ఈ వారం స్పెషల్

ఎల్‌ఈడీ మెరుపులు జగమంత వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔను...ఇప్పుడు ఆ బల్బులను చూస్తే
అందరి మోములు వెలిగిపోతున్నాయి..
ఇళ్లేమిటి.. రోడ్లేమిటి
టీవీలేమిటి..సైకిళ్లేమిటి అన్నింటా ఎల్‌ఇడి బల్బులు అమరిపోతున్నాయి. ఆ వెలుగుల్లో జిగేలుమంటున్నాయి. చివరికి వాష్‌బేసిన్ టాప్‌కూ ఎల్‌ఇడి బల్బులు అమర్చేస్తున్నారు. బెడ్‌రూమ్‌లో పైకప్పుపై ఎల్‌ఇడి బల్బులు చుక్కల్ని, చంద్రుడ్ని తలపిస్తున్నాయి. అందుకే జగమంతా ఇప్పుడు ఎల్‌ఇడి బల్బుల వెలుగులతో నిండిపోతోంది. మన తెలుగులోగిళ్లలోనూ ఆ వెలుగులు కన్పిస్తున్నాయి. రాత్రిళ్లు కాస్త ఎక్కువసేపు లైట్లు వేసి ఉంచితే... కరెంటు బిల్లులు జేబులకు చిల్లులు పెడతాయన్న బెంగతో లైట్లు ఆర్పండర్రా అన్న కేకలు ఇప్పుడు విన్పించడం లేదు. ఎల్‌ఇడి బల్బులు తెచ్చిన సౌకర్యం అది. పొదుపునకు పొదుపు, వెలుగులకు వెలుగు ఇస్తున్న ఎల్‌ఇడి బల్బుల వాడకం ఇప్పుడు ఓ ఉద్యమం.
లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఎల్‌ఈడీ) ఆవిష్కరణతో విద్యుత్ రంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. విద్యుత్ రంగంలో ‘ఎల్‌ఈడీ’ లైట్ ఆవిర్భావం కొత్త శకానికి నాంది పలికింది. విద్యుత్ ఆదా చేయడంతోపాటు వెలుగులను వెదజల్లే విధంగా ఎల్‌ఈడీ లైట్స్‌ను కంపెనీలు రూపకల్పన చేసి మార్కెట్లోకి తెచ్చాయి. దీంతో అందరి దృష్టి ప్రస్తుతం ఎల్‌ఈడీ వైపు మళ్లింది. ఎల్‌ఈడీ బల్బుల వినియోగంతో విద్యుత్ ఆదాకు ఆదా.. వెలుగులకు వెలుగులు. రోజురోజుకూ ఎల్‌ఈడీ లైట్స్ వాడకం పెరుగుతోంది.
కొత్త వెలుగుతో.. కంప్యూటర్‌ను లేదా మన మొబైల్ ఫోన్ స్క్రీన్‌లను ప్రకాశవంతం చేసే (బ్లూ ఎల్‌ఈడీ) ఇంధన వనరును ఆవిష్కరించి ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల నాణ్యతను మెరుగుపరచినందుకు గానూ పర్యావరణానికి మేలు చేసిన ముగ్గురు జపాన్ శాస్తవ్రేత్తలకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించారు. జపనీయులు అయిన ‘ఇసమూ అకసాకీ’ ‘హిరోషీ అమానో’ సాంతా బార్బరాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ‘షుజీ నకమూర’లకు భౌతిక శాస్త్రంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని 2014లో అందుకున్నారు. అత్యంత సమర్థవంతం, తక్కువ విద్యుత్‌తో ఎక్కువ వెలుగులను అందించడమే కాకుండా, పూర్తి స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు వీలు కల్పించే విధంగా ఈ శాస్తజ్ఞ్రుతలు తమ పరిశోధనలు సాగించారు. విద్యుత్ దీపాల ఆవిష్కరణలో అత్యంత కీలక ఘట్టమిది. ఇప్పటివరకూ ఉన్న ట్యూబ్‌లైట్లు ఇతర బల్బులతో పోలిస్తే ఇవి విద్యుత్ ఆదాకు ఉపకరించడమే కాకుండా, పర్యావరణం వేడెక్కకుండా చేస్త్తున్నాయని అందుకే వారికి ఈ పురస్కారం ప్రకటించామని నోబెల్ జ్యూరీ తెలిపింది.
డయోడ్ ద్వారా వచ్చే కాంతి ఫిలమెంట్ బల్బులు లేదా ట్యూబ్‌లైట్ల కాంతితో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఒకే ఒక్క డయోడ్‌కి బదులుగా ఎన్నో డయోడ్‌లను కలిపి ఒక ల్యాంపుగా వాడతారు. వాణిజ్య స్థాయిలో వాడే 100 ఓల్టుల బల్బు దాదాపు 1700 లూమెన్ల (మన కంటితో గ్రహించగలిగిన వెలుతురును అంతర్జాతీయ యూనిట్లలో ‘లూమెన్ల’తో కొలుస్తారు) కాంతిని ఇస్తుంది. కానీ, దీనికి సమానమైన విద్యుత్‌తో డయోడ్ బల్బుల ద్వారా 7,527 లూమెన్ల కాంతిని పొందవచ్చు. దీనినే ఇంకో విధంగా చెప్పాలంటే ఈ కొత్త ల్యాంపుల ద్వారా ఖర్చయ్యే విద్యుత్‌ను దాదాపు 7.5-8.0వ వంతుకు తగ్గించవచ్చు. ఈ కొత్త బల్బులను ఫిలమెంట్ బల్బుల్లా ఇప్పుడున్న హోల్డర్‌లలోనే బిగించవచ్చు. డయోడ్‌లలు డిసి (డైరెక్ట్ కరెంట్) విద్యుత్‌ను వినియోగిస్తాయి. కానీ, మామూలుగా వాడేది ఎసి (ఆల్టర్‌నేటివ్ కరెంట్) విద్యుత్. అందువల్ల కాంతి డయోడ్ ల్యాంపులను వినియోగించటానికి ఎసిని డిసిగా మార్చేందుకు అంతర్గతంగా ప్రత్యేక సర్క్యూట్ ఏర్పాటు వీటిలో ఉంటుంది.
విద్యుత్ ఫిలమెంట్ బల్బులు 1909లో రూపొంది, విస్తృత వాడకం ప్రారంభమైనప్పటి నుంచి వీటి విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని పెంచటానికి నిరంతరం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా వచ్చినవే ఇప్పుడు మనం వాడుతున్న ట్యూబ్‌లైట్లు, కాంపాక్ట్ ఫ్లోర్‌సెంట్ లైట్లు (సిఎఫ్‌ఎల్). వీటి కొనసాగింపుగానే ఇటీవల ‘కాంతి డయోడ్’ (రెడ్) ల్యాంపులు వచ్చాయి. ఇవి ఇతర ల్యాంపులకన్నా ఖరీదెక్కువ. కాని, తక్కువ విద్యుత్‌తో దీర్ఘకాలం పని చేస్తాయి. మొబైల్ ఫోన్లు, కెమెరాల వంటి ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలకూ ఇవి ఉపయోగపడతాయి.
ఫ్లోరోసెంట్ దీపాల్లో పాదరసం ఉంటుంది. కానీ ఎల్‌ఈడీల్లో అది ఉండదు. భవిష్యత్తులో, దీన్ని నీటిని స్టెరిలైజ్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే యువి లైట్ అనేది బాక్టీరియాను, వైరస్‌లను చంపుతుందని మనకు తెలుసు కాబట్టి నీటి స్టెరిలైజేషన్‌కు ఉపయోగించవచ్చు.
సెమి కండక్టర్ (అర్ధ వాహకం) ఘన పదార్థంతో రూపొందిన డయోడ్‌లలో విడుదలయ్యే వెలుగును ఉపయోగిస్తూ కాంతి డయోడ్ ల్యాంపులు రూపొందాయి. ఇవి సంప్రదాయంగా వెలుగునిచ్చే సెమి కండక్టర్ డయోడ్‌లు కావచ్చు లేదా వెలుగునిచ్చే సేంద్రియ లేదా పాలిమర్ (ప్లాస్టిక్‌కు సంబంధించిన) డయోడ్‌లు కావచ్చు. సేంద్రియ లేదా పాలిమర్ డయోడ్‌లలు ఇటీవల కాలంలోనే (2010) అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త బల్బులను ‘లెడ్’ ల్యాంపులుగా వ్యవహరిస్తున్నారు.
తెల్లని కాంతి కావాలంటే సాధారణంగా ఎరుపు, ఆకుపచ్చ, నీలి కాంతుల మిశ్రమాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఎరుపు, ఆకుపచ్చ కాంతి దశాబ్దాలుగా అందుబాటులో ఉంది. ఇప్పుడు నీలిరంగుల ఎల్‌ఈడీల వెలుగులను కూడా సృష్టించగలిగారు. మూడు దశాబ్దాలుగా నీలిరంగు కాంతి అనేది ఒక సవాలుగా మారింది. ఇప్పుడు ఈ ముగ్గురు శాస్తవ్రేత్తలు వారి సెమీ కండక్టర్‌ల నుండి ప్రకాశవంతమైన నీలిరంగు కాంతి పుంజాలను సాధించడంతో ఇల్యూమినేషన్ టెక్నాలజీ రంగంలో సమూల మార్పులకు గేట్లు తెరిచారు. 20వ శతాబ్దాన్ని ఇన్‌కేండిసెంట్ బల్బులు ప్రకాశవంతం చేస్తే 21వ శతాబ్దం ఎల్‌ఈడీ దీపాలదే.
వెలుగు కోసం కాంతి డయోడ్ ల్యాంపులను వినియోగిస్తున్నారు. రంగురంగుల వెలుగు కావాల్సినప్పుడు పలు రంగుల్లో ఆకర్షణీయంగా ఫిల్టర్‌లు లేకుండా నేరుగా డయోడ్ ల్యాంపులు వస్తున్నాయి. ఫలితంగా, విద్యుత్ ఆదా అవుతుంది. విద్యుత్ వినియోగ సామర్థ్యం తెల్ల కాంతికన్నా రంగు కాంతి డయోడ్ బల్బుల్లో అధికంగా ఉంటుంది. కాంతి డయోడ్ ల్యాంపుల జీవితకాలం ఫిలమెంట్ బల్బులు, ట్యూబ్‌లైట్ల కన్నా చాలా ఎక్కువ. ఇవి తేలికగా ఉండి ఫిలమెంట్లు ఎగిరిపోవు. పగిలే
ఛాన్స్ లేదు కూడా. విద్యుత్‌ను అతి పొదుపుగా వినియోగిస్తాయి. అన్ని ప్రత్యేక అవసరాలకు వేర్వేరు బల్బులను రూపొందించవచ్చు. ఈ కొత్త ల్యాంపులను మామూలుగా 12 ఓల్టుల విద్యుత్ (కార్లలో వాడే బ్యాటరీలు)తో పనిచేసేలా రూపొందిస్తున్నారు. కానీ, 220-240 ఓల్టుల విద్యుత్‌తో కూడా పనిచేసే ల్యాంపులూ వస్తున్నాయి. లెడ్ ల్యాంప్‌లు చిరకాలం మన్నుతాయి. ఇతర లైట్లతో పోలిస్తే విద్యుత్ వాడకం కూడా తక్కువ పరిమాణంలోనే ఉంటుంది.
ఇప్పుడున్న బల్బుల కంటే పది రెట్లు ఎక్కువ కాలం పని చేస్తాయి. వేడెక్కవు. ఏసీ ఉన్న ఇంట్లో ఈ లైట్లు వాడితే ఎంతో విద్యుత్ ఆదా అవుతుంది. 2 నుంచి 17 వాల్టుల విద్యుత్‌ని మాత్రమే వాడుకుంటాయి. అంటే ఇప్పుడు వాడుతున్న విద్యుత్‌లో మూడు నుంచి 30 శాతం మాత్రమే అన్నమాట. విద్యుత్ పొదుపును చేయడమే కాదు. మీ డబ్బుని కూడా ఆదా చేస్తాయన్నమాట. ఎల్‌ఈడీ లైట్ల ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ మధ్య తగ్గుతూ వస్తోంది. భవిష్యత్తులో చాలా చౌకగా మారనున్నాయి. 19వ శతాబ్దంలో థామస్ ఎడిసన్ విద్యుత్ బల్బును ఆవిష్కరించారు. అప్పటి నుంచి ఎడిసన్ బల్బులు తప్ప మరో కొత్త రకం బల్బులు లేకుండా పోయాయి. అయితే నూతన పరిజ్ఞానంతో ఇప్పటి అవసరాలకు అనుగుణంగా ఈ విద్యుత్ బల్బులు వెలుగులోకి రావడం కీలక పరిణామంగా మారింది. ప్రస్తుత విద్యుత్ సంక్షోభాల కాలంలో ఇలాంటి నూతన ఆవిష్కరణలు చాలా అవసరమని నోబెల్ కమిటీ తెలిపింది. అంతేకాకుండా ఈ బల్బులను సౌర విద్యుత్‌కు కూడా అనుసంధానం చేయవచ్చు. దీనితో ఇప్పటివరకూ సరైన రీతిలో విద్యుత్ సౌకర్యాలు లేని కోటానుకోట్ల మందికి ఇవి ఉపయుక్తంగా మారాయి.
వీటిని ఎక్కువ స్థాయిలో ప్రచారంలోకి తెచ్చేందుకు వివిధ ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గల విద్యుత్‌లో నాలుగో వంతు విద్యుత్‌ను మనం కేవలం వెలుగురు కోసమే ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు ఎల్‌ఈడీ ఆవిష్కరణతో భూమిపైగల ఇంధన వనరులను ఆదా చేయడానికి చాలా వీలు ఉంటుంది. బల్బులు వెయ్యి గంటలు, ఫ్లోరోసెంట్ దీపాలు 10 వేల గంటలు వెలిగితే ఎల్‌ఈడీలు లక్ష గంటలు వెలుగుతాయి, ఆ రకంగా వినిమయం కూడా తగ్గుతుంది. నీలి ఎల్‌ఈడీని ఉపయోగించి తెల్లని లైట్‌ను కూడా కొత్త పద్ధతిలో సృష్టించవచ్చని ఇది మానవాళికి అతి పెద్ద ప్రయోజనం అని శాస్తవ్రేత్తలు పేర్కొంటున్నారు.

ఎల్‌ఈడీ వినియోగం...
విద్యుత్ ఆదాలో వచ్చిన పెనుమార్పులకు అనుగుణంగా అధునాతన టెక్నాలజీతో తయారవుతున్న ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ పరిశ్రమల్లో ఈ ఎల్‌ఈడీలను విస్తృతంగా వాడుతున్నారు. టీవీల్లో, కార్ల లైటింగ్స్ కోసం, సిస్టంల మానిటర్ల, ట్రాఫిక్ సిగ్నలింగ్, రైల్వే సిగ్నల్స్ లైట్ల కోసం ఎల్‌ఈడీ లైట్లనే వినియోగిస్తున్నారు. వీటితోపాటుగా నగరాల్లో భారీ స్థాయి మల్టీఫ్లెక్స్‌లలో, కార్పొరేట్ వాణిజ్య సముదాయాల్లో, బంగారం షోరూముల్లో, కార్పొరేట్ ఆస్పత్రుల్లో, షాపింగ్ మాల్స్‌లో, బట్టల షాపుల్లో ఎల్‌ఈడీ బల్బుల వినియోగం అధికంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే గృహాల్లో కూడా ఎల్‌ఈడీలు కాంతులు విరజిమ్ముతున్నాయి.
అత్యంత ఉజ్వలంగా కాంతినిస్తూనే, పర్యావరణం దెబ్బతినకుండా కాంతిపుంజాలను ఈ బల్బులు వెదజల్లుతుంటాయి. విద్యుద్దీకరణ పరిజ్ఞానంలో ఇది కీలక ఘట్టం. విద్యుత్ సంక్షోభాల కాలంలో ఇలాంటి నూతన ఆవిష్కరణలు చాలా అవసరం కూడా.

పది సాధారణ బల్బులకు దీటుగా ఒక ఎల్‌ఇడి బల్బు సురక్షితమైన వెలుగును అందిస్తుంది.

ఇప్పటికి 17 కోట్ల బల్బులు ప్రజలకు అందాయి. 77 కోట్ల బల్బులు అందచేయాలన్నది లక్ష్యం

ఎసిలు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లకోసం విద్యుత్ వినియోగంలో ఎల్‌ఇడి టెక్నాలజీ వాడకంతో 25శాతం విద్యుచ్ఛక్తిని ఆదా చేయాలన్నది ఓ లక్ష్యం. వీధి దీపాలు, ఇళ్లలో సంప్రదాయ బల్బులకు బదులు ఎల్‌ఇడిల వాడకం వల్ల ఏటా 40వేల కోట్ల రూపాయల విద్యుత్ బిల్లుల ఖర్చు తగ్గించుకోవాలన్నది మరో లక్ష్యం. ఈ ఏడాది 5 కోట్ల బల్బుల కొనుగోలుకు ఇఇఎస్‌ఎల్ సిద్ధమైంది.

ఓపెన్ మార్కెట్‌లో 7-9 వాల్టుల ఎల్‌ఇడి బల్బు ధర రూ.300 ఉంది. ప్రభుత్వం వీటిని రూ. 75కే అందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఈ ధర 54.9గా నిర్ణయించి బల్బుల కొనుగోలుకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దేశవ్యాప్తంగా 17 సంస్థలు ఎల్‌ఇడి బల్బుల ఉత్పత్తితోపాటు ప్రభుత్వ పథకం ఉజల అమలులో తోడ్పాటును అందిస్తున్నాయి.

ఉజ్వలంగా ఉజాల!
కేంద్రప్రభుత్వం ప్రారంభించిన పథకం ఉజల. దేశంలో అన్ని ప్రాంతాల్లో ఎల్‌ఇడి బల్బుల వాడకాన్ని ప్రోత్సహించి, విద్యుత్‌ను ఆదా చేయడం, నాణ్యమైన, మేలైన, స్పష్టమైన వెలుగును అందించడం, ఆర్థికంగా పొదుపు సాధించడం, విద్యుత్ కోసం నిధుల వృధాను అరికట్టడం ఈ పథకం లక్ష్యం. కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం దీనిని ఓ ఉద్యమంలా నిర్వహిస్తోంది. ఎనర్జి ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్‌ఎల్) ద్వారా దీనిని అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలనూ ఇందులో భాగస్వామ్యం చేశారు. అన్ని ఇళ్లకు చౌకగా ఎల్‌ఇడి బల్బులు అందచేయడం, అన్ని ప్రాంతాల్లో వీధిలైట్లకు ఎల్‌ఇడి బల్బులనే వాడటం వంటివి కార్యక్రమంలో కొన్ని అంశాలు. దేశంలో ఈ ఏడాది అక్టోబర్ 17 నాటికి 17,04,04,847 ఎల్‌ఇడి బల్బులను ప్రజలకు కేంద్రప్రభుత్వం అందజేసింది. దీనివల్ల రోజుకు 6,06,30,047 కెడబ్ల్యుహెచ్ విద్యుచ్ఛక్తి, రూ. 24,25,20,178ల ఖర్చు ఆదా, విద్యుత్ పీక్‌టైమ్ లోడ్ డిమాండ్‌లో 4,431 మెగావాట్ల తగ్గుదల, 49,110 టన్నుల కార్బన్‌డయాక్సైడ్ వాయువు విడుదల తగ్గడం సాధ్యమవుతోందన్నమాట. 2020 నాటికి దేశం అంతటా ఎల్‌ఇడి బల్బులనే వాడేలా చేయడం లక్ష్యం. ప్రజల చైతన్యంతోనే ఇది సాధ్యం.

ఇవీ లాభాలు!
ఎల్‌ఇడి బల్బుల వాడకం వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సంప్రదాయ బల్బుల వాడకంతో ఎన్నో నష్టాలున్నాయి. ఎల్‌ఇడివల్ల అవి తగ్గి పొదుపు సాధ్యమవుతుంది. అది పౌరులకు, దేశానికి, వాతావరణానికి ఎంతో లాభం చేకూరుస్తోంది. ఇంతకీ ఆ లాభాలేమిటో తెలుసా. సంప్రదాయ బల్బుల ఖరీదు ఎక్కువ. అవి ఎక్కువ కాలం పనిచేయవు. త్వరగా పాడైపోతాయి. అందువల్ల సగటున వాటికోసం పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. అదే ఎల్‌ఇడి బల్బుల మన్నిక ఎక్కువ. ఒకసారి కొంటే ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. సాధారణ బల్బుల్లో ఉన్నట్లు ఫిలమెంట్ ఉండదు. అందువల్ల విద్యుత్ సరఫరాలో ఓల్టేజీల్లో హెచ్చుతగ్గులు వచ్చినపుడు సాధారణ బల్బులు పాడైపోతాయి. కానీ ఎల్‌ఇడి తట్టుకోగలుగుతుంది. అంటే సాధారణ బల్బుల్లా పదేపదే కొనాల్సిన అవసరం ఉండదు. మామూలు బల్బులు వెలగడానికి పట్టే సమయం, అవి వెలగడానికి ఖర్చయ్యే శక్తిలో ఎక్కువ వేడెక్కడానికే అవుతుంది. అంటే అదంతా శక్తిని వృధా చేస్తున్నట్లే. అంటే వెలుగుకోసం అయ్యే శక్తిఖర్చుకన్నా అది విడుదల చేసే వేడికోసం శక్తి వినియోగం ఎక్కువవుతున్నట్లు లెక్క. ఎల్‌ఇడి బల్బులైతే సాధారణ బల్బులుకన్నా పదిరెట్ల వేగంతో, చల్లటి వెలుగును, అత్యంత తక్కువ శక్తి వినియోగంతో ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. సాధారణ బల్బుల నుంచి వచ్చే వెలుగు అన్ని ప్రాంతాలకు ప్రసరిస్తుంది. అంటే వెలుగు వృధా అవుతున్నట్లే లెక్క. ఎల్‌ఇడి బల్బుల వెలుగు మనం కోరుకునే స్థలంలోకి పడేట్లు వాటిని రూపొందించుకోవచ్చు. నేరుగా, స్పష్టమైన రీతిలో వెలుగు ప్రసరించేలా ఇవి పనిచేస్తాయి. పైగా సాధారణ బల్బులను నిర్ణీత రూపాల్లో, సైజు పెద్దదిగా ఉండేలా మాత్రమే తయారు చేయగలరు. ఎల్‌ఇడికి ఆ బాధ లేదు. అందమైన, అతి సూక్ష్మమైన, తక్కువ స్థలంలో పట్టేలా వీటిని తయారు చేయవచ్చు. అదీగాక వీటిని కేవలం బల్బుల మాదిరిగానే కాదు వెలుగునిచ్చే పరికరాల్లాగానూ రూపొందించవచ్చు. డెకరేషన్ కోసం, అలంకరణ కోసం, సైకిళ్లు, ఇతర వాహనాలు, టీవీ తెరలు, చివరకు పాదరక్షల్లోనూ ఎల్‌ఇడి బల్బులను వినియోగించుకోవచ్చు.

*ఒక ఎల్‌ఇడి బల్బు వాడకం వల్ల ఏడాదికి 129 కెడబ్ల్యుహెచ్ విద్యుత్‌శక్తి ఆదా అవుతుంది. ఓ బల్బువల్ల ఏడాదికి 5190 రూపాయల విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది.

*ప్రపంచంలో చైనా ఎల్‌ఇడి బల్బులు, ఇతర ఎల్‌ఇడి వస్తువుల తయారీలో, వాడకంలో రారాజనే చెప్పాలి. ప్రస్తుతం ఎల్‌ఇడిని మించి ప్రయోజనాలు అందించే దిశగా అక్కడ పరిశోధనలు పెద్దఎత్తున సాగుతున్నాయి. మలేసియా, జపాన్, ఇండియా ఎల్‌ఇడిల వినియోగంలో ముందున్నాయి.

*దేశంలో గుజరాత్ ఎల్‌ఇడిల వినియోగంలో అగ్రపథాన ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రెండోస్థానంలో ఉంది. కర్నాటక, దాదర్ చెప్పుకోదగిన రీతిలో ఉజాల పథకాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ ఇప్పుడిప్పుడే రంగంలోకి దూసుకువస్తోంది.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి