సబ్ ఫీచర్

రాని ‘హోదా’ కోసం.. రాద్ధాంతం దేనికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో దురదృష్టవశాత్తూ ప్రతి సమస్యను రాజకీయం చేస్తున్నారు. ఇది దేశ క్షేమానికి మంచిది కాదు. అధికార, ప్రతిపక్షాల మధ్య ఏ ఒక్క విషయంలోనూ ఏకాభిప్రాయం లేకపోవడం ఆనవాయితీగా మారింది. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తే లాభం ఏమిటి? ఇవ్వకపోతే నష్టం ఏమిటి? అన్న వివరాలు సామాన్యులకు తెలియకపోవచ్చు. ఇపుడు ఇది ఒక ‘టెక్నికల్ సబ్జెక్టు’గా మారింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలులేని కారణాలు ఏమిటో కేంద్రం స్పష్టంగా చెబుతున్నది. కేంద్రం చెబుతున్న విషయాలను ప్రతిపక్షాలు సావధానంగా విని తమ అభిప్రాయాలు చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ కన్నా వెనుకబడ్డ ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే- వెనుకబడ్డ కొన్ని ఇతర రాష్ట్రాలు అభ్యంతరం తెలియజేసే అవకాశం ఉంది. అవి కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నవి. అందువల్ల ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ఎక్కువ ఆర్థిక సహాయం ‘ప్రత్యేక ప్యాకేజి’ రూపంలో ఇస్తామంటే అంగీకరించడానికి అభ్యంతరం ఏమిటి? అది అంగీకరించకుండా, సహేతుక వాదన వినిపించకుండా- ‘నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు’- అన్నట్లుగా మూర్ఖపు పట్టు పనికిరాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత. ప్రాంతీయ దురభిమానంతో కాకుండా జాతీయభావంతో ఎవరైనా మాట్లాడాలి. ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో వ్యవహరించాలి. రాజీతత్వం కావాలి. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం, సఖ్యత, సామరస్యం కావాలి. అంతేకానీ- కేవలం మంకుపట్టు పనికిరాదు. ఆందోళనలు, ఉద్యమాల ముసుగులో అరాచకం సృష్టించకూడదు. చీటికీ మాటికీ బందులు, సమ్మెలు చేసి అశాంతిని రెచ్చగొట్టకూడదు. అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేసి శాంతియుతంగా చర్చించి, సమస్యలను పరిష్కరించడం మంచిది. పట్టువిడుపుతో వ్యవహరించడం మంచిది. నిధుల కేటాయింపు, అభివృద్ధి పథకాల అమలు వంటి విషయాలను ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి వదిలివేయడం మంచిది. అసలు సమస్యకు వస్తే, ‘కొరివి తీసికొని తల్లో పెట్టుకున్నట్లు’గా ప్రస్తుత పరిస్థితులకు కారణం- హడావుడిగా రాష్ట్రాన్ని విభజించడమే. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడమే అన్ని రాజకీయ పార్టీలు చేసిన పెద్ద పొరపాటు. రాజకీయ పార్టీల ఏకైక లక్ష్యం- ‘అవకాశవాదం, ఓట్ల సంపాదన, ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం’. అంతకుమించి రాజకీయాల్లో న్యాయం, నీతి, ధర్మం ఉండవు. ప్రత్యేక తెలంగాణ ఇస్తామని వాగ్దానం చేసింది, ఎన్నికల ఎజెండాలో ప్రకటించింది భారతీయ జనతాపార్టీ. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని భయపడి- ఆదరాబాదరాగా రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ తెరతీసింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల పరిపాలన మెరుగుపడుతుందని బిజెపి ప్రచారం చేసింది. తెలంగాణలో తెరాస ఆధిపత్యానికి గండి కొట్టాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర విభజనకు బిజెపి అంగీకరించింది. రాజకీయ కోణంలో ఆలోచించాకే భారతీయ జనతా పార్టీ నేతలు రాష్ట్ర విభజనకు సమ్మతించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఎపికి రాజధాని లేకుండా పోయింది. నవ్యాంధ్రకు కొత్త రాజధానిని నిర్మించాలంటే కేంద్రం భారీగా నిధులను కేటాయించాల్సి ఉంది. కానీ, వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. ఎపి ప్రజలను ఆదుకోవాలన్న సంకల్పం ఉంటే ప్యాకేజీ, ప్రత్యేక హోదా అనే పదాలతో సంబంధం లేకుండా కేంద్రం నవ్యాంధ్ర రాజధానికి నిధులను కేటాయించవచ్చు.
కారణాలు ఏమైనప్పటికీ రాష్ట్ర విభజన అనివార్యమై రెండు తెలుగు రాష్ట్రాలు ఆవిర్భవించాయి. రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్‌కు అడుగడుగునా సమస్యలు, సవాళ్లు మిగిలాయి. వీటి పరిష్కారానికి ఏకైక మార్గం- విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలుపరచడమే. జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు శిలాఫలకాలు వేసినంతనే బాధ్యత తీరిపోదు. వాటి నిర్మాణానికి దండిగా నిధులను కేటాయించాలి. విభజన చట్టంలో పేర్కొన్నట్లు పోలవరం సాగునీటి పథకాన్ని కేంద్ర నిధులతోనే పూర్తి చేయాలి. ప్రత్యేక హోదాతోనే ఇవన్నీ సాధ్యమవుతాయన్న వాదన సరికాదు. హోదా ఇవ్వడానికి చట్టపరంగా అవకాశం లేనపుడు అదే స్థాయిలో నిధులు ఇస్తామంటే ప్యాకేజీని అంగీకరించవచ్చు. రాజకీయ కారణాలతో కొన్ని పార్టీలు ‘ప్రత్యేక హోదా కోసం పోరాడతామం’టూ హడావుడి చేసినా ఫలితం ఉండకపోవచ్చు. కేంద్రం ఇచ్చే నిధులను తీసుకుంటూ, ఇంకా సాధించాల్సిన వాటి కోసం ఉద్యమించడం ఉ త్తమం.
ప్రత్యేక హోదా ఇవ్వక పోవడానికి సాంకేతిక కారణాలు ఉండవచ్చు. అందువల్ల ఇప్పటికైనా ‘ప్రత్యేక హోదా’ కోసం మూర్ఖపు పట్టుపట్టకుండా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కవేసి అంత డబ్బు కేంద్రాన్ని అడగడమే ఉచితం. రానిదాని కోసం ఆందోళనలు చేయడం అంటే- రాజకీయంగా ఉనికిని కాపాడుకునే ప్రయత్నమే. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలను సమావేశపరచి సామరస్యంతో చర్చించి ఏకాభిప్రాయానికి రావడం మంచిది.

-పున్నావఝల వెంకటేశ్వరరావు