సంపాదకీయం

‘బాటల’ ప్రగతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పద్దెనిమిది వందల కిలోమీటర్ల మేర జాతీయ రాజమార్గాలు ఏర్పడుతుండడం సమాఖ్య స్ఫూర్తికి సరికొత్త నిదర్శనం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమక్షంలో కేంద్ర రహదారి రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం వరంగల్లులో ఆవిష్కరించిన ఈ పథకం తెలంగాణకు మరో ప్రగతి తోరణం! తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే మాతృభూమికి హరిత హారాన్ని సమర్పించడానికై నడుంబిగించి ఉంది! ఈ రహదారులు భూమాతకు మరో తోరణం! రహదారులకు ఇరువైపుల కాని, మధ్యలోని నడవలో కాని పచ్చని చెట్లు పెంచినట్టయితే రాజపథాలు హరిత హారాలుగా విరాజిల్లడం ఖాయం! దేశంలో తెలంగాణ కూడ భాగమేనన్న చంద్రశేఖరరావు మాట సమాఖ్య స్ఫూర్తికి అనుగుణం! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల నిర్వాహకులు ఇన్నాళ్లుగా ఎడమొగం పెడమొగంగా ఉంటున్నట్టు జరిగిన ప్రచారానికి తెరపడింది! రాష్ట్రాలు దేశంలో అవిభాజ్య అంగాలు కావడం సమాఖ్య రాజ్యాంగ స్ఫూర్తి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాహకులు పరస్పరం సహకరించుకోవడం సమాఖ్య రాజకీయ స్ఫూర్తి! తెలంగాణలో కొత్తగా పనె్నండు రహదారులను జాతీయ మార్గాలుగా తీర్చిదిద్దడానికి నిర్ణయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి పట్ల తన నిష్ఠను ప్రకటించింది! ఈ నిష్ఠ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కూడ సంతృప్తిని వ్యక్తం చేయడం స్ఫూర్తికి నూతన శ్రీకారం! చేసిన మేలు మరువబోమని చంద్రశేఖరరావు వరంగల్లు సభలో ప్రకటించడం ఈ సంతృప్తికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ ప్రదానాలపట్ల రాష్ట్రాలు ఇలా కృతజ్ఞతను ఆవిష్కరించడం అరుదైన విషయం. కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల నిర్వాహకులు భిన్న భిన్న రాజకీయ పక్షాలకు చెందిన వారైనప్పుడు ఇలా సమన్వయ సామరస్య స్వరాలు వినబడడం మరీ అరుదు. అలాంటి అరుదైన సన్నివేశం సోమవారం తెలంగాణ గడ్డపై సూత్రబద్ధమైంది. కొత్త జాతీయ రాజ మార్గాలు ఈ సమన్వయ సూత్రాలు! నలబయి మూడు వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఈ రోడ్ల అభివృద్ధికి ఖర్చుపెడుతుందట! అయితే ఎన్ని సంవత్సరాలలో ఈ రోడ్లు పూర్తి అవుతాయన్నది స్పష్టం కాలేదు! బెంగుళూరునుంచి హైదరాబాద్ వరకు ఇప్పటికే ఎక్స్‌ప్రెస్ హైవే-క్షిప్రయాన పథం- ఏర్పడి ఉంది! దీన్ని హరిత రాజమార్గం-గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వే-గా తీర్చిదిద్దాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం కూడ ఉభయ తెలుగు రాష్ట్రాలకు మరో మంగళ తోరణం! అలాగే హైదరాబాద్-విజయవాడల మధ్య నెలకొని ఉన్న జాతీయ రాజమార్గాన్ని మరింత వెడల్పు చేయాలన్న పథకం ప్రమాదాలను నిరోధించడానికి దోహదం చేయగలదు. తెలంగాణ రాష్ట్రంలో 1355 కిలోమీటర్ల మేర పదకొండు జాతీయ స్థాయి రహదారులు నిర్మించనున్నట్టు అక్టోబర్‌లో ప్రచారమైంది. అయితే చంద్రశేఖరరావు విజ్ఞప్తి మేరకు 1800 కిలోమీటర్ల మేర పనె్నండు రహదారులను నిర్మించాలని కేంద్రం నిర్ణయించిందట! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెరిగిన సదవగాహనకు ఇదంతా నిదర్శనం! సమాఖ్య స్ఫూర్తి పెంపొందుతోంది...
ఈ రహదారులకు కేంద్ర ప్రభుత్వమే నిధులను కేటాయిస్తున్నట్టు నితిన్ గడ్కరీ ప్రసంగం వల్ల తెలియవచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా నిధులనుండి ఈ మొత్తాన్ని కేటాయిస్తారు కాబోలు...ఎందుకంటే ఈ పథకం విషయంలో ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యం గురించి ప్రచారం కావడం లేదు. ప్రభుత్వ ప్రభుత్వేతర భాగస్వామ్యం-పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్-పిపిపి-తో నడుస్తున్న పథకాలు ప్రభుత్వేతర వాణిజ్య సంస్థలకు అక్రమ లాభాల గనులుగా మారిపోయాయి. ప్రపంచీకరణ-గ్లోబలైజేషన్- వ్యవస్థీకృతమైన తరువాత పిపిపి విదేశీయ సంస్థలు మనదేశాన్ని దోచుకుని పోవడానికి మాత్రమే ప్రధానంగా ఉపయోగపడుతోంది! ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణంవల్ల జనానికి ఈ దోపిడీ గురించి బాగా తెలిసి వచ్చింది! నిర్మించి నిర్వహించి ప్రభుత్వానికి అప్పచెప్పే పథకం కింద ప్రభుత్వేతర సంస్థలు ఏర్పాటు చేసిన ఎక్స్‌ప్రెస్ హైవేలు ఈ దోపిడీకి ప్రత్యక్ష సాక్ష్యాలు! ఈ హైవేలను నిర్మించిన ప్రభుత్వేతర సంస్థలు వాటిని ఏళ్లతరబడి నిర్వహిస్తూనే ఉన్నాయి. నిర్వహణ దశ ముగిసి రాజపథాలను తిరిగి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే దశ ఎప్పుడన్న ప్రశ్నకు సమాధానం లేదు! ఇలా నిర్వహిస్తున్న ప్రభుత్వేతర సంస్థలు రహదారి సుంకం-టోల్‌టాక్స్ పేరుతో వాహనాల యజమానులవద్ద భారీగా దండుకుంటున్నాయి. బెంగుళూరు-్భగ్యనగరం మధ్య 560 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ హైవే పొడవునా వున్న అనేక చోట్ల ఈ శుల్క ద్వారాలు ఏర్పడి ఉన్నాయి. ఈ టోల్ గేట్లను ఏర్పాటు చేయడానికి గల మార్గదర్శక సూత్రాలు ప్రజలకు వెల్లడి కాలేదు!
జాతీయ పథాలను, ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మిస్తున్న ప్రభుత్వేతర సంస్థలు సగటున కిలోమీటర్‌కు ఎంత ఖర్చుపెడుతున్నారు? ఎంత మొత్తం రహదారి శుల్కం రూపంలో వసూలు చేస్తున్నారు? బెంగుళూరునుంచి హైదరాబాద్‌కు చేరేలోగా ఒక కారు ఏడెనిమిది చోట్ల శుల్క ద్వారాల వద్ద ఆగి సుంకాన్ని చెల్లించాల్సి వస్తోంది. ఇలా బెంగుళూరునుంచి హైదరాబాద్ చేరే సరికి కారు యజమాని లేదా కారును అద్దెకు తీసుకున్నవారు ఎనిమిది వందల రూపాయల దాకా సుంకాన్ని చెల్లించాలి! బస్సులకు, ట్రక్కులకు ఈ సుంకం చాలా ఎక్కువ! రాష్ట్రాల ప్రభుత్వాల రోడ్డు రవాణా సంస్థలకు చెందిన బస్సులు కూడ ఈ సుంకాలను చెల్లించవలసిందే! ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రయాణం చేస్తున్న ఒక్కొక్క ఆర్‌టిసి బస్సునుండి రహదారుల నిర్వాహకులు రోజుకు రెండు వేల రూపాయల దాకా వసూలు చేసుకుంటున్నారు! ప్రభుత్వేతరులు ప్రభుత్వాలకు పన్నులు చెల్లించాలి! కానీ ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వేతర సంస్థలకు టాక్స్ చెల్లిస్తుండడం రహదారుల నిర్వహణ ప్రహసనంలో భాగం! కల్పాంతం వరకు ఈ సుంకాల వసూళ్లు కొనసాగవలసిందేనా? లేక ఎప్పటికైనా వాహనాలకు ఈ నిత్య సుంకాలనుండి విముక్తి కలుగుతుందా? ఈ కాల వ్యవధి, సుంకాల పరిమాణాన్ని ఎవరు ఏ కొలమానం ప్రాతిపదికగా నిర్ధారిస్తున్నారు? తెలంగాణలో కొత్తగా ఏర్పడే జాతీయ రాజమార్గాలు కూడ ఇలా ప్రభుత్వేతర సంస్థల నిర్వాకానికి గురి కానున్నాయా? లేదా? ఈ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం స మాధానం చెప్పాలి! ఇలా ప్రభుత్వేతర సంస్థలు నిర్వహిస్తున్న రహదారులపై అనేకచోట్ల గతుకులు ఏర్పడి ఉండడం సర్వోన్నత న్యాయయస్థానం నిరసించిన వైపరీత్యం! సరిగా నిర్వహించని రహదారులలో సుంకాలను వసూలు చేయరాదని, శుల్క ద్వారాలను ఏర్పాటు చేయరాదని గత ఆగస్టు 27న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చత్తీస్‌గడ్‌లోని రాయపూర్-దుర్గ్ మధ్య ఇరవై ఆరు కిలోమీటర్ల రహదారికి ఉపయోగించిన వాహనాలపై వసూలు చేసిన పదకొండు కోట్ల రూపాయలను నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వానికి జమ కట్టాలని కూడ సుప్రీంకోర్టు అప్పుడు ఆదేశించింది...
ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం వల్ల ఇతర రహదారులను వెడల్పు చేయడం వల్ల జరిగిపోయిన మరో విపరిణామం ఇరుపక్కలా ఉండిన చెట్లు నరికివేతకు గురి కావడం... నిర్వాహకులు కొత్త చెట్లను పెంచడం లేదు. పెంచి ఉండినట్టయితే ప్రధానమైన పథాలన్నీ పచ్చని శోభలతో కళకళలాడి ఉండేవి. ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ హైవేస్-హరితపథాలు పథకాన్ని ప్రకటించవలసిన అవసరమే ఉండేది కాదు. చెట్లు పెంచని ప్రభుత్వేతర సంస్థలు జరిమానాలు చెల్లించే విధంగా నిబంధనలను ఎందుకు మార్చరు?