సంపాదకీయం

విద్రోహంలో వాటా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రచ్ఛన్న ఉగ్రవాది ఝకీర్ నాయక్ నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ ముఠావారు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నడుపుతున్న సేవాసంస్థకు విరాళం ఇవ్వడం రోగలక్షణం మాత్రమే. అసలు ‘రోగం’ దేశమంతటా అనేకానేక ముఠాలు, దేశ వ్యతిరేకపు వలలను బిగించి ఉండడం. వివిధ రకాల పేర్లతో రూపాలతో చెలామణి అవుతున్న ఈ ముఠాలన్నీ స్వచ్ఛందం ముసుగేసుకున్న నకిలీ సేవా సంస్థలు. ప్రభుత్వేతర సంస్థలు-ఎన్‌జిఓస్-గా అధికారికంగా నమోదైన సేవా సంస్థలలో కొన్ని మాత్రమే నిజంగా ప్రజలకు సేవ చేస్తున్నాయన్నది నిజం. మిగిలిన సంస్థలు సేవ ముసుగులో దేశ విద్రోహ కలాపాలను గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నాయి. నిధులు వసూలు చేసుకొని దిగమింగుతున్నవారు తమ అక్రమాలకు రక్షణ కవచాలుగా ఉండడానికై ఎన్‌జిఓలను ఏర్పాటు చేసుకుంటున్నారు. విదేశాలనుంచి వస్తున్న డబ్బు మూటలను వెదజల్లి దేశమంతటా మతం మార్పిడులను కొనసాగిస్తున్న ముఠాలలో అత్యధికం స్వచ్ఛందం ముసుగేసుకొని సంచరిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి పంచమాంగ దళాలుగా మారి దేశమంతటా దేశ విద్రోహపు బట్టీలను నిర్మించిన, నిర్మిస్తున్న ఝకీర్ నాయక్ వంటివారు ఇంకా ఎందరు ఉన్నారన్నది వెల్లడి కావలసిన వ్యవహారం. సరళీకరణ విధానాలు సక్రమంగా వ్యవహరిస్తున్న వారికంటె అక్రమంగా వ్యవహరిస్తున్న వారికి మిక్కిలి ఉపయోగిస్తుండడం ప్రపంచీకరణ మాయాజాలం. 1994లో మన్‌మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉండిన సమయంలో సరళీకరణ ముదిరి ముదిరి ప్రపంచీకరణకు అంకురార్పణ జరిగింది. పాకిస్తాన్‌లో ముద్రించిన నకిలీ భారతీయ కరెన్సీ నోట్లు, చైనానుండి మావోయిస్టులకు వారి సమర్థకులకు అందుతున్న నిధులు, మతం మార్పిడి ముఠాలకు ఐరోపానుంచి, అమెరికానుంచి వచ్చిపడిన నిధులు, పశ్చిమాసియా నుంచి జిహాదీలకు లభించిన నల్లడబ్బు- వీటికి తోడు ప్రపంచీకరణ తరువాత ఎన్‌జిఓల బెడద తీవ్రతరమైంది. విదేశీయ విరాళాల నియంత్రణ క్రమబద్ధీకరణ చట్టం-ఎఎఫ్‌సిఆర్‌ఏ- 2010లో రూపొందేవరకు పాత చట్టాలలోని లొసుగులు దేశ వ్యతిరేక చర్యలకోసం విదేశాలనుండి అక్రమ ధనం వెల్లువలెత్తి ప్రవహించడానికి దోహదం చేశాయి. ఎన్‌జిఓను ప్రారంభించడంతో సరి. ఆ తరువాత నమోదైన ఎన్‌జిఓల పైన నిఘా లేకపోవడం అందుకు కారణం. చట్టం 2010లో వచ్చిన తరువాత విదేశీయ నిధులు అక్రమంగా తరలిరావడం ఆగలేదు. మరింతగా పెరిగాయి. 2014 మేలో పాలనా బాధ్యతలను స్వీకరించిన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం విదేశాలనుంచి నిధులను స్వీకరిస్తున్న సంస్థలపై నిఘా పెంచడంతో డొంక కదులుతోంది. ఈ కదలికతో అనేక అక్రమ విదేశీయ విరాళాల పుట్టలు పగలడం మొదలైంది. ఝకీర్‌నాయక్ నాయకత్వంలోని ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్-ఐఆర్‌ఎఫ్- అన్న ప్రచ్ఛన్న బీభత్స జిహాదీ ముఠాకు విదేశాలనుంచి దాదాపు అరవైకోట్ల రూపాయల నిధులు లభించినట్టు దాదాపు నెలరోజుల క్రితం వెల్లడైంది. ఈ ఐఆర్‌ఎఫ్ నుంచి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ అన్న సంస్థకు యాబయి లక్షల రూపాయలు అందినట్టు ధ్రువపడడం సరికొత్త వికృత ఘట్టం...
విదేశీయ విరాళాల క్రమబద్ధీకరణ చట్టాన్ని అక్రమ కలాపాలకు ఒడిగడుతున్న ఎన్‌జిఓలు అనేక రకాలుగా ఉల్లంఘిస్తున్నట్టు ప్రచారమవుతూనే ఉంది. ఇప్పుడు బయటపడింది మరోమార్గం మాత్రమే. విదేశాలనుంచి భారీగా వందలాది కోట్ల విరాళాలు ముడుపులు, లంచాలు, సేవానిధులు పొందుతున్న సంస్థలు ఆ నిధులను దేశంలోని అనేకానేక సంస్థలకు వెదజల్లడం ఈ అవినీతి మార్గం. కేవలం మొదట పెద్ద విరాళాన్ని విదేశాలనుండి గ్రహిస్తున్న సంస్థ మాత్రమే ఎఫ్‌సిఆర్ చట్టం దృష్టి ఆకర్షించగలదని మిగిలిన సంస్థల ధీమా. అందువల్ల విదేశాలనుంచి నిధులను పొందిన ముఠానుంచి విరాళాలను స్వీకరిస్తున్న ఇతర ఎన్‌జిఓలు, ట్రస్టులు, ఫౌండేషన్లు చట్టం దృష్టిని ఆకర్షించవన్నది నకిలీల ధీమా. ఝకీర్ నాయక్ నడుపుతున్న ఎన్‌జిఓకు మూడేళ్లలోనే మూడు విదేశాలనుంచి అరవైకోట్ల రూపాయలు లభించాయట. అంతకుపూర్వం ఎన్ని దేశాలనుంచి ఈ ఝకీర్ ముఠాకు ఎంత సొమ్ము లభించిందో ఎవరికి ఎరుక? రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు అతగాడు ఈ సొమ్ములో నుంచే యాబయి లక్షల రూపాయల విరాళం ఇవ్వడం, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వారు స్వీకరించడం, ఆశ్చర్యం కాదు. అధికార రాజకీయ పక్షాలను విరాళాల ద్వారా మంచి చేసుకోవడం వల్ల తమ అక్రమ కలాపాలపై ప్రభుత్వం నిఘా ఉండబోదన్నది జకీర్ వంటి దేశద్రోహుల ధీమా.
ఝకీర్ నడుపుతున్న ఐఆర్‌ఎఫ్ వారు 2011లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్-ఆర్‌జిఎఫ్-కు ఇలా యాబయిలక్షల విరాళం చెల్లించేనాటికి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది. ఆర్‌జిఎఫ్‌కు అనుబంధంగా మరో సంస్థ రాజీవ్‌గాంధీ సేవాసంస్థ-ఆర్‌జిసిటి- నడుస్తోందట. ఉభయ సంస్థలలోను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాన భాగస్వాములు. 2011 నాటికి ఝకీర్ ముఠా నిర్వహిస్తున్న దేశ విద్రోహ కార్యకలాపాల సంగతి బయపడలేదట. అందువల్ల అతని ఎన్‌జిఓ నుండి విరాళాలు స్వీకరించినట్టు ‘రాజీవ్’ సంస్థల తరపున కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు. ఈ విరాళం రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు కాక, రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్టుకు మాత్రమే ముట్టినట్టు సవరణను కూడా కాంగ్రెస్ ప్రతినిధులు ప్రకటించారు. కొన్ని నెలల క్రితం ఈ విరాళాన్ని మళ్లీ ఝకీర్ నడుపుతున్న ఐఆర్‌ఎఫ్‌కు తిప్పి పంపినట్టు కూడ కాంగ్రెస్ నాయకులు చెప్పుకొచ్చారు. అయితే తాము చెల్లించిన విరాళం తమకు తిరిగి రాలేదన్నది ఝకీర్ ముఠా ముక్తాయింపు...తమకు యాబయి లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చిన స్వచ్ఛంద సంస్థ కలాపాలలో విద్రోహం కాని, ఇతర అక్రమాలు నిహితమై ఉన్నాయా? అన్న విచారణ జరుపకుండానే సోనియా బృందం వారు ఈ విరాళాన్ని స్వీకరించేశారన్నమాట. ఇంత మొత్తం విరాళం ఇచ్చిన ఎన్‌జిఓ నిర్వాహకుల గురించి తగినంత సమాచారం సోనియాగాంధీ, కాంగ్రెస్ ప్రతినిధులకు తెలిసి ఉంటుంది. అందువల్ల ఝకీర్ ముఠా వారిమతం మార్పిడి కలాపాలను, విద్రోహకాండను పసికట్టడంలో 2011వ, 2014వ సంవత్సరాల మధ్య అధికారపార్టీ విఫలమైంది. ప్రభుత్వం విఫలమైంది. 2014, మే26 తరువాత కూడ ఝకీర్‌ను నిర్బంధించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడం వేరే సంగతి. బంగ్లాదేశ్‌లో ఝకీర్ అనుచరులు పేలుళ్లు జరిపిన తరువాత, అతగాడు సౌదీ అరేబియాకు పారిపోయిన తరువాత మాత్రమే ఝ కీర్ విద్రోహం గురించి ప్రచారవౌతోంది. ఇప్పుడైనా మిత్రదేశమైన సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని ఒప్పించి ఝకీర్‌ను మనదేశానికి వెంటనే రప్పించడానికి మన ప్రభుత్వం ఎందుకని ప్రయత్నించరాదు?ఝకీర్‌ను నిర్బంధించి న్యాయస్థానం ముందు నిలబెట్టి విచారించినప్పుడు మాత్రమే మరిన్ని నిజాలు బయటపడతాయి. విదేశాలనుంచి అక్రమ నిధులు పొందిన ఆరోపణలకు గురి అవుతున్న నూట యాబయి సంస్థలలో ఝకీర్ ముఠా ఒకటి మాత్రమేనట. అందువల్ల మిగిలిన సంస్థలు కూడా ఏఏ ప్రముఖుల సంస్థలకు విరాళాలు చెల్లించాయో మరి! ఝకీర్ దేశద్రోహి అని బయటపడిన వెంటనే రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ సంస్థవారు స్వచ్ఛందంగా ఈ విరాళం సంగతి బయటపెట్టి ఉండాలి. డబ్బును ప్రభుత్వానికి స్వాధీనం చేసి ఉండాలి..