సంపాదకీయం

తెగులు ‘తెగని’ పత్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంట పండినా కష్టమే, పంట ఎండినా కష్టమే- అ న్నది పత్తిరైతుల బతుకులను నిర్దేశిస్తున్న వ్యవసాయ వైపరీత్యం. ఈ ఏడాది అకాలవర్షాల కారణంగా, మితిమీరిన వర్షాల వల్ల పత్తి దిగుబడులు తగ్గాయట! దిగుబడి తగ్గినపుడు నిజానికి ధరలు పెరగాలి. కాని ధరలు వి పరీతంగా తగ్గిపోయాయట! దిగుబడులు పెరిగినప్పుడు గిరాకీ తగ్గి ధరలు తగ్గడం సహజం. పంటనష్టాన్ని ధరల పెరుగుదలతో పూడ్చుకోవచ్చునన్న రైతులకు నిరాశ మాత్రమే ఎదురౌతుండడం తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న దృశ్యం.. తెలంగాణలోనే కాదు, దేశంలోని అన్ని ప్రాంతాల్లోను ‘పత్తి’- రైతుల పాలిట శాపంగా మారుతుండడం నడుస్తున్న చరిత్ర. జన్యు పరివర్తన ప్రక్రియ-జెనటిక్ మోడిఫికేషన్-జిఎం- జీవ సాంకేతిక ప్రక్రియ ద్వారా రూపొందిన పంటల ఆవిష్కరణ జరిగినప్పటి నుంచి ఎక్కువ నష్టపోతున్నది భారతీయులే! ఈ ‘జిఎం’ విత్తనాలలో ఉత్పత్తి అయి మొక్కలకు విస్తరిస్తున్న ‘బాలిలస్ తురింజెనిసిస్’- బి.టి- అనే రసాయనం పంటల దిగుబడులను పెంచుతుందన్న భ్రమ ఇటీవలి కాలంలో పటాపంచలైంది. బి.టి పంటలు ఎలాంటి భూమిలోనైనా పండుతాయని, తెగుళ్లను తట్టుకుంటాయని, పురుగులను నాశనం చేసే రసాయనాలను వాడనవసరం లేదని ప్రచారం జరిగింది. అందువల్ల తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ‘్ఫలసాయం’ పొందవచ్చునన్నది జరిగిన ప్రచారం. కాని అయిదారేళ్ల తర్వాత ‘బిటి’ పత్తికి కొత్తరకం పురుగుల, ఈగల బెడద దాపురించింది. ఈ పురుగులు, ఈగలు పత్తికాయలను, మొగ్గలను నమిలి మింగేసి నిష్క్రమిస్తున్నాయి. ఒక సంవత్సరం ‘తెల్ల ఈగలు’ బిటి పత్తిపంటపై దాడి చేశాయి. ఫలానా ‘క్రిమినాశక రసాయనం’ పిచికారీ చేశారు. పిచికారీ కోసం ప్రతి ఎకరానికి కనీసం పదివేల రూపాయల ఖర్చవుతోందట! ఫలితంగా ‘బిటి’ పంటలు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడినిస్తాయన్న కృత్రిమ సిద్ధాంతం కూలిపోయింది. ‘బిటి’ పత్తిని పండించడానికి పెట్టుబడులు పెరుగుతున్నాయి. కాని వ్రతం చెడినా రైతులకు ఫలితం దక్కడం లేదు.. మరుసటి సంవత్సరం మళ్లీ ‘తెల్ల ఈగలు’ బిటి పత్తిపొలాలపై దాడి చేస్తున్నాయి. ఈ మరుసటి సంవత్సరం రైతులు మళ్లీ ‘్ఫలానా రసాయన ఔషధాన్ని’ పిచికారీ చేశారు. కాని ఈ ‘క్రిమినాశని’ తెల్లఈగలను నిర్మూలించ లేకపోయింది. ‘ఈగలు’ పంటను తినేశాయి. మొదటి సంవత్సరం ‘అధిక పెట్టుబడి’ వల్ల పంట మిగిలింది, రెండవ సంవత్సరం ‘అధిక పెట్టుబడి’ పెట్టినప్పటికీ పంట పాడైంది! పంజాబ్‌లోను, తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లోను ‘బిటి’ పత్తి వల్ల రైతులు సాధించిన ‘ప్రగతి’ ఇదే.. మూడవ సంవత్సరం ‘తెల్ల ఈగల’కు తోడు ‘గులాబీ రంగు పురుగులు’ పంటపై పడి తినేస్తున్నాయి! ఇలా వివిధ వినూతన వికృత క్రిములు ‘బిటి’ పత్తిపంటలపై దాడులు చేస్తున్నాయి. ఒక కొత్తరకం పురుగులను నిరోధిస్తే మరో కొత్తరకం పురుగులు దాపురిస్తున్నాయి!
ఈ సంవత్సరం తెలంగాణలో దాదాపు 30 లక్షల ఎకరాల్లో పత్తిని పండించారట! దేశం మొత్తమీద ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పత్తిని పండిస్తున్నారు. నకిలీ విత్తనాలు, అధిక ధరలకు విత్తనాలను కొనడం వంటి సమస్యల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా పత్తి పంటను తగ్గిస్తున్నారు. పత్తి పంటను తగ్గించి కంది తదితర పప్పు ధాన్యాలను ఆ భూముల్లో సాగు చేయడమన్నది దేశ వ్యాప్తంగా పెరుగుతున్న అభిప్రాయం. తెలంగాణలో కూడా పత్తిపంట విస్తీర్ణం తగ్గుతోంది. అయినప్పటికీ ఈ ఏడాది 30 లక్షల ఎకరాల్లో పత్తిని పండించారట! 2015లో పంజాబ్‌లో 12 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని పండిస్తున్నట్టు లెక్క. విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ నష్టపోతున్న రైతుల సంఖ్య కూడా పెరుగుతోంది! క్వింటాలు పత్తికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీసపు మద్దతు ధర 4,200 రూపాయలు.. తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లోను అత్యధిక శాతం పత్తి వ్యవసాయం ‘బిటి’ విత్తనాల ప్రాతిపదికగానే జరుగుతోంది. వర్షాధార భూముల్లో ఎకరాకు అయిదు క్వింటాళ్ల పత్తి ఉత్పత్తి అవుతోందట! ఈ ప్రాతిపదికన సగటున రైతుకు లభించేది ఎకరానికి దాదాపు 20వేల రూపాయల ఆదాయం. పెట్టుబడులు, ఖర్చులు పోను ఎంత మిగులుతోందన్నది బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడు. ఈ ఏడాది వర్షాల బీభత్సంతో పత్తి పాడైందట! అందువల్ల ఎకరానికి 5 క్వింటాళ్ల కంటే తక్కువగానే పత్తి ఉత్పత్తి అయింది! స్వేచ్ఛా విపణి నిర్వాహకులు క్వింటాలుకు 5,500 రూపాయలు చెల్లించనున్నట్లు మొదట ప్రచారమైందట! పత్తి విపణికి చేరిన సమయంలో హఠాత్తుగా ధరను 4,500 రూపాయలకు కుదించేశారట..
‘ప్రపంచీకరణ’ విష ప్రభావం నుంచి కనీసం వ్యవసాయాన్ని కాపాడండి- అన్నది స్వదేశీయ సంప్రదాయ వ్యవసాయ సమర్థకులు గత ఇరవై ఏళ్లకు పైగా ప్రభుత్వాలకు చేస్తున్న విజ్ఞప్తి! అంటే బహుళ జాతీయ వాణిజ్య సంస్థల వారు వేల ఎకరాల వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వరాదన్నది ఈ స్వదేశీయ ఉద్యమకారుల అభీష్టం. ఇలా వేల ఎకరాల్లో ఒకే సంస్థ వారు ‘వాణిజ్య వ్యవసాయం’ చేసే పద్ధతి మన దేశంలో పుంజుకోకపోవడం హర్షణీయం. అలా పుంజుకొన్నట్టయితే పోటీకి తట్టుకోలేని చిన్నరైతులు వ్యవసాయ శ్రామికులుగా మారిపోవడం ఖాయం.. బహుళ జాతీయ సంస్థల వాణిజ్య వ్యవసాయ క్షేత్రాలలో కూలీలు కావడం ఖాయం. అలా జరగడం లేదు.. సంతోషించాలి! వ్యవసాయంపై ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ ఉచ్చు బిగిసి ఉంది! విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక రసాయనాలు, ఆధునికమైన పనిముట్లు ఈ ఉచ్చులు! వీటిని ప్రధానంగా ఉత్తత్తి చేస్తున్నవి బహుళ జాతీయ సంస్థలు! వర్షాధార భూముల్లో పత్తిని మానేసి కందిని సాగుచేస్తున్నవారు పంట కోతకు వచ్చేలోగా రెండుసార్లు కనీసం పురుగుల మందును పిచికారీ చేయాలట! కందికి మాత్రమే కాదు- కొర్ర, జొన్న, సజ్జ వంటి పంటలన్నింటికీ ఇలా క్రిమినాశకాలను వాడాల్సిందే. లేనట్టయితే కంకులు కోతకు వచ్చే సమయంలో ‘వేలెడంత’ పెద్ద పురుగులు వాటిపై దాడి చేస్తాయట! తినేస్తాయట!! ఆ సమయంలో పిచికారీ చేసినప్పటికీ ఫలితం ఉండదట. అందువల్ల పురుగుల మందులను వాడడం తప్పనిసరి. పురుగుల మందు కోసం ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టాలని కర్నూలు జిల్లాకు చెందిన ఒక కందిరైతు చెప్పాడు! పురుగుల మందులను ఉత్తత్తి చేస్తున్న బహుళ జాతీయ సంస్థలు వ్యవసాయంపై సాధించిన పట్టుకు ఇది నిదర్శనం కాదా? ఇంకా ఎరువుల కథ, విత్తనాల కథ వేరే ఉన్నాయి..
పత్తిరైతులు, ఇతర రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండడానికి ప్రధాన కారణం ‘బిటి’ రసాయనం నిండిన ‘జిఎం’ పంటలు కారణమని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. 2015లో పంజాబ్‌లోని 8 లక్షల ఎకరాల్లోని పత్తిని ‘తెల్ల ఈగలు’ భోంచేశాయి, 15 మంది రైతులు ఆత్మహత్యకు పాలుపడ్డారు. ఇది కేవలం ఒక ఉదాహరణ! పత్తి ఉత్పత్తి అవసరమే. కంది, వరి , గోధుమ ఉత్పత్తి కూడా అవసరమే! కానీ ఈ ‘అవసరాలు’ ప్రపంచీకరణ మాయాజాలంలో గింగిర్లు తిరుగుతున్నాయి. ఈ ఊబి నుంచి రైతులు, ప్రజలు బయటపడడానికి మార్గం సంప్రదాయ సేంద్రియ వ్యవసాయం! ప్రభుత్వాలు ఆలోచించాలి.. సిక్కిం రాష్ట్రం అందరికీ ఆదర్శం కావాలి!