మిర్చిమసాలా

మమ్మల్ని తిట్టరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్‌లో జరిగిన తెరాస బహిరంగ సభ బిజెపి నాయకులకు తీవ్ర ఆవేదన మిగిల్చింది. రాజకీయాలన్నాక ప్రత్యర్థులను ఘాటుగా విమర్శించడం సహజమే. వరంగల్ సభలో ‘స న్నాసులు, ద ద్దమ్మలు’ అని కాంగ్రెస్‌ను తెగ తిట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్ టిడిపి, బిజెపిలను అస్సలు పట్టించుకోలే దు. ‘2019 లో మేమే అధికారంలోకి వస్తాం, కేంద్రంలో మేమే ఉంటాం’ అని చెబుతున్న బిజెపి ఉనికిని కెసిఆర్ గుర్తించకపోవడం ‘కమలం’ నేతలకు దిగులు పుట్టించింది. ‘మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటించనున్నందున కెసిఆర్‌కు భయం పట్టుకుంది.. అందుకే మా జోలికి ఆయన రావడం లేదు..’ అంటూ బిజెపి నాయకుడొకరు గొప్పలు చెప్పారు.
- మురళి

ఇదేం దూకుడు?
‘ఇదిగో తోక అంటే అదిగో పులి’ అన్నట్లుంది సామాజిక మాధ్యమాల దూకుడు చూస్తుంటే. ఖాళీగా ఉండే సామాజిక మాధ్యమాల సైనికులు తమకు నచ్చిన విషయాన్ని గొప్పగా అప్‌డేట్ చేస్తుంటారు. అది ఎప్పటిదో, నిజమో కాదో కూడా చూసుకోకుండా దానిని మిగిలిన వారు షేర్ చేసుకుంటూ పోతుంటే- చివరికి దానిని ఖండించడం తలకుమించిన భారంగా మారుతుంది. జయలలిత మృతికి వారం ముందే ఆమె మరణించినట్టు సామాజిక మాధ్యమాలు ప్రకటించేశాయి. నిన్నగాక మొన్న ఒక బాబా కారు ప్రమాదంలో మరణించినట్టు ఇవే మాధ్యమాలు ఖరారు చేశాయి. కారుతో పాటు ప్రమాద సంఘటన దృశ్యాలను కళ్లకు కట్టినట్లు ఫొటోలు కూడా పెట్టేశాయి. తీరా చూస్తే సదరు బాబా సురక్షితమే. సామాజిక మాధ్యమాల దూకుడుకు తలలు పెట్టుకోవడం అందరి వంతైంది.
- బివి ప్రసాద్

కట్టప్ప ఎవరు?
రాజకీయ నేతలు బాహుబలి అంటే ఉలిక్కిపడుతున్నారు. మొన్నటి దాకా మా నాయకుడు బాహుబలి అంటే మా నాయకుడు బాహుబలి అని వివిధ పార్టీల నేతలు చంకలు కొట్టుకున్నారు. బాహుబలి-2 విడుదలైన తర్వాత కట్టప్ప బాహుబలిని హతమారుస్తాడని తేలడంతో బాహుబలి పేరు ప్రస్తావించడానికి నేతలు జంకుతున్నారు. రాజకీయాల్లో పదవీ వియోగానికి గురైన వారు బాహుబలి అయితే, అందుకు కుట్రపన్నిన వారు కట్టప్పలవుతారు. ‘మా నేత బాహుబలి’ అని ఎవరైనా అంటే కట్టప్ప ఎవరు? అని ఇపుడు ఆరా తీస్తున్నారు. ఎన్టీఆర్ బాహుబలి అయితే చంద్రబాబు కట్టప్ప అవుతారని ఒక నేత అంటే, ములాయం సింగ్‌ను దెబ్బతీసిన అఖిలేష్ కట్టప్పేమని మరో నేత అంటున్నారు. అన్ని పార్టీల్లోనూ ఈ రెండు పాత్రలూ ఉండడం సహజమే!
- శైలేంద్ర

ఉచిత ప్రచారం!
సంస్కృతి, సాంప్రదాయాలు, చారిత్రక కథాంశాలతో రూపొందించిన సినిమాలకు వినోదపు పన్ను రాయితీ ఇచ్చి ప్రభుత్వాలు ఆదుకోవడం సాధారణ విషయమే. వీటిలో ఏ కోవకు చెందకపోయినప్పటికీ బాహుబలి సినిమాకు రాజకీయ పార్టీలు బాసటగా నిలిచి పరోక్షంగా ప్రచారాన్ని కల్పించాయి. వరంగల్‌లో టిఆర్‌ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ‘బాహుబలి’తో పోల్చి ఆ సినిమాకు ఉచిత పబ్లిసిటీ కల్పించారు. ఇక, కట్టప్ప ఎవరన్న చర్చ తెరాస, కాంగ్రెస్‌ల్లో జరుగుతోంది. కెసిఆర్‌ను ‘బాహుబలి’తో పోల్చిన కడియం శ్రీహరే కట్టప్పని తెరాస నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకూ తెరాసలో శివగామి ఎవరు?
- వెల్జాల చంద్రశేఖర్

బుగ్గలైట్లు తీసేసినా..
మంత్రులు, క్యాబినెట్ హోదా కలిగిన వివిఐపిలు ప్రయాణించే వాహనాలపై ‘బుగ్గలైట్ల’ను తొలగించాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం నేతల్లో కలకలం రేపుతోంది. ఇటీవలే మంత్రివర్గంలో చేరినవారు, క్యాబినెట్ హోదాతో నామినేటెడ్ పదవులు పొందినవారు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం ఇచ్చిన కార్లకు, తమ సొంత వాహనాలకు హడావుడిగా బుగ్గలైట్లు అమర్చుకున్నారు. ఇది మూన్నాళ్ల ముచ్చటైనా నేతలెవరూ బాధ పడడం లేదు. ఎందుకంటే మంత్రులు, వివిఐపిలు వెళుతుంటే వారి వాహనశ్రేణిలో ఎర్రబల్బులున్న పోలీసు ఎస్కార్ట్ జీపులు, అంబులెన్స్‌లు వంటివి ఉండనే ఉన్నాయి. ఈ మాత్రం సందడి ఉంటే చాలని నేతలు సంతృప్తి పడుతున్నారు.
- నిమ్మరాజు చలపతిరావు