సంపాదకీయం

గొంతు దిగని నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జలవాణి’ సేవను ప్రారంభించిన తరువాత సంభవించిన తక్షణ పరిణామం- రాష్టమ్రంతటా అధికశాతం జనాల గొంతులెండిపోవడం.. జనాల నోళ్లు మాత్రమే కాదు, భూమాత గుండెలు సైతం ఎండిపోతున్నాయి. గొట్టపుబావులను వందల వేల అడుగుల లోతున తవ్విన కారణంగా శతాబ్దుల నాటి సేద్యపుబావులు ఎండిపోయి పూడిపోతుండటం దశాబ్దుల కథ. గ్రామాలలోని వారందరూ ఈతకొట్టడం పాతకథ, వర్తమాన తరం వారికి ఈత రాదు. బావులు, చెరువులు ఎండిపోయాయి. అందువల్ల ‘ఈత’ అన్న పదం చిన్నపిల్లలకు తెలీదు. ఈతచెట్లు కూడా ఇప్పుడు గ్రామాలలో కనిపించడం లేదు. వాటిని కొట్టేశారు, నరికేశారు. ఇళ్లలోని ‘చేదబావులు’ పూడిపోతున్నాయి. ఇదంతా గొట్టపుబావుల ప్రభావం. ఇప్పుడు గొట్టపుబావులు కూడా ఎండిపోయాయి, ఎండిపోతున్నాయి. భూగర్భం శుష్కించి ఎండలకు కుతకుత ఉడికిపోతోంది. ‘డోలుపోయె, కత్తివచ్చె డూడూడూం’ అన్న కోతి కథ వలె ఉంది నీటి వ్యథ. చెరువులు, బావులు, కాలువలు, వాగులు పోయె. గొట్టపుబావులు వచ్చె. ఇప్పుడు గొట్టపుబావులు ఎండిపోయె. నీటిపెట్టెలు వచ్చె. వస్తున్న నీటిపెట్టెలు-వాటర్ ట్యాంకర్లు-పట్టణాలలోని సగం మంది గొంతులకు సైతం సరిపోవడం లేదట. ముందు గొంతు తడిస్తే కదా.. తలకు పోసుకోడానికో, స్నానం చేయడానికో అని గ్రామీణులు వాపోతున్నారట. ఎందుకంటే తరలివస్తున్న ‘సంచార జలకుండిక’-వాటర్ ట్యాంకర్-లు పట్టణాలకే పరిమితమైపోతున్నాయి. ప్రచారానికి నోచుకోని పల్లెలకు ట్యాంకర్లు పోవు. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలలో నోళ్లు ఎండిపోతున్న దృశ్యాలు మాత్రమే ప్రచారమవుతున్నాయి. హిందూపురం పట్టణానికి దాదాపు నూట యాబయి కిలోమీటర్ల దూరాన ఉన్న పెన్న అహోబిలం జలాశయం నుంచి మంచినీటిని తరలిస్తున్నారట. ఉత్తరాంధ్రలోని విజయనగరం వంటి పట్టణాలకు కూడా ఇదే స్థితి. ‘జలవాణి’ సేవల ద్వారా ఈ సమస్యలు సమావిష్కృతమవుతున్నాయి. భగీరథ ఉద్యమం, గోదావరి భాగ్యనగరికి తరలిరావడం వంటి సుధాపరిణామాల తరువాత కూడా తెలంగాణలోని గ్రామాలలో మంచినీటి కటకట కొనసాగుతుండటం భూగర్భం ఎండిపోయిన ఫలితం, ఇది తెలుగు రాష్ట్రాల కథ మాత్రమే కాదు. భారత దేశపు వ్యథ. నీటిని మంచిగా పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఇచ్చిన పిలుపు దాహతాపంతో మూర్ఛిల్లి ఉన్న ధరణికి మేలుకొలుపు. గుజరాత్‌లోని కచ్ జిల్లా జూకావులో నర్మదా నది నీటిని పల్లెలకు తరలించే పథకాన్ని ఆరంభించిన మోదీ ఈ బోధ చేశారు.
నీటిని సద్వినియోగం చేసుకొనడం గురించి, వృథా చేయకపోవడం గురించి దశాబ్దులుగా నీతిబోధ జరుగుతూనే ఉంది. నీరు ఉన్నప్పుడు కదా సద్వినియోగం చేయడం.. నీటిచుక్క కనిపించని గ్రామాలలో సద్వినియోగం చేయడం గురించి, వృథాను అరికట్టడం గురించి పాఠాల ప్రచారానికి ఔచిత్యం లేదు. ఆచరణ వేరు, అభిభాషణ వేరు. కానీ గుర్తుచేయడంలో తప్పులేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటివారు గుర్తు చేయడంలో ఔచిత్యం కూడా ఉంది. ‘నమామి గంగే’ పథకం ద్వారా గంగానదిని ‘అమలిన అమృతధుని’గా మార్చడానికి మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడుం బిగించి ఉంది. గంగానది ప్రక్షాళన గురించి దశాబ్దుల తరబడి నీతిబోధ జరిగింది. ఆచరణకు నిజంగానే శ్రీకారం చుట్టడం మాత్రం గత ఏడాది జులైలోనే. అయిదు రాష్ట్రాలలోని నూట నాలుగు తీర గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో రెండువందల ముప్పై ఒక్క శుద్ధి వ్యవస్థలు-ట్రీట్‌మెంట్ ప్లాంట్స్-ఒకే రోజున ఆరంభమైపోయాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నర్మదానదీ శుద్ధి పథకాన్ని 17వ తేదీన మోదీ ఆరంభించాడు. ఇప్పుడు మేనెల 22వ తేదీన గుజరాత్‌లోని కచ్ ప్రాంత గ్రామాలలో గొంతు ఎండినవారి నోటికి నర్మదా జలాలను అందించే పథకాన్ని ఆయన ప్రారంభించాడు. నీటి ఉపయోగంపై నీతి పాఠం చెప్పగల నైతిక అధికారం మోదీకి ఉంది. భగీరథ, కాకతీయ ఉద్యమ పథకాల ద్వారా నీటిని పల్లెలలోని పొలాలకు, ఇళ్లలోని నల్లాలకు తరలించుకుని వస్తున్న తెలంగాణ ప్రభుత్వ నిర్వాహకులకూ ఉంది. కృష్ణాగోదావరి నదులను అనుసంధానం చేయగలిగిన ఆంధ్రప్రదేశ్ పరిపాలకులకూ ఉంది. నీళ్లు మాత్రమే తగినన్ని లేవు!
నీటి కొరతకు, నీటి కాలుష్యానికి అతి ప్రధాన కారణం ‘ప్రపంచీకరణ’. ప్రపంచీకరణకు పూర్వరంగంలోనే కృత్రిమ కొరత ఏర్పడటానికి కారణం నీరు వ్యాపారం కావడం. ఈ నీటి వ్యాపారం ప్రపంచీకరణ ఫలితంగా ఏర్పడిన ‘అంతర్జాతీయ అనుసంధానం’తో మరింత విస్తరించిపోయింది. ఈ వ్యాపార జలాలు అవతరించక పూర్వం మనదేశంలో యుగాలుగా మంచినీటిని కొనవలసిన అవసరం రాలేదు. నీటిని అమ్మి, సొమ్ము చేసుకునే విద్య మన దేశంలో పుట్టలేదు. పుట్టగొడుగుల వలె మనదేశంలో నీటి ఉత్పాదకులు, నీటి విక్రేతలు పుట్టుకుని రావడానికి కారణం కృత్రిమంగా ఏర్పడిన కొరత, విషరసాయనపు ఎరువుల వల్ల క్రిమినాశక ఔషధాల వల్ల భూగర్భ జలం ఉపరితలం కాలుష్యం కావడం. 1970వ దశకంలో అప్పటి ప్రధాని మొరార్జీదేశాయ్ వద్దకు కొందరు శాస్తవ్రేత్తలు వెళ్లి ‘చేదబావి’-నుయ్యి-నీటిని శుభ్రపరిచే ప్రక్రియ గు రించి ప్రస్తావించారట. ‘మనదేశంలోని చేదబావులలో తరతరాలుగా శుభ్రమైన నీరు ఉంది. మన పూర్వీకులు ఆ నీరుతాగి హాయిగా జీవించారు, ఆ రోగ్యవంతులుగా జీవించారు. అందువల్ల చేదబావుల నీటిని శుద్ధి చేయనక్కర్లేదు’ అని మొరార్జీదేశాయ్ అన్నారట. చేదబావులలో మంచినీరు ఉండేది, ఉప్పునీరు కూడా ఉండేది కొన్నిబావులలో. కానీ నీరు విషపూరితం కాలేదు. ‘్ఫలానా వారి బావిలో నీరు కొబ్బరి నీరు’ అని మెచ్చుకునేవారు. ‘ఉప్పునీరు పడిన బావుల’ నీరు తాగేవారు కాదు. కానీ రసాయన ఎరువుల ప్రభావంతో, మందుల ప్రభావంతో భూగర్భం కలుషితమైపోయింది. చేదబావుల నీరు మొదట చెడిపోయాయి. ఆ తరువాత ఇంకిపోయాయి.
ప్లాస్టిక్ సీసాలలో నీరు, ప్లాస్టిక్ డబ్బాలలో నీరు, ప్లాస్టిక్ సంచులలో నీరు- ఈ ప్లాస్టిక్ నీరు వచ్చిన తరువాత ఉచితంగా నీరు తాగడం అన్న సంప్రదాయం అడుగంటిపోయింది. బహుళ జాతీయ వాణిజ్య సంస్థల వాణిజ్య సామ్రాజ్యాలు నీటిని కొల్లగొడుతున్నాయి. శీతల పానీయాలను, ఐస్‌క్రీములను, బీరు-బ్రాందీలను ఉత్పత్తి చేసే సంస్థలు భూగర్భాన్ని తవ్వేసి నీటిచుక్క ఇతరులకు దక్కకుండా దోచేస్తున్నాయి. రసాయనాల ద్వారా, ఎరువుల ద్వారా కాలుష్య జలాన్ని సృష్టించిన విదేశీయ వాణిజ్య సంస్థలు, నీటిని శుద్ధిచేసే పరికరాలను భారీగా ఉత్పత్తి చేసి జనానికి అంటగట్టారు. పట్టణాలలో, నగరాలలో ఈ శుద్ధియంత్రాలు-ప్యూరిఫైయర్‌లు-అధికశాతం ఇళ్లలో నెలకొని ఉన్నాయి. వేలకోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోవడానికి ఇదీ కారణం. మనదేశంలో చైనా కంటే అమెరికా కంటే అధికంగా భూమిని తవ్వి నీటిని కొల్లగొడుతున్నారని నిర్ధారణ జరిగిందట. కొల్లగొడుతున్నది విదేశీయ సంస్థలు.