మెయన్ ఫీచర్

విద్యాశిక్షణలో మార్పు రావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయసుతో సంబంధం లేకుండా, నేరాన్నిబట్టి శిక్ష వేయాలంటూ నిర్భయ కేసు నిందితుడి విడుదల సందర్భంగా అంటున్న మాటలివి. డిసెంబర్ 16, 2012న ఢిల్లీలో జరిగిన ఘోరమైన అత్యాచార నిందితుల్లో ఒకరైన బాల (యువ) నేరస్థున్ని 18 సంవత్సరాలు నిండటం తో జువనైల్ హోంలో వుంచడం కుదరదని, ఢిల్లీ హైకో ర్టు డిసెంబర్ 18న ఆదేశించడంతో డిసెంబర్ 20న భద్రతా చర్యలతో గుర్తుతెలియని ఓ ఎన్‌జివో సంస్థకు పునరావాసానికై అప్పగించారు. ఈ విడుదలను నిరసిస్తూ నిర్భయ తల్లిదండ్రులతో సహా కొందరు ఇండియాగేట్ దగ్గర నిరసన తెలిపారు.
అత్యాచారం, హత్యలకు పాల్పడే బాల నేరస్థులను కూడా పెద్దవారు చేసే నేరదృష్టితోనే చూడాలని ఈ నిరసనకారుల డిమాండ్. ఇందులో సాంఘిక న్యాయం కనపడుతుంది. ‘ఎవరు చేసినా నేరం నేరమేగా...?’అనేది దీని సూత్రీకరణ! ఈ అంశంపై రెండురకాల వాదనలు వినపడుతున్నాయి. మొదటిది పై వాదన అయితే, రెండోది బాల నేరస్థుల్ని పెద్దవారి దృష్టితో చూడకూడదని! దీనికి వీరు చెపుతున్న అనేక సాంఘిక కారణాలు వున్నాయి. 1920నాటి బ్రిటీషు చట్టం ప్రకారం, నేరస్థులైన పిల్లల్ని కూడా సాధారణ జైలుకు పంపే విధానం వుండేది. కాని, ఎదగని మేధస్సు, వయస్సు, ఇంటి, సామాజిక పరిస్థితులు పిల్లల్ని నేరాలవైపు పురికొల్పడమో, లేదా అనుకోని పరిస్థితిలో నేరాలు చేస్తారు కాని, మనసావాచా కాదనేది అత్యధికులు, న్యాయకోవిదులు, సామాజికవేత్తలు గుర్తించడంతో ఆ చట్టానికి అనేక సవరణలు జరిగాయి. పిల్లల హక్కుల, రక్షణ చట్టాలు వచ్చాయి. నేరస్థులైన పిల్లల రక్షణకై, వారి సాంఘీకరణకై ప్రత్యేక సంస్థల్ని (్హ్యౄళ) ఏర్పాటుచేసి, విద్యనందించడం, వివిధ అంశా ల్లో శిక్షణనిచ్చి, పద్దెనిమిది సంవత్సరాలు, లేదా కనీసం మూడు సంవత్సరాల శిక్షణ (శిక్షకాదు) తర్వాత వారిని విడుదల చేయడం జరుగుతున్నది.
ఇవికూడా ఆశించిన ఫలితాల్ని ఇవ్వకపోవడం, పిల్లల్లో సంవత్సర సంవత్సరానికి నేరప్రవృత్తి పెరగడంతో కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్, 2000 అనే చట్టాన్ని రూపొందించి, ప్రతీ జిల్లాలో జువనైల్ జస్టీస్ బోర్డుల్ని ఏర్పాటుచేసి, పిల్లల్ని తీర్చిదిద్ది తిరిగి సమాజంలో హుందాగా బతికేలా చేయాలనేది ఈ చట్టం ఆలోచన! కాని, ప్రతి జిల్లాలో ప్రత్యేక బోర్డులు ఏర్పడకపోగా, జిల్లా కలెక్టర్లకు (మెజిస్ట్రేట్), ఎస్‌పీలకే ఈ బోర్డుల్ని అప్పజెప్పడంతో క్షేత్రస్థాయిలో ఈ చట్టం పూర్తిగా విఫలమైం ది. తిరిగి 2012లో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెనె్సస్ (పిఓఎస్‌సిఓ) అనే చట్టాన్ని ఆడ, మగ అనే వివక్షత లేకుండా రూపొందించగలిగింది. ఈ విధంగా పిల్ల ల్ని అత్యాచారాల భారీ నుంచి రక్షించడమేకాక, నేరస్థుల్ని, బాధితుల్ని కూడా సంస్కరించాలని, రక్షణ కల్పించాల్సిన బాధ్యతల్ని ఈ చట్టాలు గుర్తించాయి. అయినా ఆశించిన మార్పురాకపోగా, జరుగుతున్న నేరాలల్లో బాలల ద్వారా జరిగేది కూడా దారుణంగా వుంటున్నాయి.
వీటిని నిలువరించాలంటే, ప్రస్తుతమున్న శిక్షకు అర్హతగల 18 సంవత్సరాల వయస్సును కుదించాలనేది మహిళా సంఘాల, కొన్ని మహిళా కమిషన్ల నినాదం. నిర్భయ సంఘటన నుంచే ఈ డిమాండ్ పెద్దఎత్తున ముందుకు రాగా, ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం జువనైల్ జస్టీస్ బిల్లు 2015ను లోక్‌సభలో ఆమోదించింది. కాని రాజ్యసభలో కాంగ్రెస్‌తో సహా, వామపక్షాలు వ్యతిరేకించడంతో ఆమోదం సాధ్యపడలేదు. తిరిగి బాల నేరస్థుడు విడుదలైన సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్యసభలో డిసెంబర్ 22న ప్రవేశపెట్టడంతో వామపక్షాలు మినహా కాంగ్రెస్‌తో సహా మూజువాణి ఆమోదంతో బిల్లు ఆమోదం పొందింది. ఆవేశంతో బిల్లుల్ని ఆమోదిస్తే, చట్ట రూపందాల్చే ఈ బిల్లులు అనేక దుష్ఫలితాలకు కారణవౌతాయని, పూర్వాపరాలను చర్చించడానికి ఓ సెలెక్టు కమిటీని ఏర్పాటుచేసి చర్చించి, సూచనల్ని స్వీకరించి రూపొందించాలని వామపక్షాలు వాదించినా, రాజ్యసభ పట్టించుకోలేదు. ఈ బిల్లుపై మిశ్రమ స్పందనల్ని మీడియాలో చూస్తూనే వున్నాం. పిల్లల హక్కుల సంఘాలు, మహిళా న్యాయశాస్త్ర నిపుణులతో సహా, మహిళా హక్కుల కార్యకర్తలు ఈ బిల్లుపట్ల ఆందోళనను వ్యక్తపరుస్తున్నారు. చట్టాలు మార్గదర్శకంగా వ్యవస్థను, వ్యక్తు ల్ని బాగుచేసేదిలా వుండాలి గాని, కన్నుకు కన్ను, పన్ను కు పన్ను పరిష్కారం కాదనేది చాలామంది అభిప్రా యం! ఈ జువనైల్ జస్టీస్ బిల్లుకూడా ఈ కోవలోనే వుందనేది వీరి ఆరోపణ. పత్రికలు ఘోషిస్తున్నట్లు, ప్రభుత్వం వాదిస్తున్నట్లు ఇతర నేరస్థుల్లా బాల నేరస్థుల సంఖ్య పెరగడం లేదని, కాని హేయమైన అత్యాచారాలకు బాల నేరస్థులు పాల్పడుతున్నారనే తప్పుడు అభిప్రాయాన్ని కల్గించి బిల్లురావడానికి కారకులయ్యేరనేది మిగతావర్గాల వాదన. గత పది సంవత్సరాల కాలంలో బాల నేరస్థుల సంఖ్య 14,297కాగా, మిగతా నేరస్థుల సంఖ్య రెండుకోట్లకు పైగా వున్నట్లు నేర పరిశోధనా రికార్డులే తెలుపుతున్నాయి. అలాగే 2004నుంచి 2014 మధ్యన బాల నేరస్థుల సంఖ్య ఒక శాతం నుంచి 1.2 శాతానికి మాత్రమే పెరిగిందని, 2014లో అత్యాచారాలు చేసిన పెద్దవారి సంఖ్య 48,193 కాగా బాల నేరస్థులు కేవలం 1,989 (4.7%)మేనని గణాంకాలు తెలుపుతున్నాయి. వివిధ నేరాల కింద కేసులు నమోదుఅయిన బాలలు 2012లో 31,973గా, 2013లో 35,861గా, 2014లో 38,565గా వున్నాయి. ఈ నేరాలకు పాల్పడే పిల్లల కుటుంబాల వార్షిక ఆదాయం 25వేలు మించనివారే అత్యధికులు కావడం గమనార్హం. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు, పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రవర్తన వెరసి, బాల నేరాలకు కారణభూతవౌతున్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి.
నిర్భయ కేసు బాల నేరస్తుడిది కూడా ఇలాంటి కథనే! పది సంవత్సరాల వయస్సులోనే కుటుంబ ఆర్థిక కారణాలతో ఇల్లువదిలి ఢిల్లీకిచేరిన ఈ బాలుడు సంఘవ్యతిరేక ఆలోచనాపరులతో కలవడం, వారుచేసిన నేరంలో భాగస్వామికావడం జరిగిపోయింది. మెజిస్ట్రేట్ల సమక్షంలో రెండుసార్లు ఈ నిందితుడిని నిర్భయముందు ప్రవేశపెట్టినా, ప్రధాన నిందితుడిగా, ఘోరమైన అత్యాచారంచేసిన వ్యక్తిగా ఆమె గుర్తించలేదు. కేవలం రాంసింగ్ అనే మరో నేరస్థుడు చెప్పడంతో ఈ బాల నేరస్తుడిని నిర్భందించారు. రాంసింగ్ జ్యుడీషియల్ నిర్బంధంలో చనిపోగా, నిర్భయ కూడా మరణించింది తెలిసిందే! నిర్భయ సంఘటన బాధాకరమైనదే కాక, హేయమైన చర్యనే! నేరస్తులకు శిక్షపడాల్సిందే! కాని, ఆరోపణపై, శిక్షలుపడడం సరియైంది కాదనేది ఆలోచనాపరుల ఆవేదన!
నాణెంకు బొమ్మ, బొరుసు వున్నట్లే, ప్రతి అంశానికి రెండు కోణాలుంటాయి. ఒక కోణానే్న పట్టించుకునే సమాజం మనది. సమస్య మూలాల్ని కారణాల్ని విశే్లషించే అలవాటు మనకింకా అబ్బలేదు. నేరం చేసినవారికి శిక్షలుండాలనడం ఎంత సహజమో, నేరప్రవృత్తికిగల ఇతర కారణాల్ని ఆలోచించడం అంతే అవసరం. ఆరోగ్యకరమైన సామాజిక వాతావరణం లేనప్పుడు, అసమానతలు, అక్రమాలు, ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కొనసాగినంత కాలం ఈ రుగ్మతలు ఇలాగే కొనసాగుతాయి. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే! ఏ దేశంలో లేనంత యువ సంపద భారతదేశంలో వుంది. రేపటి ఈ సంపదను సరియైన మార్గంలో నిర్దేశించాల్సిన పాఠశాలలు, సాంఘిక సంస్థలైన కుటుంబం, సంప్రదాయాలు, మతాలు, రాజకీయాలు, ఆర్థిక సంబంధాలు తప్పుడు మార్గంలోనే కొనసాగుతున్నాయి. పిల్లల పెంపకంలో వివక్షతని, అజాగ్రత్తలని పాటించే సమాజం మనది. వీటిని నియంత్రించాల్సిన పాఠశాల, పాఠ్యప్రణాళికలు బాధ్యతారాహిత్యంగానే పనిచేస్తున్నాయి.
సామాజిక పరిపక్వతకు, నేరప్రవృత్తికి కూడా చాలా దగ్గరి సంబంధం వుంటుందనేది వాస్తవం. అభివృద్ధిచెందాయని భావించే నగరాల్లో, పట్టణాల్లో కనుపించే నేర సంస్కృతి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ఆవాస ప్రాంతాల్లో లేకపోవడం గమనార్హం! ఇక్కడి సమాజాల్లో వుండే కట్టుబాట్లు, నిబంధనలు నేరాలకు పాల్పడితే వెనువెంటనే అమలుచేసే శిక్షలు నేరాల్ని నియంత్రిస్తే, పోలీసు వ్యవస్థ, న్యాయస్థానాలు, రాజకీయ పలుకుబడి, ప్రమేయం, ఆర్థికస్థోమత లాంటి తదితర అంశాలు పట్టణాల్లో, నగరాల్లో నేరాల్ని పెంచి పోషిస్తున్నాయి. ఏ పోలీసు స్టేషన్‌లో చూసినా, సామాన్యజనం కనపడతారేగాని, రాజకీయ సంబంధం గలవారు, డబ్బున్నవారు ఒక్కరంటే, ఒక్కరు కనపడరు. అసలు నేర సమాజానికి కారకులైన ఈ ఉన్నతవర్గాలు బయట దర్జాగా వుండడమేకాదు, శిక్షలనేవి వీరి దరికేరావు. బడుగువర్గాలు ఎంత సులభంగా నేరాల్ని ఒప్పుకుంటాయో అంతే సులభంగా శిక్షల్ని అనుభవిస్తాయి. కిందిస్థాయి వర్గాల నేరాలు రికార్డు అయినంతగా, ఉన్నతవర్గాల నేరాలు రికార్డుకావడం లేదు. ఈ వర్గాలు ప్రమోటుచేసే ఆశారాం బాపులాంటి వారి జీవిత చరిత్రల్ని గొప్ప వ్యక్తులుగా వర్ణిస్తూ రాజస్థాన్ లాంటి ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో చేరుస్తున్నాయి. ఇలాంటి మహామహులంతా పుణ్యపురుషులని చదివే రేపటితరం ఎలా నిర్మితవౌతుందో మనకెవరికి పట్టదు. అందరికీ దైవచింతననే! అయినా అత్యాచార పర్వాలెందులకు జరుగుతున్నాయో మన బుర్రలకు తట్టదు. ఆర్థికంగా పిల్లలు ఎంత ఎదిగారనే ఆశనే గాని, నైతికంగా ఎంతగా దిగజారుతున్నారో పట్టించుకోకపోతే ఇప్పటి పరిస్థితులే పునరావృతమవుతాయి.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162