మెయన్ ఫీచర్

అవకాశాలను అందుకోలేని వామపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త పెళ్లికూతురు ఎంతెంతగా సిగ్గుపడేదీ, మెలికలు తిరిగేదీ అందరికీ తెలిసిందే. కోల్‌కతాలో జరిగిన పార్టీ ప్లీనం సమావేశాలలో సిపిఎం కూడా కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు విషయమై అదే తీరున సిగ్గులు పోయింది. మెలికలు తిరిగింది. ప్లీనం ముగిసేసరికి విషయమేమిటో అందరికీ తెలిసినందున ఇక అటువంటి అమాయకపు నటనల అవసరం ఉండదు. పురోహితుడు విధి విధానాలు నడిపించటం, పెళ్లి తంతు పూర్తికావటం మాత్రం మిగిలి ఉంది. ఆ కార్యక్రమం ఈ విధంగా ఉండబోతున్నదని చెప్పవచ్చు. సిపిఎం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ నాలుగు రోజులు అటు ఇటుగా సమావేశమవుతుంది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల అంశం చర్చకు వస్తుంది. ఫాసిస్టు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, మతతత్త్వ బిజెపితో పాటు సంఘ్ పరివార్ శక్తులు ఎంత ప్రమాదకరంగా మారాయో విశే్లషణ జరుగుతుంది. ఈ రెండు శక్తుల మధ్య పరోక్ష అవగాహనలు ఉన్నాయనేదానిపై ఎటువంటి సందేహాలు లేవని దృఢంగా ప్రకటిస్తారు. వామపక్ష, ప్రగతిశీల శక్తులను అంతం చేయటమే వారి లక్ష్యమంటారు. ఆ పార్టీలు బలపడటం, అధికారంలోకి రావటం పశ్చిమ బెంగాల్‌కే గాక, మొత్తం దేశానికి హానికరమంటారు. అందువల్ల పార్టీ శ్రేణులు, ఇతర వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఆ ప్రమాదాన్ని తిప్పికొట్టేందుకు సమాయత్తం కావాలని పిలుపునిస్తారు.
ఇదంతా కాంగ్రెస్‌తో పొత్తుకు ఉపయోగపడే వాతావరణాన్ని సృష్టించటమన్నమాట. ఆ పని చేస్తారు గాని వెంటనే నేరుగా ఎక్కడా కాంగ్రెస్ ప్రస్తావన కాదు. ‘‘ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకం కావటం, విశాల వేదిక నిర్మాణం’’ తరహా మాటలు వినవస్తాయి. విషయమేమిటో అందరికీ అర్థమవుతూనే వుంటుంది కాని అంత త్వరగా పేర్లు చెప్పటం మంచి రాజకీయ ఎత్తుగడ కాబోదు. అంతకుమించి తాము ఇన్ని దశాబ్దాలుగా పాటించిన సైద్ధాంతిక సౌశీల్యానికి ప్రతిష్ఠ కలిగించేది కూడా కాదు. కనుక ప్రస్తుతానికి పై తరహా మాటలు మాత్రం ఉంటాయి. అదిగాక, బహిరంగ నిర్ణయాలకు ముందు చక్కబెట్టుకోవలసినవి, అంచనాలు వేయవలసినవి కొన్నుంటాయి. పశ్చిమ బెంగాల్‌లో ఇంతకాలం ఉన్న నమూనా అన్నీ వామపక్షాలతో కూడిన ‘వామపక్ష ఐక్య సంఘటన’ (లెఫ్ట్ ఫ్రంట్). ఆ కూటమి అదేవిధంగా ఉండి కాంగ్రెస్‌తో అవగాహనలు మాత్రమే చేసుకుంటారా, లేక వారిని కూటమిలో భాగం చేసి కేరళ తరహాలో ‘లెఫ్ట్-డెమోక్రటిక్ ఫ్రంట్’గా మార్చుతారా అన్నది ఒక ప్రశ్న. రెండు నమూనాలకు కూడా కొన్ని సమస్యలుంటాయి. రెండవదానికి కొంత ఎక్కువగా. వాటిని తెరవెనుక మంతనాలతో ఢిల్లీ స్థాయిలో పరిష్కరించుకోవాలి. ఆ తర్వాత గాని పశ్చిమ బెంగాల్ కమిటీకి గ్రీన్‌సిగ్నల్ వెళ్లటం, వారొక వైఖరిని లాంఛనప్రాయంగా తీసుకోవటం ఆ నీటిని పొలిట్ బ్యూరో శంఖువులో పోసి తీర్థంగా మార్చటం వంటివి జరగవు.
ఇదిగాక తేలవలసినవి ఇంకా ఉంటాయి. కొన్ని వార్తలు సూచిస్తున్నదాని ప్రకారం, సిపిఎంలోని దిగువ శ్రేణులు కొన్ని కాంగ్రెస్‌లో పొత్తుకు ఉత్సాహంగా లేవు. లెఫ్ట్ ఫ్రంట్‌లోని పార్టీలు కొన్ని కూడా అదే ధోరణిలో ఉన్నాయి. సాధారణంగా ప్రజానీకం ఆలోచనలేమిటో తెలియదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వామపక్షాలకు చేరువైతే ఆ పార్టీ వారు తగినంత మంది తృణమూల్, లేదా బిజెపిలోకి వెళ్లగలరనే అనుమానాలున్నాయి. ఇప్పటికే గణనీయంగా బలహీనపడిన కాంగ్రెస్ నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో 2014కు ముందు తృణమూల్‌లోకి, ఆ తర్వాత తృణమూల్‌తోపాటు బిజెపిలోకి మారుతుండిన స్థితిలో, ఒకవేళ సిపిఎంతో కాంగ్రెస్‌కు పొత్తుకుదిరినట్లయితే ఈ వలసలు పెరిగిపోగలవన్నది కాంగ్రెస్ వర్గాల భయం. వ్రతం చెడటం- ఫలం దక్కటం అనే సామెత ప్రకారం, ఒకవేళ వామపక్షాలతో కలిసినా తృణమూల్‌ను ఓడించగలమనే హామీ లేనందున, మరొక వైపు వలసలు పెరిగి మరింత బలహీనపడే ముప్పు కాంగ్రెస్‌కు ఉంటుంది. ఆ స్థితిలో వామపక్షాలకు ఉపయోగపడేందుకు తామెందుకు కొత్త నష్టాలు తెచ్చుకోవాలనే ప్రశ్న కాంగ్రెస్ నాయకత్వానికి ఉంది. చివరకు ఏమయేదీ చెప్పలేము గాని, కాంగ్రెస్‌కు తృణమూల్‌తో అవగాహన కుదిరినా ఆశ్చర్యపడనక్కరలేదని భావిస్తున్నవారూ ఉన్నారు.
ఇటువంటి ప్రశ్నలను చక్కబెట్టుకోవాల్సి ఉండగా పశ్చిమ బెంగాల్ సిపిఎం కమిటీ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు అంటూ పేరు పెట్టి మాట్లాడే అవకాశం తక్కువ. ఇంతకూ అదంటూ జరిగితే, అది త్వరలో అయినా కొంతకాలం తర్వాత అయినా, సిపిఎంవారు, ఇతర వామపక్షాలూ లోకానికి ఇచ్చుకోవలసిన వివరణలు కొన్ని ఉంటాయి. తృణమూల్ ప్రభుత్వానికి అసమర్థ పాలన, ఫాసిస్టు పాలన అనే తమ విమర్శ నిజమైతే మమతా బెనర్జీ ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గుతుండాలి. అటువంటపుడు ఆ పార్టీని లెఫ్ట్ ఫ్రంట్ స్వయంగా ఎదుర్కొనగలగాలి. మరి కాంగ్రెస్‌తో పొత్తు అవసరమేమిటి? ఆ పార్టీతో పొత్తు ఎంత మాత్రం ఉండబోదని కేవలం ఎనిమిది మాసాల క్రితం (ఏప్రిల్, 2015) విశాఖపట్నంలో జరిగిన సిపిఎం 21వ కాంగ్రెస్ సమావేశాలలో ఆమోదించిన రాజకీయ తీర్మానంలో ఉంది. పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితులు అప్పుడేమిటో ఇపుడు కూడా అవే అయినపుడు ఇంత పెద్ద పిల్లి మొగ్గ ఎందుకు? కాంగ్రెస్, బిజెపిలతో సమదూరం పాటించగలమంటూ చెప్పిన ప్రధాన కారణాలలో ఆర్థిక విధానాలు ఒకటి. కాంగ్రెస్ ఆర్థిక విధానాలు ఈ ఎనిమిది మాసాల్లో ప్రగతిశీలంగా, తమ భావజాలానికి అనుకూలంగా ఏమైనా మారాయా? బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు, అదే సమయంలో జరగనున్న కేరళ ఎన్నికలలో వైరం అనే వైరుధ్యానికి సమాధానమేమిటి? పశ్చిమ బెంగాల్‌లో అధికారానికి వస్తే అనుసరించేది తమ ఆర్థిక విధానాలా లేక కాంగ్రెస్ విధానాలా?
బెంగాల్‌లో మరొక పరిస్థితి కూడా కనిపిస్తున్నది. అది బెంగాల్ జాతీయవాద ధోరణి. నిజానికి ఈ ధోరణి కొత్త కాదు. బ్రిటిష్ వలస రాజ్యానికి కలకత్తా రాజధానిగా ఉన్న కాలం నుంచి అక్కడ ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధితోపాటు బెంగాలీ జాతీయ భావనలు తలెత్తటం, 1905లో బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ ఆ భావనలు పెచ్చరిల్లటం, తర్వాత కాలంలోనూ బలపడి కొనసాగటం అందరికీ తెలిసిన విషయాలే. సిపిఎంకు ఆ వారసత్వం రావటం కూడా వారి అధికార సాధనకు ఒక కారణమనే భావన ఉండటమూ తెలిసిందే. అదే బెంగాలీ జాతి వాద వారసత్వం ఇపుడు తృణమూల్‌కు బదిలీ అవుతున్నదని, ఆ భావనలను వీలైనంత పురికొల్పి లాభపడేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు కొందరి అభిప్రాయం. అది నిజమే అయినట్లు తోస్తున్న ది కూడా. బెంగాలీ జాతి భావనలకు ప్రాతినిధ్యం వహించటమన్నది సిపిఎం నుంచి తృణమూల్‌కు బదిలీ కావటం ఒక వౌలికమైన మార్పు. దానిని ఎదుర్కోవటం తేలిక కాదు. ఆ భావనల లాభాన్ని ఇంతకాలం స్వయంగా పొందిన సిపిఎంకు ఎవరూ చెప్పనక్కరలేదు. కనుక, వారి ఎన్నికల వ్యూహంలో దీనిని ఏ విధంగా పరిష్కరిస్తారో చూడవలసి ఉంది.
ఇంతకూ, సైద్ధాంతిక శీలత ఇతర వామపక్షాలన్నింటికన్నా తమకు ఎక్కువని సగర్వంగా ప్రకటించుకుంటూ, గెలుపు ఓటములు ఎన్ని ఎదురైనా అందుకు కట్టుబడి ఉండగలమనే దీక్షా దక్షత గల సిపిఎం, ఇపుడు పశ్చిమ బెంగాల్‌లో గెలిచేందుకు ఇంత పట్టుదల ఎందుకు చూపుతున్నట్లు? తిరిగి అధికార సాధనకు అన్ని వ్రతాలను ఎందువల్ల వదలుకుంటున్నారు? ఇంత సుదీర్ఘకాలం అనుభవించిన అధికారం పోయినందుకా? తాము పాలించనిదే అక్కడి ప్రజల జీవితాలు, భవిష్యత్తు ఏమైపోగలవోననే విచారంతోనా? తృణమూల్ ఫాసిజాన్ని, బిజెపి మతతత్త్వాన్ని నిలువరించి తీరవలసిందేనన్న సైద్ధాంతిక ఆవేశంవల్లనా? అనేక ప్రశ్నలు, విమర్శలను ఎదుర్కొనేందుకైనా సిద్ధపడుతూ, పొత్తువల్ల గెలవటం నిశ్చయం కూడా కానపుడు, అనేక విధాలుగా రాజీపడుతూ కొత్త జూదం ఎందుకు ఆరంభిస్తున్నట్లు? అన్ని వ్రతాలను భంగపరచుకునేందుకు ఎందువల్ల సిద్ధపడుతున్నారు?
ఇందుకు స్థూలమైన సమాధానం అధికారం. వివరాలలోకి వెళితే మరికొన్ని విషయాలున్నాయి. వాస్తవానికి భారతదేశం వంటి వెనుకబడిన సమాజంలో వామపక్షాలకు అపరిమిత అవకాశాలుండాలి. కాని వాటిని అందుకోగల స్థాయికి వారు ఎప్పుడూ చేరుకోలేదు. అందుకు స్వీయ వైఫల్యతలు కొంత కారణమైతే, వామపక్షేతర పార్టీలు అనుసరించిన రకరకాల వ్యూహాలు మరికొంత. ఆ వివరాల చర్చకు ఇది చోటు కాదు గాని, కనీసం స్వాతంత్య్రోద్యమ కాలంలో తమకుండిన శక్తిప్రపత్తులను, స్వాతంత్య్రానంతర మొదటి రెండు ఎన్నికలలో ప్రదర్శించగలిగిన బలాన్ని అయినా వారు తర్వాత సంవత్సరాలలో నిలబెట్టుకోలేకపోయారన్నది గుర్తించవలసిన విషయం. రాష్ట్రాలలో అధికారం రావటం రాకపోవటం కన్నా ముఖ్యంగా దేశవ్యాప్తంగా వారి విస్తృతి తగ్గిపోతూ వచ్చింది. మరొకవైపు అంతర్గత బలహీనతలు సైద్ధాంతికంగా, వ్యవస్థాపరంగా, ఆచరణాత్మకంగా పెరుగుతూ పోయాయి. వీటినుంచి కోలుకునేందుకు గట్టి ప్రయత్నం జరగలేదు. అంతర్గత చర్చల ఫలితంగా ఒకటి రెండుసార్లు ప్రయత్నించినా అది ముందుకు సాగలేదు.
చివరకు పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో అధికారమే వారికి సర్వస్వంగా మారింది. వీటిలోనూ పశ్చిమ బెంగాల్ ఒక అయస్కాంత క్షేత్రమైంది. వారి ఆలోచనలు, వ్యవహరణలు, అహంభావాలు, మంచి చెడులు అన్నీ ఆ ఒక్క రాష్ట్రాన్ని ఇరుసుగా మార్చుకున్న పరిస్థితి వచ్చింది. తమ జాతీయ స్థాయి రాజకీయాలకు, పాత్రకు కూడా అదే ఆయువుపట్టు అన్నట్లుగా మారింది. ఒకవైపు ఇందుకు తగిలిన దెబ్బ, మరొకవైపు 34 సుదీర్ఘ సంవత్సరాల అధికార నష్టం ఆ పార్టీని నీటినుంచి బయటపడిన చేపగా మార్చి తల్లడిల్లజేస్తున్నా యి. అక్కడ తిరిగి అధికార సాధన ఎంత జాప్యమైతే వారి ఊపిరి అంతగా కడగట్టుకుపోతుంటుంది. అందువల్ల పశ్చిమ బెం గాల్ అధికారమనే జీవన్మరణ సమస్య దృష్ట్యా ఎటువంటి రాజీలకైనా వారికి అభ్యంతరం ఉండకూడదు.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)