సబ్ ఫీచర్

సెక్యులర్ భారతంలో సెలవుల పర్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన పొరుగు దేశమైన శ్రీలంకలో ప్రధానమైన మతం బౌద్ధం. బౌద్ధులకు పౌర్ణమి ముఖ్యమైన రోజు. ఆ కారణంగా శ్రీలంకలో ప్రతి పున్నమికీ సెలవు ఇస్తారు. అత్యవసర సేవా విభాగాలైన వైద్యాలయాలు, రవాణా వంటివి మాత్రమే పనిచేస్తాయి. పూర్ణిమనాడు బౌద్ధులు విహారాలకు వెళ్ళి ప్రార్థనలు చెయ్యాలి, అప్పుడు ఏ విధమైన విలాసాలవైపూ మనస్సు పోరాదు. అందుకే ప్రతి పౌర్ణమినాడూ మాంసం దుకాణాలు, మద్యం సప్లైచేసే బార్లు, నైట్ క్లబ్బులు, చివరకు సినిమా హాళ్ళు కూడా మూసివెయ్యాలన్నది ప్రభుత్వ ఉత్తరువు.
అన్ని రకాల ఆనందాలకూ ఇతర మతస్థులు ఎందుకు దూరమవాలి, వారి మనోభావాలు గాయపర్చడం తప్పుకాదా? అన్న ప్రశ్న శ్రీలంకలో ఉత్పన్నం కాదు. బ్రిటన్ నుంచి 1948లో రాజకీయ స్వాతంత్య్రం లభించిన తరువాత నిర్మించుకున్న రాజ్యాంగంలో బౌద్ధమత రక్షణ కూడా ఉంది. ప్రలోభపెట్టి కానీ, భయపెట్టికానీ బౌద్ధులను మతమార్పిడి చేయించడాన్ని చట్టవిరుద్ధం చేసే ప్రయత్నాలు శ్రీలంకలో జరుగుతున్నాయి. అంతమాత్రాన ఇతర మతస్థులను శ్రీలంక ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందనడానికి లేదు. హిందువుల పండుగలైన సంక్రాంతి, శివరాత్రి, దీపావళులకూ, ముస్లిం పండుగలైన రంజాన్, బక్రీద్, మిలాదిన్ నబీలకూ, క్రైస్తవుల క్రిస్టమస్, గుడ్‌ఫ్రైడేలకూ శ్రీలంక ప్రభుత్వం సెలవులిస్తుంది. (ఇస్లాం దేశాలలో రంజాన్ నెలలో పగలంతా హోటళ్ళు మూసే ఉంటాయన్నది తెలిసిన విషయమే.)
మతం ప్రధానం కాని దేశాలలో పండుగ సెలవులెలా ఉంటాయి? అతి శక్తివంతమైన అమెరికా సెక్యులర్ దేశం. చాలాకాలంపాటు క్రిస్టమస్‌కు కూడా ఆ దేశంలో సెలవు లేదు. జనాభాలో క్రైస్తవుల శాతం చాలా ఎక్కువ కనుక క్రిస్టమస్ నాడు ఆఫీసుకి వచ్చేవారి సంఖ్య అతి తక్కువ అవడంతో క్రిస్టమస్‌ను ఫెడరల్ హాలిడేస్‌లో (కేంద్ర ప్రభుత్వ సెలవు) చేర్చారు. గుడ్‌ఫ్రైడే వంటివి ఫెడరల్ హాలీడేస్‌లో లేవు. అతి తక్కువ రాష్ట్రాల్లోనే గుడ్‌ఫ్రైడే, క్రిస్టమస్ ఈవ్, బాక్సింగ్ డే వంటివి రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినాలు.
ఇక- ‘మతమనేది ప్రజలకు మత్తుమందు’ అని విశ్వసించే కమ్యూనిస్టు దేశాలలో పండుగలకు సెలవు ఇచ్చే ప్రశ్న ఉదయించదు. సోవియట్ల ఆధీనంలోని రష్యాలోక్రిస్టమస్‌కు సెలవు లేదు. 1990ల నుంచీ వ్లాడిమిర్ పుతిన్ ఆర్థడాక్స్ క్రిస్టమస్‌కు సెలవుఇవ్వడం ప్రారంభించారు. (రష్యాలో క్రిస్టమస్‌ని డిసెంబర్‌లో కాకుండా జనవరిలో జరుపుకుంటారు. పోప్ గ్రిగరీ నిర్దేశించిన కాలండరు కాకుండా జూలియస్ సీజర్ కాలండరునే వారు పండుగల లెక్కింపుకు వాడతారు.) చైనాలో ఏ మతానికి సంబంధించిన పండుగకూ సెలవు లేదు. మావో పుట్టినరోజు, చైనా సంవత్సరాది, మహిళా దినోత్సవం వంటి వాటికి సెలవులుంటాయి కానీ, ఆ సెలవుకు బదులుగా తరువాత వచ్చే ఆదివారం లేదా ముందు జరిగిపోయిన ఆదివారం పనిచెయ్యాల్సిందే.
‘పని మాత్రమే దైవం’ (వర్క్ ఈజ్ వర్షిప్) అనే ప్రగాఢమైన నమ్మకమున్న జపాన్‌లోనూ మతపరమైన సెలవులు లేవు. సెక్యులర్ దేశాలలో, దైవం మీద విశ్వాసం లేని కమ్యూనిస్టు దేశాలలో పండుగలకు సెలవులుండవు. మత ప్రాతిపదికన రాజ్యాంగముండే దేశాలలో పండుగలకు సెలవులివ్వడంతోపాటుగా ప్రభుత్వం నియమనిష్ఠలతో విలాస రహితంగా పండుగలు జరుపుకునేలా చూస్తుంది. మరి ‘సెక్యులర్’ భారతదేశంలో అన్ని మతాలనూ సమానంగా ఆదరించడం వల్ల, అన్ని మతాల పండుగలకూ కేంద్ర ప్రభుత్వం సెలవులిస్తుంది. అయితే, మత విశ్వాసాలను గౌరవించాలన్న నియమం లేదు. మహావీర జయంతి నాడు మాంస విక్రయం నిషేధించాలంటే ‘మైనారిటీ’ల మనోభావాలు దెబ్బతింటాయన్న భయం. సెలవులు ప్రకటించడంతో ప్రభుత్వం పని పూర్తయినట్లే. సెక్యులర్ దేశం కనుక పండుగ ఎలా జరుపుకుంటున్నారన్న విషయంలో జోక్యం చేసుకోదు.
మెజారిటీ ప్రజల పండుగలనే పరిశీలించవచ్చు. సంవత్సరాదితో పండుగలు ప్రారంభవౌతాయి. ఉగాది నుండి శ్రీరామనవమి వరకూ వసంత నవరాత్రులలో రామాయణ పారాయణం, రాముని పూజించడం, వీలయితే రామాయణ సప్తాహం నిర్వహించడం వంటివి చెయ్యాలి. గణపతి నవరాత్రులలో వినాయక పూజ, ఉండ్రాళ్ళ నైవేద్యం, శరన్నవరాత్రులలో దేవీపూజ, వైకుంఠ ఏకాదశి, మహాశివరాత్రులలో ఉపవాసం, జాగరణ వంటివి ఉంటాయి. నియమనిష్ఠలతో, భక్తిప్రపత్తులతో దైవారాధన చేయడం పండుగల ముఖ్యోద్దేశం. ఆ కారణంగానే శ్రీలంకలో సినిమా హాళ్ళనుంచి సర్వమూ మూసివేస్తారు.
భారతదేశంలో జరుగుతున్నదేమిటి? పండుగనాడే కొత్త సినిమాలు రిలీజవుతాయి. ఉదయానే్న థియేటర్లముందు తొడతొక్కిడి మొదలవుతుంది. బట్టల దుకాణాలూ, నగల షాపులూ పండుగకు ముందే డిస్కౌంట్ల ప్రకటనలు మొదలెడతాయి. మొక్కుబడిగా నైవేద్యం పెట్టి సుష్టుగా మనమే తింటాం కాబట్టి పత్రికలూ, టీవీ చానెళ్ళూ వంటలను నేర్పిస్తాయి. కడుపునిండా తిని, సినిమాలకూ, షాపింగులకూ తిరగడమే పండుగ పరమార్థం. ప్రభుత్వం అందుకే సెలవు ఇస్తున్నది.
ఇక, సామూహిక ప్రార్థనలైతే మద్యం ఏరులై ప్రవహించవలసినదే. ఈ ఏడాది విజయవాడలో గణేశ నిమజ్జనానికి 15 కోట్లు ఖర్చుకాగా అందులో మూడవ వంతు మద్యానికే అని అంచనా. ఏ ఊరులోనూ ఈ పరిస్థితిలో మార్పు ఉండదు.
ఉద్యోగులను ఆకట్టుకుందుకే ప్రభుత్వం విచ్చలవిడిగా సెలవులిస్తున్నదా? అన్పిస్తుంది. (ఉద్యోగులను మించిన ఓటుబ్యాంకు మరొకటి లేదేమో.) సెక్యులర్ దేశాలలోవలె సెలవులివ్వకపోయినా మంచిదే. ఎవరికి కావలసిన పండుగకు వారు సెలవు పెట్టుకుంటారు. లేదా సెలవు ఎందుకు ఇవ్వబడినదో ఉద్యోగులు గుర్తుంచుకునేలా చేసినా మంచిదే. ఎటొచ్చీ ప్రభుత్వ జోక్యాన్ని ఇటు ఉద్యోగ సంఘాలు కానీ, అటు సినిమా, వ్యాపార రంగాలు కానీ అంగీకరిస్తాయా? అన్నది ప్రశ్న.
మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అతి ఎక్కువగా సెలవులిచ్చే దేశం కూడా. ఉద్యోగులు సెలవుపెట్టడం భారతదేశంలో చాలా తక్కువ అని లెక్కలలో తేలింది. పెట్టాల్సిన అవసరం లేకపోవడమే కారణమేమో. పండుగ సెలవులలోనే కాదు, ప్రతి సెలవుకీ పరిస్థితిలో తేడా లేదు. మహనీయుల జయంతి విషయమైనా అంతే. మరణించిన సమయమైనా అంతే. స్నానాల గదిలో ఎమర్జన్సీ బిల్లు సంతకం పెట్టిన వృద్ధుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణించినా, దేశాన్ని ప్రగతిపథంలో నడపాలని ఆరాటపడ్డ యువ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకు గురయినా ఉద్యోగుల మనస్సులో ఉదయించే ఆలోచన ఒక్కటే- సెలవు ప్రకటిస్తారా? ఇక ఈ దేశానికి పురోగతి ఎక్కడ?

-పాలంకి సత్య