సంపాదకీయం

నిలదీస్తున్న నైరోబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్గతంగా మన ప్రభుత్వాలు, క్రీస్తుశకం 1994 నుంచి, సంపన్న దేశాల ప్రయోజనాలను పెంపొందించడానికి వీలైన ఆర్థిక నీతిని అవలంబిస్తున్నాయి. సంపన్న దేశాల ఆర్థిక దురాక్రమణను అంతర్జాతీయ వేదికలపై నిరోధించడానికి మన ప్రభుత్వాలు యత్నిస్తుండడం సమాంతర పరిణామం. ఈ రెండు సమాంతర ప్రక్రియలు పరస్పరం వైరుధ్యాలుగా కొనసాగుతుండడం ఇటీవల ముగిసిన ప్రపంచ వాణిజ్య సంస్థ సదస్సులో మన వైఫల్యానికి నేపథ్యం. 2001 నుండి కొనసాగుతున్న దోహా వాణిజ్య ప్రక్రియలో భాగంగా ఆఫ్రికాలోని కెన్యా రాజధాని నైరోబీలో డిసెంబర్ 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ-డబ్ల్యుటిఓ- సమావేశంలో సంపన్న దేశాలు వ్యూహం మరోసారి విజయవంతమైంది. ఎలాంటి అంగీకారం కుదరకపోవడం సంపన్నుల విజయం. అంగీకారం కుదిరి ఉన్నట్టయితే దోహా ప్రక్రియలో భాగంగా సంపన్న దేశాలవారు తమ దేశంలో వివిధ రంగాలకు ప్రధానంగా వ్యవసాయరంగానికి కల్పిస్తున్న రాయితీలను వెంటనే తగ్గించవలసి ఉండేది. క్రమంగా రద్దు చేయవలసి ఉండేది. ఖతార్ రాజధాని దోహాలో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సులో కుదిరిన ఈ అంగీకారం పదిహేను ఏళ్లుగా అమలు కావడం లేదు. సంపన్నుల సబ్సిడీలు కొనసాగడానికి నైరోబీ సదస్సు విఫలం కావడం ఇలా దోహదం చేస్తోంది. సంపన్న దేశాల ప్రభుత్వాలు తమదేశంలోని బృహత్ వాణిజ్య వ్యవసాయ సంస్థలకు ఇస్తున్న భారీ రాయితీల కారణంగా ఆయా దేశాలలోని వ్యవసాయ ఉత్పత్తుల, ఎరువుల, పనిముట్ల ధరలు తక్కువగా ఉంటున్నాయి. అందువల్ల ఈ దేశాలవారు చౌక ధరలకు తమ వ్యవసాయ ఉత్పత్తులను విత్తనాలను ఎరువులను పరికరాలను వర్ధమాన దేశాలకు ఎగుమతి చేయగలుగుతున్నాయి. దిగుమతి చేసుకుంటున్న వర్ధమాన దేశాలలోని స్వదేశీయ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా స్వదేశీయ ఉత్పత్తులకు సక్రమంగా గిరాగీ తగ్గి స్వదేశీయ వ్యవసాయం గిట్టుబాటు కాని స్థితి ఏర్పడింది. అందువల్ల వర్ధమాన దేశాలలోని స్వదేశీయ ఉత్పత్తులకు గిరాకీని పెంచడానికి ఏకైక మార్గం సంపన్న దేశాలనుండి దిగుమతులను తగ్గించడం. ఇందుకు వీలుగా వర్ధమాన దేశాలకు స్పెషల్ సేఫ్‌గార్డ్స్ మెకానిజం-ఎస్‌ఎస్‌ఎమ్-ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన దోహా ప్రక్రియలో భాగం...ఎస్‌ఎస్‌ఎమ్-ప్రత్యేక రక్షణల వ్యవస్థ ఒప్పందం- అమలు జరిగినట్టయితే దిగుమతులపై సుంకాలను పెంచడానికి వర్ధమాన దేశాలకు వీలు కలుగుతుంది. దిగుమతులపై సుంకాలను పెంచడం వల్ల వర్ధమాన దేశాలలోని జాతీయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి, వ్యవసాయం గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. ఈ అంశం గురించి కూడ నైరోబీలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ రెండు అంశాలను ఆమోదింప చేయడానికి మనదేశం పట్టుపట్టినప్పటికీ ఫలితం సిద్ధించలేదు. సంపన్న దేశాలకిది వ్యూహాత్మక విజయం...
వర్ధమాన దేశాలలో ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి కల్పిస్తున్న రాయితీలు మాత్రం రద్దయి పోవాలన్నది సంపన్న దేశాల దురాశ. ఈ దురాశ కారణంగానే గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో జెనీవాలో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సు విఫలమైంది. వ్యవసాయ రంగానికి రాయితీలు కొనసాగించి తీరుతామని అప్పుడు మన ప్రభుత్వం పట్టుబట్టింది. అనేక వర్ధమాన ప్రతినిధులు కూడ తమ దేశాలలోని వ్యవసాయ ‘రాయితీలు’ రద్దు చేయడానికి సుముఖంగా లేదు. ఫలితంగా జెనీవాలో చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా జెనీవా సదస్సులో ‘వాణిజ్య సదుపాయ అంగీకారం’-ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ కుదరలేదు. ప్రపంచంలోని అన్ని దేశాలలోను ఎగుమతుల దిగుమతులను సుంకాల సమానస్థాయిలో ఉంచడానికి వీలైన ఒప్పందం అది. శాశ్వతమైన ఒప్పందం కుదిరే వరకు వ్యవసాయంపై రాయితీలను కొనసాగించడానికి మనదేశం సహా వర్ధమాన దేశాలు అప్పుడు నిర్ణయించాయి. వర్ధమాన రాయితీలను రద్దు చేయాలని గత ఏడాది జెనీవాలోను, తమ ‘రాయితీ’లు రద్దు చేయబోమని ఇప్పుడు సంపన్న దేశాలు పట్టుపట్టాయి. ఇలా చర్చలు ప్రతి దశలోను విఫలమవుతుండడం ‘దోహా’ ప్రక్రియ యథాతథ స్థితి కొనసాగుతుండడానికి కారణం! ఈ యథాతథ స్థితి సంపన్న దేశాల ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ మన దేశం వంటి ప్రవర్ధమాన దేశాలలోని వ్యవసాయ రంగాన్ని దురాక్రమించడానికి దోహదం చేస్తోంది..
మన ప్రభుత్వం అమలు జరుపుతున్న ‘ఆహార భద్రత’ పథకాల గురించి కూడ ‘వాణిజ్య సంస్థ’ వారు అభ్యంతరాలను వ్యక్తం చేస్తుండడం నడుస్తున్న చరిత్ర! ఈ ‘్భద్రత’ పథకాన్ని రద్దు చేసే ప్రసక్తి లేదన్న మన ప్రభుత్వ స్పష్టీకరణ సంపన్న దేశాలకు ప్రధానంగా అమెరికా ఐరోపా చైనా దక్షిణ కొరియా వంటి దేశాల వాణిజ్య సంస్థలకు మిక్కిలి దుఃఖాన్ని కలిగిస్తోంది! ఈ ‘రాయితీల’ వల్ల ఆహార ధాన్యాలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ‘చౌక‘గా లభించడం వల్ల వర్ధమాన దేశాలలో తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలులేదన్నది బహుళ జాతీయ సంస్థల భయం! అందువల్లనే వర్ధమాన దేశాల చిల్లర వ్యాపార రంగంలోకి చొరబడి స్వదేశీయ వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీని నియంత్రించడానికి ‘సంపన్న’ సంస్థలు యత్నిస్తున్నాయి! అంతర్జాతీయ వేదికలపై ఇలా మన వ్యవసాయ ప్రయోజనాల పరిరక్షణ కోసం మన ప్రభుత్వాలు కృషి చేయడం ప్రశంసనీయం. కానీ అంతర్గతంగా మాత్రం మన వ్యవసాయాన్ని చిల్లర వ్యాపారాన్ని పంపిణీ రంగాన్ని సంపన్న విదేశీయ సంస్థలకు అప్పగించడానికి మన ప్రభుత్వం యత్నిస్తోంది. ‘దినమంతా ఎగనేశాము దీపం పెట్టరా దిగనేద్దాము...’ అన్న చందంగా మన ప్రభుత్వాలు సంపన్న దేశాల ఒత్తడికి లొంగిపోతుండడం 1994 నుంచి కొనసాగుతున్న అంతర్గత వైపరీత్యం! అయినప్పటికీ ‘డబుల్ యుటిఓ’లో మన ప్రభుత్వ వైఖరి మాత్రం తమకు ‘కొరకరాని కొయ్య’గా మారినట్టు గత ఏడాది జెనీవా చర్చల సందర్భంగా అమెరికా ప్రభుత్వం వ్యాఖ్యానించింది. నైరోబీ చర్చలకు ముందుగా కూడ అమెరికా ఈ వ్యాఖ్యను పదే పదే ఉద్ఘాటించింది! ప్రపంచ వాణిజ్య సంస్థలో తమ మాటకు తానతందానా పాడకపోయినట్టయితే ‘ఆసియా పసిఫిక్ ఆర్థిక సమాఖ్య’- ఆపెక్-లో మనకు సభ్యత్వం కల్పించడానికి ‘అడ్డుపుల్ల’ వేయాలని అమెరికా నిర్ణయించడం ‘ఒత్తడి’ వ్యూహంలో సరికొత్త ఘట్టం!
నైరోబీ నుండి మన వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ ఒత్తి చేతులతో తిరిగివచ్చినట్టు మన్‌మోహన్‌సింగ్ ప్రధానిగా ఉండిన సమయంలో వాణిజ్య మంత్రిగా ఉండిన ఆనందశర్మ వ్యాఖ్యానించడం విచిత్రమైన వ్యవహారం! ‘బిటి’ పత్తి గింజలను అమెరికా వారి మొన్‌సాంటో సంస్థవారు మన వ్యయసాయదారులకు తగలకట్టడానికి కారణం అమెరికా ప్రభుత్వం ఒత్తడికి మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం లొంగిపోవడం కారణం! భారీ ధరలకు ఈ పత్తి గింజలను మన వ్యవసాయదారులకు అమ్మిన మొన్‌సాంటో వేలాది కోట్ల రూపాయలను దోచేసింది, ఈ దోపిడీ ఇప్పటికీ సాగిపోతోంది. ఈ దోపిడీని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మొన్‌సాంటో వారు నిరసిస్తుండడం నడుస్తున్న వైపరీత్యం! ‘బిటి’ పంటను తింటున్న గులాబీ రంగు పురుగులు దాపురించిన వినూతన కొత్త తెగులు! మన్‌మోహన్‌సింగ్ ఆర్థిక నీతి వ్యవసాయానికి దాపురించిన అసలైన ‘తెగులు’...