సంపాదకీయం

మైత్రికి మెరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇజ్రాయిల్ అధ్యక్షుడు రూలెన్ రిబ్లిన్ మన దేశంలో పర్యటిస్తుండడం ఉభయ దేశాల ద్వైపాక్షిక మైత్రీ ప్రస్థానంలో మరో చారిత్రక పరిణామం! ఈ చరిత్ర సహస్రాబ్దుల క్రితం మొదలైంది, కొన్ని శతాబ్దుల పాటు ప్రాధాన్యం కోల్పోయింది. 1992లో మళ్లీ ఆరంభమైంది. ఈ పునరారంభ స్నేహానికి సహస్రాబ్దుల నాటి చారిత్రక బంధం ప్రాతిపదిక! వాణిజ్యం, రక్షణ సైనిక ప్రయోజనాలు, రాజకీయ దౌత్యం, వ్యూహాత్మక అనివార్యాలు వివిధ దేశాల మధ్య స్నేహ సంబంధాలను, వైరుధ్యాలను నిర్దేశిస్తుండడం అంతర్జాతీయ వర్తమాన వాస్తవం. భారత్-ఇజ్రాయిల్ సంబంధాలను సైతం ఈ వాస్తవం ప్రభావితం చేస్తోంది. జిహాదీ ఉగ్రవాదుల బీభత్స చర్యల వల్ల ఉభయ దేశాలకు సమాన ప్రమాదం దాపురించి ఉండడం ఈ సమకాల వాస్తవంలో ఒక అంశం! కానీ భారత్- ఇజ్రాయిల్ సంబంధాలు కేవలం ఈ భౌతిక వాస్తవ పరిధికి పరిమితమైనవి కావు! ఉభయ దేశాల ప్రజల సంబంధాలు రెండు వేల ఏళ్లకు పూర్వం ఇజ్రాయిలీ ప్రజలు శరణార్ధులుగా భారతదేశానికి వచ్చినప్పటి నాటివి! స ర్వమత సమభావ జాతీయతతో ముడివడినవి! ఈ జాతీయత అనాదిగా హిందువుల సం స్కృతి. అందువల్లన సర్వమత సమభావ వ్యవస్థ భారత్‌లో అనాదిగా కొనసాగుతోంది! 1950లో ఏర్పడిన స్వతంత్ర భారత రాజ్యాంగం సర్వమత సమభావ స్వభావాన్ని సంతరించుకొనడానికి ఈ చరిత్ర ప్రాతిపదిక! ఇజ్రాయిల్‌లో కూడా ఆ దేశం 1948లో మళ్లీ స్వతంత్ర రాజ్యంగా ఏర్పడిననాటి నుంచి సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ నెలకొని ఉంది! ఉభయ దేశాల మధ్య సమాన స్వభావానికి ఇది ఒక నిదర్శనం. పశ్చిమ ఆసియాలోను, ఉత్తర ఆఫ్రికాలోను ఏకమత రాజ్యాంగ వ్యవస్థలు ఏర్పడి ఉన్నాయి. ఇవన్నీ ఇస్లాం మత రాజ్యాలు. ఇస్లాంను తప్ప మరో మతాన్ని సహించని జిహాదీలు, జిహాదీ స్వభావాన్ని సంతరించుకున్న ప్రభుత్వాలు ఇజ్రాయిల్ చుట్టూ వున్న దేశాలలో ఏర్పడి ఉండడం వర్తమాన స్థితి! ఈ జిహాదీ స్వభావం 1948 నుంచి ఇజ్రాయిల్ సర్వమత సమభావ వ్యవస్థను ధ్వంసం చేయడానికి యత్నిస్తోంది! ఇదే జిహాదీ స్వభావం పాకిస్తాన్‌ను ఆవహించి ఉంది. అందువల్లనే భారత్‌ను బద్దలుకొట్టడం తమ లక్ష్యమని పాకిస్తాన్‌లోని జిహాదీ ముఠాలు నిరంతరం పునరుద్ఘాటిస్తున్నాయి. 1947 నుంచీ మన దేశానికి ఈ జిహాదీ ఉగ్రవాద ప్రమాదం పొంచి ఉంది! ఉగ్రవాదం భారత్-ఇజ్రాయిల్ దేశాలకు ఉమ్మడి శత్రువని మంగళవారం కొత్త ఢిల్లీలో ఇజ్రాయిల్ అధ్యక్షుడికి స్వాగతం చెప్పిన సందర్భంగా మన ప్రధాని పేర్కొనడం సమకాల అంతర్జాతీయ స్థితికి అద్దం. 2008 నవంబర్‌లో పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత ఉగ్రవాదులు ముంబయిపై జరిపిన దాడికి కొందరు ఇజ్రాయిల్ పౌరులు కూడ బలైపోయిన సంగతిని రూవెన్ రిబ్లిన్ గుర్తు చేసుకొనడం సహజం!
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మనదేశం మరో ప్రజాస్వామ్య దేశంతో మైత్రిని పాటించడం సహజమైన వాస్తవం. నియంతృత్వ క్షార జల సముద్రంలో ప్రజాస్వామ్య క్షీరం పెల్లుబుకుతున్న చిన్న దీవి వంటిది ఇజ్రాయిల్! మనదేశంలోని ఒక పెద్ద జిల్లా అంత విస్తీర్ణం, అరవై డెబ్బయి లక్షల జనాభా మాత్రమే కలిగిన అతి చిన్న దేశం అయినప్పటికీ ఇజ్రాయిల్ ప్రజాస్వామ్య పథంలో ఆరంభం నుంచీ పయనిస్తోంది! పరిణత ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరు తెచ్చుకుంది! చుట్టూ ఉన్న ఇస్లాం మత రాజ్యాలలో ప్రజాస్వామ్యం లేదు, రాజరికాలు, నియంతృత్వ ప్రభుత్వాలు పాతుకుపోయి ఉన్నాయి. ఈ నియంతలకు వ్యతిరేకంగా ఐదారేళ్ల క్రితం పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలలో ప్రజలు ఉద్యమించారు. ఈ అరబ్ ఉప్పెనలో పాత నియంతలు కొందరు కొట్టుకొనిపోయినప్పటికీ ఆయా దేశాలలో ప్రజాస్వామ్యం మాత్రం పరిఢవిల్లలేదు! ఎందుకంటే ప్రజాస్వామ్య వౌలిక లక్షణం సర్వ వైవిధ్య స్వభావం! ఈ సర్వ వైవిధ్య సమభావం ఇజ్రాయిల్ చుట్టూ ఉన్న దేశాలలో లేదు! అందువల్ల 1948 నుంచి భారత్, ఇజ్రాయిల్ దేశాలు సహజ మైత్రిని పాటించి ఉండాలి! కానీ ఉభయ దేశాల మధ్య 1992 వరకు పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు నెలకొనకపోవడం విచిత్రమైన చరిత్ర! దౌత్య సంబంధాలు నెలకొని ఇరవై నాలుగు ఏళ్లు గడిచినప్పటికీ ఉభయ దేశాల మధ్య అంటీముట్టని రీతిలోనే సంబంధాలు కొనసాగుతున్నాయి. 2003లో ఇజ్రాయిల్ ప్రధాని ఆలియల్ షరణ్ మన దేశానికి వచ్చి వెళ్లినప్పటికీ ఆ తరువాత పదేళ్ల పాటు ఉభయ దేశాల సంబంధాలలో చెప్పుకోదగిన ప్రగతి కనిపించలేదు!
ఇజ్రాయిల్‌లో మన దేశంలో వలెనే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పని చేస్తోంది. అందువల్ల దేశాధ్యక్షుడు ప్రభుత్వ నిర్వాహకుడు కాదు. ప్రభుత్వ నిర్వాహకుడు ప్రధానమంత్రి! ఇజ్రాయిల్ అధ్యక్షుని పర్యటన తాత్కాలిక వాణిజ్యపు ఒప్పందాలకు, దౌత్య వ్యూహాలకు సం బంధించినది కాదు. దీర్ఘకాల సాంస్కృతిక మైత్రికి సంబంధించినది! ఈ దీర్ఘకాల చరిత్ర రోమన్లు యూదులను పాలస్తీనానుంచి వెళ్లగొట్టిన నాటిది. పాలస్తీనా-ఇజ్రాయిల్ ప్రాంతం యూదులకు సహస్రాబ్దులుగా మాతృభూమి. దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం ఇలా పరాజితులై మాతృభూమిని వదిలి పారిపోయిన యూదులు ప్రపంచమంతటా చెల్లాచెదురయ్యారు. దాదాపుప్రతి దేశంలోను యూదులను స్థానికులు చిన్న చూపు చూశారు, వివక్షకు గురి చేశారు, వెళ్లగొట్టారు. ఒక్క భారతదేశంలో మాత్రమే యూదులకు భద్రత ఏర్పడింది, సమాన గౌరవ ప్రతిపత్తులు లభించాయి. ఇదంతా యూదులు స్వయంగా వ్రాసుకున్న చరిత్ర! రెండు వేల ఏళ్లపాటు యూదులు మన దేశంలో హాయిగా జీవించగలిగారు, అభివృద్ధి సాధించారు. భారత- ఇజ్రాయిల్ మైత్రికి ఇదీ ప్రాతిపదిక! రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నాజీ ప్రభుత్వం లక్షలాది యూదులను ఊచకోత కోసింది. రష్యా కమ్యూనిస్టులు సైతం యూదులను హింసించారు, అణచివేశారు. పాశ్చాత్యుల ఈ కర్కశ స్వభావం గురించి భారతీయుల కరుణామయ స్వభావం గురించి యూదులకు బాగా తెలుసు, అంతరం తెలుసు!
ఈ అంతరాన్ని 1893 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలోని చికాగోలో చేసిన ప్రసంగంలో వివేకాననంద స్వామి ఉటంకించాడు. ‘రోమన్ల దమనకాండ వల్ల తమ దేవాలయం ధ్వంసమైన సంవత్సరంలోనే దక్షిణ భారతదేశానికి వచ్చి తలదాచుకున్న అవశేష ఇజ్రాయిలీ ప్రజలను అక్కున చేర్చుకుని ఆదరించిన జాతి మాదని చెప్పడానికి గర్విస్తున్నాను..’-అని వివేకానందుడు భారత-ఇజ్రాయిల్ బంధాన్ని ప్రపంచానికి గుర్తు చేశాడు. 1948లో ఇజ్రాయిల్ ఏర్పడిన తరువాత కూడ వేలాది యూదులు, ఇజ్రాయిల్ జాతివారు ఇప్పటికీ మనదేశంలోనే నివసిస్తుండడం ఈ చారిత్రక మైత్రికి ప్రత్యక్ష సాక్ష్యం! ఇజ్రాయిల్ అధ్యక్షుని పర్యటన ఈ మైత్రికి మరింత బలం!