సంపాదకీయం

‘కబ్జా’ల కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో పుట్టలుగా గుట్టలుగా పెరిగిన అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలైంది. ఎప్పుడో మొదలు కావలసి ఉండిన ఈ మహానగర ప్రక్షాళన కార్యక్రమం ఇప్పటికైనా శ్రీకారం చుట్టుకొనడం హర్షణీయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరంభించిన ఈ ప్రక్షాళన పథకం అభినందనీయం. ఈ ప్రక్షాళన మురికి నుండి విముక్తి కోసం.. దుర్గందం నుండి విముక్తి కోసం.. అవినీతి నుండి విముక్తి కోసం.. అవినీతిపరులు దురాక్రమించిన భూమిని విముక్తం చేయడం కోసం! ఈ అవినీతిపరులు- దళారీలు, స్థిరాస్తి వ్యాపారులు, గూండాలు, తాగుబోతులు, అధికారులు, రాజకీయ జీవులు! వీరందరూ కలసికట్టిగా భూమిని ‘కబ్జా’ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా కొనసాగిన భాగ్యనగరంలో దశాబ్దాల పాటు ఈ ‘కబ్జా’లు కొనసాగాయి. కాలువలను కూల్చి అక్రమంగాకట్టడాలను కట్టేశారు. వరదనీటి వాగులను పూడ్చి వాణిజ్య ప్రాంగణాలను నిర్మించారు. కాలవలు ఇరుకైపోయాయి. నీరు పట్టక పగిలిపోతున్నాయి. వరద నీటి వాగులు దారిలేక దారిలేక పక్కకు తిరిగి వెనక్కు మళ్లి జనావాసాలను మొంచెత్తుతున్నాయి. వాన కురవగానే జంట నగరాల ప్రాంగణం మురికినీటి మహా సముద్రంగా మారి పోతుండడానికి ఏకైక కారణం ప్రవాహాల పరీవాహ ప్రాంతాన్ని దుర్మార్గులు దురాక్రమించుకోవడమేనని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం నిర్ధారించగలగడం నిజానికి చారిత్రక పరిణామం. కాలువలు- నాలాలు - వరదనీటి ప్రవాహాల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించిన వారు ఇరవై ఎనిమిది వేలకు పైగా ఇళ్లను, కొట్లను, రెస్టారెంటులను, క్లబ్బులను, విహార కేంద్రాలను, విలాస గృహాలను ఇంకా ఎన్నో రకాల కట్టడాలను నిర్మించేశారట! ప్రభుత్వం నాలాలపై, వరద కాలువలపై గుర్తించిన అక్రమ నిర్మాణాల సంఖ్య ఇది. గుర్తించని అక్రమ నిర్మాణాలు హైదరాబాద్ అంతటా ఇంకా ఎక్కడెక్కడ నక్కి ఉన్నాయో? సార్వజనిక స్థలాలను దుర్జన మూకలు దురాక్రమించడం రాజధాని నగరంలో మాత్రమే కాదు, తెలంగాణ, ఆంధ్రపద్రేశ్ రాష్ట్రాలలో మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా అప్రతిహతంగా నడచిపోతున్న దుశ్చర్య. ఆలయాల భూములు, మఠాల, ధర్మసంస్థల ఆస్తులు, అటవీ భూములు, సార్వజనిక స్థలాలు, మైదానాలు, పశువులు మేయవలసిన పచ్చిక బీళ్లు, ప్రభుత్వ కార్యాలయాల సంస్థల స్థలాలు కబ్జాలకు గురి అవుతుండడం దశాబ్దాలుగా నడచిపోతున్న వైపరీత్యం.. ఈ ‘కబ్జా’లు రాజకీయ వేత్తల అండదండలతో, ప్రభుత్వ అధికారుల కుమ్మక్కుతో జరిగిపోతున్నాయి. ఉన్నత స్థాయిలోని న్యాయమూర్తులు సైతం భూమి కబ్జాలకు పాల్పడినట్టు ఆరోపణలు, అభియోగాలు ప్రచారం కావడం ‘్భ బకాసుర’ ప్రవృత్తికి పరాకాష్ఠ. తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా శ్రీరంగరాజపురం ప్రాంతంలో వందలాది ఎకరాల పచ్చిక బీళ్లను ‘కబ్జా’ చేసిన అభియోగానికి గురైన పిడి దినకరన్ అన్న ఉన్నత న్యాయమూర్తి ఆ తరువాత పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది! ఇలా అందరికీ సంబంధించిన భూమిని వేల లక్షల ఎకరాలను కొందరు దిగమింగడం ‘కబ్జా’ల కథకు ఇతివృత్తం..
కానీ వేఱు వేఱు తరగతుల భూమిని ‘కబ్జా’ చేయడం వేఱు, జనావాసాల మధ్యగల ‘నాలా’లను, చెఱువులను పూడ్చి వేసి అక్కడ ఇళ్లను నిర్మించే వైపరీత్యం వేఱు.. ఇతర రకాల ‘కబ్జాల వల్ల జనం నష్టపోతున్నారు. దేశం నష్టపోతోంది. నాలాలను పూడ్చడడం వల్ల, వరద ప్రవాహాల మార్గాన్ని సంకుచితం చేయడం వల్ల ఈ నష్టంతోపాటు జనజీవనం రోజుల తరబడి కల్లోలగ్రస్తమైపోతోంది. అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. నాలాలు పూడిపోవడంవల్ల నీరు ఎక్కడ పడితే అక్కడే మడుగు కడుతోంది. చెరువుల నుంచి, జలాశయాల నుంచి పొంగిపొరలి ప్రవహించే వరదనీరు ముందుకు పోలేక ఇళ్లలోకి చొరబడిపోతోంది. జనావాస ప్రాంగణాలు జలాశయాలుగా మారిపోతున్నాయి. ‘చుట్టూ నీరు- తాగడానికి మాత్రం చుక్క కూడా లేదు’ అని చెప్పడం ఉప్పు నీటి సముద్రంలో పయనించే వారు చెప్పే వాస్తవం. కానీ హైదరాబాద్ బృహత్ ప్రాంగణం నీట మునిగిన వేళ, ఇటీవలి వర్షబీభత్సం వేళ, జనం ఈ ఆర్తదానాలు చేశారు. లోతట్టు ప్రాంతాల జనావాసాలు మాత్రమే కాదు, మిట్టమీద ఉన్న అంతస్థుల భవనాలు సైతం మురికినీటి ప్రవాహం మధ్య దిగ్బంధమయ్యాయి. తిండికోసం తిప్పలు పడినవారు, మంచినీటి చుక్క దొరకని వారు, ఇంట్లోని సర్వస్వం నీటిపాలు చేసుకున్నవారు, వరద ఉద్ధృతికి కొట్టుకొని పోయి తెరచి ఉన్న ‘మానవ గవాక్షం’ - మాన్‌హోల్‌లో- పడిపోయిన వారు.. ఇలాంటి వరద బీభత్సానికి కారణం కాలువలను పూడ్చి, జలాశయాలను కూల్చి అక్రమంగా నిర్మాణాలు సాగించడం. నిరుపేదలు, దిక్కులేనివారు ఇలా ‘కబ్జా’ చేసి ఇళ్లు కట్టుకున్నారన్నది కేవలం కట్టుకథ. ప్రభుత్వం గుర్తించిన ఈ వేల అక్రమ నిర్మాణాలలో 90 శాతం ‘దగుల్బాజీలు’, ‘దళారీ’లు పథకం ప్రకారం ‘కబ్జా’ చేసిన నీటిదారులపై నిలబడిన అవినీతి కట్టడాలు.. ఇప్పటికైనా వీటిని తొలగిస్తున్న తెలంగాణ ప్రభుత్వ సాహసకృత్యం ఇతర రాష్ట్రాల వారికి అనుసరణీయం..
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం మేరకు బృహత్ హైదరాబాద్ మహానగర పాలిక - గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ - జిహెచ్‌ఎమ్‌సి - వారు ‘నాలా’లపై నెలకొన్న కట్టడాలను కూలగొట్టడం ఆరంభించిన తరువాత ‘కబ్జా’ల కథలు, గాధలు మరిన్ని ప్రచారం అవుతున్నాయి. ప్రభుత్వం వారే చెఱువులను, జలాశయాలను పూడ్చివేసి అక్కడ అధునాతన భవనాలను నిర్మించడం ఈ ‘కథనా’లకు అవినీతి మకుటం! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ‘కబ్జా’లు ఎనె్నన్నో జరిగిపోయాయన్నది నడుస్తున్న ప్రచారం. హైదరాబాద్ ప్రాంగణానికి ఆవల నెలకొన్న పంచాయతీ గ్రామాలలో సైతం జలాశయాలను పూడ్చేసి కబ్జా చేసి ఇళ్లను, అంతస్తుల భవనాలను నిర్మించిన కథనాలు కూడా వెలువడుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను 2004 వరకు పాలించిన ప్రభుత్వం వారి హయాంలోనే హైదరాబాద్ ‘నమూనా నగరం’ - మోడల్ సిటీ గా వెలసింది! అప్పటి ప్రభుత్వం అలా వాయించిన ‘గొప్పల డప్పుల’ ధ్వనులను విన్న వారిలో కొందరి చెవులలోనైనా అవి ఇప్పటికీ మారుమోగుతూ ఉండవచ్చు. ఇన్ని వేల అక్రమ నిర్మాణాలలో సగమైనా 2004 నాటికే వెలసి ఉండవచ్చు. ఆ తరువాత, అంతకు ముందు కూడా ‘వినాయక సాగరం’ - హుస్సేన్ సాగరం నుండి ఉప్పొంగిన వరనీరు దారి తెలియక జనావాసాలను ముంచెత్తడం, ముంచెత్తు తుండడం చరిత్ర. నీరు బయటికి వెళ్లే దారులను నిరోధించడమేనా నగరాలకు నమూనా? 2004 తరువాత కూడా కాలువల పూడ్చివేత కార్యక్రమం నిర్నిరోధంగా జరిగినట్టు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం వల్ల ధ్రువపడింది. ఈ ప్రభుత్వం కూడా రెండేళ్లుగా ఈ వైపరీత్య నిర్మూలనకు పూనుకోకపోవడం వైఫల్యం.. ఇటీవల కురిసిన వర్షం- ప్రభుత్వాన్ని నిద్రలేపిన కర్తవ్య శంఖం!
ఇలా నీటి ప్రవాసాళు నిర్నిరోధంగా ముందుకు సాగకుండా దశాబ్దాలపాటు అడ్డుకున్న పాప ఫలితం ఉత్తరాఖండ్‌ను రెండేళ్ల క్రితం ముంచెత్తిన ‘బురద’ ప్రభంజనం. వందలాది తీర్థయాత్రికుల, స్థానికుల ప్రాణాలు బురద మేటలలో కూరుకుపోయాయి. క్రూరమైన అధికార నిర్లక్ష్యం దశాబ్దాలుగా ఆగని ఈ అక్రమ నిర్మాణాలకు ప్రాతిపదిక! అవినీతి మార్గాలలో భోంచేయడం మరిగిన అధికారులు, రాజకీయ వేత్తలు ఈ భూమి ఆక్రమణలకు ప్రధాన కారణం. జిహెచ్‌ఎమ్‌సిలోను, ‘హైదరాబాద్ మహానగర అభివృద్ధి మండలి - హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ - హెచ్‌ఎమ్‌డిఎ లోను అందరూ అవినీతిపరులేనని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్య ఇందుకు సాక్ష్యం..