సబ్ ఫీచర్

నవ్యాంధ్రకు కేంద్ర గ్రంథాలయం ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర గ్రంథాలయంగా హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లోని గ్రంథాలయం వుండేది. ఇప్పుడది తెలుగు రాష్ట్రాల విభజనానంతరం తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర గ్రంథాలయం అయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం అంటూ లేదు. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ పౌర సంచాలకుల కార్యాలయం తాత్కాలికంగా అఫ్జల్‌గంజ్ గ్రంథాలయంలో కార్యకలాపాలు సాగిస్తోంది. ఆ శాఖ వారు ఈ సమస్య సంబంధంగా ఏదైనా ప్రతిపాదన పంపిన జాడలు కూడా లేవు. ఈ అంశంలో దొరతనానికి ప్రయోజనకరంగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. రాష్ట్ర నూతన రాజధాని, అమరావతిలో కొత్తగా తగిన స్థలంలో గ్రంథాలయాన్ని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంగా పెట్టాలని ఆలోచన ఏమైనా ఉందా? లేదా ఇప్పటికే ఉన్న ఏ గ్రంథాలయాన్నైనా రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంగా చేసే ఒక ఆలోచన ఏమైనా ఉందా? అలా ఉంటే రాజమహేంద్ర వరంలోని ప్రభుత్వ గ్రంథాలయమైన శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయాన్ని రాష్ట్ర కేంధ్ర గ్రంథాలయంగా చేసే అర్హతలున్నాయి.
1920వ ప్రాంతంలో ఆంధ్రపత్రిక సంపాదకులు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గౌతమిని సందర్శించినపుడు ‘‘పరిశోధకులు తరచుగా చెన్నపురి వెడలు అవసరమును తీర్చుటకు రాజమహేంద్రవరంలోని శ్రీ గౌతమి గ్రంథాలయమును కేంద్ర గ్రంథాలయముగా చేయవలెను’’ అని అభిప్రాయాన్ని సందర్శకుల పుస్తకంలో వ్రాసారు. 1920 దశక ప్రాంతంలోనే విశాఖపట్నంలో జరిగిన గ్రంథాలయ మహాసభలో అద్దంకి సత్యనారాయణ శర్మ అనే గ్రంథాలయ కార్యకర్త గౌతమీ గ్రంథాలయాన్ని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంగా చెయ్యాలని శుభాకాంక్షిస్తూ కొన్ని సీస పద్యాలను సైతం వ్రాశారు. ఆ మూడువేల చదరపు గజాల స్వంత స్థలం అపురూప గ్రంథ సంపద ఎన్నో పాత పత్రికల సంపుటాలు, చరిత్రాత్మకమైన రికార్డులు, నాలుగు వందలపైబడి తాళపత్ర గ్రంథాలు ఉన్న గౌతమి సుమారు లక్ష పుస్తకాలతో అలరారుతోంది. విశాఖపట్నంలో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం పెట్టకూడదా? అనే ఒక ఆలోచన రావచ్చు. కాని విశాఖపట్నంలో ఇప్పటికే ఒక ప్రాంతీయ గ్రంథాలయం ఉంది. రెండు విశ్వవిద్యాలయాల గ్రంథాలయాలున్నాయి. విశాఖపట్నం జిల్లా కేంద్రం అవడంతో అక్కడే జిల్లా గ్రంథాలయ సంస్థ కేంద్ర గ్రంథాలయం ఉంది. స్టీలు ప్లాంటులోని గ్రంథాలయం, మరి ఇంకా కొన్ని గ్రంథాలయాలు కూడా ఉన్నాయి. అందువల్ల అక్కడ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం పెట్టడం అవసరం లేదేమోనని అనిపిస్తోంది. గుంటూరులో రాష్ట్ర ప్రాంతీయ గ్రంథాలయం ఉంది. అక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ, కేంద్ర గ్రంథాలయం ఉంది. ఇంకా మరికొన్ని గ్రంథాలయాలున్నాయి. విజయవాడలో జిల్లా గ్రంథాలయ సంస్థ, కేంద్ర గ్రంథాలయం, రామమోహన గ్రంథాలయం, సర్వోత్తమ గ్రంథాలయం, ఠాగూరు గ్రంథాలయం, వెలిదిండ్ల హనుమంతరాయ గ్రంథాలయం, క్షీణదశలో శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర గ్రంథాలయం కొన్ని కళాశాలల మంచి గ్రంథాలయాలు ఉన్నాయి. తిరుపతిలో ప్రాంతీయ గ్రంథాలయం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ గ్రంథాలయం మరికొన్ని గ్రంథాలయాలున్నాయి.
రాజమహేంద్రవరంలో గౌతమీ ప్రైవేటు గ్రంథాలయంగా ఉండి 1979 ఫిబ్రవరి 19వ తేదీన శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంగా మారింది. రాజమహేంద్రి సాహిత్య కేంద్రమైనా, జిల్లాకు కేంద్రం కాకపోవడంతో నగరంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కేంద్ర గ్రంథాలయం ఉండే అవకాశం లేదు. నన్నయ్య తెలుగు విశ్వవిద్యాలయ గ్రంథాలయాలు అభివృద్ధి చెందే స్థితిలో వున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సదరన్ రీజినల్ సెంటర్ డైరెక్టర్ చేసిన దివంగత పి.సత్యనారాయణ గౌతమీ గ్రంథాలయాన్ని జాతీయ గ్రంథాలయంగానే చేయవచ్చు అన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇందుకై నగర ప్రముఖులు శ్రీ యాతగిరి నరసింహారావు కొన్ని ప్రయత్నాలు సాగించారు కూడా. అంత పెద్ద కోరికను తీర్చాలంటే పార్లమెంటు సభ్యుల తీర్మానం కూడా అవసరమని భావించారు.
ఇట్టి పరిస్థితులలో 1898లో నాళం కృష్ణారావు వెలిగించిన దీపం తరువాత గౌతమిగా వెలిగింది. కొన్ని గ్రంథాలయాల సమ్మేళన ఫలంగా సజీవ గ్రంథాలయ గౌతమి అయింది. రాష్ట్ర ప్రభుత్వం గౌతమిని స్వీకరించి మూడు దశాబ్దాలు పైబడినా సరైన భవన నిర్మాణాలే జరగలేదు. అరకొర నిధులు. ముప్ఫై ఐదు మంది సిబ్బంది అవసరం కాగా చాలీ చాలని స్వల్ప సిబ్బందితో గౌతమీ ఖాళీ పోస్టుల నియామకానికి ఎదురుచూస్తోంది. మహనీయుడు నార్ల వెంకటేశ్వరరావు గౌతమిని గురించి ఎపుడో ‘ఏ గ్రేట్ లైబ్రరీ విత్ గ్రేట్ ప్రాబ్లమ్స్’ అన్నారు. ఆ విశే్లషణకు ఇప్పటికి తగినట్టుగానే ఉంది గౌతమి. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంఘం శ్రీమతి పి.చిరంజీవిని కుమారి అధ్యక్షతన రాజమహేంద్రిలోని గౌతమిని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంగా చెయ్యాలని తీర్మానించారు. ఇంకా కొన్ని సంస్థలు ఇలా తీర్మానించాయి.
కనుక గౌతమిని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంగా చెయ్యడానికి ఆలోచనలు దొరతనం చెయ్యాలి. నిపుణుల అభిప్రాయాలు సేకరించాలి. ఆంధ్రప్రదేశ్‌కు గ్రంథాలయ పరిషత్తును గ్రంథాలయ రంగ సేవా నిపుణులతోను, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం (విజయవాడ) ప్రతినిధులతోను పునర్నిర్మించాలి.

-సన్నిధానం నరసింహ శర్మ సెల్: 9292055531