సంపాదకీయం

‘సింగపూర్’కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణ కార్యక్రమంలో పారదర్శకత లోపించిందన్న ఆరోపణ ఇప్పుడు ధ్రువపడింది. నిర్మాణ ప్రక్రియను హైదరాబాద్ ఉన్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేయడం ఇందుకు ప్రాతిపదిక. నిర్మాణ ప్రక్రియను ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించడంలో అనేక అక్రమాలు జరిగినట్టు సోమవారంనాడు తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేసిన ఉన్నత న్యాయమూర్తి ఎమ్.ఎస్. రామచంద్రరావు నిర్ధారించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానానికి చెంపపెట్టు..సింగపూర్ తదితర విదేశీయ వాణిజ్య సంస్థలకు మాత్రమే నూతన రాజధానిని నిర్మించే పరిజ్ఞాన పాటవాలు, శక్తి సామర్ధ్యాలు ఉన్నాయని దాదాపు రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ఉద్ఘోషణలకు ఇలా న్యాయ నిరోధం ఏర్పడడం స్వదేశీయ సంస్థలు హర్షించదగిన పరిణామం. న్యాయమూర్తి వెలువరించిన తాత్కాలిక ఆదేశాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పీలు చేస్తుందా చేయదా అన్నది స్పష్టం కావలసిన అంశం. కానీ దేశంలోని సంస్థలకు రాజధాని నిర్మాణం వంటి బృహత్ పథకాలను అమలు జరుపగల పరిజ్ఞాన పాటవాలు లేవన్న అవమానకరమైన విధానాన్ని విడనాడడం ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కర్తవ్యం. స్వాతంత్య్రం లభించిన తరువాత అన్ని రంగాలలోను దేశం అమిత వేగంగా ప్రగతి సాధించిందన్న ప్రచారం ఒకవైపున కొనసాగుతోంది. గతంలో 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉండిన తొమ్మిదేళ్లలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిని నమూనా నగరం- మోడల్ సిటీ- గాను, ఆదర్శ నగరం-ఐడియల్ సిటీ-గాను రూపొందించారు. రూపొందించినట్టు ఆయన పదేపదే స్వయంగా ప్రకటించడం ఇప్పుడు చరిత్ర...2004 నాటికే ప్రపంచంలో నమూనా నగరాలను నిర్మించిన చంద్రబాబుకు పనె్నండేళ్ల తరువాత అమరావతిని అత్యాధునికంగా రూపొందించడం కష్టం కాదు. కానీ నూతన రాజధాని నిర్మాణ కార్యక్రమం ఎల్ అండ్ టి వంటి భారతీయ సంస్థలలో ఒకటి రెండింటికి మాత్రమే సాధ్యం కాగలదని, మిగిలిన భారతీయ సంస్థలన్నీ పనికి రానివని చంద్రబాబునాయుడు నెలల తరబడి ప్రచారం చేయడం జాతీయ ఆత్మన్యూనతా భావానికి నిదర్శనం. మనదేశపు సంస్థలు చేసే నిర్మాణాలు మురికివాడలను పోలి ఉన్నాయని కూడ ముఖ్యమంత్రి చారిత్రక నిర్ధారణలు చేసి ఉన్నారు. ఈ చరిత్రను హైకోర్టు సోమవారం రద్దు చేసింది. సింగపూర్ సంస్థలకు మాత్రమే అనుకూలంగా ఉండే రీతిలో టెండర్ల వ్యవహారాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందన్న ఆరోపణలను హైకోర్టు ఆమోదించింది. తుది తీర్పు ఎలా ఉండబోతున్నప్పటికీ సింగపూర్ సంస్థలను నెత్తిమీద నుంచి దించుకోక తప్పదన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రహించదగిన గుణపాఠం..
స్థానిక ప్రజలకు అర్థంకాని, అంతుపట్టని రీతిలో అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మించడానికి జరుగుతున్న ప్రయత్నాలకు పారదర్శకత లోపించడం సహజం. అంతరిక్షంలో ఊహా హార్మ్యాలను నిర్మిస్తున్నవారు ఇప్పటికైనా భూమిపై నిలబడి, తెలుగునేలపై నిలబడి రాజధానికి పునాదులను వేయవలసిన అవసరం హైకోర్టు ఆదేశాలతో ఏర్పడింది. అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను పిలిపించి అత్యంత సమర్థులైన వారికి అమరావతిని అప్పగించాలన్నది ప్రభుత్వ విధానమైంది. దీనివల్ల జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందన్న ధ్యాస ప్రభుత్వానికి కలుగకపోవడం ప్రపంచీకరణ మాయాజాలంలో భాగం. రాజధాని నిర్మాణంలో ప్రధానమైనది పాలనా కార్యాలయాలను ఏర్పాటు చేయడం. సచివాలయం, శాసనసభాభవనం, శాసనమండలి భవనం, గవర్నర్ నివాసం, మంత్రుల నివాసాలు, అధికారులకు, ఉద్యోగులకు తగినన్ని ఆవాసాలు, హైకోర్టు ప్రాంగణం-ప్రధానంగా వీటిని నిర్మించినట్టయితే రాజధాని నిర్మాణం దాదాపు పూర్తవుతుంది. భువనేశ్వర్‌ను కాని చండీగఢ్‌ను కాని గతంలో ఇలాగే నిర్మించారు. ఈ నిర్మాణానికి స్వదేశీయ పరిజ్ఞానంతో పాటు, దేశంలోని ఇంజినీర్లు, తాపీ మేస్ర్తిలు సరిపోతారు. ఇసుకలను మోసే కార్మికులు సింగపూర్ నుంచి రానక్కరలేదు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంగతిని గ్రహించినప్పటికీ, అంతర్జాతీయ స్థాయి ఆర్భాటాలను మానుకోకపోవడం తెలుగువారి దురదృష్టం. ఇలా స్వదేశీయ పద్ధతిలో రాజధాని నిర్మించి ఉంటే పచ్చని అందాల మధ్య మరింత సుందరమైన చిన్న రాజధాని ఉద్దండరాయని పాలెంలోనో, వెలగపూడిలోనో ఈ పాటికి వెలసి ఉండేది. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి చేస్తున్న సహాయం కూడ ఈ పాలనాకేంద్రం నిర్మాణం కోసం మాత్రమే. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రాజధానిని పాలనాకేంద్రంగా మాత్రమే కాక విద్యాకేంద్రంగా, వాణిజ్యకేంద్రంగా, క్రీడా ప్రాంగణంగా, సాంస్కృతిక కేంద్రంగా-ఇంకా రకరకాల కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి నడుం బిగించడమే వైపరీత్యం. రాష్ట్రంలో సగం జనాభా రాజధానిలోనే కేంద్రీకృతం కావడానికి సింగపూర్ మోడల్ ఉపకరిస్తోంది. సింగపూర్ దేశమంతటా రాజధాని విస్తరించి ఉంది. మరి దేశమే రాజధాని, రాజధానే దేశం. అంతర్జాతీయ వాణిజ్యం మీద, దళారీల కలాపాలమీద ఆధారపడి అతిశయిస్తున్న కృత్రిమ ప్రగతి కేంద్రం సింగపురం. ఈ కృత్రిమ ప్రగతి మనదేశంలోని ప్రముఖులకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నిర్వాహకులకు మిరుమిట్లు గొలపడం ప్రంపంచీకరణ బంగారు జింక సృష్టించిన మాయాజాలం. రెండువేల ఎకరాలలో చిన్న రాజధానిని నిర్మించి మిగిలిన ముప్పయివేల ఎకరాలను హరిత ప్రాంగణంగా ఉండచడం వల్ల, తోటలను పొలాలను యథాతథంగా కొనసాగించడం వల్ల మాత్రమే నిజమైన ప్రగతి నెలకొంటుంది. సింగపూర్ మోడల్ పేరుతో జనాభాను కేంద్రీకరించడం కాలుష్య కేంద్రీకరణకు ప్రాతిపదిక మాత్రమే కాగలదు...
ఈ అంతర్జాతీయ స్థాయి విధానాన్ని తాము నిర్దేశించుకున్న కృత్రిమ ప్రగతి విధానాన్ని కూడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నిబంధనలకు అనుగుణంగా అమలు జరుపలేదు. అంతర్జాతీయ వాణిజ్య సంస్థలన్నింటికీ సమానంగా ఆహ్వానాలు పంపి వాటి టెండర్ల ఆధారంగా కాంట్రాక్టును అప్పగించి ఉండాలి. కాని మొదట సింగపూర్ కన్సార్టియంకు రాజధాని నిర్మాణాన్ని అప్పగించారు. ఈ సింగపూర్ వాణిజ్య ఒప్పందం కంటె తక్కువ ఖర్చుతో నిర్మించగల సంస్థలుంటే ముందుకు రావాలని ఆ తరువాత సిఆర్‌డిఎ-క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ- రాజధాని ప్రాంత అభివృద్ధి వ్యవహారాల అధికార మండలి-వారు సవాలు చేశారు. ఇలా పోటీ పెట్టడం-కౌంటర్ టెండర్ సిస్టం-పేరు ‘స్విస్ ఛాలెంజ్’ అట. ఈ పోటీకి స్విట్జర్లాండ్ దేశానికి సంబంధం ఏమిటో మరి! ఏమయినప్పటికీ ఈ స్విస్ సవాలు’’ పద్ధతిని ఇతర వాణిజ్య సంస్థలు హైకోర్టులో సవాలు చేశాయి. సింగపూర్ కన్సార్టియం ఆర్భాటానికి ఇలా అంతరాయం ఏర్పడింది..