సంపాదకీయం

‘తవ్వకాల’ గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమిని లోతుగా తవ్విపారేస్తుండడం పర్యావరణానికి కన్నాలు పెడుతున్న ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘బాక్సైట్’ తవ్వకాలను ‘‘తాత్కాలికంగా ఆపివేయడం’’ అందువల్ల హర్షించదగిన పరిణామం. ‘అల్యూమినియం’’ ఉత్పత్తికి అవసరమైన ఈ ఖనిజాన్ని భారీగా తవ్వివేయడం వల్ల అటవీ ప్రాంతాలలో పర్యావరణ సమతుల్యం నష్టమైపోతోంది. బాక్సైట్ తవ్వకాలవల్ల మాత్రమే కాదు, ఇసుక తవ్వకాల వల్ల, బొగ్గు తవ్వకాల వల్ల, ఇనుపరజాన్ని కొల్లగొట్టడం వంటి అనేక తవ్వకాలు విచక్షణా రహితంగా జరగడం పర్యావరణం పాడుపడుతుండడానికి కారణం. అందువల్ల విచక్షణ యుతంగా మాత్రమే తవ్వకాలు సాగించాలన్నది పర్యావరణ పరిరక్షణ వౌలిక సూత్రం. విశాఖపట్టణం గిరిసీమలలోని తవ్వకాలు విచక్షణారహితంగా జరుగుతుండడం వనవాసీ ప్రజలను అక్కడి నుండి వెళ్లగొట్టడానికి దోహదం చేస్తోంది. బాక్సైట్ తవ్వకాల వల్ల ఇసుక పర్రలను కొల్లగొట్టడం వల్ల భూగర్భ జలాలు ఆవిరి అయిపోతుండడం గడచిన వైపరీత్యం. విశాఖ గిరిసీమల-ఏజెన్సీ-లో ఆంధ్రప్రదేశ్‌లోని బాక్సైట్ నిక్షేపాలలో, అత్యధికశాతం నెలకొని ఉండడం ఈ సీమకు గర్వకారణం. కానీ భూమి దారుణంగా గాయపడకుండా అంచెలంచెలుగా ఈ ఖనిజ నిక్షేపాలను తవ్వుకోవచ్చు. కానీ ప్రపంచీకరణ ఫలితంగా వ్యవస్థీకృతమైన ఉన్న పైశాచిక వాణిజ్య వాంఛ అక్రమ లాభాలకోసం విచక్షణా రహితంగా బాక్సైట్‌ను తవ్వడానికి దోహదపడింది. గిరిజనుల గగ్గోలునకు ఇదీ కారణం. బాక్సైట్ ఖనిజం బంకమట్టి శిల. ఫ్రాన్స్‌లోని ఒక గ్రామం ‘లే బాక్స్’ అనేచోట, మొదట ఈ మట్టి రాతిని కనుగొన్నారట. అందువల్ల బాక్సైట్ ఉష్ణతాపాన్ని నిరోధించగల అల్యూమినియం -సత్తు-లోహాన్ని ఈ శిలాజ ఖనిజం నుండి తయారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని డెబ్బయికోట్ల టన్నుల బాక్సైట్ ఖనిజంలో నలబయి ఎనిమిది కోట్ల టన్నులు విశాఖ, తూర్పుగోదావరి అటవీ ప్రాంతాలలోనే నిక్షిప్తమై ఉన్నాయట. అరకు లోయ ప్రాంతంలో ఇరవై నాలుగు కోట్ల టన్నులకు పైగా ఈ నిక్షేపాలు నెలకొని ఉన్నాయట. ఇలా వివిధ ప్రాంతాలకు విస్తరించకుండా పరిమిత ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్న ఖనిజాన్ని ఏకబిగిన తవ్వేయడం పరిసరాలకు హాని కలిగిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు, గిరిజనుల ప్రయోజనాలకు హాని కలిగించని రీతిలో తవ్వకాలు జరిపించడం ప్రభుత్వ విధివిధానం కావాలి. ఆవు పొదుగు నుండి పాలను పిండుకోవచ్చు. పొదుగును కోసుకొనిపోవడం ప్రపంచీకరణ వ్యవస్థలోని పారిశ్రామిక స్వభావమైంది. దేశంలోని కంపెనీలు చాలా ఉన్నట్టు విదేశీయ వాణిజ్య సంస్థలు కూడ విశాఖ ఏజెన్సీలోకి చొరబడిపోవడం పర్యావరణ కాలుష్య విస్తరణకు నేపథ్యం... బంకమట్టి వంటి బాక్సైట్ భూసార పరిరక్షణకు, భూగర్భ జలాల పరిరక్షణకు దోహదం చేస్తోంది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తరువు మేరకు విశాఖ ఏజెన్సీలో ఈ తవ్వకాలు ఆరంభమయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం, డిసెంబర్ 22న ఆ ప్రభుత్వపు ఉత్తర్వులను రద్దు చేసింది. అందువల్ల ఇంతవరకు తవ్వకాల గురించిన దేశీయ విదేశీయ సంస్థలు ఇక తవ్వలేవు...కానీ ప్రభుత్వం వారి తదుపరి చర్య ఏమిటన్నది స్పష్టం కావలసి ఉంది.
పాత ఉత్తరువు రద్దయిపోయింది కాబట్టి కొత్త ఉత్తరువు కోసం ఆంధ్రప్రదేశ్ తవ్వకాల అభివృద్ధి సంస్థ-ఏపీఎమ్‌డిసి- ఎదురుతెన్నులు చూస్తున్నదట. అందువల్ల విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల నిలిపివేత తాత్కాలికమేనన్న అభిప్రాయం కలుగుతోంది. అనేక సంస్థలు ఇదివరకే బాక్సైట్‌ను శుద్ధి చేయడానికి అల్యూమినియంను ఉత్పత్తి చేయడానికి వీలుగా పరిశ్రమలను నిర్మించి ఉన్నాయన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శాసనసభలో చెప్పిన మాట. ఈ సంస్థలు ఇదివరకే ఐదువేల రెండువందల కోట్ల రూపాయల మేర ఖర్చుపెట్టి ఉన్నాయట. తవ్వకాలు పూర్తిగా రద్దయిపోతే ఈ పారిశ్రామిక వేత్తలు నష్టపడిపోతారన్న ధ్వని చంద్రబాబు మాటలలో ప్రస్ఫుటించింది. 2007వ, 2008వ సంవత్సరాలలో జారీ అయిన ఉత్తరువులు రద్దయ్యాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వారు సైతం తవ్వకాలను అనుమతిస్తూ ఒక జీవో జారీ చేసి ఉన్నారట. ఈ ఉత్తర్వు రద్దయిందా? లేదా? అన్నది మాత్రం స్పష్టం కాలేదు. ఎట్టి పరిస్థితులలోను గిరిజనుల ప్రయోజనాలకు మాత్రం భంగం కలిగించబోమని మాత్రమే చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. మరుసటి రోజుననే తవ్వకాలను కొనసాగించే విషయంలో ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్టు ఎపిఎమ్‌డిసి అధ్యక్షుడు ప్రకటించడం అస్పష్టతకు మరో సంకేతం. బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయించడానికై ఉద్యమాన్ని నడిపిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వారు ఈ అంశం గురించి చర్చ జరిపినప్పుడు శాసనసభకు ముఖం చాటేయడం అంతుపట్టని రహస్యం.
మన రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాల ద్వారా మాత్రమే కాదు, వివిధ రకాల తవ్వకాలను, అనే్వషణలను, పరిశోధనలను, పరిశీలనలను చేస్తున్న పేరుతో బహుళ జాతీయ సంస్థలు అటవీ ప్రాంతాలలోకి, గిరిసీమలలోకి చొరబడి పోతుండడం నడుస్తున్న వైపరీత్యం. ప్రపంచీకరణ వ్యవస్థ బలపడుతున్న కొద్దీ వనవాసీ ప్రజలు ఆవాసాన్ని కోల్పోతున్నారు. అంతర్జాతీయ అనుసంధానం, విదేశీయ సంస్థల పెట్టుబడులు, ప్రత్యేక ఆర్థిక మండలాలు, వంటి కృత్రిమ ప్రగతి విధానాలు ప్రకృతిని గాయపరుస్తున్నాయి. నేలతల్లిని చిత్రవధకు గురిచేస్తున్నాయి. బాక్సైట్ తవ్వకాలు, ఇసుక పర్రలను తొలచివేయడాలు వంటివి ఈ కృత్రిమ ప్రగతి వ్యూహంలోని విభాగాలు మాత్రమే. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రమే కాక దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడ పర్యావరణ విచ్ఛేదకమైన ప్రపంచీకరణను వ్యవస్థీకరిస్తున్నాయి. ఈ మొత్తం విధానం రద్దు కానంతవరకు విడివిడి వైపరీత్యాలకు పరిష్కారం లభించడం కల్ల. అందువల్ల పర్యావరణానికి, హరిత శోభలకు, వ్యవసాయ సీమలకు, అడవులకు, హాని కలుగని రీతిలో పారిశ్రామిక ప్రగతి సాధించే మార్గాలను అనే్వషించడం ప్రభుత్వాల కర్తవ్యం. కేంద్ర ప్రభుత్వానిది ప్రధాన బాధ్యత!
ఖనిజాలను, ఇసుకను తవ్వడం గురించి తెలుగు రాష్ట్రాలలోను, ఇతర రాష్ట్రాలలోను గొప్ప గందరగోళం నెలకొని ఉంది. న్యాయస్థానాల తీర్పులు కూడ ఒకే వివాదంలో భిన్నబిన్నంగా ఉంటున్నాయి. తమిళనాడులోని సముద్ర తీర ప్రాంతంలో ఇసుక పర్రలను తవ్వడానికి జారీ అయిన ముప్పయి రెండు అనుమతులను గత ఏడాది కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇసుక పర్రల కింద నిక్షిప్తమైన అపురూప ఖనిజాలకోసం రెండు బహుళ జాతీయ సంస్థలు విచ్చలవిడి తవ్వకాలను కొనసాగించాయి. అందువల్ల కేంద్రం వాటి లైసెన్సులను రద్దు చేసింది. కానీ మద్రాసు హైకోర్టు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను రద్దు చేసింది. సంవత్సరం తరువాత అప్పీలు ప్రాతిపదికగా మద్రాసు హైకోర్టు ధర్మాసనం వారు కేంద్ర ప్రభుత్వపు ఉత్తరువులను ఆమోదించారు.. ఇది తవ్వకాల గందరగోళానికి ఒక ఉదాహరణ మాత్రమే. దేశమంతటికీ వర్తించే ఒకే పద్ధతి ఎప్పుడు రూపొందుతుందో?