సంపాదకీయం

నేరానికి నిర్భయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల నేరస్థుడు బయటికి వచ్చేశాడు.. మూడేళ్ల క్రితం భయంకరమైన లైంగిక అత్యాచారానికి గురయి ప్రాణాలు పోగొట్టుకున్న నిర్భయకు న్యాయం జరగకపోవడం మరోసారి నిగ్గుతేలిన నిజం! సహజ న్యాయంగా చెలామణి అవుతున్న ‘అసహజ న్యాయం’లో నిహితమై ఉన్న అన్యాయం ఇందుకు కారణం! పద్దెనిమిదేళ్లు నిండని యువకుడు లైంగిక అత్యాచారానికి పాల్పడినట్టయితే అది నేరం కాదన్నది ఈ అసహజ న్యాయం! బాల నేరస్థుల చట్టం కింద ఈ అసహజ న్యాయం సహజమైన అన్యాయంగా వ్యవస్థీకృతమై ఉంది. అందువల్లనే 2012 డిసెంబర్ 16వ తేదీన నిర్భయను ఢిల్లీ శివారులో పైశాచికంగా లైంగిక అత్యాచారానికి గురి చేసిన బాల నేరస్థుడు మూడేళ్ల తరువాత ఇప్పుడు నిర్బంధ విముక్తుడయ్యాడు. బాల నేరస్థుల చట్టాన్ని-జెవనైల్ జస్టిస్ ఆక్ట్-ను సవరించనిదే ఈ బాలునికి ఇంతకంటే ఎక్కువ శిక్షను విధించడం సాధ్యం కాదని ఢిల్లీ కోర్టు శుక్రవారం స్పష్టం చేయడం కొనసాగుతున్న సహజ అన్యాయ సూత్రాలకు మరో నిదర్శనం. మూడేళ్ల గడువు ముగిసిన తరువాత కూడ నిర్భయను చంపిన ఈ లైంగిక బాల నేరస్థుడు స్వేచ్ఛా సమాజంలో అడుగుపెట్టకుండా నిరోధించడానికి జరిగిన ప్రయత్నం ఇలా వమ్మయిపోయింది. హైకోర్టులో డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేయడానికి కారణం అత్యాచారం జరిపే సమయంలో నేరస్థునికి పద్దెనిమిది ఏళ్లు నిండక పోవడం! ఈ నిబంధనను సడలించి పద్దెనిమిదేళ్లు కాక పదహారు ఏళ్లు నిండిన లైంగిక నేరస్థులను పురుషులగా పరిగణించాలన్న కొత్త నిబంధన నిర్భయ హంతకునికి వర్తించకపోవడం జాతీయ వైపరీత్యం! డాక్టర్ స్వామి పిటిషన్‌ను కొట్టివేసినప్పటికీ చట్టంలో సవరణ జరగాలని హైకోర్టు సూచించడం ప్రభుత్వ నిర్వాహకులకు అభిశంసన వంటిది! 2012 డిసెంబర్ 16న మరో నలుగురితోపాటు నిర్భయపై పైశాచికంగా అత్యాచారం జరిపే నాటికి ఈ బాల నేరస్థుడికి పద్దెనిమిదేళ్లు నిండలేదట! కానీ పదహారు నిండాయి! పదహారు ఏళ్లు నిండిన వారు కూడ పురుషులేనన్న నిబంధనను నిర్భయ హంతకునికి వర్తింపచేసినట్టయితే వీడికి కూడ తగిన శిక్ష పడి ఉండేది. ఈ కొత్త నిబంధనను ఆమోదిస్తూ లోక్‌సభ గత మే ఏడవ తేదీన బిల్లును ఆమోదించింది! అయినప్పటికీ నిర్భయను పొట్టనపెట్టుకున్న ఈ బాల మృగం ఇప్పుడు నిర్భయంగా బయటికి వచ్చేసింది! ఎందుకంటే లోక్‌సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభ ఇంతవరకు ఆమోదించలేదు. నిర్భయపై లైంగిక అత్యాచారం జరిపి చంపిన ముఠాలోని ఈ బాలుడు ఇప్పుడిలా నిర్బంధ విముక్తుడు కావడానికి రాజ్యసభ కారణమని కేంద్రమంత్రి మేనకాగాంధీ అంటున్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు, సామాజిక ఉద్యమ కారులు, మేధావులు ఇన్నాళ్లు ఏమి చేసినట్టు?
నిర్భయ తల్లి ఆశాదేవి తండ్రి జదరీనాధ్‌సింగ్ ఆక్రోశించినట్టు గుండెలు పగిలేలా ఏడ్చినట్టు నేరం గెలిచింది...బాధితులు ఘోర పరాజయం పాలయ్యారు. నేరం గెలిచిందన్న ఆవేదనను 2013లో ఈ బాల దుర్మార్గుడు శిక్షను తప్పించుకుని బాల నేరస్థుల శిక్షణ గృహానికి-జువనైల్ హోమ్-వెళ్లినప్పటినుంచి నిర్భయ తల్లిదండ్రులు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 2012 డిసెంబర్ 12న అత్యాచారానికి గురి అయిన నిర్భయ 17 రోజులు మృత్యువుతో పోరాడి తుదకు 29వ తేదీన మరణించింది. ఈ నేరం దర్యాప్తు సందర్భంగా ఈ బాల నేరస్థుడి పేరు వెల్లడైంది. నేరం జరిగిన నాటికి ఇతగాడికి 18 ఏళ్లు రాలేదని పాఠశాలలో నమోదైన వివరాల ప్రకారం వెల్లడైందట! ఈ నేరస్థుని పేరు ఆ తరువాత ప్రచారం కావడంలేదు. దారుణ లైంగిక బీభత్సకాండకు బలైపోయిన నిర్భయ పేరు ఇంతవరకు గోప్యంగా ఉంది! ఇంత ఘోరం జరిగిన తరువాత నేరస్థుడు నిర్భంధం నుంచి విడుదల అవుతున్న తరువాత ఇంకా గోప్యం ఎందుకన్నది నిర్భయ తల్లి ఆవేదన... అందుకే తమ కుమార్తె పేరును ఆమె వెల్లడించింది. రహస్యంగా ఉంచనవసరం లేదని స్పష్టం చేసింది. నేరం జరిగేనాటికి నేరస్థుడు-ఇప్పుడు ఇరవై ఏళ్ల దుర్మార్గుడు-బయటికి వచ్చిన నాటికి ఇదొక్కటే తేడా! వాడిలో పరివర్తన వచ్చినట్టు సమాచారం లేదు..దేశమంతటా యువతులపై, బాలికలపై, శిశువులపై జరిగిపోతున్న లైంగిక బీభత్సకాండలో కూడా మార్పులేదు! భారతదేశం ధర్మప్రాణ దేశమన్న మాట నేతి బీరలోని నెయ్యి, ఎండమావిలోని నీటి ఊట! అన్న ఆరోపణలకు ఇది మరో ఆధారం!
లైంగిక బీభత్సం పరమ కిరాతకమైంది, పాశవికమైంది, రాక్షసమైంది, పైశాచికమైంది! లైంగిక బీభత్స కృత్యాలకు ఒడిగట్టిన వారికి మరణ దండని విధించడం మనదేశ చరిత్రలో భాగం! బోటికి ప్రాణము మానము...అన్న సంస్కారం మనది! బోటికి మాత్రమే కాదు పురుషులకు సైతం సౌశీల్యం ప్రాణం వంటిదన్న సంస్కారాలను పంచిపెట్టిన సకల శుభంకరమైన స్వభావం మన జాతిది! విదేశీయుల దురాక్రమణ కొనసాగిన సమయంలో సౌశీల్యానికి ప్రమాదం ఏర్పడినప్పుడల్లా అబలలు ఆత్మాహుతి చేసుకోవడం పునరావృత్తికి గురైన వైపరీత్యాలు! ప్రాణం వాపి పరిత్యజ్య మానమేవాభి రక్షతు అన్నది-ప్రాణాన్ని వదిలిపెట్టి అయినాసరే మానాన్ని రక్షించుకోవాలి అన్న సూత్రం పురుషులకు మహిళలకు సమానంగా వర్తించిన ధర్మప్రాణ దేశం మనది! ఈ ధర్మాన్ని నిలబెట్టి ఛత్రపతి శివాజీలు, పుష్యమిత్రులు, మిహిరకులు, యదుకుల కృష్ణులు మరుగున పడి ఉండడం వర్తమాన వైపరీత్యం...కీచకులు, దశకంఠులు, నరకాసురులు, అల్లా ఉద్దీన్ ఖిల్జీలు దేశమంతటా విలయతాండవం చేస్తున్నారు! నిరోధించడంలో విఫలమైన నిర్వాహకులు ఈ ఘోరమైన నేరాన్ని తేలిక చేసి మాట్లాడడం, నేరాలను ప్రచారం చేసి వ్యాపారం చేయడం వంటి దారుణాలను చూడనట్టు అభినయిస్తున్నారు! నిర్భయ నిస్సహాయత గురించి చలనచిత్రాలు నిర్మించి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. సినిమాను ప్రభుత్వం నిషేధించిన తరువాత అంతర్జాలంలోకి చొరబడి వికృతానందం పొందిన మానసిక బీభత్సకారులు కూడ ఉన్నారు! లైంగిక అత్యాచారం చేసినంత మాత్రాన నేరస్థుడిని ఉరి తీయడం న్యాయం కాదని నిర్లజ్జగా ప్రకటించిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి కూడా అయన ములాయం సింగ్ వంటివారు కూడ ఉన్నారు! అబలలపై లైంగిక అత్యాచారం నేరం అంత తేలిక అయిపోయింది!
ఇది కేవలం ఒక్క నిర్భయకు జరిగిన అన్యాయం కాదు! వందలాది వేలాది అబలలు కామాంధుల పైశాచిక వాంఛా జ్వాలలకు ఆహుతైపోతూనే ఉన్నారు. పాఠశాలలలో లైంగిక విద్యను బోధించాలన్నవారు, బోధిస్తున్నవారు, అసలు నైతిక విద్య మాత్రం బోధించడంలేదు. నైతిక నిబంధనలు లేని లైంగిక విద్యలు నిర్భయ హత్య, బాలనేరస్థుడిని సృష్టించాయి! ఈ పిశాచాన్ని మరో రెండేళ్ల వరకు బాల నేర నిరోధ నియంత్రణ మండలి వారు కనిపెట్టి ఉంటారట! ఆ తరువాత మాటేమిటి? ఈ నేరస్థుడు ఇప్పటికే ఉగ్రవాద భావజాలంతో ప్రభావితుడయ్యాడని కేంద్ర ప్రభుత్వమే అనుమానిస్తోందట! అలాంటప్పుడు విడుదలను ఎందుకు నిరోధించలేకపోయింది