సంపాదకీయం

విత్తనాలకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతులనుంచి నేరుగా విత్తనాలను కొనుగోలు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ సంస్థల నిర్ణయం సజావుగా అమలు జరిగినట్టయితే దళారీ వాణిజ్య సంస్థల దోపిడీని నిరోధించవచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని విత్తనాల భాండాగారంగా మార్చి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు విత్తనాలను ఎగుమతి చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం ఏడాది క్రితమే ఆవిష్కరించింది. ప్రభుత్వ ప్రభుత్వేతర భాగస్వామ్యం పేరుతో దళారీలు రంగ ప్రవేశం చేసి రైతులను దోచుకోకుండా నిరోధించడం వల్ల మాత్రమే విత్తనాల భాండాగారం వల్ల ప్రయోజనం సిద్ధిస్తుంది. ప్రభుత్వేతర సంస్థలు ప్రధానంగా విదేశాల బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు వ్యవసాయ రంగంలోకి చొరబడిపోయి ఉండడం దేశమంతటా నడుస్తున్న కథ. ఈ చొరబాటు ప్రధానంగా రెండు విధాలుగా నడుస్తోంది. విదేశీయ వాణిజ్య సంస్థలు తమ ప్రత్యక్ష పర్యవేక్షణలో పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలలోను, చిన్న వ్యవసాయ క్షేత్రాలలోను విత్తనాలను ఉత్పత్తి చేయడం మొదటి విధానం. ఈ ప్రత్యక్ష పర్యవేక్షణ కొనసాగుతున్న చోట్ల నిజంగా పండించే రైతులు కూలీలుగా మారిపోవడం ప్రచారం కాని బహుళ జాతీయ సంస్థల దోపిడీకి నిదర్శనం. ఈ ప్రత్యక్ష ప్రమేయం లేని చోట్ల, చిన్న వ్యవసాయ క్షేత్రాలలో విత్తనాలను ఉత్పత్తి చేస్తున్న రైతులనుంచి ప్రభుత్వేతర సంస్థలు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తుండడం రెండవ పద్ధతిలో జరిగిపోతున్న దోపిడీ. ఇలా ఉత్పత్తి దారులనుంచి ఎక్కువ ధరలకు విత్తనాలు కొంటున్న ప్రభుత్వేతర సంస్థలు వ్యాపార ముద్ర-బ్రాండ్-లను వేసిన ప్యాకెట్ల ద్వారా అవసరమైన రైతులకు సరఫరా చేస్తున్నారు. ఫలితంగా కొనుగోలు చేస్తున్న రైతులు ఎక్కువ ధరలను చెల్లించవలసి వస్తోంది. కృత్రిమమైన కొరతలను సృష్టించడం ద్వారా ఈ ప్రభుత్వేతర సంస్థలు అధికారిక మూల్యం కంటె ఎక్కువ ధరలకు విత్తనాలను అమ్మడం కూడ దేశంలోని అనేక రాష్ట్రాలలో నడుస్తున్న వైపరీత్యం. అందువల్ల చిన్నచిన్న వ్యవసాయ క్షేత్రాలలో విత్తనాలను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం వారి విత్తనాల అభివృద్ధి సంస్థలు నిర్ణయించడం మంచి పరిణామం...ఉత్పత్తిదారులైన రైతులకు గిట్టుబాటు ధరలు లభించడమే కాక, విత్తనాల కొనుగోలు చేసే రైతులకు తక్కువ ధరలకు తగినన్ని విత్తనాలను ప్రభుత్వపు పంపిణీ కేంద్రాల ద్వారా పంపిణీ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది..
సంప్రదాయ సేంద్రియ వ్యవసాయం మూలపడడంతో మూడు నాలుగు దశాబ్దాలుగా భారతీయ కర్షకులు విత్తనాలను కొనుగోలు చేయడం అనివార్యం అయింది. సంకర జాతుల విత్తనాల, రసాయన ఎరువులు, భారీ యంత్ర సామగ్రి వ్యవసాయానికి అనివార్యం అయిపోయాయి. సంకర జాతుల విత్తనాలతో పాటు పుట్టుకొచ్చిన క్రిములను, కీటకాలను నిరోధించే రసాయన ఔషధాలు, మరో అనివార్యం. ఈ అనివార్య చతుష్టయం ప్రభుత్వేతర సంస్థలు, విదేశీయ దళారీ సంస్థలు వ్యవసాయ రంగ దురాక్రమణకు దోహదం చేసింది. హరిత విప్లవం పేరుతో మొదలైన ఈ తతంగం క్రమంగా వ్యవసాయ దారులను ఋణగ్రస్తులను చేసింది. ఈ అప్పులు పెరగడానకి కారణం ఈ నాలుగింటినీ రైతులు భారీ మూల్యం చెల్లించి కొనవలసి రావడం. రైతులకు ఋణాలను సమకూర్చడం మాత్రమే లక్ష్యమైన ప్రభుత్వాలు రైతులకు అప్పులు అవసరం లేని పరిస్థితిని మాత్రం సృష్టించలేకపోతున్నాయి. గత రెండు దశాబ్దులుగా నడుస్తున్న ప్రపంచీకరణలో భాగంగా జన్యు పరివర్తక జీవ సాంకేతిక విజ్ఞానం మన వ్యవసాయ రంగాన్ని ముంచెత్తుతోంది. ఈ జన్యు పరివర్తక-జీఎమ్- పరిజ్ఞానం ద్వారా రూపొందిన విత్తనాలు ద్వితీయ హరిత విప్లవ సాధనకు అనివార్యమన్నది జరుగుతున్న ప్రచారం. ఈ మహా సంకరజాతి జీఎమ్ విత్తనాల వల్ల పంటలకు తెగులు వ్యాపించదని, దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయని జరిగిన ప్రచారం. అత్యంత ఆకర్షణీయమైంది. ఫలితంగా జిఎమ్ ద్వారా తయారైన బిటి పత్తి విత్తనాలకోసం రైతులు ఎగబడడం ఆరంభమైంది. బిటి పత్తి విత్తనాల ప్రయోగం సఫలమైతే మొత్తం పంటలన్నీ బిటి విత్తనాల ద్వారానే పండించే ప్రక్రియ మొదలై పోతుంది. బిటి-బాసిలస్ తురింజెనిసిస్- రసాయనం దిగుబడి పెంచుతుందట!
బిటి పత్తి విత్తనాలను అమ్మిన విదేశీయ మొన్‌శాంటో సంస్థ వారు దశాబ్దానికి పైగా దోచిపారేశారు. న్యాయస్థానాల ప్రమేయంతో ప్రభుత్వాలు ఆరేళ్ల క్రితం కొంత మేరకు ధరలను తగ్గించాయి. తగ్గించిన తరువాత కూడ నాలుగువందల యాబయి గ్రాముల విత్తనాలను ఈ సంస్థవారు తొమ్మిది వందల రూపాయలకు అమ్ముతున్నారు. అంటే కిలో ధర రెండువేల రూపాయల పైమాటే. బిటి విత్తనాలను పండిస్తున్న రైతులనుంచి మొన్‌శాంటో వారి ప్రతినిధి సంస్థలు విత్తనాలను కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నాయి. ప్రతి నాలుగు వందల యాబయి గ్రాముల ప్యాకెట్‌పై మొన్‌శాంటోకు నూట ఎనబయి రూపాయల సుంకాన్ని ఈ ప్రతినిధి సంస్థలు చెల్లిస్తున్నాయి. ఇలా సుంకాన్ని, పరిజ్ఞానం అమ్మిన సంస్థకు ఇరవై ఏళ్లపాటు చెల్లించాలన్నది వాణిజ్య ముద్రల -పేటెంట్స్- నిబంధన. కానీ ఇరవైయేళ్లు గడచిపోయిన తరువాత కూడ మొన్‌శాంటో వారు ఈ సుంకాన్ని వసూలు చేసుకుంటూనే ఉన్నారట. ఈ వాణిజ్య దౌర్జన్యాన్ని ఉత్పత్తిదారులు, పంపిణీ సంస్థలు భరిస్తూనే ఉండడం ప్రపంచీకరణ ఫలితం. గడువు ముగిసిన తరువాత అదే పరిజ్ఞానాన్ని మరో పేరుతో ప్రవేశపెట్టడం ద్వారా మొన్‌శాంటో సంస్థవారు దోపిడీని కొనసాగించగలుగుతున్నారట. బిటి పత్తి ఒకటవ స్థాయి విత్తనాల పరిజ్ఞానానికి ఇరవైఏళ్ల గడువు ముగిసేలోగా రెండవ స్థాయి పరిజ్ఞానాన్ని మనపై రుద్దుతున్నారు. మూడవస్థాయి బిటి పత్తి విత్తనాలు కూడ చొరబడుతున్నాయట. మొన్‌శాంటోకు లభిస్తున్న రాయల్టీని నూట ఎనబయి ఐదు నుంచి యాబయి రూపాయలకు తగ్గించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతులకు మేలు చేయ తలపెట్టింది. అయితే మొన్‌శాంటో వారు ఈ నిర్ణయాన్ని న్యాయస్థానాలలో సవాలు చేయడం నడుస్తున్న చరిత్ర..
ఇతర రకాల విత్తనాలు ఉత్పత్తి చేస్తున్న రైతులనుండి కొనుగోలు చేయడానికి నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వ సంస్థలు ఈ బిటి విత్తనాలను మాత్రం రైతులనుండి ఎందుకు నేరుగా కొనరాదు? అలా కొని పంపిణీ చేసినట్లయితే వినియోగ కర్షకులకు బిటి విత్తనాలను సైతం తక్కువ ధరలకు విక్రయించవచ్చు. బిటి విత్తనాల వల్ల భూమి క్రమంగా వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో అప్పుడు బిటి విత్తనాలను జిఎమ్ పరిజ్ఞాన ప్రక్రియను నిషేధించక తప్పదు. ఈలోగా బిటి విత్తనాల ధరలను రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించవచ్చు. ప్రతి రైతు గతంలో సంప్రదాయ వ్యవసాయ పద్ధతిలో తన విత్తనాలను తానే రూపొందించుకునేవాడు. ఈ పద్ధతిని పునరుద్ధరించడానికి వీలుగా ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులందరికీ ఎందుకు మప్పరాదు? అలా చేస్తే రైతులు విత్తనాలను కొనవలసిన అవసరం లేదు. స్వయంగా పండించుకోవచ్చు.