సబ్ ఫీచర్

‘తెలుగు సూరీడు’.. బ్రౌన్ ( నేడు బ్రౌన్ జయంతి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీయుడైనా, తన మాతృభాష వేరైనా, మన తెలుగు భాష ఔన్నత్యానికి విశేషంగా పాటుపడిన సిపి బ్రౌన్ ఓ ఆంగ్లేయుడంటే చాలామందికి నమ్మకం కాదు. అయినా- ఇది అక్షరాలా నిజం. తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణ కోసం నిర్విరామంగా కృషిచేసిన మహోన్నత వ్యక్తి ఆయన. కొడిగడుతున్న తెలుగు సాహిత్య దీపాన్ని ప్రజ్వలింపజేసి, తెలుగు సూరీడుగా అందరి మనసులను దోచుకున్నారు. సి.పి. బ్రౌన్‌గా అందరికీ సుపరిచితులైన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 1798 నవంబరు 10న కోల్‌కతలో జన్మించారు. తండ్రి మ రణం తర్వాత ఆయన కుటుంబమంతా ఇంగ్లాండుకు తి రిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బ్రౌన్ తిరిగి భారత్ చేరుకుని, 1817 ఆగస్టు 4న చెన్నైలో ఈస్టిండియా కంపెనీలో చేరారు. వెలగపూడి కోదండరామ పంతులు వద్ద తెలుగు వర్ణమాల నేర్చుకున్నారు. అనతికాలంలోనే తెలుగులో మంచి ప్రావీణ్యం సంపాదించారు. 1820లో సర్ థామస్ మన్రో మద్రాసు గవర్నరుగా బాధ్యతలు చేపట్టాక ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులంతా దేశ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాలని, ప్రజల భాషలోనే ప్రభుత్వ కార్యకలాపాలు సాగించాలని ఆదేశించారు. ఈ మాట బ్రౌన్ మనస్సులో బాగా నాటుకొంది. తర్వాత ఆయన కడపలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1820 నుంచి 1822 వరకు అక్కడే పనిచేశారు. ఆ తరువాత బందరు, గుంటూరు, చిత్తూరు, తిరునల్వేలి తదితర ప్రాంతాల్లో పనిచేశారు.
1826-29 మధ్య కడపలో తిరిగి ఉద్యోగం చేశారు. ఆ సమయంలో తెలుగు భాష పరిశోధనకు శ్రీకారం చుట్టారు. ప్రాచీన కావ్యాలను వెలికితీసి పరిష్కరించారు. మనుచరిత్ర, వసుచరిత్రల వంటి ప్రబంధాలను, పోతనామాత్యుని భాగవతాన్ని పండితుల చేత పరిష్కరింపజేశారు. వాటికి వ్యాఖ్యానాలు రాయించేందుకు కృషిచేశారు. 1837 ప్రాంతంలో తెలుగు భారతం 18 పర్వాలను పరిష్కరింపజేసేందుకు, శుద్ధప్రతులను తయారు చేసేందుకు 2714 రూపాయలను ఆ రోజుల్లో ఖర్చుచేసిన వితరణ ఆయనది. పల్నాటి వీరచరిత్రను వెలికితీసి కొత్త ప్రతులను రాయించారు. ఆయన సాహితీ కృషికి కడప వేదికయింది. పండితుల్ని నియమించి తన సాహితీ సేద్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. వేమన పద్యాలు వెలికితీసి 1829, 1839 సంవత్సరాలలో ప్రచురించారు. తెలుగువారి వేమనను తిరిగి బతికించారు. 1840లో తెలుగు వ్యాకరణాన్ని ప్రచురించారు. ఆంధ్ర గీర్వాణచ్ఛందాలను తులనాత్మకంగా పరిశీలించి స్వయంగా గ్రంథాలను రాశారు. తె లుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులను దేశంలో తొలిసారిగా వెలువరించారు. తెలుగు నేర్చే ఇంగ్లీషువారి కోసం, ఇంగ్లీషు నేర్చదలచిన తెలుగువారి కోసం లానే స్వయంగా సిలబస్ నిర్ధారించుకొని వాచకాలను రూపొందించి తరువాతి తరాలకు అందించేందుకు కల్నల్ మెకంజీ కైఫీయతులను పరిష్కరింపజేశారు.
బ్రౌన్ సంస్కృత భాషలోనూ దిట్ట. శంకరాచార్యుల సౌందర్య లహరికి, లితోపాఖ్యానానికి వ్యాఖ్యానాలు రాశారు. జ్యోతిషం, శిల్పశాస్త్రం, గణితం తదితర అంశాలపై 106 వ్యాసాలు రాసి ప్రచురించారు. చెన్నై, ఓరియంటల్ మాన్యుస్క్రిప్టు గ్రంథాలయంలో బ్రౌన్ సేకరించిన వివిధ సంపుటాలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. లండన్‌లోని భారత్ కార్యాలయాల గ్రంథాలయాల్లో 52 ముద్రిత, అముద్రిత సంపుటాలను కూడా భద్రపరచి ఉంచారు. తాను పనిచేసిన ప్రాంతాల్లో విద్యావ్యాప్తికి పలు చర్యలు తీసుకున్నారు. కడప, మచిలీపట్నాల్లో రెండేసి ఉచిత పాఠశాలలను స్థాపించి, విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యాలను కల్పించారు. వీటి నిర్వహణకు తన వేతనం నుంచి నిధులను సమకూర్చేవారు. కడపలో ఓ బంగాళా కొని సొంత ఖర్చుతో 15 మంది పండితులను నియమించి, తెలుగులో పరిశోధన కార్యక్రమాలను నిర్వహించేవారు. బ్రౌన్ నివసించిన బంగళాను రూ.10 లక్షల వ్యయంతో పునరుద్ధరించి ఆయన పేరుతోనే గ్రంథాలయాన్ని, అకాడమీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ భాషలకు చెందిన 16,500 గ్రంథాలున్నాయి.
ఉద్యోగరీత్యా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పలుచోట్ల పనిచేశారు. 1820లో కడప కలెక్టరుగా, తరువాత కృష్ణాజిల్లా కోర్టు రిజిస్ట్రారుగా, ఇన్‌ఛార్జి కలెక్టరుగా, జిల్లా మేజిస్ట్రేటుగా, రాజమహేంద్రవరం అదనపు జడ్జిగా, గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టరుగా పనిచేశారు. 1837లో పోస్టుమాస్టర్ జనరల్‌గా సేవలందించారు. ఓవైపు సాహితీసేవలను అందిస్తూనే, ఉద్యోగ విధులను ఎన్నడూ విస్మరించకుండా సామాన్య ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడేవారు. కరవు పరిస్థితులను అధిగమించే చర్యల్లో భాగంగా గంజి కేంద్రాలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయించారు. కరవునివారణ పథకాలను ఆరోజుల్లో వినూత్నంగా చేపట్టారు. సతీ సహగమనాన్ని రూపుమాపడంలో ఎంతో కృషిచేశారు. పరిపాలనాదక్షునిగా, సాహితీ సేవకునిగా ప్రజల హృదయాల్లో బ్రౌన్ చెరగని ముద్రవేసుకున్నారు. తెలుగుభాషా సాహిత్యాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. 1854లో బ్రౌన్ పదవీ విరమణచేసి లండన్‌లో స్థిరపడ్డారు. లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యునిగా కొంతకాలం పనిచేశారు. 1884 డిసెంబరు 12న తన ఎనభై ఏడవ ఏట తుది శ్వాస విడిచారు. తెలుగు సాహిత్య సరస్వతిని స్వాగతించి, ఆ వాగ్దేవిని ‘నిండుముత్తయిదువ వలె నడయాడేలా చేయగలిగిన మహానుభావుడ’ని పండితులు, మేధావులు కీర్తించారు.

నేడు బ్రౌన్ జయంతి

- వాండ్రంగి కొండలరావు