సబ్ ఫీచర్

ప్రాధికార సంస్థతో తెలుగుకు తేజస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం హర్షణీయం. ఈ విషయమై లోతుగా అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు భాష విషయంలో కొంత ఆసక్తి కలిగే పనులను ప్రభుత్వం చేపడుతుందేమో అనే ఆశ కలుగుతోంది.
మనకు అధికార భాషా సంఘమనే ప్రభుత్వ సంస్థ చాలాకాలంగా ఉంది. కానీ- అది ఇంతవరకు తెలుగు భాషను తెలుగువాళ్ళ కోసం ఉపయోగించే విషయంలో ప్రయోజనాత్మకమైన పనుల్ని పటిష్ఠంగా చేపట్టిన దాఖలాలు లేవు. ‘అధికారం’ అనే పదం నామమాత్రంగానే మిగిలిపోవడం వల్ల, ప్రభుత్వానికి ప్రజల భాష మీద ఏమాత్రం గౌరవం లేకపోవడంవల్ల ఈ అధికార భాషా సంఘమన్నది ఆశ్రీత జనావాస కేంద్రంగా మిగిలింది.
భాషాసంస్కృతులన్నవి కేవలం మాటలకు పరిమితం కాదగిన విషయాలని మన పాలకుల గట్టి నమ్మకం. ప్రజలు మాట్లాడే భాషలోనే అన్ని వ్యవహారాలు జరగాలని, ప్రజలు మాట్లాడే భాషకే ఎప్పుడూ అగ్రస్థానం దక్కాలని, ఇతర భాషల్ని కేవలం అనుసంధాన భాషలుగా పరిగణించాలని మన పాలకులకు ఎప్పటికీ అర్థం కాదు. విద్యార్థులు, టీవీ కార్యక్రమాలలో కనిపించే ప్రయోక్తలు, చలనచిత్ర రంగానికి చెందిన ప్రతి ఒక్కరూ, రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అటు తెలుగు భాషను సరిగ్గా మాట్లాడలేక, ఇంగ్లీషును సవ్యంగా వ్యక్తం చెయ్యలేక అవస్థ పడుతుంటే జాలివేస్తుంది. వీళ్ళు తమ మాతృభాషనీ నేర్చుకోలేరు, ఇంగ్లీషునీ సొంతం చేసుకోలేరు. ఇలాంటి ‘సంకర జాతి’ని సృష్టించడమే పరమావధిగా భావించడం ప్రభుత్వం బాధ్యత కాదని గుర్తించడం తక్షణ అవసరం.
ప్రజల అవసరాల కోసం వేల కోట్లు ఖర్చుచెయ్యడానికి వెనకాడని ప్రభుత్వం భాషాసంస్కృతుల విషయం వచ్చేసరికి వంద కోట్లు కూడా ఖర్చుచేయలేని పరిస్థితిలో ఉందంటే మనం సిగ్గుపడాలి. కోట్ల సంఖ్యలో జనం మాట్లాడే భాష కోసం సంవత్సరానికి కనీసం వంద కోట్లయినా ఖర్చుపెట్టే మనసులేని వారికి మనం ఎన్ని చెప్పినా లాభం లేదు. మనసు పెట్టకపోతే రేపుప్రాధికార సంస్థ ఏర్పడినా అది నామమాత్రపు సంస్థగానే మిగిలిపోతుంది.
భాషా ప్రాధికార సంస్థ ఆలోచన బహుశా కర్నాటకలో ఉన్న కన్నడ భాషాప్రాధికార సంస్థ ప్రేరణ వల్ల కలిగి ఉండవచ్చు. కానీ, కర్నాటక రాష్ట్రంలోలాగా భాషాసంస్కృతుల పట్ల గౌరవాన్ని చూపించడం మనకు కలలోని మాట. కన్నడిగులకు గాని, తమిళులకు గాని ఉండే భాషాభిమానం తెలుగువారికి ఎప్పటికీ రాదు. అలాంటి నమ్మకాన్ని కలిగించే రోజు వస్తే సంతోషమే.
కర్నాటక రాష్ట్రంలో భాషా సంస్కృతుల అభివృద్ధికి కేవలం ప్రాధికార సంస్థ మాత్రమే లేదు. కన్నడం కోసం ‘కన్నడ మరియు సంస్కృత ఇలాఖా’, కర్నాటక సాహిత్య అకాడెమీ, సంగీత అకాడెమీ, నాటక అకాడెమీ, జానపద అకాడెమీ, యక్షగాన అకాడెమీ వంటివి ఉన్నాయి. వీటితోబాటు కన్నడ పుస్తకాల ప్రచురణ, ప్రచారం కోసం కన్నడ పుస్తక ప్రాధికారం కూడా ఉంది. ఇవికాక ప్రాచీన, ఆధునిక కన్నడ రచయితలైన పంప, రన్న, కనకదాస, కువెంపు, బేంద్రె మొదలైన వారి పేరిట ప్రతిష్ఠానాలున్నాయి. బసవ ప్రశస్తి పేరిట ఐదు లక్షల రూపాయల పురస్కారం, ఇతర కవుల పేరిట లక్ష రూపాయల చొప్పున పురస్కారాలున్నాయి. కర్నాటక రాష్ట్రావతరణ రోజున 50 నుంచి 100 మందికి ‘రాజ్యోత్సవ ప్రశస్తి’ని ఇస్తూ లక్ష రూపాయలు, పది గ్రాముల బంగారం ఇస్తారు. ఇలాంటి భాషాభిమానాన్ని తెలుగు విషయంలో ఊహించడానికి కూడా వీలులేదు. అంతేకాదు, తెలుగుకు ప్రాచీన భాషాప్రతిపత్తి లభించినా దాని ఉపయోగాలను పొందడానికి మనకు ఇప్పటివరకు వీలుకాలేదు. వీలుకాకపోవడం కాదు.. కేవలం అది అలసత్వం. కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా ప్రకటించి కూడా మొండి చెయ్యి చూపించినందుకు వౌనం వహించకుండా కర్నాటక ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలకు రెండు కోట్ల చొప్పున ధన సహాయం చేసి ప్రాచీన సా హిత్య పరిశోధనకు వీలుకల్పించింది.
ఇంతగా చెప్పడం కర్నాటక ప్రభుత్వాన్ని పొగడటానికి కాదు. కొన్ని వందల కోట్లు ప్రతి ఏడాది ఖర్చయినా వెనుదీయకుండా మనసుపెట్టి భాషా సంస్కృతులను అభివృద్ధి చేసే చొరవ మన ప్రభుత్వానికి ఉందా? అన్నదే ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికైనా మనం మాటలు కట్టిపెట్టి నిజాయితీగా భాషా సంస్కృతుల అభివృద్ధికి పాటుపడాలని ఆశిద్దాం. ప్రభుత్వం చెవికి వినపడేలా చేద్దాం. ఒకవేళ అన్నీ అనుకూలించి తెలుగు భాషాభివృద్ధికి ప్రాధికార సంస్థ ఏర్పడితే అది ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష సమగ్ర అభివృద్ధికి పాటుపడేట్లుండాలి. తెలుగు భాషకు సంబంధించిన అన్ని విషయాలపై ప్రాధికార సంస్థకు పూర్తి అధికారాలుండాలి. పరిపాలనకు సంబంధించిన అన్నిశాఖలలో తెలుగు వ్యవహారం తప్పనిసరిగా జరిగేట్లు చూడగలగాలి. తెలుగు అమలు కాకపోతే చర్యతీసుకొనే అధికారం ఉండాలి. అన్నిరంగాలలో తెలుగు అమలుకావటానికి వీలుగా పదకోశాలను తయారుచేయాలి. విద్యాబోధనలో తెలుగు భాషకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి, ఇంగ్లీషు సహా మరే భాషనైనా అనుసంధాన భాషగా నేర్చుకోడానికి వీలుకల్పించాలి. ఇవన్నీ చేయగల సామర్థ్యం ఉండే విధంగా తెలుగు భాషాభివృద్ధికి ప్రాధికార సంస్థను ఏర్పాటు చెయ్యాలి.

-రాళ్ళపల్లి సుందరం