మెయన్ ఫీచర్

అక్కడే లేని ‘తలాక్’ ఇక్కడెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తలాక్’ అన్న పదానికి ‘విడిపోవడం’ అని అర్థం చెప్పుకోవచ్చు. ఇస్లాం మత సూత్రాల ప్రకారం భర్త మూడుసార్లు ‘తలాక్, తలాక్, తలాక్’ అని ఉచ్చరించి అత్యంత సునాయాసమైన పద్ధతిలో భార్యకు విడాకులు ఇచ్చేయవచ్చు. ఒకవేళ ఆమెనే తిరిగి వివాహం చేసుకోదలిస్తే- ఆ స్ర్తి మరొక పురుషుడిని వివాహం చేసుకుని కొంతకాలం కలిసి జీవించి అతని నుంచి విడాకులు పొంది, తిరిగి తన మొదటి భర్త వద్దకు చేరుకోవచ్చు. తలాక్ విషయంలో ముస్లింలలోని షియా, సున్నీల మధ్య చిన్నచిన్న తేడాలున్నప్పటికీ వౌలిక అంశంపై దాదాపు ఒకటే అభిప్రాయం. తలాక్ సంప్రదాయానికి వ్యతిరేకంగా ముస్లిం మతంలోని ఒక మహిళావర్గం పోరాటానికి సన్నద్ధమయ్యింది. ‘తలాక్’ సంప్రదాయం ఇస్లాం మతంలోని స్ర్తిలపై పురుషులకు పూర్తి అధికారాలను అప్పచెబుతున్నదని, పురుషులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమ భార్యలకు ఏ క్షణమైనా విడాకులు ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నదని, ఈ పద్ధతి లింగ వివక్షకు అద్దం పడుతున్నదని, తమను కట్టుబానిసలుగా తయారుచేస్తున్న ఈ పద్ధతిని రూపుమాపాలని ముస్లిం స్ర్తిలు ఉద్యమం చేపట్టారు.
భారతదేశపు ముస్లిం సమాజంలో అమలులోఉన్న తలాక్ పద్ధతి కారణంగా మహిళలు ఎప్పుడు తమ భర్తలు తమను వదిలేస్తారో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఏర్పడ్డాయి. భర్త తన భార్యకు విడాకులు ఇవ్వడానికి మూడుసార్లు ‘తలాక్’ పదాన్ని ఉచ్చరించినప్పుడు ఆమె అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో విడాకులు ఇచ్చేసినట్లు ఆ స్ర్తికి తెలియదు. ఆధునిక యుగంలో ఈ-మెయిల్ ద్వారా, సంక్షిప్త సందేశం (ఎస్. ఎం.ఎస్) ద్వారా కూడా విడాకులు ఇచ్చేస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యకర పరిస్థితులు ఏముంటాయని ముస్లిం మహిళలు ధైర్యంగా ప్రశ్నించడం మొదలుపెట్టారు.
ఇస్లామిక్ దేశాలుగా పేరుపడ్డ పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా అనేక ముస్లిం దేశాలలో ‘తలాక్-ఉల్-బిదత్’ - మూడుసార్లు ‘తలాక్’ శబ్దాన్ని ఉచ్చరించి విడాకులు ఇచ్చే పద్ధతిని నిషేధించినపుడు- సెక్యులర్ దేశమైన భారత్‌లో ఈ పద్ధతిని ఎందుకు కొనసాగిస్తున్నారని ముస్లిం మహిళలు ప్రశ్నిస్తున్నారు. ‘్భరతీయ ముస్లిం మహిళా ఆందోళన్’ అనే ఒక స్వచ్ఛంద సంస్థ జాతీయస్థాయిలో జరిపిన ఒక సర్వే ప్రకారం ప్రతి 11 మంది ముస్లిం మహిళలలో ఒకరు తలాక్ బాధితురాలే. వీరిలో అధిక శాతం మందికి భరణాలు కూడా అందడం లేదు. దేశంలో అమలులో ఉన్న చట్టాలు, వ్యవస్థలను కాదని ‘తలాక్’ ద్వారా విడాకులు ఇచ్చేయడం వల్ల ఈ మహిళలకు అందాల్సిన భరణాలు అందడం లేదు. భారతీయ ముస్లిం మహిళలు చట్టాల ఆధారంగా విడాకులు కోరుతున్నారు. వీరు భరణం కోసమే కోర్టులను ఆశ్రయిస్తున్నారని అనుకోవడం పొరపాటు.. తాము మగవారికి బానిసలం కాదని, దశాబ్దాలుగా కాపురం చేసిన తరువాత అకస్మాత్తుగా వదిలివేయడానికి తామేమీ ఆటబొమ్మలం కాదని నిరూపించుకుంటూ తమ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు ఉద్యమిస్తున్నామని ముస్లిం మహిళలు అంటున్నారు. వీరు తమ ఉద్యమాన్ని ‘తలాక్’ వరకే పరిమితం చేయలేదు. పురుషులతో తమకూ సమాన స్థాయిని కల్పించేలా చూడాలని, ఖురాన్‌ను చదవడానికి, అర్ధం చేసుకోవడానికి మహిళలు అర్హులేనని ఉలేమా (ముస్లిం మత పెద్దలు, మేధావులకు) చెప్పాలని వీరు కోర్టులను కోరుతున్నారు.
ఆంగ్లేయులు మనదేశంపై పెత్తనం కొనసాగిస్తున్నప్పుడు ‘విభజించు-పాలించు’ విధానంలో అంతర్భాగంగా ముస్లింలు వారి మత ఆచారాల ప్రకారం నడుచుకునేలా ఆమోదించారు. హిందువులు, ముస్లింలు కలిస్తే తమ అధికారానికి భంగం కలుగుతుందనే భయంతో ఈ రెండు మతాల వారిని వేరు చేసేందుకు తీసుకున్న చర్యల్లో ఇదొక భాగం. ముస్లింలు తమ ఆచారాల ప్రకారం వివాహాలు, విడాకులు చేసుకోవచ్చని చెప్పారు. భారత్ సర్వసత్తాక సార్వభౌమ దేశంగా మారిన ఏడు దశాబ్దాల తర్వాత కూడా ముస్లిం మత సంప్రదాయాల ప్రకారం విడాకుల పద్ధతి కొనసాగితే ఎలా? అని వీరు ప్రశ్నిస్తున్నారు. చట్టాలు, కోర్టులకు అతీతంగా ముస్లిం మతాచారాల ప్రకారం విడాకుల వ్యవస్థ కొనసాగితే రాజ్యాంగానికి విలువ ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
బ్రిటీష్ వారు ఆమోదించిన ‘షరియా’ ప్రకారం ఇప్పటికీ నడుచుకోవాలంటే ఎలా సాధ్యం? అని ప్రగతిశీల ముస్లిం మహిళలు ప్రశ్నిస్తున్నారు. ముస్లిం మతంలో వివాహానికి కనీస వయోపరిమితిని సూచించలేదు. విడాకులు పొందడానికి హేతుబద్ధమైన విధానాలు పేర్కొనలేదు. విడాకుల తరువాత పిల్లల బాధ్యతపై ‘షరియా’ ఏమీ చెప్పలేదు. కేవలం ‘షరియా’ ప్రకారం నడుచుకోవాలని చె ప్పారు. ఇది ఎవరి కోసం ఉద్దేశించిన ‘షరి యా’ అని మహిళలు ప్రశ్నిస్తున్నారు.
తలాక్ ద్వారా ఆత్మగౌరవంతోపాటు ఆర్థిక సంరక్షణ, సామాజిక గౌరవాన్ని కోల్పోయిన ముస్లిం మహిళలు ఈ పద్ధతిని నిర్మూలించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొట్టమొదటగా ఉత్తరాఖండ్‌కు చెందిన షయారా బానో తలాక్ పద్ధతిని రద్దుచేయాలని, మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా మహిళలకు విడాకులు ఇచ్చే పద్ధతి, తిరిగి అదే వ్యక్తితో సంసారం కొనసాగించేందుకు మరొక వ్యక్తితో కొంతకాలం జీవించి విడాకులు పొంది తిరిగి వచ్చే పద్ధతి, బహుభార్యత్వాలు రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొనాలని సుప్రీంకోర్టును కోరింది. షయారా బానో వేసిన పిటిషన్‌కు మద్దతుగా ఇదే తరహాలో రాజస్థాన్‌కు చెందిన అఫ్రీన్ రహ్మాన్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇషరత్ జహాన్‌లు పిటీషన్లు దాఖలుచేశారు. వీరికి మద్దతుగా మరొక మూడు ముస్లిం మహిళా సంస్థలు- భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ (బి.ఎం.ఎం.ఎ), బేబాక్ కలెక్టివ్, ఆల్ ఇం డియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డ్ (ఎ.ఐ.ఎం.డబ్ల్యు.పి.ఎల్.బి) సంస్థలు సుప్రీంను ఆశ్రయించాయి. సుప్రీంకోర్టుకు ఆవల ‘ము స్లిం మెన్‌ఫర్ జండర్ జస్టిస్’ అనే సంస్థ ప్రధాన నగరాలలో ముస్లిం మహిళా పిటిషనర్లకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టింది.
తమ ఆత్మగౌరవం, వ్యక్తిత్వం, సామాజిక ఆర్థిక న్యాయాల కోసం ముస్లిం మహిళలు చేస్తున్న న్యాయ పోరాటాన్ని పురుష ప్రాధాన్యతతో కూడిన ముస్లిం పర్సనల్ లాబోర్డు పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. ముస్లిం మహిళల పిటిషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలుచేస్తూ ‘తలాక్’ పద్ధతిని సమర్ధించడమే కాకుండా, ‘ముస్లిం పర్సనల్ లా’లో జోక్యం చేసుకునే అధికారం కోర్టుకు లేదని వాదిస్తున్నది. బాధిత మహిళల న్యాయ పోరాటానికి రాజకీయ రంగులు అద్దుతూ తలాక్ పద్ధతిని అడ్డుపెట్టుకుని- ‘కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్‌కోడ్‌ను అమలుచేయాలని చూస్తున్నద’ని ఆరోపణలు చేస్తున్నది.గతంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛపై వాదోపవాదాలు జరిగినపుడు తలాక్ పద్ధతి, బహుభార్యత్వం ఇస్లాంలో అంతర్భాగమని ముస్లిం పర్సనల్ లా బోర్డు వాదించింది. షరియా ముస్లింలకు దేవుడిచ్చిన రాజ్యాంగంగా పేర్కొన్నది. ముస్లిం పర్సనల్ లా బోర్డు చేస్తున్న వాదనలో నిజం ఉంటే అనేక ముస్లిం సంస్థలు వీటిని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయన్నది ప్రధాన ప్రశ్న. షియాల సంగతి అటుంచితే, సున్నీలలోని ‘సున్నీ అల్-ఎ-హదిత్’ వర్గం తలాక్ పద్ధతిని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నది. అనేక ముస్లిం దేశాలు తలాక్ పద్ధతిని చట్టవ్యతిరేకంగా పరిగణిస్తూ, బహుభార్యత్వాన్ని నిషేధించాయి లేదా అనేక పరిమితులు విధించాయి. షరియా అంతా- ఖురాన్, అహదిత్‌లపై పలు సందర్భాలలో పలువురు వ్యక్తులు చేసిన వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు అయినపుడు ఇది మానవ నిర్మితమే కానీ దేవుడిచ్చిన రాజ్యాంగం ఎలా అయ్యిందని ముస్లిం మేధావులే ప్రశ్నిస్తున్నారు.
ఇస్లామిక్ రాజ్యంగా ఏర్పడ్డ పాకిస్తాన్‌లో 1961లో మూడుసార్లు తలాక్ పద్ధతిని రద్దుచేశారు. అనేక సందర్భాలలో పాకిస్తాన్‌ను అనుసరిస్తున్న భారతీయ ముస్లిం సంస్థలు ఈ విషయంలో ఎందుకు అనుకరించడం లేదని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ముస్లిం సమాజంపై తమకు పట్టుపోతుందనే భయంతోనే ముస్లిం పర్సనల్ లాబోర్డు ఇటువంటి అనాగరిక చర్యలను సమర్ధిస్తున్నదని ముస్లిం మేధావులు వాదిస్తున్నారు. ఈ సందర్భంగా 1946లో వౌలానా ఆజాద్ చేసిన వ్యాఖ్యలను వారు గుర్తుచేస్తున్నారు- ‘ముస్లిం చరిత్ర అంతా ముస్లిం మతపెద్దలు చేసిన అనాగరిక, అనాలోచిత చర్యలతో భ్రష్టుపట్టిపోయింది. ప్రతి సమయం, సందర్భంలోనూ మత పెద్దల కారణంగా ముస్లిం చరిత్ర అనేక అవమానాలకు, అగౌరవాలకు గురిఅయ్యింది.’
ఖురాన్ సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్న తలాక్ పద్ధతిని ఈజిప్టు, సూడాన్, జోర్డాన్, సిరియా, ఇరాక్, మొరాకో లాంటి అనేక దేశాలు రద్దుచేశాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15లు దేశంలో సమానత్వం ఉండేలా చూడాలని, ప్రాంతం, వర్గం, లింగ, మత ప్రాతిపదికపై వివక్షలకు తావులేకుండా చూడాలని ఆదేశిస్తున్నది. సెక్యులర్ దేశంగా చెప్పుకున్న భారత్‌లో మత ప్రాతిపదికన కీలక అంశాలను, పద్ధతులను కొనసాగించడం సహించరాని అంశం అని ముస్లిం పెద్దలే అంటున్నారు. మొత్తం మీద తలాక్ అంశంపై సుప్రీంకోర్టు దాఖలైన పిటిషన్ అనేక వౌలిక ప్రశ్నలకు దారితీసింది. ముల్లాలు, వౌల్వీల ఆధారంగా నడుస్తున్న భారతీయ ఇస్లాం సంప్రదాయాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నా యా? లేక ఇవి రాజ్యాంగానికి అతీతమైనవా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం జరుగుతున్నది. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే ముస్లిం మత గ్రంథాల ఆధారంగా జీవిస్తామంటూ ఆ మత పెద్దలు తరచూ చేస్తున్న ప్రకటనలు దేశానికి విధేయతను ప్రకటిస్తున్నట్లుందా? లేదా? అన్న ప్రశ్నకు దారితీసింది.
ఒక్కటి మాత్రం నిజం.. ముస్లిం మహిళలు చేస్తున్న న్యాయ పోరాటం కారణంగా శతాబ్దాలుగా కొనసాగుతూన్న ముస్లిం మగ పెత్తనానికి సవాల్‌ను విసిరింది. భారత్‌లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మహిళలలో సా మాజిక చైతన్యం పెరిగింది. ఇస్లామిక్ సూత్రాలను చదివి అర్థం చేసుకుని, వాటిలోని అసమానతలను మహిళలు ప్రశ్నిస్తున్నారు. భారతదేశంలో కూడా ముస్లింల ప్రవర్తన మన రాజ్యాంగానికి లోబడి ఉన్నదా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం జరుగుతున్నది. ‘మూడుసార్లు తలాక్’ పద్ధతి 1948లో ఐక్యరాజ్యసమితి ద్వారా ఆమోదింపబడిన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూ మన్ రైట్స్‌కు లోబడి ఉన్నదా? లేదా? అన్న అంశంపైనా విస్తృత చర్చ జరగాల్సి ఉంది.

-కామర్సు బాలసుబ్రహ్మణ్యం 09899 331113