ఎడిట్ పేజీ

‘ఆరోగ్య పరిరక్షణ’ సాకారం ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్య భారతాన్ని ఆవిష్కరిస్తున్నామని చెబుతూ సమున్నత లక్ష్యాల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో జాతీయ వైద్య విధానాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా మేలైన వైద్యసేవలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాలనే ధ్యేయంతో ఈ విధానానికి కేంద్రం రూపకల్పన చేసినట్టు సంబంధిత మంత్రి చెప్పుకొచ్చారు. ‘దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించడంతోపాటు మందులను అందుబాటులో ఉంచడం ఈ పథకం ఉద్దేశాల్లో ఒకటి’ అని కూడా మంత్రి స్పష్టం చేశారు. విధాన ప్రకటనలో ఇతర అంశాలతోపాటు రోగుల సాధికారత, ప్రసూతి మరణాల రేటు తగ్గింపు, నవజాత శిశు మరణాల రేటు తగ్గింపు, ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అనేక అంశాలున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ.. అసలు ఏ మేరకు ఆరోగ్య సేవలు వివిధ రాష్ట్రాలలో అందుబాటులో ఉన్నాయనే అంశంపై స్పష్టత లేదనే అనాలి. క్రమేపీ విస్తరిస్తున్న ఆరోగ్య, వైద్య అవసరాలకు అనుగుణంగా, అటు కేంద్ర ప్రభుత్వం కాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కాని అంచెలంచెలుగా అందుతున్న వైద్య సేవల్లో కాలానుగుణంగా మార్పులకు ఎంతవరకు శ్రీకారం చుడతాయన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ సహా దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా వైద్య, ఆరోగ్య సేవలను మరింత పటిష్టపరుచుకోవడం ప్రభుత్వ వ్యవస్థను పరిపుష్టం చేయడం, తద్వారా కావాల్సినంత మేరకు వైద్య, ఆరోగ్య సేవలను వినియోగించాలి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యరంగాలను విలీనం చేసి ఒక సమగ్ర వైద్య విధానం రూపకల్పన చేసి పకడ్బందీగా అమలు చేయడం ఎంతైనా అవసరం. భవిష్యత్తులో సాంకేతికత ఆధారంగా వైద్య సేవలను ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు తగ్గ ప్రణాళికలను తక్షణం సిద్ధం చేసుకోవలసిన ఆవశ్యకత కూడా ఉంది.
ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చూసినట్టయితే స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు పెద్దఎత్తున ప్రైవేటు రంగంలోనే అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య సేవలను మాత్రమే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు అందిస్తున్నాయి. మన దేశంలో మరో ముఖ్యమైన సమస్య- రోగ నిర్ధారణ సేవలకయ్యే అసాధారణ వ్యయం. అటు సామాన్యులకు, ఇటు మధ్యతరగతి వారికి కేవలం ప్రైవేటు సంస్థలు మాత్రమే ఈ సేవలను అందించడం జరుగుతుంది. అదీ అతి ఎక్కువ ధరలతో. ఉదాహరణకి పిఏటి పరీక్ష (పోసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ) స్కానింగ్‌కు 20 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఎంఆర్‌ఐ (మాగ్నటిక్ రిసొనెన్స్ ఇమేజింగ్) పరీక్షకు పదివేల రూపాయల వరకూ వెచ్చించాల్సి వస్తుంది. రోగ నిర్థారణకు ముందుగా ఇలాంటి ఎన్నో రకాల పరీక్షలు విధిగా అవసరం అవుతాయి. వీటిని తక్కువ ఖర్చుతో ప్రభుత్వ వైద్యశాలలే అందించే పరిస్థితి రావాలి. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా కొంత పురోగమించింది. అలాగే, ప్రభుత్వ ఆధ్వర్యంలో పాలిక్లినిక్‌లు ఏర్పాటై ప్రైవేటు క్లినిక్‌ల సహాయంతో తక్కువ ఖర్చులో వైద్య పరీక్షలకు వెసులబాటు కల్పించాలి. ఇందుకు ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో పాటించే విభిన్న పద్ధతులను అధ్యయనం చేసి తదనుగుణంగా మార్పులకు ఉపక్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించినట్టయితే రాష్ట్రాన్ని మోడల్‌గా తీసుకుని అటు నగర వాసులకు, ఇటు గ్రామీణ వాసులకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి అవకాశం ఉంది.
ఆరోగ్య పరిరక్షణ పద్ధతుల సమగ్ర వినియోగం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించుకోవచ్చు. 75-80 లక్షల వరకూ జనాభా కలిగిన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలను ఒక జోన్‌గాను, 40 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు రెండవ జోన్‌గా, 60 లక్షల జనాభాకు మరొక జోన్‌గాను, 900 గ్రామాలు కలిపి 27 లక్షల ప్రజలతో ఇంకొక జోన్‌గా పరిగణించవచ్చు. వీటిలో ప్రాథమిక, మాధ్యమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నవి కలుపుకుంటే 47 శాతం ప్రజలకు వైద్యసేవలు చేరువ అవుతాయి. మరో జోన్‌గా 8,100 గ్రామాలను తీసుకుంటే 186 లక్షల ప్రజలు అవుతారు. ఈ జోన్‌లోని 53 శాతం ప్రజలు ప్రస్తుతం గుర్తింపు పొందని ఆర్‌ఎంపి వైద్యులపై, ఎఎన్‌ఎమ్‌ల మీద ఆధారపడి ఉన్నారు.
ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ ఏపీ రంగారావు అంచనాల ప్రకారం ప్రస్తుతం మొదటి జోన్‌లో 2400 స్పెషలిస్టులు, 640 సూపర్ స్పెషలిస్టులు ప్రభుత్వ-ప్రైవేటు రంగాల్లో సేవలందిస్తున్నారు. వీరితోపాటుగా ఎంబిబిఎస్ చదివిని వైద్యులు ఇందులో అదనపు భాగస్వామలుగా వున్నారు. రెండవ జోన్‌లో ప్రజలకు ప్రథమ స్థాయి, ద్వితీయ స్థాయి కేంద్రాలు మాత్రమే చేరువలో ఉన్నాయి. వారికి వారి అవసరాలను బట్టి 780 స్పెషలిస్టులు, 125 సూపర్ స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. జనాభాలో 7.6 శాతం ప్రజలు (దాదాపు 27 లక్షల మంది) గ్రామాల్లో ఉన్నారు. వారికి 683 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. కానీ నిరంతర వైద్య సేవలు మాత్రం మృగ్యంగా ఉన్నాయని ఆయన అంటున్నారు. మిగిలిన ప్రజలకు (రమారమి 1.86 శాతం మందికి అంటే.. ఇంచుమించుగా 53 శాతం మంది ప్రజలకు) 8100 గ్రామాల్లో అనుభవం కలిగిన వైద్యులు తత్సంబంధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొన్ని మైళ్ల దూరంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీరిలో 57 లక్షల ప్రజలకి 5 నుండి 10 కిలోమీటర్ల దూరం వెళ్లవలసిన పరిస్థితి ఉండగా, 92 లక్షల మందికి 10 కిలోమీటర్ల పైనే ప్రయాణించాల్సి ఉంది. నిజానికి ఈ 1.86 కోట్లమంది ప్రజల స్థానికంగా గుర్తింపు పొందని, దీర్ఘకాలంగా వైద్యం అందిస్తున్న వారివద్దనో, అలోపతి వైద్య సేవలు అందించే ఇతరుల సేవలనో వినియోగించుకోవడం జరుగుతున్నది.
హైదరాబాద్ నగరంలోని రమారమి 80 లక్షల ప్రజల్లో 25-30 లక్షల మంది గుర్తింపు పొందిన మురికి వాడల్లో నివసిస్తున్నారు. మెహల్లా క్లినిక్‌ల పేరుతో వీరికి వైద్య సేవలు అందించవచ్చు. ఇలా వైద్య సేవలు అందించడానికి హైదరాబాద్‌లో సుమారు 5,000 దాకా క్లినిక్కులు కావాల్సి ఉంది. ఇక్కడ పని చేయడానికి 1750 మంది డాక్టర్ల అవసరం ఉంటుంది. ఇందుకోసం హౌస్ సర్జన్ల సేవలను ఉపయోగించుకోవచ్చు. ఏటా దాదాపు 2,500 మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ,ప్రైవేటు వైద్య కళాశాలల్లో చేరుతుంటారు. వీరిలో 2/3 శాతం మంది ఉత్తీర్ణత పొందిన వారు ఉంటుండగా, మొహల్లా క్లినిక్‌లో పనిచేయడానికి 1650 మంది దాకా అందుబాటులో ఉంటారు. వీరి వృత్తి సాధారణ వైద్యం అందించడం, ప్రాథమిక చికిత్స చేయడం, స్క్రీనింగ్ వంటివి ఏర్పాటు కావించడం.. ఇలా పరిమితంగానే ఉంటుంది. వీరి సేవలు ఉపయోగించుకుంటే సుమారు 30 లక్షల మందికి వైద్యం చేరువ చేసినట్టవుతుందని అన్నారు
ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో 110 దాకా అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి సరిపోతున్నా ఈ సంఖ్యను అదనంగా మరో 150 అర్బన్ హెల్త్ సెంటర్లుగా పెంచుకున్నట్టయితే అందులో అనుభవజ్ఞుడైన వైద్యులు అందుబాటులోకి వచ్చినట్టు అవుతుంది. తద్వారా తొలి దశ వైద్య సేవలు, సలహాలు అందించినట్టుగా అవుతుంది. ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్‌కు 30-35 క్లినిక్‌లు అనుసంధానం చేస్తే సమస్య తీరుతుంది. వీటిలో పిజి మెడికల్ విద్యార్థుల సేవలుప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నుండి రొటేషన్ పద్ధతిలో అనుసంధానిస్తే ద్వితీయ స్థాయి వైద్య సేవలు చేరువ చేసినట్టు కూడా అవుతుంది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పిజి కళాశాలల నుండి వీరిని వినియోగించుకుంటే దాదాపు 850 మందికి పైగా పిజి విద్యార్థుల సేవలు వినియోగించున్నట్టు అవుతుంది. వైద్యంతోపాటుగా సర్జరీ, మానసిక నిపుణులు, గర్భిణులకు సేవలు, నేత్ర వ్యాధులకు పరిష్కారాలు, ఆరోగ్య సలహాలు అందించే ఆస్కారం ఉంటుంది.
జోన్ మూడు, నాలుగు స్థాయికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 4863 సబ్ సెంటర్లకుగాను 683 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 1147 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 31 ఏరియా ఆసుపత్రులు, ఏడు జిల్లా ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ తరువాత జిల్లా హెడ్ క్వార్టర్స్ పరిధిలో ఇవి 1/3 శాతం. మనకి జిల్లా స్థాయి ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 18 టీచింగ్ ఆసుపత్రులలో 10 హైదరాబాద్‌లో ఉండగా, 4 వ రంగల్‌లో ఉన్నాయి. వీటికి అనుబంధంగా అదనంగా 272 ఆయుర్వేద ఆసుపత్రులు, 130 హోమియో ఆసుపత్రులు, 141 యునానీ ఆసుపత్రులు, 24 నాచురోపతి ఆసుపత్రులు తెలంగాణ రాష్ట్రంలో వున్నాయి. వీటన్నింటినీ అనుసంధానించుకోవచ్చు. ప్రతి జిల్లాకు వైద్య కళాశాలలు విస్తరిస్తున్న నేపథ్యంలో హౌస్ స ర్జన్ల సేవలు, పిజి విద్యార్థుల సేవలు సమగ్రంగా ఆయా ప్రాథమిక కేంద్రాల్లో, ద్వితీయ, తృతీయ స్థాయి కేంద్రాల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రాంతీయ జిల్లా టీచింగ్ ఆసుపత్రుల్లో ఎక్కడయినా వినియోగించుకునే సౌలభ్యం ఉంది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తగు రీతిలో వైద్యులు సేవలు వినియోగించుకునే ఆస్కారం ఉంది. అదేవిధంగా కమ్యూనిటీ సెంటర్లలో నమూనాల సేకరణ సుగమం అవుతుంది. తృతీయ స్థాయిలో జిల్లాల ఆసుపత్రులలో డయాగ్నిస్టిక్ సేవలు అందుబాటులోకి తెచ్చే ఆస్కారం ఉంది. 8100 గ్రామాల్లోని 1.86 కోట్ల ప్రజలకు (అంటే మొత్తం జనాభాలోని 53 శాతం మందికి) నైపుణ్యం కలిగిన ప్రాథమిక వైద్యం సుసాధ్యం చేయడంతోపాటుగా టెలి మెడిసిన్, ఫిక్స్ డేట్ హెల్త్ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. గర్భిణులకు పరీక్షలు, పెరిగే పిల్లలకు వైద్యం, దీర్ఘ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు, ఆయాల సంబంధ సహకారం సుసాధ్యం అవుతుంది. తద్వారా సత్వర వైద్యం రోగి ముంగిట్లో అందిస్తే తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు అవుతుంది. అన్ని వర్గాల వారికి సమన్యాయం, సరైన వైద్యం చేరువ చేసినట్టు అవుతుంది. సమచార సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్న పరిస్థితుల్లో టెలి కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత పరిపుష్టం చేసుకుని టెలి మెడిసిన్ ద్వారా దూర వైద్యాన్ని రోగికి చేరువ చేయడం ఆరోగ్య పరిరక్షణకు దోహదపడడం జరుగుతుంది. తద్వారా కాలయాపన నివారించుకోవడంతోపాటు అనుకున్న సమయంలో అత్యవసర వైద్యం చేరువ చేసి ఆపత్కాలంలో ఆదుకునే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితులను అధిగమించి ప్రాణాపాయాన్ని నివారించి ఆపన్నహస్తం అందించినట్టు అవుతుంది. ఈ ఆలోచనలు ఆచరణలోకి తీసుకురాగలిగితే ప్రజలకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని చేరువ చేయడంలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించినట్టవుతుంది.

- వనం జ్వాలా నరసింహారావు సెల్: 80081 37012