రచ్చ బండ

ఎవరికి వారే.. కాంగ్రెస్ తీరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు, ఎమ్మెల్యేలు ‘ఎవరికి వారే’ అన్నట్లు గ్రూపు రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారు. మెజారిటీ జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. టి.పిసిసి అధ్యక్షుడిగా కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా పరిస్థితులు ఏ మాత్రం మారలేదు. ఉత్తమ్ తన సొంత జిల్లా అయిన నల్లగొండలోనే గ్రూపులు లేకుండా చేయలేకపోయారన్న విమర్శ ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ జిల్లా పార్టీ కార్యక్రమాల్లో తప్ప, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. ఇక సిఎల్‌పి నేత, ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి స్టైలే వేరుగా ఉంది. తుమ్మడిహెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టును 148 మీటర్ల ఎత్తుకు నిర్మించేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తాము అధికారంలో ఉన్నప్పుడు 152 మీటర్లకు ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇప్పుడు ఎత్తు తగ్గించడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. జానారెడ్డి మాత్రం తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదన చేయగా, ‘మహా’ ప్రభుత్వం ససేమిరా అందని తేల్చి చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కినుక వహించారు. ఒప్పందం 152 మీటర్లకే జరిగినట్లు చెప్పాల్సిందన్నది వారి అభిప్రాయం. అలా చెబితే గనుక, తాను అసెంబ్లీ సమావేశాల్లో అడ్డంగా దొరికిపోతానన్నది జానా అభిప్రాయమై ఉండవచ్చు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒప్పందం చేసుకోలేదని, కేవలం ప్రతిపాదన మాత్రమే చేసిందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో వాస్తవ పత్రాలను బయట పెట్టి, తనను నిలదీస్తే ఏమని సమాధానం చెప్పుకోవాలి...అందుకే వాస్తవం చెప్పా..’ అని జానారెడ్డి తేల్చేశారు. ఇక, గ్యాంగ్‌స్టర్ నరుూం ఉదంతాలపై సిబిఐ విచారణ జరిపించాల్సిందిగా కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాత్రం ‘సిట్’తో దర్యాప్తు చేయిస్తున్నది. దీనిపై కూడా జానా పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడారు. ‘సిట్’ దర్యాప్తు జరుగుతున్నది కదా జరగనివ్వండి, మాజీ హోం మంత్రిగా సిబిఐ విచారణ కోరితే, ‘సిట్’పై నమ్మకం లేదేమోనన్న అభిప్రాయం కలుగుతుందన్నది ఆయన అభిమతం. తాము ఒకటి కోరితే జానారెడ్డి మరో విధంగా మాట్లాడారన్నది పార్టీ నేతల విమర్శలు.
మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ మండలాల ఏర్పాటు విషయంలో పార్టీ నాయకుల మధ్య గందరగోళం నెలకొంది. జిల్లా నాయకులు సమన్వయంతో చర్చించుకుని పోరాటం చేయడం లేదు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ గద్వాల జిల్లా కోసం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ఒక రోజు దీక్ష నిర్వహించగా, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, జి. చిన్నారెడ్డి ఆ దీక్షకు హాజరుకాలేదు. ఎమ్మెల్యే సంపత్ ఒక్కరే ఆమెకు సంఘీభావాన్ని ప్రకటించారు. కల్వకుర్తిలో వంశీచంద్ రెడ్డి నిర్వహించిన దీక్షకు చిన్నారెడ్డి మద్దతు ప్రకటించారు. టి.పిసిసి ‘చలో మల్లన్న సాగర్’కు పిలుపునివ్వగా వివిధ జిల్లాల నేతలు, కార్యకర్తలంతా గాంధీభవన్‌కు చేరుకుని యాత్రకు బయలుదేరారు. దారిలో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నదని వినతి పత్రం అందజేసి వెళ్లారు. కాగా, డికె అరుణ, పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విడిగా మల్లన్న సాగర్‌కు చేరుకున్నారు. మల్లన్న సాగర్ బాధితులతో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఇందిరా పార్కు వద్ద దీక్ష నిర్వహించగా, ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరై సంఘీభావం ప్రకటించారు. మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్ ప్రభృతులూ పట్టించుకోలేదు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మల్లన్న సాగర్ బాధితుల ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నా, రాష్ట్ర పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు. గత ఏడాది ఆదిలాబాద్ జిల్లాలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించినప్పుడు ఆ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఏర్పాట్లన్నీ చూసుకున్నారు. ఇతర జిల్లాల్లోనూ రాహుల్ గాంధీతో పాదయాత్రలు చేయించాలనుకున్నా, ఆ విషయానే పార్టీ నేతలు మరిచారు.
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలను కూల్చి వేస్తామని, ఇందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం కోరింది. అక్రమ నిర్మాణాలకు గత ప్రభుత్వాల పాలకులే కారణమంటూ టిఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటే సహకరిస్తామని కాంగ్రెస్ నాయకుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ ప్రకటించడంపై సొంత పార్టీ నాయకులు కొందరు భగ్గుమంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించకుండా ఇళ్లను ఎలా తొలగిస్తారని, బాధితులకు మనం అండగా ఉండాల్సిన సమయంలో ఇటువంటి ప్రకటన చేస్తారా? అనేది వారి అభ్యంతరం. ఇలా పార్టీ నాయకులు, లెజిస్లేచర్ పార్టీ నేతలకు మధ్య సమన్వయం కొరవడి నాయకులు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

-వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి