సంపాదకీయం

‘గ్రహణ’గ్రస్త ‘సభ’లు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటులో ఏమి జరుగుతుంది? అన్న ప్రశ్నకు సమాధానం ‘గొడవ’...గొడవ జరగని సమయంలో పార్లమెంటు సభలు ఖాళీగా ఉండడం పరిపాటి! పనివేళలలో పార్లమెంటులో లేని ప్రజాప్రతినిధులు నియోజకవర్గం అభివృద్ధికోసం ప్రభుత్వ కార్యాలయాలలో ఉంటున్నారట! ఇలా ఢిల్లీలో ‘ప్రతినిధులు’ ఉండవలసిన సమయంలో ఉండవలసిన చోట ఉండకపోవడం మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయం అయిపోయింది! ప్రతినిధులు పార్లమెంటు బయట నిర్వహించే కలాపాలు నియోజకవర్గం అభివృద్ధి కోసం కాదని, ‘స్వాభ్యుదయం’ కోసమనీ ఆరోపించేవారు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వినూతన సంప్రదాయాలు తెలియనివారు...సభలలో జరిగేది గొడవ మాత్రమే కనుక ‘గొడవ’ను నిరోధించాలన్న సదుద్దేశంతోనే అధికాధిక ప్రతినిధులు సభల బయట ఉంటున్నారన్నది ఆధునిక సంప్రదాయం తెలిసిన అభిజ్ఞుల మాట! పదహారు ఏళ్లు నిండిన లైంగిక బీభత్సకారులు బాల నేరస్థులు కాదని నిర్దేశించే బిల్లుపై జరిగిన చర్చకు మంగళవారం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సమాధానం చెప్పిన సందర్భంగా అనేకమంది ప్రతినిధులు రాజ్యసభలో లేకపోవడం ఈ నూతన సంప్రదాయానికి ఒక ఉదాహరణ మాత్రమే! ‘బిల్లు’పై వోటింగ్ జరగలేదు కనుక ఎందరు సభలో ఉన్నది వెల్లడి కాదు. ‘నోటిమాట’ వోటు ద్వారా బిల్లును ఆమోదించారు. డిసెంబర్ నాలుగవ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు సభల పనితీరుపట్ల గొప్ప సంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘నేను పార్లమెంటుకు వెంటనే వెళ్లాలి. పార్లమెంటు సభలు పనిచేస్తుండడం శుభవార్త. ఈ ఘనత మోదీది మాత్రమే కాదు, అన్ని రాజకీయ పక్షాలది కూడ...’’ అని ప్రధానమంత్రి హర్షం ప్రకటించారు! కానీ ఆయన పార్లమెంటు భవనం చేరుకునే సరికి ఆ రోజు ఆవిష్కృతమై ఉండిన దృశ్యం ఉభయ సభలు వాయిదా పడి ఉండడం...‘చర్చ’లు ‘రచ్చ’లుగా మారినందువల్ల ఈ ‘వాయిదా’లు సంభవించలేదు. సభలలో ఉపస్థితులై ఉండవలసిన కనీసం-కోరమ్-సంఖ్యలోని సభ్యులు అక్కడ లేకపోవడం వల్ల సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ సభ్యుల సం ఖ్య 545. అందువల్ల కనీసం పదోవంతు-55 మంది-సభ్యులు సభలో ఉన్నప్పుడే సభ పనిచేయగలదు. యాబయి ఐదుగురు కూడ సభలో లేకపోవడంవల్ల ఆరోజు లోక్‌సభ దాదాపు గంటసేపు వాయిదా పడిందట! ఆ తరువాత హడావుడిగా అధికార పక్షం ప్రతినిధులు అరుదెంచి ‘కోరం’ ఏర్పాటు చేసారు. సభ మొదలైంది. ‘కోరం’ ఉండినప్పటికీ అధికాధిక సభ్యులు సభలో లేకపోవడం నరేంద్రమోదీ ‘ఆశాభావాన్ని’ ఆవిరిచేసిన పరిణామం! ‘ఏరీ మీ 282 సభ్యులు?’ అని నిలదీసిన ప్రతిపక్షం వారికి ప్రభుత్వం సమాధానం చెప్పలేని స్థితి!
పార్లమెంటు ప్రాంగణంలో సభ్యులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలనుచేసే కార్యక్రమాన్ని అదే రోజున ఏర్పాటు చేసారట! అందువల్ల సభ్యులందరు సభలను వదిలిపెట్టి పరీక్షా కేంద్రం వద్ద బారులు తీరారట! సభలు జరగవలసిన సమయంలో సభ్యులు ‘పరీక్ష’లకు హాజరు కావడం ‘కోరం’ లేకపోడానికి కారణమట! సభలలో చర్చలు జరగవలసిన సమయంలో ‘ప్రాంగణం’లో ‘పరీక్షా’ కేంద్రాన్ని ఎందుకు ఏర్పాటు చేసారన్న ప్రశ్న పుట్టలేదు..ఎవ్వరూ అడగలేదు! సామాన్యులకు నిరుపేదలకు ఉచిత ఆరోగ్య చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయడం పరిపాటి. పార్లమెంటు సభ్యులకు సైతం ఇలా ఉచిత పరీక్షా కేంద్రాలు ఏర్పాటవుతున్నాయన్నది పెద్దగా ప్రచారం కాని మహా విషయం. ఏమయినప్పటికీ ‘సభలు’ సజావుగా జరగకపోవడం వల్ల మధ్యాహ్నం ఒంటి గంటకో రెండుకో వాయిదా పడిపోవడం వల్ల ‘ప్రతినిధుల’కు బోలెడంత సౌలభ్యం అన్నది ప్రజలకు అర్ధమైపోయిన పార్లమెంటరీ సంప్రదాయం! ప్రతి సమావేశాల-బడ్జెట్, వర్షాకాల, శీతాకాల-ప్రారంభంలోను రచ్చ జరగడం కోసం ఏదో ఒక వివాదం కాచుకుని ఉండడం ఏళ్ల తరబడి జరిగిపోతున్న ప్రహసనం! ఈ ‘వివాదం’ కారణంగా సమావేశాలలో ప్రజా ఉపయోగకరమైన అంశాలేవీ ప్రస్తావనకు నోచుకోడం కుదరదు. వివాదాల ఉద్ధృతిలో ప్రస్తుత శీతాకాల సమావేశాలుకూడా కొట్టుకుని పోవడం అందువల్ల ఆశ్చర్యం కాదు. కనీసం ‘నిర్భయ‘ వైపరీత్యం కారణంగా ‘బాల నేరస్థుల’ న్యాయప్రక్రియ-సవరణ-బిల్లు రాజ్యసభ ఆమోదించింది! ఏ ‘బిల్లు’ కూడ ఆమోదం పొందడానికి వీలు లేని రీతిలో సభల సమావేశాలు ముగిసిపోతున్నప్పుడు, ఈ బిల్లును మాత్రం ఎందుకు ఆమోదించాలన్న ‘పట్టుదల’ కూడ కొన్ని పక్షాలవారికి పెరిగింది. అందువల్లనే వారంతా ‘వోటింగ్’ సమయంలో సమావేశాన్ని బహిష్కరించి రాజ్యసభ బయటికి నడిచారు! సమావేశాలలో ఎలాంటి ‘బిల్లు’లు ఆమోదించరాదన్న, చర్చలు జరగరాదన్న విచిత్ర సంప్రదాయానికి ఈ ‘బహిష్కరించినవారు’ ఇలా తమ సైద్ధాంతిక నిబద్ధతను పునరుద్ఘాటించారు..
అందువల్ల ఈ శీతాకాల సమావేశాలలో ఎన్ని గంటల సమయం వృధా అయిపోయిందన్న వివరాల కోసం మాత్రమే కుతూహల గ్రస్తులైన వారు ఎదురు చూస్తున్నారు! ప్రతిసారి సమావేశాలు ముగిసిన వెంటనే ఈ వృధా అయిపోయిన గంటల వివరాలు మాత్రం వెలువడడం వ్యవస్థీకృతమై పోయిన సంప్రదాయమైంది! అత్యవసరమైన ‘బిల్లు’లను రాష్టప్రతి ఆదేశాల ద్వారా ప్రజలనెత్తికెత్తే వెసలుబాటు ఎలాగూ ఉంది! ‘్భమి సేకరణ సవరణ బిల్లు’ ఏడాదికి పైగా ఇలా ప్రజల నెత్తికెక్కి ఆ తరువాత దిగిపోవడం ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వైచిత్రికి మరో మచ్చుతునక! ఈ సమావేశాల ప్రారంభానికి ముందే ‘వస్తు, సేవల సుంకాల’-గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్-బిల్లుపై ఏకాభిప్రాయ సాధన ప్రహసనం మొదలైంది. ప్రతిపక్షాలకూ ప్రభుత్వ పక్షాలకూ మధ్య ‘బయట’ భారీగా చర్చలు జరిగాయి..ఈలోగా నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారంలో కాంగ్రెస్ అధ్యక్ష ఉపాధ్యక్షులు నడిపిన అక్రమాల వివాదం రచ్చకెక్కింది! ‘సభ’లను జరగనీయకుండా నిరోధించడం ఎలాగ? అన్న సమస్యతో సతమతమైపోతుండిన కాంగ్రెస్ వారికి పార్లమెంటు సమావేశాలలో సంబంధం లేని ఈ వివాదం ‘తక్షణ ఆయుధం’గా మారింది! వస్తు సేవల సుంకాల-జిఎస్‌టి-బిల్లు మూల పడింది! తల్లీ తనయులు న్యాయస్థానంలో హాజరైనంత మాత్రాన దేశానికి జరిగిపోయే నష్టం ఏమిటి? పార్లమెంటు సమావేశాలకు మాత్రం నష్టం జరిగిపోయింది!
నేషనల్ హెరాల్డ్ నిధులను స్వాహా చేసిన వివాదం ఒకటి చాలదన్నట్టు ఢిల్లీ క్రీడల సంస్థలో జరిగిపోయిన అక్రమాల వివాదం ఢిల్లీ ముఖ్యమంత్రికి గుర్తువచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి మాత్రమే కాక ప్రధానమంత్రి కూడ పదవికి రాజీనామా చేయాలన్న కోర్కెలు పార్లమెంటు సమావేశాలను జరగనివ్వలేదు! అధికారపక్షం సభ్యుడైన కీర్తి ఆజాద్ సైతం కేంద్ర ఆర్థిక మంత్రిపై ‘దుమ్ము చల్లడం’, భారతీయ జనతాపార్టీనుండి తాత్కాలిక బహిష్కృతుడు కావడం పార్లమెంటు ‘సభ’లను స్తంభింపచేసిన ప్రక్రియకు పరాకాష్ఠ!