ఈ వారం స్పెషల్

జాడలేని జలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు నుడికారంలో ఓ నానుడి ఉంది.
‘డబ్బును నీళ్లలా ఖర్చుపెట్టేస్తున్నార’ని. అలా అనడంలో ఓ ఆవేదన ఉంది..
ఓ అర్థం ఉంది.. ఓ హెచ్చరిక ఉంది. డబ్బుకు ఎంత విలువిస్తామో, నీళ్లను మనం ఎలా దుర్వినియోగం చేస్తామో చెప్పకచెబుతుంది ఈ వ్యాఖ్య. అది సరే, డబ్బు సంగతి పక్కనపెడదాం. కానీ, నీళ్లకోసం డబ్బును నీళ్లలా ఖర్చు చేసినా గొంతు తడవని రోజులు ఎంతో దూరంలో లేవు. ఇది కటిక నిజం. నీటికోసం ఇప్పటికే చాలాచోట్ల జనం కన్నీళ్లు పెడుతున్నారు. మున్ముందు మంచినీటి కోసం యుద్ధాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. వీధుల్లో కన్పించే ‘పానీపట్టు’ యుద్ధాలు విస్తృతమై వివిధ ప్రాంతాలు, దేశాల మధ్య చిచ్చుకూ కారణం కావచ్చు.
దశాబ్దాల క్రితం నీటికోసం యుద్ధాలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఆధునిక భారతంలో నదీజలాల కోసం జరిగే వివాదాలు ఎరుగని వారెవ్వరు? భూగోళంలో మంచినీటి అవసరాలు, సౌకర్యాలు, వనరుల మధ్య పెరిగిపోయిన అంతరమే ఈ దుస్థితికి కారణం. ఈ దురవస్థకు కారణం మనమే. అందుకే పరిస్థితిని చక్కదిద్దుకోవలసినదీ మనమే. ఆ ఆలోచన లేనప్పుడు.. భవిష్యత్‌లో ఎదుర్కోబోయే ముప్పేమిటో తెలుసుకోకతప్పదు.
ఇప్పుడున్న రీతిలోనే పరిస్థితులు ఉంటే మరో పదేళ్లలో నీటిఎద్దడి ఇప్పటికన్నా రెండురెట్లు పెరుగుతుంది. జనాభా పెరుగుదల కంటే ఇది రెట్టింపన్నమాట. ఇప్పుడు మనం లీటర్ మంచినీటిని 20 రూపాయలకు కొంటున్నాం కదా. మరో పదేళ్ల తరువాత అది వందరూపాయలైనా ఆశ్చర్యపోనవసరం లేదు.
జలం...కనీసావసరం.
ఏ ప్రాణికైనా నీరు లేనిదే మనుగడ సాధ్యం కాదు.
మిగతా జీవులతో పోలిస్తే మనిషికి
నీటి అవసరం మరింత ఎక్కువ.
అవసరమైన వాటిని, విలువైన వాటిని జాగ్రత్తగా దాచుకునే మనం నీటి విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉంటాం. ఆ ఉదాసీనతే ఇప్పుడు గంగవెర్రులెత్తిస్తోంది. నీటికోసం అల్లల్లాడే పరిస్థితి ఊపిరాడనీయడం లేదు. ఈ ప్రమాదాన్ని పసిగట్టి జనచైతన్యానికి 1993లోనే ఐక్యరాజ్య సమితి నడుం బిగించింది. ఏటా మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం పేరిట చైతన్య కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఒక్కో ఏడాది ఒక్కో ఆలోచనతో, ఒక్కో నినాదంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశాలన్నీ ఈ కార్యక్రమాలను అమలుచేస్తాయి. ‘జలం-ఉద్యోగం’ అనే నినాదంలో ఈ ఏడాది పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.
జలం చేత...జలం కొరకు..
ఈ ఏడాది నిర్వహించే ప్రపంచ జల దినోత్సవం నినాదానికి ఓ ట్యాగ్‌లైన్ జోడించారు. ‘ప్రజల కొరకు..ప్రజల చేత’ అన్నట్లు ‘జలం కోసం..జలం చేత..’అని. ఈ భూగోళం మీద సగటు మనిషికి కావలసిన మంచినీటిని చౌకగా, నేరుగా అందించడమే లక్ష్యంగా ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేవలం జలవనరుల సంరక్షణ, కల్పనకే పరిమితమవకుండా ఆయా రంగాల్లో ఉద్యోగ కల్పన జరిగేలా ఉద్యమించడమే ఈ ఏడాది ప్రపంచ జల దినోత్సవం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ థీమ్‌తోనే వివిధ దేశాల్లో చర్యలు తీసుకుంటున్నారు. మంచినీటి వనరుల సంరక్షణ, వసతుల కల్పన, కొత్తకొత్త విధానాలు అవలంబించడం, శానిటేషన్, మంచినీటితో ఆరోగ్య సంరక్షణ పేరుతో ఉద్యోగావకాశాలు కల్పించడం ఈసారి లక్ష్యం. 22 ఏళ్లక్రితం ‘వరల్డ్ వాటర్ డే’ ఉద్యమం ప్రారంభమైంది. గతేడాది ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్ అన్నమాటలు
ఇప్పటికీ చెప్పుకోవచ్చు. ‘నీటి సమస్యను ఎదుర్కోవడానికి ఒకరకమైన స్ఫూర్తితో, సంపూర్ణ, సత్వర సహకారంతో, కొత్త ఆలోచనలతో, పూర్తి సన్నద్ధతతో, స్థిరమైన భవిష్యత్ కోసం పనిచేయాలి’ అన్నది ఆయన పిలుపు.
ఇదీ పరిస్థితి
వేసవిలో నీటిఎద్దడి ఎదురైనప్పుడు మాత్రమే మనం స్పందిస్తాం. నీళ్లకోసం పరితపిస్తాం. మనదేశంలో వేసవిలోకొన్ని ప్రాంతాల్లో నీటిఎద్దడి తీవ్రంగా ఉంటుంది. వర్షాకాలంలో పెద్ద సమస్య ఉండదు. కానీ, ప్రపంచంలో అంతా అలానే లేదు. ఎన్నో వ్యత్యాసాలు. ఎన్నో ఇబ్బందులు. మనదేశంలోనూ వివిధ ప్రాంతాల్లో పరిస్థితి పరస్పర విరుద్ధంగా ఉంటుంది. వందలాది అడుగుల లోతుకు భూగర్భ జలనవరులు పడిపోయి నీటి లభ్యత కష్టమైపోతోంది. మరికొన్ని చోట్ల ఐదారు మీటర్ల లోతునే నీళ్లు పడతాయి. ఇలా ఎందుకు ఇలా జరుగుతోంది? భూమిలోపల నీటి నిల్వల లభ్యతలో ఈ వైరుధ్యాలు ఎందుకు? ఈ సందర్భంలో మరికొన్ని విషయాలు తెలుసుకోవడం అవసరం. భూగోళంలో 75 శాతం నీరే ఉంది కదా! మరి నీటిఎద్దడి ఎందుకు వస్తోంది? లక్షలాది సంవత్సరాల నుంచి ఈ భూగోళంలో ఉన్న నీరే ఆవిరై, వర్షాల రూపంలో మళ్లీ భూమి మీదకు వస్తోంది. ఇది అనంతంగా వస్తున్న ఓ ‘చక్రం’. భూమీద, లోపల ఉన్న నీళ్లన్నీ ప్రజలకు అందుబాటులో లేవు. అన్నీ వినియోగానికి పనికిరావు. భూగోళంలో ఉన్న 75శాతం నీటిలో మనం ఉపయోగిస్తున్నది కేవలం 2.5 శాతం మాత్రమే. అందులో మనం నేరుగా వినియోగిస్తున్నది కేవలం ‘.5’ శాతం మాత్రమే. మిగతాదంతా వస్తువులు, పదార్థాల తయారీకే సరిపోతోంది. మనం వినియోగించే నీటిలో అంతా మంచినీరే అని చెప్పలేం.
మూడోవంతు జనానికి నీళ్లు లేవు..
ప్రపంచంలో ప్రస్తుతం 110 కోట్లమందికి మంచినీరు లేదు. ఒక లెక్కలో చెప్పాలంటే ప్రతి పదిమందిలో ఒకరికి మంచినీరు అందడం లేదు. కనీసం మంచినీటి వనరులు అందుబాటులో లేవు. ఇది పచ్చి నిజం. గ్రామీణ ప్రపంచంలో 82 శాతం మందికి మెరుగైన మంచినీటి వనరులే లేవు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. నీటి సౌకర్యం లేకపోతే అది పారిశుద్ధ్యం మీద, ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. దురదృష్టవశాత్తూ ప్రజలకు దీనిపై అవగాహన తక్కువ. నేడు సగటు మనిషికి మొబైల్ ఫోన్ సమకూర్చుకోవడంపై ఉన్న ఆసక్తి మంచినీరు, పారిశుద్ధ్యంపై లేదు. లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో 39 కోట్లమందికి మంచినీటి వనరులు అందుబాటులో లేవు. ఆఫ్రికాలో 35కోట్లమంది పరిస్థితి అంతే. తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలో 195 మిలియన్లమంది దుస్థితి ఇది. ఇక అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితేమీ బాగుందని చెప్పలేం. 90 లక్షలమందికి నీటి లభ్యత లేదు. ఇక మంచినీరు లేక, అనారోగ్యంతో ఏటా ప్రపంచంలో 8లక్షల 40వేల మంది మరణిస్తున్నారు. ఇది మరోరకంగా చెప్పాలంటే రోజుకు 2,300 మంది నాణ్యమైన నీరు అందక, నీటివల్ల కలిగే రోగాలతో మరణిస్తున్నారన్నమాట. ఇక మంచినీటి కోసం సగటున ఒక్కొక్కరు ముఖ్యంగా మహిళలు, పిల్లలు రోజుకు 1.4కోట్ల గంటలు ఖర్చుపెడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎందుకిలా..?
ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను సంరక్షించుకోకపోవడం వల్ల అనూహ్యంగా వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో విపరీత పరిణామాలు ఏర్పడి ప్రకృతి ధర్మం మారిపోయింది. రుతువులు క్రమం తప్పాయి. నదీనదాలు దారితప్పాయి. ఊళ్లు ఎడారులవుతున్నాయి. నీళ్లు ఇంకిపోతున్నాయి. ఆధునిక ప్రపంచం భూగర్భంలోని నీళ్లను తోడేస్తూంటే లోపలున్న జలసిరి పలచబడిపోయింది. దీంతో నీటి కటకట ఏర్పడుతోంది. పారిశ్రామిక వినియోగం, జలవనరుల వినియోగం ఎక్కువగా ఉండే వ్యవసాయంపై అధికంగా ఆధారపడటంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. మనదేశంలో హరితవిప్లవానికి కారణమైన పంజాబ్, హర్యానా, దిల్లీ గ్రామీణం, రాజస్థాన్ ప్రాంతాల్లో దేశంలో మరెక్కడా లేనంతగా నీటిసమస్య ఉంది. అక్కడి భూగర్భజలాలూ పడిపోయాయి. ఎందుకంటే అక్కడ వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకోసం జలవనరులను ఇష్టంవచ్చిన రీతిలో ఉపయోగిస్తున్నారు. వందలాది అడుగులు తవ్వితేగానీ నీటిచుక్క ఆనవాలు కన్పించడం లేదు. గంటల తరబడి, మైళ్లకొలది దూరం వెళితేగానీ కడివెడు నీళ్లు దొరకడం లేదు. గుజరాత్, యు.పి. లక్షద్వీప్, పాండిచ్చేరి, దామన్ డయ్యు ప్రాంతాల్లో పరిస్థితి రోజురోజుకూ మారిపోతోంది. ఏపి, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోతూ భవిష్యత్‌లో పెనుసమస్యను ఎదుర్కోబోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో బోర్లు తవ్వి, నీళ్లు పడక అప్పులుపాలై, పంటలు పండక ప్రాణాలు తీసుకున్న రైతుల సంఖ్య తక్కువేమీ లేదు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఇప్పటికిప్పుడు ముప్పేమీ లేకపోయినా నిశ్చింతగా ఉండటానికి వీలులేదు. భూగర్భంలో జలాలను మనం తోడేస్తున్నాం. కానీ, మళ్లీ అవి నిండటానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇంకుడు గుంతలు, చెక్‌డ్యామ్‌లు, నీటివాడకం తక్కువగా ఉండే పంటల ఎంపికవంటి కొన్ని చర్యలు అక్కడక్కడా చేపడుతున్నా అది ఉద్యమరూపం దాల్చాల్సిన అవసరం ఉంది. అడవులు, మొక్కల పెంపకం, జలవనరుల సంరక్షణపై సామాన్య జనానికి అవగాహన కల్పిస్తే కొంత ప్రయోజనం ఉంటుంది. నీటిని పొదుపుగా వాడుకోవడం, వృథాకాకుండా చూసుకోవడంలో జనాన్ని చైతన్యపరచాల్సి ఉంటుంది.
దిల్లీలో...ఎంత తేడా?
నీటివాడకంలో పేదలు వారి జీవితాల్లోమాదిరిగానే వెనుకబడ్డారు. ధనవంతులు, ప్రముఖులు నీటివాడకంలో అగ్రగణ్యులు. అవసరం ఉన్నా లేకపోయినా, విలాసం కోసం వీళ్లు నీళ్లను విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇది మనం చెబుతున్నమాట కాదు. మనదేశంలో ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ చెబుతున్న నిజం. దిల్లీనే ఉదాహరణ తీసుకుందాం. అక్కడ ఐదునక్షత్రాల హోటల్‌లో ఓ గదిలో రోజుకు 1,600 లీటర్ల నీటిని వినియోగిస్తారట. అదే హోటల్‌లో వీఐపి సూట్‌లో కనీసం 30 వేల లీటర్ల నీటిని వాడతారని ఎందిరికి తెలుసు? ఇక్కడ ఒ పచ్చినిజాన్ని తెలుసుకోవలసి ఉంది. దిల్లీలో 78శాతం మంది ప్రజలు కేవలం 30 నుంచి 90 లీటర్ల నీటిని సమకూర్చుకోవడానికి నానాయాతన పడతారు. దిల్లీలో సగటు వ్యక్తి 160 లీటర్ల నీటిని వాడుకోగలిగే అవకాశం, వనరులు ఉన్నా ఆ మాత్రం సేకరించుకోవడం వారివల్లకావడం లేదు. తెలుగురాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఇక్కడ సగటు వ్యక్తికి రోజుకు 96 లీటర్ల మంచినీరు అందుతోంది. వందలీటర్ల లోపు నీరు పొందగలిగే సౌకర్యం ఉన్న నగరాల్లో హైదరాబాద్ మూడోస్థానంలో ఉంది. హిమాలయాలు, గంగ, యమున, కృష్ణ, గోదావరి, కావేరి వంటి జీవనదులు, అనేక సరస్సులు ఉన్న భారత్‌లో ఆ ప్రాంతాల్లోనే మంచినీటి లభ్యత అంతంతమాత్రమే. జలవనరులు దండిగా ఉన్నంత మాత్రాన ప్రజలకు మంచినీరు అందుతోందని భావించలేం. నదుల్లో లేదా సరస్సుల్లో నీటిని అలా అప్పటికప్పుడు వాడేసుకోలేం. అక్కడినుంచి ఇంటికి తెచ్చుకోవడమూ సులభం కాదు. ప్రభుత్వాలే నీటి సరఫరాకు సరైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో నగరాలు, పట్టణాల్లో ఇప్పుడిప్పుడే సౌకర్యాల కల్పన ప్రారంభమైంది. గ్రామీణ భారతంలో ఇంకా పరిస్థితి చక్కబడలేదు. చెరువుల నిర్వహణ, మొక్కల పెంపకం, వర్షం, వరద నీటిని నిల్వచేసుకునే ఏర్పాట్లు ఎంత పెరిగితే సమస్య అంత తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా దీనిని పట్టించుకోకపోవడంవల్లే గ్లాసుడు నీటికి దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడుతోంది. మనిషి మారకపోతే మనుగడ కష్టమే. చక్కటి గాలి, మంచి నీరు లేకుండా బతకడం సాధ్యమా? *

భూగర్భ జలాలు తోడేస్తున్నాం!
భూగోళం అంతటా నీటి సమస్య ఉంది. కాకపోతే కొన్నిచోట్ల ఎక్కువ. మరికొన్నిచోట్ల తక్కువ. భూగర్భ జలాల వాడకంలో మాత్రం భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ఏడాదికి భూగర్భ జలాల్లో 1230 క్యూబిక్ కిలోమీటర్ల పరిధిలో నీటిని మనం తోడేసి వాడేస్తున్నాం. భూమిలోపలి జలసిరిని దోచేస్తున్నాం. కానీ, ఆ నీటిబ్లాకుల్లో మళ్లీ నీరు చేరడానికి తగిన చర్యలు తీసుకోవడం లేదు. అందువల్లే జనవనరులు పడిపోతున్నాయి. సరే, ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ప్రపంచంలో మిగతా దేశాలు వాడుకుంటున్న భూగర్భజలాలతో పోలిస్తే అందులో పావువంతు మనమే వినియోగిస్తున్నాం. మనదేశంలో వ్యవసాయం, పరిశ్రమల కోసం వినియోగిస్తున్న నీటిలో సగటున 75శాతం నీరు భూగర్భజలాలతోనే సాగుతోంది. భారత్‌లోని భూగర్భంలో 29 ‘గ్రౌండ్ వాటర్ బ్లాక్’లు ఉంటే ఒకటీ అరా మినహా అన్నీ అడుగంటిపోతున్నాయి. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం.

నీళ్లే పెట్టుబడి!
నీళ్లు...ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. నీళ్లే పెట్టుబడి కూడా. మనకు తెలీని, మనం పట్టించుకోని ఎన్నో విషయాలు ఒక్కోసారి ఆసక్తి కలిగిస్తాయి. ఈ సృష్టిలో నీరు లేని పదార్థం లేదు. మనిషిలోకూడా నీళ్లుంటాయి. సహజంగా తయారయ్యే అన్నింటిలోనూ నీళ్లుంటాయి. పండించే పంటల నుండి వండి వడ్డించే పదార్థాల వరకూ నీరు లేకుండా ఏదీ సాధ్యం కాదు. సగటున ఒక హామ్‌బర్గర్ తయారీకి 2,400 లీటర్ల నీరు వినియోగిస్తారంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఒక కిలో గోధుమల ఉత్పత్తికి 500 నుంచి 4000 లీటర్ల నీరు ఖర్చవుతాయని తెలుసా? ఒక కిలో చాక్లెట్ తయారీకి 822 లీటర్ల నీళ్లు అవసరం. కేజీ అరటిపళ్ల ఉత్పత్తికి 790 లీటర్ల నీరు వినియోగమవుతుంది. కిలో బియ్యం పండించాలంటే 2497 కిలోల నీరు వాడాలి. 1250 గ్రాముల పత్తి ఉత్పత్తికి 2495 లీటర్ల నీళ్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒక బ్రెడ్ తయారీకి 1608 లీటర్లు, ఒక పిజ్జా తయారీకి 1230 లీటర్ల నీరు సగటున వినియోగిస్తారంటే నీటి అవసరాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

- ఎస్.కె.ఆర్.