సంపాదకీయం

వైద్య వాణిజ్యం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది బహుశా పరాకాష్ఠ! ‘ప్రపంచీకరణ’వల్ల పెరిగిన అక్రమ ఆర్థిక ప్రాధాన్యం వైద్యరంగాన్ని వాణిజ్య రంగంగా మార్చడం మొదటిదశ... వాణిజ్య వైద్యం జనాన్ని వంచనకు గురి చేస్తుండడం రెండవ దశ! ప్రభుత్వాలు సైతం వంచనకు గురి అవుతున్నాయి! వ్యాధిగ్రస్తులను వాణిజ్య-కార్పొరేట్-వైద్యశాలల యాజమాన్యాలు దోచుకొనడం పాత కథ. వ్యాధిగ్రస్తులు, వాణిజ్య వైద్య శాలల యాజమాన్యాలు కలసికట్టుగా ప్రభుత్వాలను, ప్రభుత్వేతర రంగంలోని ఉద్యోగ ప్రదాతలను వంచించడం నడుస్తున్న కథ! ఎందుకంటే వ్యాధులను నయం చేసుకొనడానికై వాణిజ్య వైద్యశాలలకు విచ్చేసి స్వస్థత పొందుతున్న వారిలో అధికాధికులకు దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలోను ప్రభుత్వాల సహాయం అందుతోంది! అందువల్ల వైద్య సేవల ఖర్చు ఎంత పెరిగినప్పటికీ ప్రభుత్వ సహాయం పొందుతున్న వారికి ‘చీమ’ కుట్టదు... ప్రభుత్వం చెల్లిస్తుంది కనుక! అంటే ప్రజల సమష్టి ధనాన్ని, రుగ్మతకు గురి అయిన కొందరు ప్రజల మాధ్యమంగా వైద్యశాలల యాజమాన్యాలు దోచుకునే ప్రక్రియ పేరు ‘ప్రపంచీకరణ’! అంతర్జాతీయ స్థాయి వైద్యం పేరుతో అంతర్జాతీయ స్థాయి దోపిడీ జరిగిపోతుండడం ‘ప్రపంచీకరణ’లో భాగం! చిన్న పట్టణాలలో ‘కంటిపొర’ను తొలగించడానికి-క్యాటరాక్ట్ ఆపరేషన్- వెయ్యి రూపాయలో పదిహేను వందల రూపాయలో ప్రభుత్వేతర వైద్యులు తీసుకోవచ్చు! కానీ విశ్రాంత ప్రభుత్వోద్యోగులను చిన్న పట్టణాలనుంచి చెన్నయికో బెంగుళూరుకో భాగ్యనగరికో, ‘విశాఖ’కో బృందాలుగా తరలించుకొని వెళ్లి ‘కంటిపొర’ శస్త్ర చికిత్సను చేయించగల ‘సేవా’ బృందాలు ఏర్పడి ఉన్నాయట! ఈ ‘సేవా’ బృందాలవారు నిజానికి ఏదో ఒక ‘కార్పొరేట్’ వైద్యశాలకు ప్రతినిధులు... ప్రతినిధులన్నది వంచనలో భాగం... నిజానికి ఈ సేవా బృందాలు దళారీ ముఠాలు! ఒక్కొక్క విశ్రాంత ఉద్యోగికి అనేక వేల రూపాయల చొప్పున-వీలున్నచోట ఇంకా ఎక్కువ మొత్తం-ప్రభుత్వాలనుంచి వైద్య శుల్కం వసూలు చేసుకోవడానికి ఈ దళారీ బృందాలు పని చేస్తున్నాయి. విశ్రాంత ఉద్యోగులను వరిష్ట పౌరులను ఈ బృందాలవారు పట్టణాలనుంచి నగరాలకు తీసుకుని వచ్చి ‘కంటిపొర’ను తొలగించి పంపిస్తారు! ఈ బృందాలు తమకు గొప్ప సేవ చేసినట్టు వయో వృద్ధ మాజీ ప్రభుత్వోద్యోగులు మురిసిపోతారు. ఎందుకంటే ఇంటినుండి బయలుదేరి వెళ్లినప్పటినుంచి మళ్లీ ఇల్లు చేరేవరకు ప్రయాస లేకుండా ఈ ‘దళారీ’ బృందంవారు తమకు వ్యవస్థ చేశారని వయోవృద్ధులు అనుభూతి చెందుతారు! తాము ‘ఖర్చు’ను తిరిగి రాబట్టుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు కనుక వృద్ధులు సంతోషిస్తారు! ప్రభుత్వ కార్యాలయాల్లోని పని చేసిపెట్టేవారు సైతం ‘వృద్ధులు’ వెడితే పలకరు! ‘దళారీ’ బృందంవారు ఇరవై ముప్పయి మంది వృద్ధుల ప్రతినిధులుగా వెడితే ప్రభుత్వ కార్యాలయాలవారు కూడ ‘తక్షణ కర్తవ్యం’ నిర్వహించి తీరుతారు! దళారీ బృందం వారికీ ఈ ప్రభుత్వ కార్యాలయాల వారికి మధ్య ‘ఇచ్చి పుచ్చుకునే వ్యవస్థ’ చక్కగా ఏర్పడి ఉందట! ఇది ఒక ఉదాహరణ మాత్రమే... ‘స్థాలీపులాక న్యాయం’ వలె... ఇదంతా ప్రపంచీకరణలో భాగం! అంతర్జాతీయ స్థాయి వైద్యం...!!
హృదయ కోశ శ్వాసకోశ వ్యాధులకు చికిత్స చేస్తున్న వాణిజ్య వైద్యశాలలవారు ‘డిస్పోజబుల్’ పరికరాలను మళ్లీ వాడుతున్నారని జరుగుతున్న ప్రచారానికి ఇది ఒక నేపథ్యం మాత్రమే! ఉపయోగించిన తరువాత చెత్తలో పారేయవలసిన -డిస్పోజబుల్-ఉపకరణాల-ఇన్‌స్ట్రుమెంట్స్‌ను అధిక శాతం వైద్యులు రెండవసారి, మూడవసరి వాడడం బహిరంగ రహస్యం! నైతిక నిష్ఠ కలిగిన వైద్యులు పని చేయకపోవచ్చు గాక! కానీ చికిత్సలో భాగంగా వాడుతున్న తాత్కాలిక ‘పరికరాల’-ఇన్‌గ్రెడియన్స్‌ట్స్‌ను సైతం ప్రభుత్వేతర వైద్యశాలలో మళ్లీ మళ్లీ వాడుతున్నారట! ఒక వ్యాధిగ్రస్తుని చికిత్సకు ఉపయోగించిన ఈ పరికరాలను పారేయకుండా ‘శుద్ధి’చేసి మళ్లీ మరో వ్యాధిగ్రస్తుని చికిత్సకు ఉపయోగించడం వాణిజ్య వైద్యశాలల వారి అనైతిక ప్రవర్తనకు కారణం! ఇలా వాడడం వల్ల శస్త్ర చికిత్స తరువాత స్వస్థత పొందుతున్న వారికి సరికొత్త రోగాలు సంక్రమించే ప్రమాదం ఉందట! ఇలా వదిలించుకోవలసిన పరికరాలను మళ్లీ వాడడంవల్ల ‘ప్రతి శస్త్ర చికిత్స’కు సగటున ఇరవైనుంచి ముప్పయి వేల రూపాయల వరకు వాణిజ్య వైద్యశాలలవారు అక్రమ లాభం పొందుతున్నారట! అత్యాశకు అవధి లేదు!
హృదయకోశ, శ్వాసకోశ చికిత్సలకోసం ఉపకరణాలను, పరికరాలను నిర్ణీత ధరలకంటె మించిన రీతిలో అమ్మరాదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్దేశించడం వాణిజ్య వైద్యుల దోపిడీని అరికట్టడానికి కొంతమేరకు దోహదం చేయవచ్చు! ఉత్పాదక సంస్థలనుంచి, విక్రేతలనుంచి కొనుగోలు చేసిన ధరలకు మాత్రమే చికిత్సార్థులకు ఈ పరికరాలను ఉపకరణాలను అందించాలని ప్రభుత్వం వైద్యశాలలను ఆదేశించింది! వైద్య సేవలు అందించినందుకు చికిత్సార్థులనుంచి భారీగాను అనేక సందర్భాలలో భయంకరంగాను శుల్కాలను వసూలు చేసుకుంటున్న వాణిజ్య వైద్య సంస్థలవారు పరికరాలను, ఉపకరణాలను మాత్రం తమకు సరఫరా అయిన ధరలకే చికిత్సార్థులకు సరఫరా చేయడం సహజ న్యాయసూత్రాలకు అనుగుణం! ఎందు వైద్యం చేసినందుకు మాత్రమే వైద్యులు శుల్కం పొందడం అనాది సంప్రదాయం. వైద్యుడు మందులను విక్రయించే వ్యాపారి కాదు, వైద్యశాల మందులనమ్మే దుకాణం కాదు! కానీ ‘ప్రపంచీకరణ’ సృష్టించిన భయంకర వికృత పరిణామాలలో వైద్యశాలలు మందులనమ్మే దుకాణాలయిపోయాయి. ప్రతి ‘కార్పొరేట్’ హాస్పిటల్‌కు అనుబంధంగా ప్రాంగణంలోనే అదే సంస్థవారి మందులమ్మే దుకాణాలు వెలిసాయి. ఉత్పాదక సంస్థలనుంచి కొన్న మందులను ఈ దుకాణాలు ఇరవై ఆరు నుంచి నలబయి తొమ్మిది శాతం లాభాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. ఇలా తమ ప్రాంగణంలోని తమ దుకాణాలలో కొన్న పరికరాలను, ఉపకరణాలను మళ్లీ ధర పెంచి అమ్మడంద్వారా వాణిజ్య వైద్య సంస్థలు చేసిన దోపిడీ అక్రమాలకు పరాకాష్ఠ! ఇన్నాళ్లుగా ఈ దోపిడీని సాగనివ్వడం ప్రభుత్వాల వైఫల్యం! ఇటీవల ఈ పరికరాల గరిష్ఠ ధరలను నిర్ధారించిన ‘జాతీయ ఔషధ మూల్య నిర్ధారక సంస్థ’- ‘నేషనల్ ఫార్మాసుటికల్ ప్రైసింగ్ అథారిటీ’- ఎన్‌పిపిఏ వారు ఇలా ‘వైద్య శాలలు’ మందులమ్మే దుకాణాలు కాదని నిర్ధారించడం అసలు ‘రోగా’నికి జరుగుతున్న చికిత్సలో భాగం...
వైద్యులు, మందులను ఉత్పత్తి చేసే సంస్థలతో ‘కుమ్మక్కయి’ చికిత్సార్థులను, వినియోగదారులను దోచుకొనడం ‘ప్రపంచీకరణ’ వ్యవస్థలోని మరో అంశం! బహుళ జాతీయ వాణిజ్య సంస్థల వద్ద భారీగా ‘గతుకుతున్న’ వైద్యులు కొందరు- అందరూ కాదు- నాసిరకం మందులను చికిత్సార్థుల చేత భారీ ధరలకు కొనిపిస్తున్నారు. వివిధ స్వదేశీ సంస్థల ‘శిశు ఆహారం’- పాలపొడి-కంటే రెట్టింపునకు పైగా ధరలకు ‘నెస్లే’ వంటి విదేశీయ సంస్థలు తమ ‘శిశు ఆహారం’- పాలపొడి అమ్ముతున్నాయి. వైద్యులు విదేశీయ శిశు ఆహారాలను కొనమని తల్లిదండ్రులకు సలహాలిస్తున్నారు! డాక్టర్లకు ఔషధ సంస్థలు వెయ్యి రూపాయలకు మించిన బహుమతులు ఇవ్వరాదని కూడ కేంద్ర ప్రభుత్వం నిర్ధారించడం ముదావహం...