సబ్ ఫీచర్

ఇది అక్రమ విభజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రాకు ప్రత్యేక హోదా అనే అంశం రాష్ట్ర విభజన చట్టంలో లేదని, వుండి వుంటే దానినిపుడు తాము అమలుచేసేవారమని బి.జె.పి. ప్రభుత్వంలోని కొందరు అగ్ర నాయకులు చెబుతున్నారు. ప్రత్యేక హోదా మాటలా వుంచితే, అసలు రాష్ట్ర విభజన చట్టమనేది వుందా? ఆ చట్టాన్ని ఎవరు చేసారు? పార్లమెంటు చేసిందా? ఎలాంటి పార్లమెంటు, ఏ రీతిలో చేసింది? చర్చ జరుగుతున్నపుడు ఆంధ్రా ప్రాంత ఎంపీలను ఇతర ప్రాంత ఎంపీల చేత పిడిగుద్దులు గుద్దించారు. పార్లమెంటు భవనం తలుపులు మూసేసారు. టీ.వీ. ప్రసారాలు ఆపుచేసారు. అసలు సక్రమ పద్ధతిలో స్పీకరు ఓటింగ్ జరుపలేదు. ఒక అరగంట తర్వాత, ఆ చీకటి పార్లమెంటు భవనంలో ‘విభజన చట్టాన్ని లోక్‌సభ ఆమోదం పొందింది’అని ఆనాటి స్పీకర్ ప్రకటించారు. ఇలాగే జరుగుతుందని ముందే గ్రహించిన రాజకీయ కురువృద్ధుడు అద్వానీగారు ముందుగానే పార్లమెంటు భవనం నుండి బైటకెళ్ళిపోయారు!
ఈ రీతిలో చేసిన దాన్ని ‘విభజన చట్టం’అంటారా? అసలు చట్టమే అక్రమ రీతిలో జరిగినపుడు అందులో ఏ అంశాలున్నాయ, ఏవి లేవని ఎలా చెబుతారు? ఎవరంటున్నారలాగనిపుడు? బి.జె.పి.లో అగ్రస్థానంలోనివారు! ఈ పాపమంతా కాంగ్రెస్‌దేనంటున్నారు వారు. కాని, ఆ పాపం ఎవరిదో ప్రజలకు తెలుసు. ప్రొద్దుట కాంగ్రెసు, బి.జె.పి. నాయకులు బైట రిహార్సలు వేసుకుని తర్వాత పార్లమెంటులో ప్రదర్శించే వారు. అప్పుడు ఆ రెండు పార్టీలూ కుమ్మక్కై చేసిన అక్రమమే అది! ఇప్పుడేమో వాళ్ళు చట్టంలో ఈ అంశం పెట్టలేదంటున్నారు. ఇంత ముఖ్యమైన అంశాన్ని చట్టంలో పెట్టకపోతే, బి.జె.పి. ఆ అక్రమ చట్టానికి ఓటెలా వేసింది? అంతేకాదు. అపుడు, లోక్‌సభలో ప్రహసనం ముగిసాకా, అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను, హోంమంత్రినీ రాజ్యసభకు బి.జె.పి. వారే రప్పించారు. అక్కడ వారు, ఆంధ్రాకు అయిదేళ్ళ ప్రత్యేక ప్రతిపత్తి, పదేళ్ళ ఉమ్మడి రాజధానినీ కల్పిస్తున్నామని ప్రకటించారు. అప్పటి రాజ్యసభ స్పీకర్ కురియన్ ప్రధాని చేసిన ఆ ప్రకటనను ఓటింగుకు పెట్టారు. దానినెవరూ తిరస్కరించలేదు. ‘‘అందువలన రాజ్యసభ విభజన చట్టాన్ని, అయిదేళ్ళ ప్రత్యేక ప్రతిపత్తి, పదేళ్ళపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా వుండాలనే సవరణలతో, ఆమోదించింది’’అని స్పీకర్ కురియన్ ప్రకటించారు. అలా బహిరంగంగా, రాజ్యసభలో ఆమోదం పొందినది చట్టంకాదా? లోక్‌సభలో చీకట్లో, జరిగిందే చట్టామా?
‘‘దేశ ప్రధాని పార్లమెంటులో ఒక హామీని గాని, మరేదైనా ప్రధాన విషయాన్ని ప్రకటించినపుడు, దానిని ఆ సభలో ఎవరూ తిరస్కరించకపోతే, అది చట్టంతో సమానమే’’అని ఒక రాజ్యంగ నిపుణుడు వ్యాఖ్యానించారు. పోనీ, ఈ విషయంపై ఈ రెండున్నర సంవత్సరాల్లోనూ రాజ్యాంగ నిపుణులతో చర్చించారా? రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించవలసింది సుప్రీం కోర్టే కనుక, వారి అభిప్రాయాన్ని అడిగారా? లేదు. అడగరు!
ఆంధ్రాకు ఈ ప్రత్యేక హోదాను ఇవ్వాలని ఏ కోశానైనా ఏ కేంద్ర నాయకులకైనా వుండి వుంటే, ఆ దిశగా ప్రయత్నించి వుండేవారు. హోదాద్వారా రాష్ట్రానికి ఎంత ఇస్తాము, ప్యాకేజి ద్వారా ఎంత ఇస్తామనేది వారి ఆలోచన కాదు. ఒకసారి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి, దానికి చట్టబద్ధతను కల్పిస్తే, అందులోని ప్రత్యేక రాయితీలు, సదుపాయాలు, ఇతర నగదు మొత్తాలూ వాటంతటవే రాష్ట్రానికి, రాష్ట్రంలోని పరిశ్రమలకు ఇతర సంస్థలకూ దక్కుతూ వుంటాయి. ప్రతిసారీ రాష్ట్రం కేంద్రాన్ని దేబిరించి అడగనక్కర్లేదు. అదే ప్రత్యేక ప్యాకేజీ అయితే, మొత్తం నగదు, నగదు రాయితీలు, ఇతర సదుపాయాలూ కేంద్ర నాయకులు చేతుల్లోంచే రావాలి. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలాగ అనేకసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి, అక్కడున్న అధిష్టాన నాయకుల్ని అర్ధిస్తున్నారో అలా తిరగవలసిందే! ఆ విధంగా, రాష్ట్ర నాయకత్వాన్నీ, రాష్ట్రాన్నీ తమ గుప్పి ట్లో కేంద్ర ప్రభుత్వం వుంచుకోగలుగుతున్నది. ఇపుడు చంద్రబాబుగారు ‘స్నేహం’ ‘స్నేహం’అంటున్నది అలాం టి లోకువతోనే కదా! అందువలన, అవసరమైతే మరో లక్ష కోట్లు ప్యాకేజీలొస్తాయంటారు తప్ప, ప్రత్యేకహోదా మాత్రమివ్వరు! తెలుగులో ఒక సామెత వుంది. ‘‘ఎందుకురా అలా.. అంటే, ఎగ్గొట్టడానికి!’’అన్నాడంట వెనకటికెవరో!
ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తే, మరో మూడు రాష్ట్రాలు అదే కావాలని అడుగుతాయని, అందువలన ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు. ఆ రాష్ట్రాలు ఎందుకడుగుతాయి? అడిగితే వారికి సమాధానం చెప్పి ఒప్పించలేరా? వారి రాష్ట్రాలను విడదీయలేదుకదా? వారికి రాజధాని అనేదే లేకుండా చేయలేదు కదా? అక్రమంగా విడగొట్టి, రాజధాని లేకుండా చేసి, ముఖ్యమైన ఏ ఇండస్ట్రీలు, విద్యాసంస్థలూ లేకుండా చేసి, ఉద్యోగ వనరులు లేకుండా చేసిన ఆంధ్రాతో మిగిలిన ఆ రాష్ట్రాలనెలా పోలుస్తారు? అధినాయకత్వం చెబుతున్న ఈ పేలవమైన వాదన కూడా ఒక వంక మాత్రమే! అంతేకాదు, ప్రత్యేక ప్రతిపత్తికి 14వ ఆర్థిక సంఘం, ‘నీతి అయోగ్’ (అదేవిటో ఎవరికీ అర్థంకాదు)లు ఒప్పకోవడం లేదని చెబుతున్నారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని ఈ రెండు సంస్థలూ కొట్టేయగలవా? ఇవి రాజ్యాంగం కంటే అతీతమైనవా? ఈ సాకులన్నీ నమ్మేటంత అమాయక స్థితిలో రాష్ట్రంలోని సాధారణ ప్రజలు కూడా లేరు. కాంగ్రెసును, ఆ ప్రభు త్వం రాష్ట్రానికి చేసిన అన్యాయానికి ప్రజలు ప్రక్కన పెట్టేసారు. ఇపుడు జరుగుతున్న నష్టానికంతకూ బి.జె.పి. ప్రభుత్వమే కారణమని నమ్ముతున్నారు. బి.జె.పి. నాయకత్వం పసలేని సాకులు మాని, రాజకీయ హుందాతనంతో, పరిణితో నడపవలసిన తరుణం వచ్చింది. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును తమ రాజకీయంకోసం పణంగా పెట్టవద్దు. పెడితే ‘‘రాజ్యాంతం నరకం ధృవం!’’అనే మాట, ఇందుకు బాధ్యులైన వారికి వర్తిస్తుంది!

- మనె్న సత్యనారాయణ సెల్: 9989076150