సంపాదకీయం

‘మత్తు’కు మద్దతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిహార్ ప్రభుత్వం జారీ చేసిన మద్యపాన నిషేధపుటుత్తరువును పాట్నా హైకోర్టు రద్దు చేయడం ‘తాగుబోతు’లకు హర్షం కలిగిస్తున్న అద్భుతం! ఆ రాష్టమ్రంతటా మద్యపాన మమకార జీవులు ఆనందోత్సాహాల విన్యాసాలను ప్రదర్శిస్తున్నారట కూడ! మద్యపాన నిషేధాన్ని దేశమంతటా సర్వసమగ్రంగా అమలు జరుపడానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నది మన రాజ్యాంగంలో పేర్కొన్న ‘నిర్దేశక నియమం’- డైరక్టివ్ ప్రిన్సిపుల్! ఈ ఆదేశ సూత్రాన్ని 1950 నుంచి కూడ ఒక రాష్ట్ర ప్రభుత్వం తరువాత మరొక రాష్ట్రం ఉల్లంఘిస్తుండడం వ్యతిరేక స్ఫూర్తి.. అందువల్ల రకరకాల ‘వారుణి’ వాహినులలో మద్యం ప్రియులు ఓలలాడుతుండడం నడుస్తున్న చరిత్ర. రాత్రి పనె్నండు గంటల వరకు మద్యపాన కేంద్రాలు, మద్య విక్రయం ‘్ఠణా‘లు తెరిచి ఉండవచ్చునని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు పోటీపడి ‘ఊగుపోతుల’కు గొప్ప వెసలుబాటును కూడ కల్పించాయి. అమెరికాలోను ఐరోపాలోను అమలు జరుపుతున్నట్టుగా ఇరవై నాలుగు గంటలూ, మూడు వందలా అరవై ఆరురోజులూ తెరుచుకుని ఉండే మద్యపాన స్థావరాలను సైతం నెలకొల్పడానికి సైతం కొందరు రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ నిర్వాహకులు ఉవ్విళ్లూరుతున్నారు. బహుశా ఈ ‘అరౌండ్ ది క్లాక్’, ‘అరౌండ్ ది లైఫ్’ మద్యం క్లబ్బులు, ‘్ఫషనబుల్ పబ్బులు’ కూడ ఆరంభమైపోయాయేమో? ఇదమిత్థంగా సమాచారం లేదు! దేశంలో గుజరాత్‌లో తప్ప మరెక్కడా కూడ మద్యపానం అమలులో లేని రాజ్యాంగ వ్యితిరేక స్ఫూర్తి రాజ్యమేలుతోంది. ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం వారు కూడ ఈ స్ఫూర్తికి అనుకూలమైన వ్యాఖ్యలు చేయడం మరో విచిత్రం. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలన్న సంకల్పం కలిగింది. మద్యపానాన్ని, మద్యం అమ్మకాలను నియంత్రించడానికి కేరళ ప్రభుత్వం గత కొనే్నళ్లుగా కృషి చేస్తోంది. ఈ కృషికి సర్వోన్నత న్యాయస్థానం ఆమోదం కూడ లభించింది. అదే స్ఫూర్తితో బిహార్ ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం రాజ్యాంగ వ్యతిరేకమని పాట్నా ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పడమే విస్మయకరం! రాజ్యాంగంలోనే మద్యపానాన్ని నిషేధించాలన్న ఆదేశ సూత్రం నిహితమై ఉంది. ఈ సంగతి పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇక్బాల్ అహమ్మద్ అన్సారీకి, న్యాయమూర్తి నానావాతీ ప్రసాద్ సింగ్‌కు తెలుసు. అయినప్పటికీ ప్రభుత్వం రూపొందించిన ‘సవరణ బిల్లు’ చెల్లదని ఈ న్యాయమూర్తులు నిర్ధారించడం సామాన్య మానవులకు అర్థం కాని న్యాయ ప్రహేళిక!
హైకోర్టు తీర్పు ప్రకారం గతంలో చేసిన సవరణ మాత్రమే రద్దయిపోయిందని బిహార్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా మరో సవరణ బిల్లును శాసనసభ ఇటీవల ఆమోదించదనీ, దానిని హైకోర్టు రద్దు చేయలేదని బిహార్ ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల రద్దుకాని కొత్త చట్టం ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ, మహాత్మాగాంధీ జయంతి నుండి మళ్లీ సంపూర్ణ మద్యపాన, మద్య విక్రయ నిషేధాన్ని అమలు జరుపుతున్నట్టు బిహార్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అది వేరే సంగతి, ఆ ఉత్తరువును సైతం మద్యం ఉత్పత్తి దారులు, విక్రేతలు, సేవకులు, ఇతరులు న్యాయస్థానాలలో సవాలు చేయవచ్చు. అది కాదు ప్రధానం. ఇన్నాళ్లకు ఒక రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తుండగా ఉన్నత న్యాయస్థానం వారు ఈ ‘ప్రగతి’ ని నిరోధించడమే అంతుపట్టని వ్యవహారం. తాము రద్దు చేసిన మద్యపాన నిషేధపు చట్టం ‘క్రూరమైనదని, నాగరిక సమాజంలో ఇలాంటి చట్టాన్ని సమర్ధింపజాలమని’ హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. నాగరిక సమాజమంటే మద్యపానాన్ని ప్రోత్సహించే సమాజమా? నిషేధించడం నాగరికం కాదా?? అందువల్లనే ‘ఇండియా మేడ్ ఫారిన్ లిక్కర్’-ఐఎమ్‌ఎఫ్‌ఎల్‌ను తాగడం, అమ్మడం నిషేధించే చట్టాన్ని ఉన్నత న్యాయస్థానం రద్దు చేసిందట! మద్యం అమ్మే వ్యాపారుల ఆస్తులను జప్తు చేయడానికి, మద్యం ఉత్పత్తి చేస్తున్న గ్రామాల ప్రజలపై సమష్టిగా జరిమానా-కమ్యూనిటీ ఫైన్- విధించడానికి వీలు కల్పిస్తున్న నిబంధనలు క్రూరమైనవట! కానీ ఈ క్రూరమైన నిబంధనలను మాత్రమే ఉన్నత న్యాయస్థానం వారు రద్దుచేసి ఉండవచ్చు. మద్యపాన నిషేధాన్ని మద్యం ఉత్పత్తి నిషేధాన్ని కొనసాగించి ఉండవచ్చు.. కొన్ని లోపాలు ఉన్నప్పుడు వాటిని తొలగించాలి కాని వ్యవస్థనే రద్దు చేయడం ఏం న్యాయం?
రాజ్యాంగంలోని ‘నిర్దేశక నియమాలు’ పరిపాలకులకు మంచి మార్గాన్ని బోధించే ‘సలహాలు’ మాత్రమే కావచ్చు. వాటిని అమలుజరిపి తీరాలన్న నిబంధన లేకపోవచ్చు, వాటిని అమలు జరిపి తీరాలని ప్రభుత్వాలను ఆదేశించవలసిందిగా ఉన్నత , సర్వోన్నత న్యాయస్థానాలను అభ్యర్థించే హక్కు పౌరులకు లేకపోవచ్చు! కానీ ఆదేశ సూత్రాలను అమలు చేయడంవల్ల మరింత ఉత్తమ ప్రజాస్వామ్య, సంక్షేమ, నైతిక, నాగరిక సమాజం వ్యవస్థీకృతం కాగలదన్నది రాజ్యాంగ స్ఫూర్తి. ఈ ఆదేశిక సూత్రాలు అనాదిగా భారతీయ సమాజం అవలంబిస్తున్న జీవన సంప్రదాయాలకు మరో ధ్రువీకరణ మాత్రమే. భారత జాతి మనోభీష్టానికి ‘ఆదేశ సూత్రాలు’ లేదా నిర్దేశక నియమాలు అద్దం పడుతున్నాయి. అందువల్లనే అందరికీ సమాన చట్టాలు ఉండాలని, ఆవులను, పాడిపశువులను గోసంతతిని హత్య చేయడం ఆగిపోవాలని, మద్యపానాన్ని నిషేధించాలని ‘డైరక్టివ్ ప్రిన్సిపుల్స్’ రాజ్యాంగ విభాగంలో పేర్కొన్నారు. ఇవన్నీ కూడ భారతీయుల యుగయుగాల ఆకాంక్షలు, జీవన పద్ధతులు. సమాజంలో మద్యం తాగేవారు, జూదరులు, వన్య మృగాలను హతమార్చేవారు, వ్యభిచారులు, జులాయిలు, అసభ్యంగా మాడ్లాడేవారు అనాదిగా ఉన్నారు. కానీ సమాజం సమష్టిగా వీటిని ప్రోత్సహించలేదు. మద్యపానం వంటివి వ్యసనాలని వాటిని విడనాడాలని సమష్టి సమాజం కోరుకుంది. ‘వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకుప్రల్లదనము, సొమ్ము నిష్ప్రయోజనమ్ముగా వమ్ము సేత’.. వంటి వ్యసనాలకు పాలుపడరాదన్నది సమష్టి సమాజ అభిప్రాయం! మద్యపానం అందువల్ల ఈ దేశంలో ఎప్పుడు కూడ ‘నాగరికము’ కాలేదు, అది భోగమని కూడ సమాజం గుర్తించలేదు..
మరి ఇప్పుడు జరుగుతున్నదేమిటి? తరతరాలుగా ఉత్తమ సంప్రదాయాలుగా సమష్టి సమాజం భావిస్తున్న వాటిని విడనాడడమే నాగరికమా? ‘నృత్యశాల’- డాన్సింగ్ బార్-లలో మద్యాన్ని విక్రయించరాదని తాగరాదని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాసించింది. తాగిన తరువాత నృత్యం చేసినా, నాట్యాన్ని చూసినా సామాజిక వ్యతిరేక చర్యలు జరిగిపోయే ప్రమాదం ఉంది. కానీ ‘మద్యం లేని నృత్యశాలలు అర్థరహితం’ అని సుప్రీం కోర్టు సెప్టెంబర్ 21వ తేదీన వ్యాఖ్యానించినట్టు ప్రచారమైంది. సామాన్యులం ఏమనగలం? అంతకు పూర్వం ఈ ‘డాన్సింగ్ బార్’లను మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. కానీ సుప్రీంకోర్టు ఈ ఉత్తరువును రద్దు చేసింది. ఈ ‘డాన్సింగ్ బార్’లు మళ్లీ తెరుచుకున్నాయి. ‘డాన్స్ మాత్రమే చేసుకోండి.. అప్పుడు మాత్రం మద్యం తాగకండి..’ అని మహారాష్ట్ర అంటోంది! తప్పేమిటి?