మెయన్ ఫీచర్

సైనిక దాడులే ఐసిస్‌ను నియంత్రించలేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) దాని అనుబంధ సంస్థలు ప్రస్తుతం చేస్తున్న దాడుల్లో తీవ్రత స్థాయి బాగా పెరిగిపోడమే కాదు, వాటి భౌగోళిక విస్తృతి కూడా విపరీతంగా విస్తరించింది. గడచిన రెండు నెలల కాలంలో..అంకారాలో రైలుపై దాడి, రష్యా ప్రయాణికుల విమానం కూల్చివేత, బీరుట్‌లో ఆత్మాహుతి దాడి, ప్యారిస్‌లో వరుస బాంబు పేలుళ్లు, అదేవిధంగా డిసెంబర్ మొదట్లో కాలిఫోర్నియాలోని సాన్ బెర్నాండినోలోని ఒక కార్యాలయంలో జరుగుతున్న పార్టీ సందర్భంగా ఐసిస్‌తో సంబంధాలున్న యువజంట జరిపిన కాల్పులు వంటివాటిని పరిశీలిస్తే ఈ తీవ్రత స్థాయి మనకు అర్థమవుతుంది.
ఇటువంటి అడ్డూఅదుపులేని ఐసిస్ దాడులు సైనిక చర్యకు దారితీశాయి. ఐసిస్ స్థావరాలు, దాని నేతలపై రష్యా గత సెప్టెంబరు నుంచి తీవ్రస్థాయిలో వైమానిక దాడులు జరుపుతోంది. ఇదే సమయంలో భూతల యుద్ధంలో పాల్గొంటున్న సిరియా, దాని కూటమికి చెందిన సైన్యాలకు మద్దతునిస్తోంది. గత ఏడాది కాలంగా అమెరికా ప్రభుత్వం జరుపుతున్న దాడులకు ఇవన్నీ అదనం. నీటి ఊట మాదిరిగా నిరంతరాయంగా ఉబికివస్తున్న ఐసిస్ కార్యకలాపాలు, వ్యూహకర్తలకు ఒకపట్టాన కొరుకుడు పడటం లేదు. ఉద్భవించిన ఏడాది కాలంలోనే బ్రిటన్ పరిమాణంలో ఒక చిన్న దేశంగా రూపొందింది. మూడు మిలియన్ల జనాభాతో, వేలాది మంది పోరాటవాదులు, సమాఖ్య, ప్రాం తీయ, మున్సిపల్ పరిపాలన, న్యాయమూర్తులు, ఉద్యోగులు, భద్రతా అధికార్లతో ఐసిస్ పటిష్టంగా ఉంది. ఈ సంస్థకు ప్రస్తుతం 500 మిలియన్ డాలర్లు అందుబాటులో ఉన్నాయని అంచనా. ఇవన్నీ చమురు అమ్మకాల ద్వారానే లభిస్తున్నాయని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇంతటి క్రూరమైన వ్యవహారశైలి కలిగిన ఐసిస్, కొత్తవారిని ఏవిధంగా ఆకర్షించ గలుగుతోందన్నది అంతులేని ఆశ్చర్యానికి లోనుచేసే అంశం. ప్రతి నెలా పశ్చిమాసియా, యూరప్, ఇతర పశ్చిమ దేశాలనుంచి వందలాది మందిని ఐసిస్ రిక్రూట్ చేసుకుంటోంది.
ఈ ఐసిస్‌కు బీజం వేసినవాడు అబు బసుల్ అల్ జార్‌ఖవి. ఇరాక్‌కు చెందిన ఇతను తీవ్రస్థాయి జిహాదీ ఉగ్రవాది. 2003లో తన దాడులను అమెరికా దళాలపై, కొత్తగా అధికారంలోకి వచ్చిన షియా తెగ ప్రజలపై ప్రారంభించాడు. తలలు నరకడం, పొంచి ఉండి దాడులు జరపడం, దాడులు, రోడ్డు పక్క మందుపాతరలను అమర్చి పేల్చివేయడం, వీటన్నింటికీ మించి ఆత్మాహతి దాడులతో ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేశాడు. షియా తెగవారిపట్ల నిలువెల్లా ద్వేషాన్ని వెళ్లగక్కుతుంటాడు. పొంచివున్న పాముగాను, కపటం మరియు ద్వేషం మూర్త్భీవించిన తేలుగాను, విషాన్ని ఎగజిమ్మేవారుగాను షియాలను అభివర్ణిస్తుంటాడు.
ఐసిస్ ప్రస్తుతం జార్‌ఖవి సంప్రదాయానే్న తమ దాడుల్లో అనుసరిస్తున్నది. ఈ దాడులు..‘‘తీవ్రత, తరచుదనం, ప్రమాదకారిత్వం’ కలిగి ఉంటాయని ఒక పరిశీలకుడు వర్ణించాడు. సైద్ధాంతిక విషయంలో మాత్రం నూటికి నూరుపాళ్లు కాఠిన్యానే్న ప్రదర్శిస్తుంది. ‘నిజమైన’ ముస్లింలపై వారిచ్చే నిర్వచనం చాలా సంకుచితంగా ఉంటుంది. ఐసిస్ దృష్టిలో వీటిని పాటించని మిగిలిన వారంతా మతభ్రష్టులే! అవిశ్వాసులు, మతభ్రష్టులు, విగ్రహారాధకులపై ‘‘జిహాదీ దాడులు’’ జరపాల్సిందేనని ఐసిస్ సిద్ధాంతీకరిస్తుంది. వీరి ప్రధాన లక్ష్యం షియాలు! అయితే చాలా ప్రాంతాల్లో ఇది జరిపిన దాడులను పరిశీలిస్తే ఐసిస్.. జార్‌ఖవిని మించిపోయిందని స్పష్టమవుతుంది. అబు బకర్ అల్-బగ్దాదీ నేతృత్వంలో ఖలీఫేట్‌ను ఏర్పాటు చేసింది. ఈ విధంగా అల్ ఖైదా లేదా జార్‌ఖవిలు చేయలేదు. తల నరకడం, సజీవదహనం చేయడం తాజాగా బానిసలుగా చేసుకోవడం, చిత్రవధ చేయడం వంటి శిక్షలు సైద్ధాంతికంగా న్యాయబద్ధం చేసి ఐసిస్ అమలు పరు స్తోంది. పూర్వ సిద్ధాంత కర్తలకు భిన్నంగా ‘పరిరక్షకుడి’కి ప్రధాన్యతనిస్తుంది. ఉత్తర సిరియాలో జరుగుతున్న విధ్వంస పూరిత పోరాటంలో అంతిమ విజయం ఇస్లాంకు మాత్రమేనని ఐసిస్ తరచుగా చేసే ప్రకటనల్లో చెబుతుంటుంది.
పశ్చిమాసియా, దానికి ఆవలి దేశాల్లో యువకులను ఆకర్షించేందుకు ఐసిస్ పడుతున్న తపన చాలామంది పరిశీలకులను ఆశ్చర్యచకితులను చేస్తోంది. ప్రతి సంభవనీయ రాజకీయ, ఆర్థిక వ్యవస్థల నుంచి విదేశీ సైన్యాలపై దాడులు చేయగలిగే ఐసిస్ సామర్ధ్యాన్ని చూసినప్పుడు భయం, గందరగోళానికి లోనయ్యానని పశ్చిమ దేశానికి చెందిన ఒక అధికారి అంగీకరించారు. ఐసిస్‌ను అంటిపెట్టుకున్న వారు ‘‘జీవితమే అర్థంలేనిదంటూ అన్ని రకాల మత, నైతిక విశ్వాసాలను తిరస్కరించే ఈతరం యువకులు, మతవిశ్వాసాలను తీవ్రస్థాయిలో మదినిండా నింపుకొని చేస్తున్న తిరుగుబాటు’’ అని ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత మేధావి ఓలివర్ రాయ్ అభిప్రాయపడుతున్నారు. ఈ యువకుల ప్రవర్తనలోని ఇస్లామిక్, జిహాదీ వ్యవహారశైలిని ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం ఇది ‘‘తరాల మధ్య నెలకొన్న పెద్ద అంతరంగా’’నే ఆయన పరిగణిస్తున్నారు. సాం స్కృతిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఇస్లాం ప్రపంచంలో గత 30 ఏళ్లుగా చోటు చేసుకుంటున్న నాటకీయ పరిణామాలే ఈ తరాల మధ్య అంతరాలకు ప్రధాన కారణమని ఆయన నిర్దిష్ట అభిప్రాయం. అందువల్ల 19వ శతాబ్దం నాటి ఫ్రాన్స్‌కు చెందిన అరాచకవాదులు లేదా 20 శతాబ్దపు బాదర్-మెన్‌హాఫ్ విప్లవకారులకు ప్రస్తుతం చోటు చేసుకుంటున్న ‘తిరుగుబాటు’కు పెద్ద తేడా లేదని కూ ఓలివర్ రాయ్ నిర్ధారణ.
ఇక అమెరికన్ మేధావి స్కాట్ అట్రాన్ ఉద్దేశంలో..ఐసిస్‌లో పనిచేస్తున్న వారిలో చాలామంది వారివారి సమాజాలకు తగినవారు కాదు. అయితే తమ చరిత్రలో, సంప్రదాయాల్లో పేర్కొన్నవాటి సాధనకోసం ప్రగాఢమైన కోర్కె కలిగిన ముస్లిం యువకులు ఐసిస్ ప్రలోభాలకు తేలిగ్గా లొంగిపోతున్నారు. ‘‘సాహసం, ప్రతిష్ఠ, సిద్ధాంతాలు మరియు గుర్తింపు’’ అనే వాటిని పొందాలన్న తమలోని బలీయమైన కోర్కెను తీర్చే సాధనంగా ఐసిస్ ఈ యువకులకు కనిపిస్తోంది. ఐసిస్ యువ అనుయాయుల్లో చాలామందికి ఏవిధమైన మతపరమైన నేపథ్యం లేదనేది స్కాట్ అట్రన్ పరిశోధల్లో తేలింది. వీరందరిని ఒక్కదగ్గరికి చేర్చింది వారిలోని మతపరమైన ఆవేశం కాదు, ‘‘కేవలం ఒక కారణం మరియు సహచరత్వం మాత్రమే’’! కేవలం ఈ ప్రబలమైన శక్తే గతంలో అనేక సైన్యాలను అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా విజయపథంలో పయనింపచేసింది. ప్రస్తుతం అల్-ఖైదాతో సైద్ధాంతికపరమైన పోటీతో పాటు, పశ్చిమ దేశాలనుంచి సైనిక దాడులను ఐసిస్ ఎదుర్కొనాల్సి వస్తున్నది. 2014 డిసెంబర్‌లో సౌదీ అరేబియా మొత్తం 34 ఇస్లామిక్ దేశాలతో ఒక కూటమిని ఏర్పాటు చేసింది. ఐసిస్‌పై పోరాటం సలపడమే దీని ప్రధాన లక్ష్యం. అదేవిధంగా ఇప్పుడు పశ్చిమ దేశాలు ఐసిస్‌కు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడి వైమానిక దాడులు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఉగ్రవాద సంస్థ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలన్న లక్ష్యంగా ఈ కూటమి ముందుకెళుతోంది. ఇందులో విజయం సాధిస్తే ఐసిస్ సిద్ధాంత వ్యాప్తిని సమర్ధవంతంగా అరికట్టవచ్చునని ఈ దేశాల భావిస్తున్నాయి.
అయితే ఇస్లామిక్ దేశాల కూటమి ఏర్పాటులో కొంత గందరగోళం నెలకొని ఉన్నమాట వాస్తవం. ముఖ్యంగా సభ్యత్వం, సైనికుల మోహరింపు, నిధుల కేటాయింపు, ఏ లక్ష్యాలపై దాడులు జరపాలి? అన్న అంశాలపై ఈ అనిశ్చితి కొనసాగుతోంది. ము ఖ్యంగా ఈ కూటమిలో ఇరాన్, ఇరాక్ దేశాలను భాగస్వాములను చేయకపోవడం వల్ల దీన్ని‘‘సున్నీ కూటమి’’గానే చాలా మంది పరిశీలకులు పరిగణిస్తున్నారు. పశ్చిమాసియాలో తెగల మధ్య మరిన్ని విభజనలకు దారితీయడం తప్ప దీనివల్ల ఒనగూడే ప్రయోజనమేం లేదని వారి దృఢ అభిప్రాయం. అసలు ఈ కూటమిలోని కొన్ని సభ్యదేశాలు జిహాదీ శక్తులను ప్రోత్సహించాయన్న సంగతి మరువరాదని, కొందరు అరబ్ వ్యాఖ్యాతలు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యా పాఠ్య ప్రణాళిక రూపకల్పన, నియామకాలు, నిధుల సమీకరణలో ఈ దేశాలు ప్రముఖ పాత్ర పోషించాయి.
ఐసిస్‌ను బలహీన పరచే యత్నాలు ఎంత తీవ్రంగా కొనసాగుతున్నాయో, అంతే తీవ్రస్థాయిలో ఆ సంస్థ పలుకుబడి పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇరాక్, సిరియాలకు ఆవల మొత్తం 20 దేశాల్లో ఐసిస్ పలుకుబడిని సాధించింది. ఈ దేశాల్లో సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, లిబియాలు కూడా ఉన్నాయి. అంతేకాదు చాలా జిహాదీ సంస్థలు ఐసిస్‌కు విధేయత్వాన్ని ప్రకటిస్తున్నాయి. జిహాదీ దాడులను కూడా ఐసిస్ పేరిటే నిర్వహించడం గమనార్హం. తమ సైనిక చర్యల ద్వారా.. ఐసిస్ ఖలీఫేట్‌గా ప్రకటించిన ప్రాంతాలు లేకుండా చేసి, దానికి మద్దతుగా నిలుస్తున్న ఆధారాన్ని, దానిపట్ల ప్రలోభాన్ని రూపుమాపాలని పశ్చిమ మరియు ప్రాం తీయ దేశాలు భావిస్తున్నాయి. అయితే జిహాదీ గ్రూపులు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా నిలదొక్కుకోగలుగుతున్నాయన్నది ఇక్కడ ముఖ్యమైన అంశం. అంతేకాదు ఈ గ్రూపులు వికేంద్రీకృతమై, ప్రపంచంలోని వివిధ దేశాల్లో తమ ఉనికిని చాటుతూ ఉగ్రవాద దాడులు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రీకృత సైనిక చర్య మాత్రమే ఐసిస్‌ను సమూలంగా నాశనం చేయలేదు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో పశ్చిమాసియా మరియు పశ్చిమ దేశాల్లో సామాజిక బహిష్కరణ కొనసాగుతున్నంత కాలం ఐసిస్‌లోకి సరికొత్త నియామకాలు చోటుచేసుకోక తప్పదు.
అల్-ఖైదా, ఐసిస్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ, ఖలీఫేట్‌కు చెందిన ఆధ్యాత్మిక ఛత్రం కింద ఒక్కటవడం ఖాయం. ఇక సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఈ సంస్థల యూనిట్లు తాము పని చేస్తున్న ప్రదేశాల్లో హింస, ప్రతీకార చర్యలకు పాల్పడుతూనే ఉంటాయి. రాబోయే సంవత్సరాల్లో వీటిని మనం చూడబోతున్నాం.

- తాల్మిజ్ అహమ్మద్ (సౌదీ అరేబియాలో భారత మాజీ రాయబారి)