ఉత్తరాయణం

బాధ్యతారహిత వ్యాఖ్యలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత కొద్దిరోజులుగా దేశ రాజకీయ రంగస్థలిపై వివిధ పక్షాలు విసురుకొంటున్న వాగ్బాణాలు అదుపు తప్పుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దుల కావల ఉన్న తీవ్రవాద శిబిరాలపై భారత్ సేనలు మెరుపుదాడి చేసి విజయంతో తిరిగిచ్చిన ఉదంతంపై రాజకీయ నేపథ్యం సంతరించుకోవడం బాధాకరం. ప్రధాన రాజకీయ పక్షాలు బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తే అది- సైన్యానికి, దేశానికీ, ప్రజలకి ఎంత మాత్రమూ మేలు కాదు.
వరస తీవ్రవాద చర్యలతో మన దేశానికి ద్రోహం చేస్తున్న పొరుగు దేశానికి మెరుపుదాడి ఒక హెచ్చరికలా పనిచేసింది. ఆ దేశం ప్రపంచ దేశాల ముందు తేలుకుట్టిన దొంగలా నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎన్నడూ లేనంత స్పష్టమైన మద్దతు అంతర్జాతీయ సమాజం నుండి భారత్‌కు లభించింది. ఆ దాడి జరిగిన పిమ్మట పాకిస్తాన్‌లో నడూస్తున్న కలవరం, తొట్రుపాటు, అస్పష్ట వ్యాఖ్యానాలు సుస్పష్టం. దాడికి ముందున్న ధీమా వారిలో లేదన్నది సత్యం. ఈ క్రెడిట్ భారతీయ సైన్యానికి, ప్రధాని మోదీకీ దక్కాల్సిందే. అయితే, దానిని ఎంతమాత్రమూ రాజకీయ తురుపుముక్కగా దిగజార్చరాదు. అలాచేస్తే ఓటుబ్యాంకు రాజకీయాల స్థాయికి దిగజారినట్టే. ప్రధాని మోదీ ఈ విజయాన్ని జబ్బలు చరచుకొనే విషయంగా మార్చొద్దు అంటూ చేసిన ప్రకటనకి పాలకపక్షం కట్టుబడాలి. సైన్యం సరిహద్దులు దాటి మెరుపుదాడి చేసినపుడు, ‘మేము మాత్రం నాగరిక హద్దులు దాటి అరుపులతో దాడి చేస్తే తప్పేమిటి?’ అన్నట్లు రాహుల్, కేజ్రీవాల్ వ్యాఖ్యలున్నాయి. వాళ్ళు పరోక్షంగా దేశానికి అందిన ఎడ్వాంటేజీకి తూట్లు పొడుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి సవాలక్ష సమస్యలున్నాయి. మెరుపుదాడిని మినహాయించి, మిగతా విషయాలపై వారు దృష్టి సారించాలి. ఇక రెండో విషయం- కరువుపై కూడా సుప్రీం ఆదేశాలివ్వాల్సిన దుస్థితిలో పాలన ఉండడం బాధాకరం. దాహమేసినప్పుడే నుయ్యి తవ్వే ధోరణిని ప్రభుత్వాలు వదలుకోవాలని చెప్పడం తీవ్ర అభిశంసనగా, సిగ్గుపడాల్సిన విషయంగా పాలకులు తీసుకోవాలి. రైతుకీ, సైనికుడికీ న్యాయంగా దక్కాల్సిన గౌరవం దక్కినపుడే దేశానికి సౌభాగ్యం.
-డా. డి.వి.జి.శంకరరావు,పార్వతీపురం
నరుూం డైరీలో ఏముంది?
పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నరుూముద్దీన్ డైరీలో ఏముందో ఇప్పటికీ ‘సిట్’ అధికారులు బహిర్గతం చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పలు రాష్ట్రాల్లో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరింపజేసి, వేల కోట్ల రూపాయల విలువైన స్థిరచరాస్తులను పోగేసుకున్న నరుూంకు కొంతమంది రాజకీయ నాయకులతో, పోలీసు అధికారులతో సంబంధాలుండేవని మీడియాలో నిత్యం వస్తున్న కథనాలకు లోటులేకుండా పోతోంది. నరుూం ద్వారా అక్రమ ఆస్తులు సంపాదించిన నాయకుల, ప్రభుత్వ అధికారుల బండారాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నరుూం కేసుల్లో సాక్ష్యాలు తారుమారుకాకుండా ‘సిట్’తో పాటు న్యాయస్థానాలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కేసులో కొంతమంది నేతలను, పోలీసు అధికారులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా వార్తలు వినవస్తున్నాయి. గనుక నరుూం డైరీలోని అంశాలన్నింటినీ ప్రజలకు బహిర్గతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్’ను ఆదేశించాలి. అధికార పక్షం అలసత్వం వహిస్తే నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలదే.
-విఆర్‌ఆర్‌ఎ రాజు, ఉప్పల్
పాక్ ఏకాకి కాదు..
భారత్‌లో ఉగ్రదాడులకు చిరకాలంగా ఊతమిస్తున్న పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలన్న ప్రయత్నాలు నిజంగా ఫలిస్తాయా? అన్నది అనుమానాస్పదంగా ఉంది. యూరీలో భారత సైనిక శిబిరంపై పాక్ ప్రేరిత ఉగ్రవాదులు జరిపిన అమానుష దాడిని ఎన్నో దేశాలు ఖండించాయి. ప్రత్యక్ష యుద్ధం చేయడం కన్నా, అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఏకాకిగా చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. భారత్ పిలుపునకు స్పందించి ఏ దేశం కూడా పాక్‌ను ఏకాకిని చేయాలని గట్టిగా స్పందించడం లేదు. పాక్‌తో వ్యాపార సంబంధాలను అమెరికా తెగతెంపులు చేసుకోగలదా? పాక్ దుశ్చర్యలను అంతర్జాతీయ వేదికపై చైనా ఖండించగలదా? బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక వంటి చిన్న దేశాలు భారత్‌కు అండగా నిలిచాయే తప్ప చైనా, రష్యా, అమెరికా వంటి పెద్ద దేశాలు పాక్‌పై ఎలాంటి ఆంక్షలు విధించడం లేదు. వ్యాపారమే పరమావధి కావడంతో పెద్ద దేశాలు పాక్‌తో మైత్రిని వదులుకోలేవు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏకాకి ఎలా అవుతుంది?
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్