ఈ వారం కథ

అమ్మకో ఆల్బమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసు బాగాలేనప్పుడు ముందు రాజేష్ గుర్తుకొస్తాడు. ఆ తర్వాత ఇండియా గేట్. పెళ్ళైన కొత్తలో ఇద్దరం ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న మారుతి 800ను ఇండియా గేట్ వైపు పోనిచ్చింది విశారద. దూరమెక్కువైనా కావాలనే ఏపీ భవన్, చిన్మయ మిషన్, లోథీ రోడ్డు, పార్కు, జంతర్‌మంతర్, ఆంధ్రా స్కూల్, పాటియాలా హౌస్, సుప్రీంకోర్టుమీదుగా ఇండియా గేట్ చేరుకుంది. ఆ ప్రాంతాల్లో రాజేష్‌తో విశారద గడిపిన జ్ఞాపకాల వయస్సు పాతికేళ్ల పైమాటే. ఆలోచనలనుంచి తేరుకుని కారును పార్క్ చేసింది. టోకెన్ తీసుకొని చుట్టూ చూసింది. జూలై నెలాఖరు. వెలుగు, చీకట్ల సంధికాలం. ఉక్కపోతనుంచి తేరుకుంటున్న ఢిల్లీ వాసులు ఎక్కడెక్కడినుంచో వచ్చి ఇండియాగేట్ చుట్టూ పరుచుకున్న చిక్కటి పచ్చికలో దేహాలను స్వాంతన పరచుకుంటున్నారు. బెలూన్లు, బొమ్మలు, పీచుమిఠాయి అమ్మేవాళ్లు పిల్లలున్న చోటికి, పూలు, పానీపూరీలు అమ్మేవాళ్లు మిగతా జనాల చుట్టూ తిరుగుతూ వ్యాపారంలో మునిగితేలుతున్నారు.
కుటుంబాలకు కుటుంబాలుగా కలిసివచ్చిన వాళ్లు గడ్డిమీద మందమైన దుప్పట్లు పరిచి వాటిపై తెచ్చుకున్న తినుబండారాలు ఉంచుతున్నారు. వాటిని ఆరగించే ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఇండియా గేట్ స్థూపం మధ్యలో అమర జవాన్లకు నివాళిగా గ్యాస్‌తో వెలిగేలా నాలుగు గొట్టాలతో ఏర్పాటుచేసిన అఖండ జ్యోతిలో మూడవ గొట్టంనుంచి వెలుగుతున్న జ్వాల ఈదురుగాలులకు మరింతగా విరాజిల్లుతోంది. బస్సులోనుంచి దిగి గలగలలాడుతూ ఇండియా గేట్ చేరుకుంటున్న కాలేజీ అమ్మాయిల రాకతో అప్పటిదాకా గంభీరంగా ఉన్న వాతావరణానికి యవ్వనోత్సాహం జత కట్టింది. నిరంతరం స్థూపానికి కాపుగాచే భద్రతా సిబ్బంది వీళ్లను చూడగానే మరింత అప్రమత్తమయ్యారు. చుట్టూ అల్లిన ఇనుప గొలుసుల కంచె వద్దకు మరికాస్త దగ్గరగా వచ్చారు. ఆ విధంగా ఇండియా గేట్ పవిత్రత, హుందాతనాన్ని కాపాడ్డంలో తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించసాగారు.
ఇదేమీ పట్టనట్టుగా విశాలమైన గడ్డి మైదానంలో చిన్నపాటి కొలను పక్కన గుబురుగా అల్లుకున్న చెట్టు దగ్గరకు చేరుకుంది విశారద. ఆలోచనలకు అడ్డుతగులుతున్న కళ్లజోడును తీసి హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టేసింది. వయోభారంతో చెట్టు కింద నెమ్మదిగా కూర్చుంది. వాటర్ బాటిల్‌లో నీళ్లు గొంతు దాటాయి. మనసు లోతుల్లో దాగి వున్న జ్ఞాపకాలు బైటకు రాసాగాయి.
ఇక్కడే విశారద రాజేష్‌ను తొలిసారి కలుసుకుంది. ‘జిందగీ ఏక్ సఫర్.. ఏ సుహానా’ పాటలో రాజేష్‌ఖన్నా నడిపిన చిన్న సైజు బైక్‌మీద కనపడ్డాడు. పీజీ చేసేందుకు విశారద రోజూ ఆగ్రా నుంచి ఢిల్లీకి వచ్చేది. అప్పుడప్పుడు ఇండియా గేట్‌కు కూడా వచ్చేది. ముందుగా తనే ప్రపోజ్ చేశాడు. ఆమెను చూడ్డానికి ఆగ్రా వచ్చేవాడు. నార్త్ బ్లాక్‌లో మంచి ఉద్యోగం. ఆమె చదువైపోయేసరికి ఇద్దరు విడదీయలేనంతగా గాఢమైన ప్రేమికులైపోయారు. పెద్దలు పెళ్లికి ససేమిరా అన్నారు. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి. గవర్నమెంట్ క్వార్టర్స్‌లో కాపురం. చూడ్డానికి చుట్టపు చూపుగా ఒక్కరూ రాలేదు. అయినవాళ్లు తృణీకరించారన్న గుండెడు బాధకు చిన్న చిన్న సరదాలతో కొత్త జంట ముసుగేసింది. హేమంత్ కుమార్ గాత్రమన్నా, బాణీలన్నా రాజేష్‌కు చచ్చేంత ఇష్టం. ఆర్ద్రతకు మాధుర్యాన్ని జోడించి పాడేవాడు. మైమరచిపోయి వినేది విశారద. కన్నాట్‌ప్లేస్, రీగల్ థియేటర్లో సినిమాలు చూడ్డాలు, ఏపీ భవన్‌లో కాఫీ, టిఫిన్లు, భోజనాలు.. క్రమం తప్పకుండా తాజ్‌మహల్ సాక్షిగా పున్నమివెనె్నల్లో మధురానుభూతుల స్నానాలు.
చీర కొంగు ఎవరో లాగినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది విశారద. చిన్నపిల్లాడు. మూడేళ్లుంటాయేమో, రూపురేఖల్లో చిన్నప్పటి సుదీప్‌ను గుర్తుచేస్తున్నాడు. ఎత్తుకోమని చేతులు చాపుతున్నాడు. ఇంతలో పిల్లాడి తల్లి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. వాడి పిర్రమీద ప్రేమతో ఒక్కటిచ్చింది. విశారద వైపు నవ్వుతూ చూసింది. వాడ్ని ఎత్తుకొని వాళ్ల దగ్గరకు వెళ్లిపోయింది.
రాజేష్, విశారదల దాంపత్యానికి నిండుదనాన్ని తెస్తున్నట్టుగా సుదీప్ పుట్టాడు. అందరికీ ఫోన్ చేసి చెప్పారు. పిల్లాడ్ని చూడ్డానికి ఎవ్వరూ రాలేదు. పంతాలు, పట్టింపులముందు పేగుబంధాలు పనికిరావేమో. వాడి ఆలనా పాలనలో మైమరచిపోయారు భార్యాభర్తలు. అంతా సాఫీగా సాగిపోతే దేవుడెందుకు గుర్తుకొస్తాడు?
పనిలో పడితే రాజేష్‌కు అన్నపానీయాలు గుర్తుకురావు. వేళకి భోజనం చెయ్యమని విశారద ఎన్నోసార్లు చెప్పి చూసింది. అయినాకానీ పని పూర్తయ్యాక తాపీగా భోజనం చెయ్యవచ్చు కదా! అనేవాడు. అలా ఒకరోజు వేళకాని వేళ ఆఫీసులో భోంచేస్తుండగా రాజేష్‌కు వెక్కిళ్లు వచ్చాయి. అటెండర్ నీళ్లు తెచ్చిచ్చేలోగా స్పృహ తప్పిపడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తే అప్పటికే చనిపోయాడని చెప్పారు వైద్యులు. సుదీప్‌ను ఎత్తుకొని ఆస్పత్రికి పరుగుపరుగున వెళ్లింది విశారద. విషాదం నుంచి తేరుకునేలోగానే తోటి స్నేహితులు మిగతా కార్యక్రమాలు కానిచ్చేశారు.
ఈలోగా ఖాళీ అయిన ఉద్యోగం కోసం రాజేష్ తమ్ముడినంటూ ఒకతను వచ్చాడు. తన అన్నకు అసలు పెళ్ళే కాలేదని, కనుక అతడి తదనంతరం చట్టపరంగా ఆ ఉద్యోగం తనకే దక్కాలంటూ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు. అయితే రిజిస్టర్ ఆఫీస్ వారు ఇచ్చిన పెళ్లి సర్ట్ఫికెట్ విశారదకు సకాలంలో ఆదుకుంది. కొడుకుతో వీధినపడకుండా రాజేష్ ఉద్యోగం ఆమెకు వచ్చింది.
ఆలోచనలనుంచి బయటికి వచ్చి చూసింది విశారద. తనను దాటుకుంటూ వెళుంతోంది ఒక జంట. అమ్మాయి మెడలో పసుపుతాడు, కాళ్లకు ఇంకా ఆరుని పారాణి. కొత్తగా పెళ్లయిన వారిద్దరూ ఏవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళుతున్నారు.
చూస్తుండగానే సుదీప్ పెద్దవాడయ్యాడు. ప్రయోజకుడయ్యాడు. మంచి ఉద్యోగంలో చేరాడు. తన బాస్ కూతురు అంజలిని పెళ్లి చేసుకుంటానని తల్లి విశారదతో అన్నాడు. సరేనంది. పెళ్లిచూపులయ్యాయి. కొద్దిరోజులకే నిశ్చితార్థం జరిగింది. అప్పటినుంచి సుదీప్ తనను పట్టించుకోవడం లేదన్న భావన విశారదలో కలిగింది. అంజలికి అదేపనిగా ఫోన్లు.. ఎడతెరిపి లేకుండా కబుర్లు.. చాటింగ్‌లు, ఎస్‌ఎమ్మెస్‌లు. ఏవేవో అనుమానాలతో ఆలోచన జోరీగలు కన్నతల్లి బుర్రలో రొదపెడుతున్నాయి.
‘‘ఇలాంటప్పుడే రాజేష్ నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తాడు..’’ అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్ తెరిచి చూసింది విశారద. రాజేష్ ఫొటో కనిపించలేదు. ఏదో కలవరపాటు ఆవరించడంతో కణతలు నొక్కుకుంటూ కూర్చుండిపోయింది.
సుదీప్, అంజలిల పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. విందు, వినోదాల ఏర్పాట్లలో అంజలి తల్లిదండ్రులు ఏ లోటు రానివ్వలేదు. కొత్తదంపతులతోపాటుగా అంజలి తరఫు బంధువులు పెళ్లికొడుకు ఇంటికి తరలివచ్చారు. పెళ్లి ఫొటోల ఆల్బమ్ వచ్చింది. అందరూ చూస్తున్నారు. కానీ చూద్దామంటే విశారద దాకా అది రావడంలేదు. ‘‘ఏదో జరుగుతోంది. తనను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారా? సుదీప్ ఎక్కడ?’’ అనుకుంటూ అంతా వెదికింది. కనిపించలేదు. మూడు రాత్రులు కాకుండానే కొత్త జంట గదిలోకి చేరాక తలుపులు బిడాయించుకుంది.
మనసంతా వేదనతో నిండిపోయింది. ఎప్పుడైనా మనోవేదన కలిగినప్పుడు రాజేష్‌ను తొలిసారి కలిసిన ఇండియాగేట్ దగ్గరకు రావడం అలవాటుగా చేసుకుంది విశారద. ఇవాళ కూడా అదే చేసింది. మళ్లీ మంచినీళ్లు తాగింది. కర్చ్ఫీతో ముఖం తుడుచుకుంది. అప్పుడప్పుడే చీకటి పరుచుకుంటున్నది. తాను కూర్చున్న చెట్టుపక్కన వీధి దీపం వెలుగుతున్న కారణంగా అంతా స్పష్టంగా కనిపిస్తోంది. దూరంనుంచి ఎవరో తనవైపు వస్తున్నట్టు అనిపించింది ఆమెకు. కళ్లజోడు పెట్టుకుని చూసింది. సుదీప్, అంజలి తనవైపే వస్తున్నారు.
‘‘ఇదేంటి.. వీళ్లిద్దరూ అప్పుడే గడప దాటేశారు? ఆ కార్యక్రమం పూర్తయ్యాక బయటకు వస్తే బాగుండేది కదా? ‘‘అమ్మ ప్రేమతో మనసులో కొత్త జంటపైన కోప్పడింది. ఐనా తప్పంతా నాదే.. ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేస్తే అంతా కంగారుపడిపోరూ.. తన గురించి సుదీప్‌కు బాగా తెలుసు కాబట్టి భార్యను వెంటపెట్టుకొని నేరుగా ఇక్కడకి వచ్చాడు’’ దగ్గరకు వస్తున్న ఇద్దర్నీ మురిపెంగా చూస్తూ అనుకుంది విశారద.
నవదంపతులు ఆమె పక్కనే వచ్చి కూర్చున్నారు. సుదీప్ చేతిలో ఫొటో ఆల్బమ్. అమ్మ చేతికి ఇచ్చాడు. అందరూ చూశాక చివరిగా నాకు ఇస్తారా? అన్నట్టుగా అంత ఆసక్తి లేనట్టుగా విశారద ఆల్బమ్‌ను తెరిచింది. ఆమె ముఖంలో మాటలకందని ఆశ్చర్యం.. ఆనందం.! పెళ్లి ఫొటోల్లో పట్టువస్త్రాల్లో తన పక్కనే నిల్చుని ఉన్నాడు రాజేష్. ఇప్పుడు కనుక బతికి ఉంటే ఇలాగే ఉంటాడు అన్నట్టుగా చెంపలపైన, తలపైన అక్కడక్కడా నెరిసిన జుట్టు. విశారదతోపాటు పెళ్లి జరిపిస్తున్నట్టుగా దాదాపుగా అన్ని ఫొటోల్లో... ఆమె పక్కనే రాజేష్.
‘‘మా.. సారీ.. మా. నిన్ను బాధపెట్టి ఉంటే.. సారీ మా’’ అంటూ విశారద ఒడిలో తలదాచుకుంటూ అన్నాడు సుదీప్.
‘‘సారీ మాజీ, మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేద్దామని... నిన్న రాత్రినుంచి కంప్యూటర్ ముందు కూర్చొని ఈ ఫొటోలు తయారుచేశాం. మీ పర్మిషన్ లేకుండా మీ హ్యాండ్ బ్యాగ్‌లోనుంచి అంకుల్ ఫొటో తీశాం’’ రాజేష్ ఫొటో ఇస్తూ బెరుగ్గా చెప్పింది అంజలి. విశారద ఇద్దర్ని దగ్గరకు తీసుకుని నుదుట ముద్దులు కురిపించింది. ఫొటో ఆల్బమ్ నుంచి రాజేష్ తమను నవ్వుతూ చూస్తున్నట్టుగా అనిపించింది ఆమెకు. సన్నగా వానజల్లు కురవడం మొదలైంది. *

-మహేష్ ధూళిపాళ్ల