సంపాదకీయం

రాజధానిలో గోదావరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నదీ తీరాలలో నగరాలు నిలబడడం యుగయుగాల కథ...నదులు నగరాల వైపు నడవడం నడుస్తున్న నాగరికత, ఆధునిక విజ్ఞాన విజయగాథ. భాగ్యనగరికి తరలిరావడం పావన గోదావరీ శుభ జీవన ప్రస్థానంలో మరో చారిత్రక ఘట్టం. హైదరాబాద్ నగరంలోని నల్లాలలో ఇలా గోదావరి జలాలు నర్తించడం మరో అభినవ భగీరథ ప్రయత్నానికి ఘన విజయం. గోదావరి మరో గంగానది..! నిత్యం జంట నగరాల జనసముదాయానికి గోదావరీ జలస్నానం, గోదావరీ జలపానం. ఈ చారిత్రక స్వప్నాన్ని సాకారం చేయగలిగిన తెలంగాణ ప్రభుత్వం కార్యదీక్ష అభినందనీయం. గోదావరీ నది ఇదివరకే తెలుగునేలపై కృష్ణానదితో సంగమించింది. రాజమహేంద్రి సమీపంలో బయలుదేరిన గోదావరి గత సెప్టెంబరు 16న అమరావతి సమీపంలో కృష్ణతో సంగమించడం నదుల అనుసంధానానికి ఆధునికమైన శ్రీకారం. ఇప్పుడు భాగ్యనగర ప్రాంగణంలో గోదావరీ జలాలు మరోసారి కృష్ణా జలాలతోకలిసి కదం తొక్కనున్నాయి. ఇది అపూర్వ సంగమం. నది మరోనదిలో కలవడం సనాతన భౌగోళిక వాస్త వం, ప్రాకృతికం. మానవ పరిశ్రమ ఫలితంగా నది మరో నదిని స్పృజించడం అనుసంధానం. ఈ రెండూ ఇప్పటి వరకు జరిగాయి. కానీ ఇప్పుడు భాగ్యనగరంలో సంభవిస్తున్న మంజీరా, కృష్ణా, గోదావరీ జలాల సంగమం అపూర్వం. గోదావరి కరీంనగరం జిల్లాలోని ఎల్లంపల్లి నుండి 151 కిలోమీటర్ల మేర కదలి వచ్చింది. ఇదివరకే భాగ్యనగరంలోని జలాశయాలలో సభలు తీర్చిన కృష్ణవేణి ఎదురు వచ్చి స్వాగతిస్తోంది. మంజీరా జలాలు వేదనాద స్వరాలవలె శృతి కలుపుతున్నాయి. అందువల్లనే గో దావరి జలాలు హైదరాబాద్‌కు అరుదెంచడం, హైదరాబాద్ ప్రాంగణంలోని ఇళ్లలోని నల్లాలలో పరుగులు తీయడం అపూర్వ సంగమం. జలాశయాలలోని కృష్ణా జలాలతో, మం జీరా ధారలతో గోదావరి నీరు కలసిమెలసి దప్పిగొన్న లక్షలా ది గొంతులకు అమృత జలం కానుంది. నీరు జీవం, నీరు జనం, నీరు ఆహారం, నీరు ప్రాణం... వారానికి ఒకసారి మాత్రమే నల్లాలలోని మంచినీరు ముఖం చూసిన ప్రాంతాలు ఉమ్మడి రాజధాని శివారులలో ఉన్నాయి. నమూనా నగరంగా, ఆదర్శ నగరంగా హైదరాబాద్ అవతరించిందని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పదిహేనేళ్ల క్రితమే డప్పుకొట్టి చాటించినప్పటికీ నాగరికుల దప్పిమాత్రం తీరలేదు. రాజధాని శివారు ప్రాంతాలలోని వారి గొంతులు మరింతగా ఎండిపోవడం నడచిన వ్యథ, గడచిన కథ. కృష్ణవేణి కదలివచ్చినప్పటికీ ఈ కథ సుఖం వైపు మలుపు తిరగలేదు. అందుకే గోదావరి కూడ తరలి రాక తప్పలేదు. ఎల్లంపల్లి నుంచి భాగ్యనగరం వరకు గొట్టపు మార్గంలో గోదావరి నీరు ప్రవహించడం మరో అపూర్వ అద్భుతం. నదులనుండి సుదూర ప్రాంతాల నుండి మదరాసు వంటి మహా నగరాలకు మంచినీరు సరఫరా అవుతోంది. కానీ ఆ నీరు ఉపరితల స్రవంతిగా మారి సాగుతోంది. గొట్టపు మార్గం ద్వారా గోదావరి నీరు ముచికుందా నదీ తీరానికి రావడమే ఈ అద్భుతం. వాటర్ గ్రిడ్ అనుసంధానం ద్వారా తెలంగాణలోని ఇంటింటికీ నల్లాలను ఏర్పాటు చేయ తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి గోదావరి భాగ్యనగర ఆగమనం గొప్ప విజయం...తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలా కృష్ణా గోదావరి సంగమాలను సాధించడంలో కృతకృత్యలు కావడం హర్షణీయ పరిణామాలు.
ఆహార ఉత్పత్తికి ఆధారం నీరు. కానీ నీటికి కటకట ఏర్పడిన నగరాలు నరకాలుగా మారడం నడుస్తున్న వైపరీత్యం. కొన్ని దశాబ్దుల క్రితం నల్లాలో అనేక గంటలపాటు నీళ్లు వచ్చేవి. రోజంతా నీరు లభించిన రోజులు కూడ ఉన్నాయి. ప్రగతి విస్తరిస్తున్న కొద్దీ ప్రాణాధారమైన నీరు అంతరించి పోవడం నగరాలలోని నరకాల కథ. గోదావరి, కృష్ణ వంటి నదులు పొలాలకు తరలి పండించినంత మాత్రాన జన జీవనం సుఖప్రదం కాదన్నది దశాబ్దుల అనుభవం. నదుల నీరు నల్లాలకు చేరాలన్నది మనం నేర్చిన గుణపాఠం. అందువల్లనే నదులు పొలంలోకి రావాలా, నివాస స్థలంలోకి రావాలా అన్న విచికిత్స అతార్కికమైపోయింది. నదులు నీటితో నిండి ఉండాలన్నది మాత్రమే తర్కబద్ధమైన ఆకాంక్ష. అందువల్ల నీటితో నిండిన గోదావరి గలగలా కదిలిపోతుండడం ప్రధానం. కృష్ణవేణి బిరబిరా పరుగులు తీయడం ప్రధానం.. అలా నదులు నిండిన నీరు మానవుల దప్పికను తీర్చగలదు, పొలాలను పండించగలదు. భూమిని పరిశుద్ధం చేయగలదు. మన జీవితాలను పరిశుభ్రం చేయగలదు. పరిశుభ్రమైన ప్రగతికి నీరు ప్రతీక. అందువల్లనే నదీ తీరాలలో నగరాలు వెలశాయి. ఆలయాలు సాంస్కృతిక స్ఫూర్తి కేంద్రాలుగా విలసిల్లాయి. జలవాయు కాలుష్యం జన జీవనాన్ని కాటువేయడం చరిత్ర. అందువల్ల పరిశుభ్రమైన నీరు లభించాలి. గోదావరి అలాంటి పరిశుభ్రమైన నీరున్న నది...ముచికుంద వలె గంగానది కాలుష్యగ్రస్తం కాకపోవడం తెలుగువారి అదృష్టం.
కాని మన నగరాల నిర్మాణ పద్ధతి ఇలాగే కొనసాగితే, నిలువునా పెరుగుతున్న ఇళ్ల సముదాయాలు పాతాళ గంగను సైతం కాలుష్యగ్రస్తం చేయగలవు.ఆ కాలుష్యాన్ని గోదావరి నీరు సైతం కడిగివేయలేదు. నదీ తీరాలలో అడ్డంగా, పొడవుగా నగరాలు విస్తరించినంత కాలం నదులు కాలుష్య గ్రస్తం కాలేదు. నీరు చెడిపోలేదు. హైదరాబాద్‌లో భాగ్యలక్ష్మి దేవత అనాదిగా ఉంది. విదేశీయుల దురాక్రమణ సమయంలో మూల విగ్రహం ధ్వంసమై పోవడం వేరే సంగతి. భాగ్యలక్ష్మీ దేవీ పరిసర ప్రాంతాలలో వెలసిన నగ రం. అందువల్లనే భాగ్యనగరమైంది. ముచికుందా నదీ తీరంలో భాగ్యనగరం విస్తరించింది. తుంగభద్ర తీరం లో, పినాకినీ తీరంలో, కృష్ణాతీరంలో, గోదావరీ పరీవాహక ప్రాంతంలో వంశధార, నాగవళీ, వైనగంగా తీరాలలో నగరాలు వెలశాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిని సైతం నదీ తీరంలోనే నిర్మిస్తున్నారు. కానీ నగరాల కాలుష్యం నదుల జీవన ధారలను దిగమింగడం కూడ చరిత్ర. ముచికుంద నది మూసీ నదిగాను, మురుగు నీటి ప్రవాహంగాను మారిపోవడం ఇందుకు సాక్ష్యం. జంటనగరాల నీటి సమస్యకు మూసీ ఇలా ఎండిపోవడం ఒక వౌలిక కారణం. గోదావరీ జలాలతో మూసీని మళ్లీ ప్రవహించేయగలమా? అలాంటి అద్భుతం జరిగినట్టయితే నదుల అనుసంధాన చరిత్రలో అది సువర్ణ అధ్యాయం కాగలదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని నిర్మిస్తున్న తీరు కృష్ణానదిని మరో మూసీగా మార్చడానికి దోహదం చేసే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని నిరోధించాలంటే అనేక అంతస్థుల భవనాలతో నిలువుగా కాక ఒకటి రెండంతస్థుల భవనాలతో అమరావతిని అడ్డంగా, దూర దూరంగా విస్తరింపజేయాలి. నిలువునా పెరుగుతన్న నగరాలు నీటిని కాలుష్యం చేస్తున్నాయి. భూగర్భం ఎండిపోవడానికి ఒక ఇల్లున్న చోట పది ఇళ్లు పెరగడం కారణం...
నీటి సమస్య హైదరాబాద్‌కు పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాల పరిధికి మాత్రమే చెందినది కాదు. మొత్తం భారత దేశానికి చెందినది. ప్రత్యేక ఆర్థిక మండలాల పేరుతో పారిశ్రామిక కాలుష్యాన్ని పెంచడం వల్ల మొత్తం నీరు కాలుష్యమై పోతుంది. ఇలా అయిన తరువాత శుభ్రమైన నీటిని డబ్బాలలోను, సీసాలలోను, ప్లాస్టిక్ సంచులలో సరఫరా చేయాలన్నది బహుళ జాతీయ సంస్థల విస్తృత పన్నాగం... విస్తృత సమస్యకు పరిష్కారంలో గోదావరి నీరు జంట నగరాలకు రావడం ఒక అంశం మాత్రమే. నగరాలను, పరిసరాలను, ప్రకృతిని పరిశుభ్రం చేయడం తుది లక్ష్యం కావాలి. తెలంగాణ ప్రభుత్వం వారి హరితహారం ఇలా ప్రకృతిని పరిశుభ్రం చేయడానికి దోహదం చేయవచ్చు.