ఈ వారం కథ

జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అమ్మా అనూషా! అమ్మా వాళ్ళంతా బయలుదేరారా?’’ అడిగింది సుజాతాదేవి.
‘‘ఇదిగో బయలుదేరుతున్నాం ఆంటీ!’’ చెప్పింది అనూష.
‘‘డైరెక్టుగా మీటింగ్ హాలు దగ్గరకు వచ్చేయండమ్మా! నేను ఇంకా చాలామందికి ఫోన్లు చేసి చెప్పాలి. నేను వచ్చేసరికి కొంచెం ఆలస్యమవుతుంది’’ చెప్పి ఫోను దగ్గరకు వెళ్ళింది సుజాతాదేవి.

సుజాతాదేవి తెలుగు సాహిత్య రంగంలో ప్రముఖ రచయిత్రి. ఆ రోజు మరికొద్దిసేపటిలో ఆమె రాసిన పుస్తకం ఆవిష్కరణ సభ వుంది. అదీకాక సుజాతాదేవి సాహిత్యం రంగంలోకి అడుగుపెట్టి 25 ఏళ్ళు అయిన సందర్భంగా గుంటూరుకు చెందిన ‘అక్షరం’ సంస్థవారు ఆమె చేసిన సాహిత్య కృషికిగాను సన్మాన సభ ఏర్పాటుచేశారు. అదే సభలో ఆవిడ రాసిన 25వ పుస్తకం ఆవిష్కరణ కూడా జరుగుతుండడంవల్ల ఆ రోజు ఆ సభకు ఓ ప్రత్యేకత కలిగింది. అందుకే ఆవిడ ఆ రోజు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తనకు పరిచయం వున్న ప్రతి ఒక్కరికీ ఫోన్ చేసి మరీ ఆహ్వానిస్తున్నది.
‘‘హల్లో.. శంకరంగారూ! నేనూ.. సుజాతాదేవినండీ! మీ ఇంటికి కారు పంపాను, వచ్చిందా?’’ ఫోన్ చేసి అవతల అతనిని అడిగింది సుజాతాదేవి.
‘‘ఆ వచ్చిందండీ! రాజశేఖరంగారి కోసం వెయిటింగ్. ఆయన రాగానే కాసేపటిలో బయలుదేరుతాం’’ చెప్పాడు అవతలనుండి శంకరం అనే ఆయన.
మళ్ళీ మరికొన్ని నెంబర్లకి ఫోన్ రింగ్ చేసి ఇంకొందరితో ‘ఇది ఓ ప్రత్యేక సందర్భం వున్న సభ అని, అందర్నీ మరీ మరీ సభకు రమ్మనమని’ ఆహ్వానించిందామె.
ఆమె ఫోన్ కట్ చేసిన వెంటనే అవతలనుండి సుభాష్ ఫోన్ చేసి చెప్పాడు, ‘‘మేడమ్! సభకు అన్ని ఏర్పాట్లు చేసేసాం. అప్పుడే సభకు ప్రేక్షకులు ఓ అరవై మందిదాకా వచ్చేశారు. మీరు కాసేపట్లో బయలుదేరితే బాగుంటుంది’’ అని.
‘‘ఇదిగో! పది నిమిషాల్లో బయలుదేరుతాము. కొందరి మిత్రులకి ఫోన్ చేసేసి..’’ చెప్పి ఫోన్ కట్ చేసిందామె.
ఆమె హడావిడి అంతా ఇంతా కాదు. గతంలో 24 పుస్తకాలు రాసి, ఆవిష్కరణ సభలు జరుపుకున్నా ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదామె. అందుకు కారణం, ఆమె సాహిత్య రంగంలోకి అడుగుపెట్టి సిల్వర్ జూబ్లీ సంవత్సరంతోపాటు అది 25వ పుస్తకం కూడా కావడమేనని వేరే చెప్పఖ్కర్లేదనుకుంటాను! ఆ సభ తన జీవితంలో ఓ ప్రత్యేక మధురమైన సభగా, సాహిత్య సభలలో ఎప్పుడూ జరగనంత కన్నుల పండువగా నిలవాలన్నది ఆమె కోరిక. ఈ రోజుల్లో సాహిత్య సభలలో కేవలం పట్టుమని ఇరవై, ముప్ఫైమందికంటే ఎక్కువ ప్రేక్షకులు ఉండటంలేదు. ఆ విధంగా కాకుండా ఈ రోజు జరిగే సభ అందుకు భిన్నంగా, సభామందిరం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయి, కిటకిటలాడే విధంగా చూడాలన్నది ఆమె తాపత్రయం. అందుకే తనకు తెలిసిన చిన్నా పెద్దా అనే భేదం లేకుండా... కొందర్ని స్వయంగాను, మరికొందరికి ఫోన్లు చేసి.. పేరు పేరునా ప్రత్యేకంగా ఆహ్వానించింది.
గతంలో తాను కథలు, కవితాసంపుటాలు, నవలలు వెలువరించి సాహిత్య ప్రక్రియలలో తనకున్న బహుముఖ ప్రజ్ఞను చాటుకుంది. కాని ఇప్పుడామె రాసి వెలువరిస్తున్న పుస్తకం ‘జీవితం’ అనే వ్యక్తిత్వ వికాస పుస్తకం. నేటి పిల్లల ప్రవర్తన ఎలా ఉంటోంది? ఎలా ఉండాలి.. ఉమ్మడి కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నం అవుతూ చిన్న కుటుంబాలుగా ఏర్పడుతున్నాయి? చిన్న కుటుంబాల వల్ల ఏర్పడే సాధక బాధకాలు.. ఉన్నత చదువులు, ఉద్యోగాలవల్ల, వలసపోతున్న జీవితాల వ్యధలు, పెరుగుతున్న విదేశీమోజు.. ఇటువంటి అనేక విషయాలపై కూలంకషంగా చర్చించి, తన 55 ఏళ్ళ ఉద్యోగ పదవీ విరమణ కాలంలో తాను చూపిన అనేక జీవితాల అనుభవసారాన్నంతా రంగరించి రచించిన పుస్తకమిది. ఈ పుస్తకం ద్వారా సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వడంతోపాటు, అనేక జీవితాలలో మార్పుకు దోహదం చేసే విధంగా మలిచిందామె. అందుకే ఆ తాపత్రయం! ఆ పుస్తకం చదివి సభలో అతిథులే కాదు, సాధారణ జనం కూడా చిరస్థాయిగా తన పేరును తమ గుండెల్లో పెట్టుకోవాలని ఆమె ఆశ, ఆరాటం!
అవును! నిజమే! ఏ రచయిత అయినా తమ జీవితంలో పాఠకులనుంచి అంతకంటే ఏమీ ఆశించడు, ఆశించలేడు. కేవలం ఈ సమాజ బాగు కోసం తాము చేసే నిరంతర కృషికి ప్రతిఫలం అంతకంటే ఇంకా ఏమిచ్చినా అది ఓ పూచిక పుల్లతో సమానం!
కారు గుంటూరు హైవేపై స్పీడుగా దూసుకుపోతోంది. ఆ కారులో ప్రయాణిస్తున్న సుజాతాదేవి ఆలోచనలు కూడా ఇలా అంతకంటే వేగంగా దూసుకుపోతున్నాయి. తాను సాహిత్య రంగంలోకి అడుగుపెట్టిన 24 ఏళ్ళలో రాష్ట్రంలోనే కాక దేశ విదేశాలలోని ఎన్నో సాహిత్య సంస్థలు తనని ఘనంగా సత్కరించాయి. మరెందరో ప్రసిద్ధ రచయితలతో పరిచయ భాగ్యం కలిగింది, మరెంతో తనకన్నా పైస్థాయి అధికార హోదాలో వున్న ప్రముఖులని తనకి దగ్గర చేసిందీ ఈ సాహిత్య రంగమే! తనకి అంతటి అదృష్టమిచ్చిన ఆ సాహిత్య రంగానికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేనిదే! అందుకే ఈ రోజు ఓ తీపిగుర్తుగా ఉండిపోయే విధంగా సభ అయిన తర్వాత రాష్ట్ర నలుమూలలనుంచి విచ్చేసిన సాహితీ మిత్రులందరికీ ఓ హోటల్‌లో విందు ఏర్పాటుచేసిందామె.
తన భర్త తన రిటైర్‌మెంట్ తర్వాత అండగా ఉంటాడనుకున్న సమయంలో ఆయన హఠాత్తుగా మరణించడంతో ఆయన లేని లోటు ఈ సాహిత్య రంగం తీర్చినట్లయింది. తనకున్న సమయాన్నంతా పుస్తకాలు చదవటంతోను, రచనలు చేయడంతోనే గడిపింది. పేరుకు తన కుటుంబం చాలా పెద్దదయినా పిల్లలందరూ వృత్తిరీత్యా ఇతర దేశాలలో స్థిరపడటంవల్ల అందరూ ఉన్నా ఏకాకి తను. అందుకే తానెప్పుడూ సాహితీ మిత్రులతోనే ఎక్కువగా గడుపుతూ ఉంటుందామె. ఏ కష్ట సుఖమొచ్చినా వాళ్ళే తనకు అండా దండా. అందుకే వాళ్ళంటే తనకి బంధువులకన్నా ఇంకా ఎక్కువగా భావిస్తుంది.
‘‘జగమంత కుటుంబం నాదీ.. ఏకాకి జీవితం నాది..’’ ఆమె ఆలోచనలను బ్రేక్ చేస్తూ ఆమె సెల్‌ఫోన్ మ్రోగింది.
ఫోన్ ఆన్ చెయ్యగానే అవతలనుండి-
‘‘హలో! మేడమ్! అతిథులందరూ వచ్చేశారు. ప్రేక్షకులతో సభంతా కిక్కిరిసిపోయింది. మీరు రావడమే ఆలస్యం. సభ మొదలుపెట్టేస్తాం!’’ చెప్పాడు

సభా నిర్వహకుడు కంగారుగా.
‘‘ఇదిగో.. ఆన్ ది వే! కాసేపట్లోనే అక్కడికి చేరుకుంటామ్’’ చెప్పిందామె.
‘‘డ్రైవర్! కారు కాస్త తొందరగా పోనీయ్!’’ కంగారు చేసిందామె. కారు ఎక్కేంతవరకూ ఆమె అందరికీ ఫోన్లు చేస్తూ ఆహ్వానించడం వల్ల టైం ఎంతైందో తెలియలేదు. తెలిసేసరికి ఇలా టెన్షన్ పడటం తప్పించి ప్రయోజనం లేదని తెలుసామెకు.
కారు స్పీడందుకుంది. అంత టెన్షన్‌లోనూ ఆమెకు ఒకింత ఆనందం! అదేమంటే-
మీటింగ్ హాల్ మొత్త జనంతో కిక్కిరిసివుందని సభా నిర్వహకుడు చెప్పడం, తాను ఏం ఆశించి ఇంత భారీగా సభ నిర్వహించి పుస్తకావిష్కరణ జరుపుకుంటుందో, ఆ తీపి గడియలు రానే వచ్చాయని ఆమె భావిస్తోంది. అందుకే ఆ ఆనందం. కానీ, ఆ ఆనందం మరెంత సేపో ఉండదని.. ఆ ఆనంద క్షణాలు తానసలు చూడలేనని.. ఆ పుస్తకావిష్కరణ సభ తన సంతాప సభగా మారిపోతుందనీ.. ఆమే కాదు, ఎవ్వరూ.. ఎప్పుడూ ఊహించి ఉండి ఉండరు.
సాయం సంధ్య నుంచి చీకటి పడే సమయమది. అది విజయవాడ గుంటూరు హైవే. సభా మందిరానికి చేరాలనే కంగారులో కారు డ్రైవర్ కారును 100 కిలోమీటర్లకంటే వేగంగా పోనిస్తున్నాడు. ఆ స్పీడులో కారు రోడ్డు మలుపు తిప్పే సమయంలో అదుపు తప్పి ఎదురుగా ఉన్న పెద్ద చెట్టును గుద్దుకుని నుజ్జు నుజ్జు అయిపోయింది.. అందులో ఉన్న సుజాతాదేవితోపాటు డ్రైవర్ దేహమూ గుర్తుపట్టలేనంత ఖండ ఖండాలుగా చెల్లాచెదరైయాయి.
‘‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది..’’ అంటూ ఈ సంఘటనతో తనకు సంబంధం లేనట్టు ఆ రక్తపు మడుగులో పడి వున్న సుజాతాదేవి సెల్‌ఫోన్ రింగ్ టోన్ మ్రోగుతోంది. అవును! జగమంత కుటుంబమే ఆమెది. చివరికి ఏకాకి జీవితం అయిపోయింది. ఓ సినిమా పాటలోని ఆ రింగ్ టోన్ అంటే ఆమెకెంతో ఇష్టం! ఆ పాటలాగే చివరికి ఆమె భౌతిక దేహం కూడా ఏకాకిదైపోయింది.
సభ ప్రారంభం కావాల్సిన సమయంకంటే గంట.. రెండు గంటలైనా.. అందర్నీ పేరు పేరునా పిలిచి ఆహ్వానించిన సుజాతాదేవి అయిపు అజా లేకుండాపోవడంతో మొదట సభా ప్రాంతం కొంత అసహనపడినా, తర్వాత్తర్వాత ఏమి జరిగిందోనన్న కంగారు ఎక్కువైంది. చివరికి అందరూ కంగారుపడ్డట్టుగానే ఆమె యాక్సిడెంట్ వార్త! ఉన్నట్టుండి ఏడుపులు, పెడబ్బొలతో ఘొల్లుమంది అక్కడి వాతావరణం! వందలాదిమంది అభిమానులు .. అనేక టీవీ చానళ్లు, పత్రికా విలేకర్లతో.. తెలుగు సాహిత్య రంగమంతా దాదాపు అక్కడే ఉందా అన్నట్లున్న అక్కడి వాతావరణం..! జీవితంలో గుర్తుండిపోయే విధంగా ఉండాలనుకున్న ఆమె కలకు భిన్నంగా, తీవ్ర విషాద ఛాయల్లో నిలిపిందది. ఆ రోజు జరగవలసిన ఆ పుస్తకావిష్కరణ సభ ఆమె వీడ్కోలు సభగా, సంతాప సభగా మారిపోయింది. కొద్ది నిమిషాల క్రితం ఆ వేదికపై అనేక పూలదండల మధ్య ఆనందబాష్పాలతో సాగవలసిన ఆ సభ, ఎందరి కన్నీళ్ళ జలపాతాలతో అభిషేకం చేస్తూ ఆమె పార్థివ దేహానికి చివరి మాలలై నిలిచాయి.
‘‘ఆమె మరణించినా ఆమె రచనలు బ్రతుకుంటాయని.. తెలుగు సాహిత్య రంగానికి ఆమె చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచుంటాయని’’’ ఆ తరువాత జరిగిన సంతాప సభలో వక్కాణించి చెప్పారు సాహిత్య ప్రముఖులెందరో. ఆమె రచనలు నేటి తరానికి ఆదర్శాలని, ఆవిడ రచనల్ని ప్రజల చెంతకు చేర్చాల్సిన బాధ్యత మనందరిది’’ అని భీష్మప్రతిజ్ఞ చేశారు మరికొందరు.
కానీ, ఇవేవి పట్టని ఆవిడ పుత్రరత్నాలు విదేశాల నుండి దిగివచ్చి దినకర్మలు చేసేసి తమ బాధ్యతలు నిర్వర్తించామనిపించారు. పోతూ పోతూ ఆవిడ ఇంతకాలం ఎంతో అపురూపంగా చూసుకుంటూ వస్తూన్న ఆమె రచనలను, సన్మాన ప్రశంసా పత్రాలను.. ఎందరికో ఆదర్శంగా నిలవాలని రాసి ప్రచురించిన పుస్తకాలను కిలోల లెక్కన కాటాకేసేసి చెయ్యి దులిపేసుకున్నారు. ఆమె గడిపిన ఆనవాళ్ళు సైతం లేకుండా ఆమె వుంటున్న ఫ్లాట్‌ని అమ్మేసి వచ్చిన సొమ్ముని విలువకట్టి తలా కొంత వాటాగా పంచేసుకుపోయారు.
ఈ సమాజంలో ఏ విధమైన మార్పును ఆశించి సుజాతాదేవి రాత్రి పగళ్ళు ఎంతో కష్టపడి తను ఈ జీవితం అనే పుస్తకం రాసిందో.. అది అందాల్సిన వారికి అందకపోగా.. దానికి భిన్నంగా, ఆమె పుత్రరత్నాలు ప్రవర్తించిన తీరు ఆమె జీవితాశయానే్న మార్చేసే విధంగా తయారైంది.
లోకానికి తెలియని ఈ నిజం.. ఆమె రచనలకు విలువకట్టే దుస్థితి వచ్చినందుకు వెలకట్టే ఆ కాటా సైతం విలవిలలాడింది. చివరికి విలువ కోల్పోయి పాత గోతాము సంచుల్లోకి చేర్చేసినందుకు సిగ్గుతో తలవంచింది. ఆమెతోపాటు ఆమె రచనలనీ మసి చేసి, ఆమె వద్దకే చేర్చేసామని బాధతో కన్నీళ్ళూ కార్చింది.
**
-చలపాక ప్రకాష్, ఫోన్ నెం:9247475975

-చలపాక ప్రకాష్, ఫోన్ నెం:9247475975