మెయన్ ఫీచర్

ఎల్లనాడుల అమ్మనుడుల పండుగ.. తెలుగువారి కర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాకవి కాళిదాసు కావ్యరచనకు ముందుగా- ‘వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ’ అంటూ ప్రార్థన చేస్తాడు. వాక్కు, దాని అర్థమూ కలిసి ఉన్నట్లే విడదీయలేనంతగా కలిసివున్న పార్వతీ పరమేశ్వరులను తాను ప్రార్థిస్తున్నానని దాని భావార్థం. భాష, సంస్కృతి కూడా అలాంటివే. భాషకు, సంస్కృతికి ఉన్న పరస్పరానుబంధం అటువంటిది. ఇప్పుడు తెలుగు భాషాసంస్కృతులను రక్షించడానికే తాము కృషి చేస్తున్నామని నిరంతరం ప్రకటించే మన మంత్రులు, అధికారులూ ఇప్పుడు తెలిసో, తెలియకో చేస్తున్నదంతా భాషా సంస్కృతులను విడదీయడానికీ, చివరకు రెండింటి విధ్వంసానికీ దారితీస్తుంది.
కూచిపూడి నృత్యప్రదర్శనల సందర్భంగానో, మరొక సాంస్కృతిక ఉత్సవ సందర్భంలోనో మన రాజకీయ నేతలు తాము తెలుగు భాషోద్ధరణ కోసమే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామంటారు. ప్రతి సందర్భంలో చూడండి. దేవతల, దేవుళ్ల ఊరేగింపులోనైనా, పుష్కరాల సందర్భమైనా, యజ్ఞయాగాదుల సందర్భమైనా- అది ఎటువంటి కళల, మతాల, సామాజిక ఆచారాల సందర్భమైనా ఇదే విధమైన ప్రసంగాలు చేస్తారు. ఇటువంటి కార్యక్రమాలకు, తెలుగు భాషోద్ధరణకు సంబంధమేమిటో బోధపడదు.
ఇది ఇలా ఉండగా,కవులు, రచయితలు తెలుగులో ఇంకా ఉన్నారు. మరికొన్ని ఏళ్లపాటు ఉంటారు. కాని వారి రచనల్ని చదివేవారు తరిగిపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన విద్యావిధానంతో త్వరలోనే.. అతి త్వరలోనే తెలుగునేల మీద చదువరులకే కాదు, రచయితలకు కూడా కఱవుప్రబలిపోతుంది. ఈ సంగతి స్పష్టంగా గోచరమవుతున్నా, పుస్తకాల ఆవిష్కరణల కోసం సభలకు విచ్చేసే మన నేతలు గొప్పగొప్ప ఉపన్యాసాలిస్తుంటారు. తెలుగు తియ్యదనాన్ని గురించి, మన ప్రాచీన, ప్రస్తుత కవుల గురించీ ప్రస్తుతిస్తారు. బాధంతా ఏమిటంటే ఆ తియ్యటి తేనెను గ్రోలేవారు నానాటికీ తరిగిపోతున్నారు.
తెలుగు భాషోద్యమ సమాఖ్య వంటి సంస్థల పుణ్యమా అని, ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు- తెలుగురాష్ట్రాల్లోని తెలుగువారి సంఖ్యకు సమానంగా ఉన్నారని గత పద్నాలుగు ఏళ్లుగా బాగా ప్రచారమైపోయింది. తెలుగువాణి వంటి సంస్థలు- తమిళనాడులో బయట తమిళమే మాట్లాడుతున్నా, ఇంట్లోనూ బంధువులతోనూ తెలుగే మాట్లాడుకుంటూ బ్రతుకుతున్న తెలుగు కుటుంబాల్లోంచి ముందుకువచ్చిన కొద్దివేలమందికి తెలుగు అక్షరాలను నేర్పడంతో వారిలోంచి వచన కవులూ, కథారచయితలూ పుట్టుకొచ్చి, కథా సంపుటాల్నే తెలుగులో తెస్తున్నారు. వాటికి చదువరులు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోంచే రావాలి. ఆ రచయితల గురించి గొప్పగా మాట్లాడి, సభలుపెట్టి సత్కరించేవారు చేతివేళ్ల మీద లెక్కించదగినంత మందే. వారికి తెలుగు ప్రజల్లోంచి సరైన స్పందన రాదు, వారిని చూసైనా నేర్చుకొందామన్న స్పృహే ఉండదు. మన రాజకీయరంగ ప్రముఖులు కొందరు వీరి కృషిని తమ ప్రచారానికి వాడుకొంటారు! కాని, అదంతా తెలుగు అక్షరాలను వారికి నేర్పడం వల్లే వచ్చిందని వారికి తోచదు. తెలిపినా పట్టించుకోరు. వాళ్లు తలచుకొంటే అక్కడ పనిచేసే సంస్థలకు తగిన సహకారమందించవచ్చు. వారలా చెయ్యరు! ఒక ఏడాది క్రితం తెలుగుదేశం పార్టీ జాతీయపార్టీగా ఆవిర్భవించాలనే ప్రయత్నాన్ని చేసినపుడు తమిళనాడులో, కర్నాటకలో కొన్ని శాసనసభా స్థానాలను గెలుచుకోవాలనే ఆశతో ప్రకటనలు చేసింది గాని, అది తమ స్వార్థ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని భయపడి తోక ముడిచింది. బయటి రాష్ట్రాలలోని తెలుగువారిలో తెలుగును కాపాడినంతవరకే వారు మనతో సోదర సంబంధాన్ని పెట్టుకొంటారన్న ఇంగితజ్ఞానం లేకపోయింది.
వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఒకసారి నాటి కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ హైదరాబాద్‌కు విచ్చేశారు. ఆయన వ్రాసిన ‘్భష-సంస్కృతి- సమాజం’ అనే కన్నడ పుస్తకాన్ని ద్రావిడ విశ్వవిద్యాలయం వాళ్లు తెలుగు చేసి ముద్రించారు. అనువాదంలో, ముద్రణలో ఉన్న అజ్ఞాన సంపద గురించీ, ముద్రారాక్షసాల గురించీ పట్టించుకోకుండా ఉంటే ఆ రచనలోని అంశాలు అందరూ చదివి తెలుసుకోదగ్గవే. ముఖ్యంగా మన రాజకీయ నేతలు చదివి తెలుసుకోవలసినవి. వీరప్ప మొయిలీ పర్యటన సందర్భంగ ఒక సభను జరిపి, ఆ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అప్పుడు వీరప్ప మొయిలీ చేసిన- ఎప్పటికీ మరచిపోరాని ప్రసంగంలో- ఆంధ్రప్రదేశ్ పాలకులకు భాషా సాంస్కృతిక స్పృహ లేదని ఎటువంటి మొఖమాటం లేకుండా అన్నారు. దాన్ని వింటూ యధాలాపంగా చిరునవ్వుతోనే సరిపెట్టారు మన ముఖ్యమంత్రి. మొయిలీ అన్నదాంట్లో తప్పేం ఉంది లెండి!
తెలుగువాళ్ల దురదృష్టం అదే. మా తెలుగువాళ్లమంతా ఒక రాష్ట్రంలోనే ఉండాలంటూ చుట్టుపక్కల ఇతర భాషీయులతో కలిసివున్న కోట్లాదిమంది తెలుగు సోదరులను విడిచి, హడావిడిగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న మన స్వార్థ రాజకీయనేతలు- నాటికీ నేటికీ తెలుగుభాషను పట్టించుకొంటున్నారా? చెప్పండి. అసలు ఆ కారణం చేతనే- ఆ స్వార్థ రాజకీయాల వల్లనే- తెలుగుభాషను అలక్ష్యం చేసి, రాజకీయ స్వార్థమే సర్వస్వంగా 60 ఏళ్ల పాలన చేయడం వల్లనే- రెండు రాష్ట్రాలుగా చీలిపోవడానికి దారి ఏర్పడింది.
ఇప్పుడైనా అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రాలో తమ భాషను కాపాడుకొనే చర్యలు తీసుకొంటున్నారా అంటే- దానికి పూర్తి భిన్నంగానే సమాధానం వస్తుంది. ఆ నేతల్ని కదిలించినా, లేకపోయినా తమ భాషాసంస్కృతులను కాపాడుతున్నామంటారు. తెలంగాణ నేత కెసిఆర్ తెలంగాణ సంస్కృతి అంటుంటే, చంద్రబాబు ఆంధ్రా సంస్కృతి అనో అమరావతి సంస్కృతి అనో అంటుంటారు. కాని ఇద్దరూ తమ తమ రాష్ట్రాల్లో విద్యారంగంలో తెలుగు బోధనను కూకటి వ్రేళ్లతో తవ్వేస్తున్నారు.
వారి దృష్టిలో- అందరూ తెలుగులోనే మాట్లాడుతున్నారు కనుక తెలుగుకు ఏమీ కాదు! ఈ రెండు ప్రాంతాల్లో కళలు, హిందూ మతాచారాలు, పీఠాలు, పుష్కరాలు ఉన్నంత వరకూ తెలుగు సంస్కృతికి ఏమీ ఢోకా ఉండదు. అందుకే ఇద్దరు ముఖ్యమంత్రులూ వాటికే ప్రాధాన్యత ఇస్తారు. తమ ప్రాంతాల గొప్పదనాన్ని తెలుపడానికి వేరే గుర్తింపు ఏమీ లేదు గనుక తెలంగాణ అనో, ఆంధ్రా అనో తీరాల్సిందే. కాని, ఇవే పరిస్థితులు కొనసాగితే తెలంగాణ తెలుగు గాని, ఆంధ్రా తెలుగు గాని- ఏ తెలుగునూ రాయలేని, చదవలేని తెలుగుజాతి నిర్మాణం అవుతుంది.
యునెస్కో వారు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి ఏటా ఫిబ్రవరి 21నాడు జరపండి అని ప్రతి ఏటా దానికి ముందుగా ఒక సందేశం ఇస్తుంటారు. జీవ వైవిధ్యం ఉండాలంటే భాషా వైవిధ్యాన్ని కాపాడుకోవాలని, ప్రపంచంలో ఆరువేలకు పైగా ఉన్న మాతృభాషల్ని కాపాడుకోవాలని పదే పదే ఉద్ఘోషిస్తుంటారు. అది మన నేతల చెవిన పడదు. కాదు, పట్టించుకోరు. వీళ్ల దృష్టిలో తెలుగును ఎంతో కొం త మాట్లాడుకోగలిగితే చాలు. తెలుగు సినిమాలు, టీవీ సీరియళ్లు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నంత కాలం తెలుగుకేమీ కాదు. ఆ తెలుగు ఎన్ని మార్పులకు, క్షోభలకు గురి అయినా ఏమీ కాదు. అయినా వీటిని తెలుగు రాష్ట్రాలనే అంటారు. ఇక్కడ చదువుకొని, తెలుగు అక్షరం ముక్క రాకపోయినా, విదేశాల్లో ఉన్నా స్వదేశంలో ఉన్నా మనవాళ్లు తెలుగువాళ్లే కదా!
ఈ పరిస్థితికి పరిష్కారం ఏమిటో మనం ఆలోచించాలి. పరిష్కారమంతా ఒకే ఒక సూత్రంలో ఉంది. 2010లో కేంద్రం ఆమోదించిన విద్యాహక్కు చట్టంలోనే ఉంది. ఎలిమెంటరీ విద్య (అంటే వాళ్ల లెక్క 8వ తరగతి అని)లో బాలబాలికలకు వారి మాతృభాషా మాధ్యమంలోనే చదువును నేర్పాలి. ఇంగ్లీషును గాని, మరొక భాషను గాని- ఒక భాషగా చదువుకోవడం తప్పుకాదు. దాన్ని కూడా తన స్వంత భాషామాధ్యమంలోనే నేర్పాలి. కొత్తగా బడిలో చేర్చిన పిల్లలకు వారి భాషలో విజ్ఞానాన్ని అందించాలి గాని, తెలియని భాషలో తెలియని జ్ఞానాన్ని అందించడం అవివేకం, అశాస్ర్తియం. కనుక మన రాష్ట్రాల్లోనూ, భారతదేశం అంతటా కనీసం 5వ తరగతి- ప్రాథమిక విద్యవరకైనా మాతృభాషా మాధ్యమంలోనే చదువు చెప్పాలి. ఈ సూత్రాన్ని మన భారత రాజ్యాంగం కూడా 350 (ఎ) అధికరణంలో చెప్తోంది. యునెస్కో చెబుతోంది. ప్రాథమిక విద్యను విద్యార్థి మాతృభాషలోనే నేర్పుతూ ఇతర భాషలను కేవలం భాషలు గానే నేర్పాలి. ఆరవ తరగతి నుంచీ విద్యార్థి కోరిన మాధ్యమంలో స్కూలు విద్యను కొనసాగించాలి. ఇంగ్లీషు మాధ్యమాన్ని విద్యార్థి ఎంచుకొంటే తెలుగును మాత్రం ఒక భాషగా తప్పినిసరిగా కొనసాగించాలి. కాలేజీ చదవులో గాని, వృత్తివిద్యలు, సాంకేతిక విద్యల్లోనూ తెలుగును ఒక సబ్జెక్టుగా కొనసాగించాలి. ఇదే విద్యారంగంలో తెలుగును రక్షించుకోవడానికి మార్గం. విద్యారంగంలో తెలుగును రక్షించుకోకుండా ఎన్ని ఇతర వృథా ప్రసంగాలు చేసినా వాటిని మనం త్రోసిపుచ్చాలి. అభివృద్ధి చెందిన దేశాలన్నీ స్వంత భాషలోనే అనంత విజ్ఞానాన్ని నిరంతరం పొందుతూ ఉంటే మనకు మాత్రం ఈ బానిస బుద్ధి ఎందుకు?
తెలుగు గొప్ప భాషల్లో ఒకటి. అన్ని రంగాల్లో తెలుగును వినియోగిస్తూ- దాన్ని అత్యంత నవీనంగా ఎప్పటికప్పుడు రూపొందించుకోవాలి. ఈ కృషి నిరంతరం సాగాలి. ఇందుకోసం ఉద్యమాలు సాగాలి. ప్రాథమిక విద్యలో మాతృభాషా బోధనను కాపాడుకోవడానికి వెంటనే ప్రజలు ఉద్యమించాలి. మన రాజకీయ నేతల భాషాద్రోహాన్ని క్షమించకూడదు. ఉద్యమించడమే, పోరాడడమే మనలను ఒక భాషాజాతిగా రక్షించుకోగల మార్గం.
చివరగా- రెండు నిజాల్ని మళ్లీ చెప్పుకొందాం.
- తెలుగుకు తెగులు పట్టించిందీ, పట్టిస్తున్నదీ మన పాలకులే.
- ఆ తెగులును వదిలించడానికి ప్రజోద్యమాలే శరణ్యం.
ఇదీ- ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భాన- ‘ఎల్లనాడుల అమ్మనుడుల పండుగ నాడు’ మన తీర్మానం.

- సామల రమేష్‌బాబు తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు