మెయన్ ఫీచర్

షాబుద్దీన్‌లు ప్రజాస్వామ్యానికి ప్రతీకలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూండాలకు, సంఘ వ్యతిరేకులకు, హంతకులకు చట్టపరంగా శిక్ష లు విధించిన సదరు న్యాయాధీశునికి బెదిరింపులే కాదు, ప్రాణాపాయం కూడా వుంటుందని సినిమాల్లో చూస్తూ వుంటాం. వర్తమానంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవటం, ప్రజాస్వామిక ఆనవాయితీగా మారిపోయింది. 58 నేరాలతో సంబంధం కలిగి, 9 హత్యలకు కారకుడని ఆరోపించబడుతూ, 7 కేసుల్లో నిందితుడిగా ముద్రపడి, జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న ఓ అసాధారణ వ్యక్తికి, చట్టాల్లోని లొసుగుల కారణంగా, పోలీసుల పక్షపాత వైఖరితో ఆరోపించబడిన అన్ని కేసుల్లో బెయిల్ లభించడం మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో వింత మాత్రం కాదు.
సినిమా కథలా సాగిన, సాగుతున్న ఈ రక్తచరిత రాజకీయాల్లో సదరు నేరస్తుడు లాలుప్రసాద్ నాయకత్వంలో నడుస్తున్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి)లో జాతీయ కార్యవర్గ సభ్యుడే కాక, 2 సార్లు అసెంబ్లీకి, 4 సార్లు పార్లమెంటుకు ఎంపికైన పరమ పార్లమెంటేరియన్ మహ్మద్ షాబుద్దీన్. ప్రాణాపాయాన్ని శంకిస్తున్న న్యాయాధీశుడు అజయ్‌కుమార్ శ్రీవత్సవ కావడం గమనార్హం. ఈ నేరచరిత దేశభక్తుడి అరాచకాలను, హత్యాకాండను విచారించడానికై సివాన్ జిల్లా జైలులోనే ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం పక్షాన శ్రీవాత్సవ గత డిసెంబర్ 11న జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగారశిక్ష విధించడం జరిగింది. పట్టుమని 10 నెలలు తిరక్కుండానే, సదరు నేరస్తుడు హత్య కేసులతోపాటు, ఇతర నేరాలకు బెయిల్‌ను పొందడం,న్యాయాధీశుని భయానికి ప్రధాన కారణమైంది.
ఈ నేపథ్యంలోనే శ్రీవాత్సవ బదిలీని కోరగా- నిందితుడికి బిహార్ హైకోర్టు బెయిల్ మంజూరుచేసిన రెండు రోజులకే సెప్టెంబర్ 9న పాట్నాకు బదిలీ చేసింది. తెల్లవారగానే షాబుద్దీన్ భగల్పూర్ జైలునుంచి దర్జాగా బయటకు వచ్చాడు. షాబుద్దీన్ నేరచరిత 2004నుంచే అచ్చుకెక్కడం ప్రారంభమైనా, రాజకీయంగా అరంగేట్రం చేసిన 1990 నుంచే ఆయన తన జీవిత చరిత్రను రక్తంతో రాసుకుంటూ వున్నాడు. పదుల సంఖ్యలో పోగుపడిన నేరాలకు, హత్యలకుగాను నవంబర్ 2005లో జైలుకు పంపబడగా, కనీసం వ్యక్తిగతంగా లాయర్‌ను పెట్టుకోలేని రాబిన్‌హుడ్- ఈ షాబుద్దీన్! 2009లో ఆర్‌జెడి ఎంపీగా టిక్కెట్ పొందిన ఈయన భార్య ఎన్నికల రిటర్నింగ్ అధికారికి చూపిన ఆస్తులే రూ.9 కోట్లు అని తెలిపినా, అత్యంత గరీబు అయిన ఈ మాజీ పార్లమెంటేరియన్‌కు సివాన్ కోర్టు ఆగమేఘాలమీద న్యాయ సహాయాన్ని ఆయన కోరుకున్న వకీలుచే అందించడం ఆశ్చర్యకరం!
చిన్న చిన్న నేరాలకు సైతం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదుకాకుండా, ఏళ్ళ తరబడి జైల్లోమగ్గే వారికి జీవిత కాలంలో బెయిలు కాదుగదా, కనీస న్యాయ సహాయం అందని ఈ దేశంలో- 90 శాతం అవిటితనంతో, మావోయిస్టు సానుభూతి పరునిగా ఆరోపించబడి నాగపూర్ జైల్లో బంధించబడిన జి.ఎన్.సాయిబాబాకు బెయిల్ లభించడం మాత్రం తన శక్తికి మించిన పని. కానీ, షాబుద్దీన్ లాంటి దండులకు, ఉద్ధండులకు మాత్రం లొసుగుల్ని, సాకుల్ని చూపి బెయిలు మంజూరుచేయడం ఈ దేశంలో సర్వసాధారణం.
సివాన్ జిల్లాలోని ప్రతాప్‌పుర్ గ్రామానికి చెందిన షాబుద్దీన్‌కు అమెరికాలోని స్వేత సౌధం లాంటి భవంతి సొంత ఊళ్లో ఉంది. అన్ని హంగులతోనేకాక, ఆయుధాగారంగా విరాజిల్లే ఆ నివాసం హత్యకాండలకు మారుపేరు. అదే గ్రామానికి చెందిన 79 ఏళ్ల చంద్రకేశ్వర్‌ప్రసాద్‌కు చెందిన భూవివాదం సందర్భంగా ఆయన ఇరువురు కుమారులైన సతీష్‌రాజ్, గిరీష్‌రాజ్‌ల్ని, వీరి పెద్దన్న రాజీవ్‌రోషన్ చూస్తుండగానే యాసిడ్ పోసి దారుణంగా ఆగస్టు 2004లో షాబుద్దీన్ చంపేశాడు. ప్రధాన సాక్షిగా వున్న రోషన్‌ను- కోర్టులో సాక్ష్యం చెప్పాల్సిన మూడురోజుల ముందే జూన్ 16, 2014 షాబుద్దీన్ అనుచరులు హత్యచేశారు. 1998లో సివాన్‌లోగల సిపిఐ(ఎంఎల్) కార్యాలయంపై దాడిచేసి, చోటేలాల్‌గుప్తా అనే కార్యకర్తను చంపినందుకు గాను మే 2007లోనే యావజ్జీవ కారాగారశిక్ష పడినా, పాట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడమేకాక, వాహన చౌర్యానికి జూన్ 2007న మూడు సంవత్సరాల జైలుశిక్షకు, 1996లో సివాన్ ఎస్‌పిగా వున్న సంజీవ్‌కుమార్ సింఘాల్‌పై ఎన్నికల సందర్భంగా జరిగిన దాడికి ఆగస్టు 2007లో పడిన 10 ఏళ్ల కారాగారశిక్షకు, 2005లో సబ్ ఇన్‌స్పెక్టర్‌ను బెదరించినందుకుగాను ఫిబ్రవరి 2008లో సంవత్సరం జైలుశిక్షకు, ఇంట్లో ఆయుధాల్ని దాచిపెట్టినందుకు సెప్టెంబర్ 2008లో మరో 10 ఏళ్ల శిక్షకు, జంటహత్యల కేసులో డిసెంబర్ 2015లో జీవిత ఖైదు శిక్షకు వేరువేరుగా బెయిల్స్ లభించడమేకాక, రోషన్ హత్య కేసులో సెప్టెంబర్ 9న పాట్నా హైకోర్టు మరో బెయిల్ ఇచ్చిందంటే- ఈ ఉదంతాలు పోలీసు వ్యవస్థ లోపాయికారితనాన్ని, న్యాయవ్యవస్థ బలహీనతల్ని బహిర్గతం చేస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితిలో గత మేలో హత్యకు గురైన జర్నలిస్టు రాజ్‌దే రంజన్ కేసులో- 4 నెలల తర్వాత సెప్టెంబర్ 15న నమోదైన కేసులో షాబుద్దీన్‌కు మరో శిక్షపడినా బెయిల్ దొరకదని అనుకోలేం. ఇలా వరుస హత్యలకు కారకుడైన షాబుద్దీన్ సివాన్‌కే సింహస్వప్నంగా మారడంతో భద్రత దృష్ట్యా భగల్పూర్ జైలుకుమార్చడం జరిగింది. బెయిల్‌పై విడుదలైన ప్రతిసారీ మరో హత్యాకాండను సాగించడం షాబుద్దీన్‌కు అలవాటుగా మారగా, నేరస్తుడి బెయిల్‌కు భయపడే న్యాయమూర్తి శ్రీవాత్సవ్ బదిలీని కోరగా, జర్నలిస్టు భార్య ఆశారంజన్ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి భద్రత కావాలందంటే పరిస్థితి ఎలా వుందో తెలుస్తున్నది. ఈ కోవలోనే వృద్ధాప్యంలో వున్న ప్రసాద్- ముగ్గురి కొడుకుల్ని కోల్పోయి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నాడు. ఈ సందర్భంలోనే ప్రఖ్యాత న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అండగా నిలిచి షాబుద్దీన్ బెయిల్‌ను వెంటనే రద్దుచేయాలని సుప్రీంకోర్టులో ప్రసాద్ పక్షాన పిటీషన్ వేయడం జరిగింది. ఆర్‌జెడికి చెందిన రామ్‌జెఠ్మాలనీ షాబుద్దీన్ పక్షాన వకల్తా పుచ్చుకోవడం కొసమెరుపు.
సెప్టెంబర్ 26న వాదనలు జరగ్గా, బెయిల్ రద్దు కోసం నితీష్ ప్రభుత్వం తాత్సారం చేయడానికిగల కారణాల్ని సుప్రీంకోర్టు అడగ్గా, ఆ పనిలోనే ఉన్నామంటూ సమాధానం వచ్చింది. ఎమర్జెన్సీ కాలంలో సాధారణ ఖైదీల కళ్ళు పీకేసినంతటి ఘనత వహించిన భగల్పూర్ జైలు షాబుద్దీన్‌కు రాచమర్యాదలే చేసింది. సెప్టెంబర్ 10న షాబుద్దీన్ విడుదల సందర్భంగా జరిగిన బహిరంగ ర్యాలీకి జర్నలిస్టు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపించబడి తప్పించుక తిరుగుతున్న మహ్మద్ కైఫ్ నాయకత్వం వహించడం ఏ పోలీసులకు కనపడలేదు. షాబుద్దీన్‌కు లభిస్తున్న ప్రత్యేక న్యాయ సహాయాన్ని నిలుపుదల చేసి కోర్టులో హాజరుపర్చాలని మూడు సంవత్సరాల క్రితం పాట్నా హైకోర్టు కోరినా, సదరు ఉత్తర్వులు జైల్లోనే ఉన్న షాబుద్దీన్‌కు అందలేదంటే, నితీష్ పాలన కూడా ఎంత పారదర్శకంగా సాగుతున్నదో తెలుస్తున్నది. అలాగే, రోషన్ హత్య కేసును మూడునెలల్లో ముగించాలని గత ఫిబ్రవరిలో ఆదేశించినా, అడుగు కదలకపోవడంతో ఈ కేసులోకూడా షాబుద్దీన్‌కు బెయిల్ దొరకడానికి కారణమైంది.
గత 26 సంవత్సరాలుగా విస్తరించిన షాబుద్దీన్ నేర సామ్రాజ్యం ఫలితంగా- ఓ న్యాయమూర్తి, వృద్ధ తల్లిదండ్రులు, జర్నలిస్టు భార్యనే కాదు, మరో 20 కుటుంబాలు బిక్కుబిక్కుమంటున్నాయని స్వయాన సివాన్ ఎస్‌పి చెబుతున్నారంటే పరిస్థితి ఎలా చేజారిపోయిందో తెలుస్తున్నది. పైగా, ప్రసిద్ధ న్యాయవాది రామ్‌జెఠ్మాలనీ ఈ కేసును వాదించడంతో వీరి భయానికి మరింత బలం చేకూరింది. సుపరిపాలన అంటే, కేవలం సంఖ్యాబలమని, అవినీతి అని లాలూ హయాంలోనే నిర్వచించబడడంతో షాబుద్దీన్ లాంటివారు పుట్టకురావడం జరిగింది. అందుకే, ఇంత నేర చరిత వున్నా, తనను ‘నాయకుడని’ షాబుద్దీన్ సంభోదిస్తే లాలూ తెగ సంతోష పడుతున్నాడు. సుప్రీంకోర్టులో కూడా గట్టెక్కడానికి గట్టి ప్రయత్నాన్ని చేస్తున్నాడు. అది ఇది కుదరకపోతే నితీష్ ప్రభుత్వాన్ని, లేదా నితీష్‌ను గద్దెదించినా ఆశ్చర్యం లేదు.
కండబలానికి తోడు డబ్బుబలం జతకడితే, లోప భూయిష్ట ఎన్నికల విధానం ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూనే వుంటుంది. ఈ దేశంలో నాలుగు చెరగులా జరుగుతున్నది ఇదే! వీటిని నియంత్రించాల్సిన రాజకీయ పార్టీలు మరింత ఆజ్యం పోస్తూ అసెంబ్లీలను, పార్లమెంటును కబ్జాచేస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు సమర్పించే వ్యక్తిగత వివరాల్లో ఆస్తులతోపాటు, అస్తిపంజరాల కథనాల్ని జతచేసినా ఈ దేశంలోని ఎన్నికల కమిషన్‌కు కళ్ళు చెమ్మగిల్లడం లేదు. పోటాపోటీన అన్ని రాజకీయ పార్టీలు ఈ రక్తహస్తాలకే ‘బి ఫాం’లను అందిస్తున్నాయి. ఎన్నికల్లో ఓడినవారికి, గెలవలేని వారికి విధాన మండలిలో, రాజ్యసభలో పిలిపించి మరీ కూర్చోబెడుతున్నాయి. ఇలాంటి వారే దీనబంధువులుగా, కళాపోషకులుగా, విద్యావేత్తలుగా, విధాన నిర్ణేతలుగా, చివరికి సామాజిక మేధావులుగా విరాజిల్లుతున్నారు. దారీ తెన్నులేని, చైతన్యరహిత యువకులు వీరి మాయలోపడి ఆయా పార్టీల జెండాల్ని మోస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీదాకా సాలెగూడులా అల్లుకున్న నేరస్తులే అసెంబ్లీ, పార్లమెంటులకు చిరునామాలుగా మారుతున్నారు.
షాబుద్దీన్ నేరచరిత్ర బిహార్ రాజకీయాల్ని ఇంతగా ప్రభావితం చేస్తుంటే, లాలూప్రసాద్ ఆర్‌జెడి పార్టీ ఇందులోనే ఈదులాడుతుంటే, జాగ్రత్తగా ఉండాల్సిన నితీష్‌కుమార్, ఎన్‌డిఎను దూరంగా పెట్టడానికై ప్రధాన శత్రువుతోనే ఐక్యసంఘటన కట్టడం ప్రజాస్వామ్యపు విషాదం కాదా? విధానపరమైన అంశాలతో ఎన్నికలకు ముందు ‘ఐక్య సంఘటనలు’ కట్టడం ఓ ప్రాపంచిక రాజకీయమైతే, ఎన్నికల తర్వాత స్వార్థరాజకీయాలకై మమేకం కావడం ప్రజాస్వామ్య ఖూనీకేనని బిహారు నిరూపించక ముందే- సిఎం నితీష్ నిద్ర మేల్కొంటే మంచిది.

- డా. జి.లచ్చయ్య 94401 16162