సంపాదకీయం

పట్టి పరిమార్చలేమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రమత్తత మరోసారి సమర వీరుల ప్రాణాలను తీసుకొంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పిన నలుగురు జిహాదీ ఉగ్రవాదులు పదిహేడుమంది సైనికులను హత్య చేయగలగడం భద్రతా కుడ్యంలో ఏర్పడి ఉన్న కన్నాలకు మరో ప్రత్యక్ష నిదర్శనం. సైనిక దళాల స్థావరంలో, జమ్ము కశ్మీర్‌లోని పాకిస్తాన్ దురాక్రమిత ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అధీనరేఖ-లైన్ ఆఫ్ కంట్రోల్‌కు అత్యంత సమీపంలోని ఊరి పట్టణంలో నెలకొని ఉన్న సైనిక శిబిరంలో ఈ ప్రమత్తత నెలకొని ఉండడం పాకిస్తానీ తోడేళ్లు దూకగలగడానికి ప్రధాన కారణం! బుర్హన్ వనీ అనే జిహాదీ బీభత్సకారుడు హతమైన తరువాత దాదాపు రెండు నెలలుగా కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్ ప్రభుత్వం అనుసరించిన అతార్కిక విధానాలు సైనిక శిబిరంలో ఈ అజాగ్రత్త ఆవహించడానికి తక్షణ ప్రాతిపదిక! సీమాంతర వాణిజ్యం పేరుతో జమ్ము కశ్మీర్‌నుంచి పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్-పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్-పిఓకె-కు యథేచ్ఛగా రాకపోకలకు అనుమతినిచ్చిన దశాబ్దుల విధాన వైపరీత్యం దీర్ఘకాల ప్రాతిపదిక! ఊరి పట్టణం ముజఫరాబాద్ జిల్లాలో ఉంది. 1947-48 నాటి పాకిస్తాన్ దురాక్రమణ తరువాత ఈ ముజఫరాబాద్ పట్టణం, జిల్లాలోని దాదాపు అరవై శాతం భూభాగం పాకిస్తాన్ అక్రమ అధీనంలో నిలిచిపోయింది. అందువల్ల ఊరి ప్రాంతాన్ని బారముల్లా జిల్లాలోని విభాగంగా పాలన వ్యవస్థీకృతమైంది. ఈ ఊరి విభాగం సైనిక స్థావరం శ్రీనగర్, బారాముల్లాల నుంచి ముజఫరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై నెలకొని ఉంది! అధీనరేఖకు సమీపంలో ఉంది. అధీనరేఖ పొడవునా ఉక్కు తీగల కంచె నెలకొ ని ఉంది. ఆదివారం ఉదయం ఊరి శిబిరంలోకి చొరబడి కాల్పులు జరిపి, మంటలను చెలరేపి సైనికులను ఆహుతి చేయగలిగిన జిహాదీ ముష్కరులు అధీన రేఖ వద్ద ముందురోజున ఉక్కు తీగలను తెంపి మనవైపునకు చొరబడినారట! ఇలా తీగెలను, కంచెను పాకిస్తానీలు నిరంతరం ధ్వంసం చేస్తూనే ఉన్నారు. ఇలా ధ్వంసం చేయకుండా మన భద్రతా దళాలవారు నిరోధించలేకపోవడం ప్రమత్తతకు నిదర్శనం. వందల మంది జవానులు నిద్రిస్తున్న సమయంలో జిహాదీ ముష్కరులు నలుగురు సైనిక స్థావరంలోకి చొరబడినారు. శిబిరాల చుట్టు, గుడారాల చుట్టు, ప్రాంగణం చుట్టూ పహారా ఉండే రక్షకులు నిద్రపోరాదు. మరో జట్టు రక్షకులు వచ్చిన తరువాతనే వారు విధులను ముగించాలి. జిహాదీలు చొరబడిన సమయంలో ఊరి సైనిక ప్రాంగణం చుట్టూ రక్షకులు లేరా? లేక రక్షకులు కూడ నిద్రపోయారా?
సరిహద్దులకు ప్రాణం సైనికులు, భద్రతా దళాలు. ‘‘కోటకు ప్రాణంబు సుభటకోటి ధరిత్రిన్’’ అన్నది తరతరాల భద్రతా స్వభావం! ఈ స్వభావ కుడ్యానికి చిల్లు పడిపోతుండడానికి ప్రధాన కారణం జమ్ము కశ్మీర్‌లోని జిహాదీలను, విద్రోహులను, వారి సమర్ధకులను ఏళ్ల తరబడి ప్రభుత్వాలు బుజ్జగిస్తుండడం. ఈ బుజ్జగింపు విధానం సరిహద్దుల సంరక్షకులను, సైనికులను, అంతర్గత భద్రతను కాపాడుతున్న వీరులను బలి తీసుకుంటోంది! బుర్హన్ వనీ వధ తరువాత జమ్ము కశ్మీర్‌లోని లోయ ప్రాంతంలో వీధులలోకి వచ్చి దేశ వ్యతిరేక నినాదాలు చేసినవారు, పోలీసులపై రాళ్లు రువ్విన వారు, విశృంఖల విహారం చేసినవారు పాకిస్తాన్ ప్రభుత్వ సమర్ధకులైన దేశద్రోహులు, జిహాదీ ఉగ్రవాదులు. ఈ జిహాదీ ఉగ్రవాదులను, వారి సమర్ధకులను ప్రజలుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది! ఈ ప్రజలపై అత్యాచారాలు జరిపిన సైనికుల చర్యల గురించి దర్యాప్తులు న్యాయ విచారణ జరిపించాలని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తి మెహబూబా ప్రకటించింది. బుర్హన్ వనీ సమర్ధకులైన విద్రోహులను ఉక్కుపాదంతో అణచి వేయవలసిన సమయంలో ఆ విద్రోహులను ప్రజలుగా చిత్రీకరించడం ఆ నకిలీ ప్రజలకు మద్దతుగా జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ప్రకటనలు చేయడం సైనిక దళాల నైతిక బలాన్ని దెబ్బతీసిన చర్య! కేంద్ర ప్రభుత్వం సైతం వీధులలో విద్రోహకాండకు పాల్పడిన ప్రజల పట్ల సంయమనంతో వ్యవహరించాలని సైనిక దళాలకు పిలుపులను ఇచ్చింది! విద్రోహులు ప్రజలా? నిజమైన లక్షల మంది కశ్మీర్‌లోయ ప్రాంతం ప్రజలు వీధులలో దేశ విద్రోహకాండకు పాల్పడిన వేలమందికి భయపడి బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే కుక్కిపోతున్నారు. ఆ నిజమైన ప్రజలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఇటీవల జమ్ము కశ్మీర్‌కు వెళ్లి వచ్చిన అఖిలపక్షం వారు కాని మాట్లాడలేదు...వారికి గుర్తింపు లేదు!
వీధులలోకి చేరి రాళ్లు విసిరి, దేశ విద్రోహకర నినాదాలు చేసి, భద్రతాదళాలపై దాడులు చేయడానికి తెగబడిన ఉద్యమకారులకు ప్రజలన్న గుర్తింపు వచ్చింది! పాకిస్తాన్‌కు పంచమాంగ దళంగా మారిన హురియత్ ముఠాల నాయకులు సయ్యద్ పాషా అలీ జీలానీ వంటివారు మరింత గొప్ప ప్రజలుగా మారిపోయారు. నిర్బంధించి న్యాయస్థానాలలో విచారించి కారాగృహం పాలు చేయవలసిన జీలానీ వంటి వారిని స్వేచ్ఛగా వదిలిపెట్టడం తోడేళ్లను ఆవుల మందల మధ్య వదలిపెట్టినట్టు అయింది! జీలానీ వంటి పాకిస్తాన్ తొత్తులు దశాబ్దులుగా భారత రాజ్యాంగ వ్యవస్థను, దేశ సార్వభౌమ అధికారాన్ని, భౌగోళిక సమగ్రతను, జాతీయ సమైక్య భావజాలాన్ని వ్యతిరేకిస్తూ, పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. జీలానీ వంటి ముష్కరులు ప్రభుత్వంతో చర్చలకు రావడమే లేదు. కానీ గతంలో అఖిలపక్ష ప్రతినిధులుగా కశ్మీర్‌కు వెళ్లిన ప్రతిపక్షాలవారు కొందరు జీలానీ ఇంటికి వెళ్లి గౌరవం ఘటించి వచ్చేవారు. దీనివల్ల సైనిక దళాల నైతిక స్థైర్యం దిగజారిపోతోంది! ఈ నెల ఆరంభంలో ఇలా శ్రీనగర్‌కు వెళ్లిన అఖిలపక్షంలోని కొందరు ప్రతి పక్షాలవారు యధావిధిగా జీలానీ ఇంటికి వెళ్లారు! అయితే జీలానీ ఈ ప్రతిపక్ష సభ్యులను సైతం కలుసుకోవడానికి తిరస్కరించాడు, ద్వారం వద్దనుండి ఈ ప్రతిపక్షాలవారు వెనుదిరిగి వచ్చారు! ఒక పాకిస్తానీ తొత్తుకు లభిస్తున్న ఈ ప్రాధాన్యం దేశ భద్రతను కాపాడుతున్న సమర వీరులకు సహజంగానే న్యూనతా భావాన్ని కలిగిస్తుంది! తెలియకుండానే ప్రమత్తత, అజాగ్రత్త భద్రతను ఆవహిస్తున్నాయి...
కశ్మీర్‌లోయ ప్రాంతంలో సైనిక దళాల సంఖ్యను తగ్గించడం వల్లనే బుర్హన్ వనీ అన్న పాకిస్తాన్ తొత్తు హతమైన తరువాత అతగాడి సమర్ధకులు పేట్రేగిపోయారు. ఇటీవలి కొన్ని రోజులలో కేంద్ర ప్రభుత్వం లోయ ప్రాంతంలో సైనికుల సంఖ్యను మళ్లీ పెంచుతోంది! ఏమయినప్పటికీ కశ్మీర్ లోయ ప్రాంతంలోని విద్రోహుల ప్రతినిధులతోను, సరిహద్దుల వెలుపల పాకిస్తాన్ ప్రభుత్వంతోను పదే పదే చర్చలను జరపాలన్న విధానం సైనిక దళాలలో నిరుత్సాహాన్ని నింపుతోంది! బలైపోతున్న సైనికులు జిహాదీ హంతకులను పట్టిపరిమార్చే -హాట్ పర్సూట్-విధానాన్ని జమ్ము కశ్మీర్‌లో ప్రభుత్వం ఇప్పుడైనా అమలు జరపాలి! బర్మాలోకి మన సైనికులు చొచ్చుకుని పోయి చైనా తొత్తులైన బీభత్సకారులను గత ఏడాది మట్టుపెట్టారు. పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లోకి తక్షణం మన సైనికులు చొచ్చుకునిపోయి జిహాదీ స్థావరాలను ధ్వంసం చేయడం మాత్రమే జమ్ము కశ్మీర్‌లో ప్రశాంతికి ఏకైక ప్రత్యామ్నాయం. మన సైనికులు జిహాదీ బీభత్స కీలలకు ఆహుతి కాకుండా తద్వారా నిరోధించగలం...