సంపాదకీయం

అరణ్య రోదన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీయ సంస్థల ఆధ్వర్యంలో వినూత్న రాజధానిని ని ర్మిస్తున్న అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలాది ఎకరాల్లోని ఆకుపచ్చదనాన్ని ‘ప్రగతి’ యజ్ఞానికి ఆహుతినిస్తోంది! మరోవైపు హరిత తెలంగాణను అవతరింప చేయడానికై కోట్లాది మొక్కలను నాటే కార్యక్రమం కూడా కొనసాగుతోంది. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఒక సమాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగిపోతోందట! ఏపుగా ఎదిగిన వృక్షాలను గొడ్డళ్లతో నరికి వేయటం ఆ కార్యక్రమం.. కూలిన చెట్లను కొడవళ్లతో ముక్కలు చేయడం ఆ కార్యక్రమం.. రంపాలతో రాచి కలపను లారీలకెత్తడం ఆ మహా కార్యక్రమం! రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పోటీ పడినట్టుగా ఈ హరిత హనన వృక్ష ధ్వంస కలాపాలు నిర్నిరోధంగా జరిగిపోతున్నాయట! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పునర్ ఘటిత ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఈ ‘వృక్ష నిర్మూలన’ వారసత్వం సమానంగా సంక్రమించింది! ప్రపంచీకరణ, కృత్రిమ పారిశ్రామిక ప్రగతి- సహజమైన ఆకుపచ్చని ప్రకృతికి ప్రబల శత్రువన్నది కేవలం ప్రచారం కాదు! ఇరవై ఏళ్లకుపైగా భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోను, ప్రతి పల్లెలోను, పట్టణంలోను, నగరంలోను నిరంతరం చెట్లను నరికివేసే కార్యక్రమం జరిగిపోతోంది! వాణిజ్య ప్రపంచీకరణ సనాతన భారతీయతను పరి మార్చుతున్న దృశ్యాలు అనుక్షణం ఆవిష్కృతవౌతూనే ఉన్నాయి. తమలపాకుల తోటలను ప్రభుత్వాధికారులు, పారిశ్రామికవేత్తలు కలసికట్టుగా తగులపెట్టిన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి! కొబ్బరి తోటలు, మామిడి తోటలు కూలిపోతుండడం నిరంతరం దృశ్యమాన మవుతూనే ఉంది. వరిపొలాలు ఉన్నచోట వెలసిన ‘ప్రత్యేక ఆర్థిక మండలాలు’- స్పెషల్ ఎకనమిక్ జోన్స్- సెజ్‌లు- పచ్చదనాన్ని పరి మార్చుతున్న కృత్రిమ ప్రగతి వాటికలు.. అటవీ భూములను ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’కు కట్టబెట్టడానికి రాష్ట్రాల ప్రభుత్వాలు ఉవ్విళ్లూరుతుండటానికి ఏకైక కారణం విస్తరించిపోతున్న ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- వ్యవస్ధ! మొత్తం భూభాగంలో 33 శాతం లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతంలో అడవులు పెరగాలన్నది అంతర్జాతీయ సమాజం అంగీకరించిన ప్రాకృతిక సూత్రం. సంపన్నదేశాలు మాత్రం తమ అడవులను కాపాడుకుంటున్నాయి! సంపన్న దేశాలకు చెందిన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ ప్రవర్ధమాన దేశాలలోని చెట్లను, మొక్కలను, అడవులను, తోటలను, వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తున్నాయి. ఈ అటవీ విధ్వంసకాండకు ఏకైక కారణం వాణిజ్య ప్రపంచీకరణ!
ఈ వాణిజ్య ప్రపంచీకరణ 1974 నుంచి దేశాన్ని పట్టిపీడిస్తోంది. భూమాత స్వరూపానికి జీవనాడి వంటి చెట్లను, నీటిని హరిస్తోంది! దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అటవీ నిర్మూలనకు ప్రధానంగా బాధ్యత వహించవలసింది కేంద్ర ప్రభుత్వాలు! కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు పోటీ పడినట్టుగా ప్రపంచీకరణ వ్యవస్థను పెంచిపోషిస్తుండడం వృక్ష నిర్మూలనకు ఏకైక కారణం! ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వేతర సంస్థలకు ప్రధానంగా విదేశీయ సంస్థలకు అడవులను అప్పగించి, చెట్లను నరికి పరిశ్రమలను ఏర్పాటు చేయించడం వల్ల చెట్లు కూకటివేళ్లతో కూలిపోతున్నాయి! దేశం బ్రిటన్ దురాక్రమణకు గురి అయ్యేనాటికి అఖండ భారత భూభాగం సగానికి పైగా అడవులతో నిండి ఉండేది. బ్రిటన్, ఐరోపాల దురాక్రమణ మొదలయ్యే వరకూ భారత్ ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం! మన దేశం బ్రిటన్ దురాక్రమణ నుంచి విముక్తమయ్యే నాటికి కూడా మొత్తం భారత భూభాగంలో మూడవ వంతుకు పైగా అడవులు ఉండేవి. రెండు వందల ఏళ్లపాటు బ్రిటన్ తదితర ఐరోపా వారు మన చెట్లను నరికి కలపను తరలించుకొని పోయారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ అటవీ హననం పరాకాష్ఠకు చేరింది!! స్వతంత్ర భారతదేశంలో అడవులను, హరితశోభలను ప్రభుత్వాలు, ప్రభుత్వేతరులు మరింతగా ధ్వంసం చేయడం వల్లనే అడవుల శాతం మొత్తం భూమిలో 24 శాతానికి కంటే తక్కువకు పడిపోయింది!! మళ్లీ కనీసం 33 శాతం భూభాగంలో అడవులను పెంచాలనే లక్ష్యం కేవలం మాటలకు పరిమితమై పోతోంది..
తెలంగాణ ప్రభుత్వం ఈ ‘ముప్పయి మూడు శాతం’ భూభాగంలో అడవులను సాధించే లక్ష్యం గురించి ఆంధ్రప్రదేశ్ కంటే మరింత గట్టిగా ప్రచారం చేసింది, చేస్తోంది! కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా రాష్ట్రంలో వేలాది చెట్లు కూలిపోతూనే ఉన్నాయి. భాగ్యనగరంలోని ‘కెబిఆర్’ పార్కులోని చెట్లను నిర్మూలించడాన్ని ఉన్నత న్యాయస్థానం నిరోధించినప్పటికీ, రాజధాని శివారు ప్రాంతాలలో చెట్లను నరికే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. దేశంలోని 17 రాష్ట్రాలలో గత మూడేళ్లలో 10 లక్షల 80 వేల చెట్లను కొట్టేశారట! మిగిలిన రాష్ట్రాలలో ఎన్ని చెట్లను నరికారో మరి! కానీ గత మూడేళ్లలో ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే దాదాపు ఆరులక్షల చెట్లను నిర్మూలించారట! తెలంగాణలో దాదాపురెండు లక్షల చెట్లను కొట్టివేయగా, నవ్యాంధ్ర ప్రదేశ్‌లో నాలుగు లక్షల వృక్షాలు నేలకొరిగిపోయాయట! అయితే ఈ చెట్లను అసాంఘిక శక్తులు, అత్యాశాపరులు, దొంగ రవాణాదారులు చట్టానికి వ్యతిరేకంగా నిర్మూలించినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. మరి ప్రభుత్వాల అనుమతితో ఎన్ని చెట్లను నరికివేశారో గణాంకాలను మాత్రం ఈ నివేదికలో వెల్లడించలేదు. ప్రత్యేక ఆర్థిక మండలాలలోని చెట్లను పరిశ్రమల స్థాపన కోసం, కాలుష్యాన్ని కేంద్రీకరించడం కోసం ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించిన భూములలోను ఉన్న చెట్లను నరకటం చట్టాలకు అనుగుణం! అందువల్ల ఆ లెక్కలు కూడా బయటపడినప్పుడు మాత్రమే వాస్తవంగా జరిగిపోతున్న ‘హరిత హననం’ గురించి జనానికి తెలుస్తుంది! ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం సేకరించిన దాదాపు 33వేల ఎకరాల్లోని చెట్లను నరికివేయటం సక్రమమే అవుతుంది! ఇలా ‘సక్రమం’గా నిర్మూలనకు గురవుతున్న చెట్లు కాక- అవికాక- అక్రమంగా తొలగిస్తున్న చెట్లను గురించి మాత్రమే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ వారు వాపోతున్నారు...
సగటున దేశంలో ప్రతిరోజూ 135 హెక్టారుల, దాదాపు 335 ఎకరాల అడవులను నరికేస్తున్నారని 2013లో అధికారికంగా వెల్లడైంది! ఆ తర్వాత ఈ విస్తీర్ణం ఇంకా పెరిగిందన్నది జరుగుతున్న ప్రచారం. హరిత పరిరక్షణకు, ప్రపంచీకరణ మధ్య జరుగుతున్న పోటీలో ప్రపంచీకరణది పైచేయి కావటం ఇందుకు కారణం! హరిత నియమాలను అతిగా పాటించటం వల్ల ఆర్థిక ప్రగతి ఆగిపోతుందని 2012లో అప్పటి ప్రధానమంత్రి చేసిన ప్రకటన ప్రభుత్వ విధానానికి గీటురాయి. 2014 మే 26న ప్రభుత్వ నిర్వాహకులు మారినప్పటికీ ‘గీటురాయి’ మాత్రం మారినట్టు లేదు. అందువల్లనే ‘ప్రగతి’ పేరుతో పచ్చదనం కనుమరుగుకావటం ఆగలేదు! భూమిని అభివృద్ధి చేయటం అంటే చెట్లను కొట్టి చదును చేయించటమేనన్నది అత్యధిక ప్రజలకు తెలిసిన ప్రగతి సూత్రం! ‘ప్రపంచీకరణ’ బంధం నుంచి భారతీయత విముక్తి అయ్యేవరకూ చెట్లకు రక్షణ లేదు, ప్రకృతికి భద్రత లేదు...