సంపాదకీయం

‘వన్య’ హననం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచెలు ఎలా చేను మేస్తాయి? వాటికి నోరు ఉందా? కాళ్లు చేతులు లేవు కదా? కడుపు ఎక్కడుంది? అన్నవి చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలు. అందువల్ల ‘కంచే చేను మేసినట్టు’ అన్న నానుడి నిజం కాదన్నది పసిమి వదలని మిసిమి వయసు వారి విశ్వాసం. కానీ వారు పెరిగి పెద్దయిన తరువాత కంచెలకు చేతులు కాళ్లు వచ్చిన సంగతిని గుర్తిస్తున్నారు. ఈ కంచెలకు నోరు కడుపు మరింత పెద్దవి. అవినీతిపరులైన అధికారుల రూపంలో నేర ప్రవృత్తికల ఉద్యోగుల రూపంలో ఈ కంచెలు కబంధునివలె కనిపించిన దానినల్లా కాజేస్తుండడం ఆధునిక జీవన రీతిలో భాగం...హైదరాబాద్‌లో కేంద్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని భద్రతా సిబ్బంది ఒక జింకను హత్య చేయడం, ముక్కలు ముక్కలు చేసి సంచులలో నింపడం, మాంసంతో తమ తోడేలు పొట్టను నింపుకోవడం కంచెలు చేను మేయడానికి సరికొత్త సాక్ష్యం. భాగ్యనగర ప్రాంగణంలో మాత్రమే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు, దేశంలోని వివిధ ప్రాంతాలలో వన్య మృగాల వధ విచ్చలవిడిగా జరిగిపోతోందట. కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో హరిణ హననం జరిగిన సమయంలోనే తిరుమల సమీపంలోని అడవుల్లో మరో మచ్చల జింకను ముష్కరులు మట్టుపెట్టిన దురంతం బయటపడింది. కట్టెలు కొట్టుకోవడం పేరుతో శేషాచలం అడవులలోకి చొరబడిన అసాంఘిక బీభత్సకారులు జింకలను వేటాడుతున్నారు. ఎర్రగంధం దొంగలకు ఈ వేటగాళ్లకు సంబంధం ఉండవచ్చు లేదా ఎర్రగంధం దొంగలే ఈ వేటగాళ్లు కావచ్చు. మచ్చల జింక మృతదేహంతో పాటు బియ్యం బస్తాలను కూడ కట్టెలు కొట్టేవారి వద్ద ఎర్రచందనం అక్రమ వ్యాపార నిరోధక దళం-ఆర్‌ఎస్‌ఏఎస్‌టిఎఫ్-సిబ్బందికి లభించాయట. మహారాష్టల్రోని నాగపూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక చిరుతపులి మృతదేహం, ఒక పెద్దపులి కళేబరం కనిపించడం సమాంతర వైపరీత్యం. ప్రతిరోజూ దేశంలో ఎక్కడో అక్కడ అక్రమంగా వన్యమృగాలను వేటాడి చంపడం మానవుని క్రూరత్వానికి నిదర్శనం, అటవీ భద్రతా వైఫల్యానికి సాక్ష్యం...
పట్టుబడుతున్న వన్యమృగ హంతకులకంటె పట్టుబడని నేరస్థుల సంఖ్య వందల రెట్లు! జింకల మాంసం, నెమళ్ల రక్తం రుచి మరిగిన ఘరానాలు సమాజంలో నిండి ఉన్నారు. మామూలు మాంసం తినడం కంటె అరుదైన వన్యమృగాల పక్షుల మాంసం తినడం వల్ల డబ్బుతో జేబులు ఉబ్బిపోతున్న వారి గొప్ప భోగంగా మారింది. ‘నితాంత అపార భూతదయ’ గురించి ప్రచారం జరిగిన ధర్మప్రాణ భారత దేశంలో వన్య మృగాలకు రక్షణ లేకపోవడానికి కారణం అక్రమ వాణిజ్యం. పులుల చర్మాలను, పులిగోళ్లను, దంతాలను, చైనాకు ఎగుమతి చేస్తున్న ముఠాలు పనిచేస్తూనే ఉన్నాయి. ఏనుగు దంతాలను, జింకల చర్మాలను వినోదం కోసం కొని ప్రదర్శించుకునే జీవన విధానం నితాంతాపార భూతదయను వెక్కిరిస్తోంది. ‘నరమాంస భక్షణే దోషం..’’ ‘‘మాంసం తినడం దోషం కాదు..’’ అని మన ధర్మశాస్త్రాలు స్పష్టం చేసి ఉన్నాయి. కానీ ఈ మాంస భక్షణకు భూతదయకు మధ్య సమతుల్యం కొనసాగడం సహస్రాబ్దుల భారతీయ జీవనం. ఈ సమతుల్య ప్రాకృతిక వ్యవస్థ శిథిలమై పోవడం ఆధునిక జీవనం. మాంసాహారులు ప్రతి రోజూ కాక ఎప్పుడో అప్పుడు మాత్రమే జంతువధ, పక్షివధ చేసి భోంచేయడం సంప్రదాయం. ఈ దేశంలో ప్రతిరోజూ మాంసం తినడం అందువల్ల పద్ధతి కాదు. ప్రతిరోజూ మాంసం తినడం ప్రతిరోజూ నూనెలో వేయించిన పదార్ధాలను బొక్కడం వల్ల జనం రోగగ్రస్తులవుతున్నారు. కానీ ప్రతిరోజు మాంసం, గుడ్లు తదితర మాంసాలను తినాలని జరుపుతున్న ప్రచారం జీవన దృక్పథాన్ని మార్చివేసింది. గ్రామాలలోని నగరాలలోని మాంసంతో తృప్తిపడని ప్రవృత్తి అడవులపై దాడి చేస్తోంది.
పర్యావరణంలోని జీవజాలంలో సగం వృక్షజాలం, సగం జంతుజాలం. తెలివైన జంతువైన మానవుడు మిగిలిన జంతుజాలాన్ని, వృక్షజాలాన్ని నిరంతరం హత్య చేస్తుండడం పరిసరాల సమతుల్య వ్యవస్థ పాడుపడడానికి కారణమన్నది శాస్తవ్రేత్తలనుండి సామాన్యుల వరకు చెబుతున్న మాట. అయినప్పటికీ కేవలం వందఏళ్ల కాలవ్యవధిలో అడవులలోని జీవజాలం మూడు వంతులు హరించుకొని పోయింది. అడవులలోని సాధు మృగాలను వేటాడి చంపేయడం వల్ల తిండి దొరకని క్రూర జంతువులు నశించిపోయాయి. ఇలా నశించిపోతున్న క్రూర జంతువులు దిక్కుతోచని స్థితిలో జనపదాలలోకి చొరబడడం ఎప్పుడో అప్పుడు జరుగుతున్న ఘటనలు. కానీ ఈ ఘటనలు జరిగినప్పుడల్లా సంచలన ప్రచార ప్రకంపనాలు విస్తరించిపోతున్నాయి. కానీ నాగరికులు నిరంతరం జరుపుతున్న వన్యమృగ హననం గురించి పెద్ద ప్రచారం లేదు. అమితవేగంగా పయనిస్తున్న రైళ్లకింద పడి పెద్ద పెద్ద ఏనుగులు నలిగిపోతున్న ఘటనలు ప్రతిఏటా ఎక్కడోక్కడ జరుగుతూనే ఉన్నాయి. రైళ్లది తప్పుకాదు, ఏనుగులదీ తప్పుకాదు! ఎనుగులు రైలుపట్టాల సమీపంలో సంచరించకుండా నిరోధించలేని అటవీ సిబ్బంది హంతకులు. అడవులలో తిండి దొరకని ఏనుగులు పంటపొలాలలోకి చొరబడుతుండడం మరో వైపరీత్యం. హైదరాబాద్‌లోని జంతు విహార కేంద్రం-జూపార్క్‌లోని రక్షణ వలయంలో ఉన్న పులి మెడకు గొలుసు వేసి లాగి హత్య చేసిన ఘటన పదేళ్ల క్రితం సంచలనం సృష్టించింది. అయితే ఈ పదేళ్లుగా అనేక పులులు హత్యకు గురై గోళ్లుగా, ఎముకలుగా, చర్మాలుగా మారి చైనాకు తరలిపోయాయి. చైనా సంప్రదాయ వైద్యంలో భాగంగా తయారవుతున్న మందులకు పులిభాగాలు అవసరమట. కానీ చైనా ప్రభుత్వం తమ దేశంలోని పులులను చక్కగా రక్షించుకుంటుంది. చైనాలోని పులుల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. కానీ మనదేశంనుండి పులి అవయవాలను చైనా దొంగచాటుగా దిగుమతి చేసుకుంటోంది. ఈ దొంగచాటు వ్యాపారాన్ని నిరోధించి భారతీయ శార్దూలాలను కాపాడ వలసిందిగా మన ప్రభుత్వం చైనా ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేయడం చరిత్ర..
అటవీ విధ్వంసం వల్ల పారిశ్రామిక కాలుష్యం వల్ల పట్టణ నగర ప్రాంతాలలో కాకులు కనుమరుగయ్యాయి. కాకులు ప్రాకృతిక పారిశుద్ధ్య కార్మికులు. అసహ్యకరమైన పదార్ధాలన్నింటినీ తినేసిన కాకులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాయి. ఇలా కాలుష్యానికి సహజ విరోధులైన కాకులను సమష్టిగా కబళించే స్థాయికి కాలుష్యం పెరిగిపోయింది. ఇలా ఒక్కొక్క పక్షి, జంతువు నశించిపోతున్న కొద్దీ పరిసరాలలో ఒక్కొక్క వైపరీత్యం సంభవిస్తోంది. రాబందులు నశించిపోవడం వల్ల పారశీక మతస్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రసిద్ధం. ఊరికి ఉపకారులైనన పిచ్చుకలు నగర పరిసరాలలో కనిపించవు. ఉడుత ఎలా వుంటుందో నగరాలలో పుట్టిపెరిగిన వారికి తెలీదు. ఈ ముచ్చటైన ఉడుత ఇప్పుడు పల్లెల్లో సైతం అంతరించిపోతున్నది. పట్టుకొని భక్షిస్తున్న పైశాచిక మానవుల సంఖ్య పెరిగిపోయి ఉంది మరి. అపురూపమైన జంతువులను, పక్షులను చంపివేయడం విద్యాధికులుగా, ప్రసిద్ధులుగా చెలామణి అవుతున్న వారికి వినోదంగా మారడం నడిచిపోతున్న వైపరీత్యం. క్రికెట్ క్రీడాకారులు చలన చిత్ర నటులు, రాజకీయవేత్తలు, ఇలా వన్యమృగ హనన ఆరోపణలకు గురి అయ్యారు. అయతే ఈ అభియోగ గ్రస్తుల నేరాలను న్యాయస్థానాలలో ఋజువు చేయలేకపోవడం ప్రభుత్వాల నిరంతర వైఫల్యం. బాటల పక్కన విహరించే సీతాకోక చిలుకలు ఇప్పుడు పుస్తకాలకు పరిమితం.