ఈ వారం స్పెషల్

శరణు.. శరణు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుద్ధాలు, అంతర్యుద్ధాలు, అస్థిరత, రాజకీయ వేధింపులు, ఆర్థిక మాంద్యం, ఉపాధి లేమి, పేదరికం - కారణాలు ఏమైతేనేం కొన్ని దేశాలు అస్థిరతకు చిరునామాగా మారిపోయాయి. సామాన్య ప్రజల సాధారణ జీవనాన్ని అసాధారణ రీతిలో ఛిద్రం చేసేశాయి. నిలువ నీడ లేక, స్వదేశంలో ఉండలేక పొట్ట చేతపట్టుకుని, కట్టుబట్టలతో పరాయి దేశం పంచన చేరాల్సిన పరిస్థితులూ తెచ్చిపెట్టాయి. కారణాలు వేరైనా ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయులైనవారి సంఖ్య ఆరున్నర కోట్లకు పైగా చేరడం ఆయా దేశాల్లో ఏర్పడిన ప్రమాదకర పరిస్థితులకు అద్దం పడుతోంది. వలసవాదులు, శరణార్థులు, బలవంతంగా తరలించబడిన వారు, నిరాశ్రయులు, ఆర్థిక వలసదారులు - పేరు ఏదైనా పరాయి దేశాల్లో ప్రత్యేక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారి సంఖ్య ఎన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయికి చేరింది. ఐక్యరాజ్యసమితి శరణార్థి వ్యవహారాల హైకమిషన్ అంచనాల ప్రకారం వీరి సంఖ్య సుమారు ఆరుకోట్ల 53 లక్షలు. కొన్ని దేశాల్లో నెలకొన్న భయానక పరిస్థితులకు, సాధారణ జన జీవనానికి ఏర్పడిన అవరోధాలకు ఈ గణాంకాలు ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. ఆశ్రయం కోసం పరుగులు తీస్తున్న వారి జాబితా రికార్డు స్థాయికి చేరడం ఒక ఎత్తయితే, ఆ పరుగు ప్రయాణంలో మధ్యలోనే మరణించేవారూ, సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్న శిబిరాల్లో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరగడం విషాదకరం.
2015 డిసెంబర్ చివరినాటి గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 24మంది స్వదేశాన్ని విడిచిపెడుతున్నారని ఐరాస శరణార్థి వ్యవహారాల హైకమిషన్ తేల్చిచెప్పింది. 2005లో ఈ సంఖ్య ఆరుగురికే పరిమితం కాగా, దశాబ్ద కాలంలో అది 24కు చేరడాన్ని బట్టి చూస్తే ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితులను తేటతెల్లం చేస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఎన్నడూ లేని రీతిలో గత ఏడాది రికార్డు స్థాయిలో శరణార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాగే మధ్యదరా సముద్ర జలాల్లోనూ, అటు ఆశ్రయం పొందుతున్న శిబిరాల్లోనూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా పెరగడం ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న అంశం. రాజకీయ ఆశ్రయం పొందే హక్కు ఉన్నా శరణార్థుల జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పు లేదు. ఉపాధి తదితర అవకాశాల్లో స్థానికుల అవకాశాలు సన్నగిల్లడం, వలస వస్తున్న శరణార్థుల సంఖ్య పెరిగిపోతుండటం ఆశ్రయమిస్తున్న చాలా దేశాలు వారిపట్ల నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి. తొలి దశలో ఉదారంగా వ్యవహరించినా కాలక్రమేణా శరణార్థులను పట్టించుకోవడం తగ్గించేశాయి. కొన్ని దేశాలు సరిహద్దులను మూసివేస్తే, మరికొన్ని దేశాలు నిత్యావసరాల పంపిణీ, సౌకర్యాల కల్పనలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయి.
ప్రస్తుతం యూరప్ దేశాలను మంచు ముంచెత్తుతోంది. మంచుతో కప్పబడిపోతున్న శరణార్థుల శిబిరాలవైపు ఆ ప్రభుత్వాలు కనె్నత్తి కూడా చూడటం లేదు. దీంతో వారి బతుకు దుర్భరంగా, దయనీయంగా మారి గడ్డకట్టే చలిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే పలువురు మృత్యువాత పడటంతో ఐక్యరాజ్యసమితి శరణార్థి వ్యవహారాల హైకమిషన్ ఘాటుగానే స్పందించింది. తక్షణం ఆదుకోవాలని హైకమిషన్ పిలుపునివ్వడం శరణార్థులు ఎదుర్కొంటున్న దుర్భర, ప్రమాదకర పరిస్థితులకు అద్దం పడుతోంది. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో చలికి తట్టుకోలేక రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు మరణించారు. దీంతో శరణార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, వారికి అవసరమైన సామగ్రిని సరఫరా చేయాలని హైకమిషన్ తీవ్ర స్థాయిలోనే పిలుపునిచ్చింది.
దేశాలు దాటి ఆశ్రయం కోరి వచ్చినా శరణార్థుల బతుకుల్లో ఎలాంటి మార్పులేదు. ప్రాథమిక హక్కులు, సాధారణ దైనందిన జీవితం వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. మరోపక్క హత్యలు, కిడ్నాప్‌లు, దాడులు, బెదిరింపులు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. భద్రత విషయంలో ఆయా దేశాలు నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటంతో క్షణక్షణం బతుకు భయం వెంటాడుతోంది. శరణార్థులుగా గుర్తింపు పొందిన వారి జీవితాలు బాగానే ఉన్నా, మిగిలిన వారి పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా ఉంది. శిబిరాల్లో భద్రత కల్పించడంతో పాటు సౌకర్యాలు మెరుగుపరచాలని ఐరాస శరణార్థి వ్యవహారాల హైకమిషన్ హెచ్చరించడం శరణార్థులపట్ల పలు దేశాలు వ్యవహరిస్తున్న తీరును తేటతెల్లం చేస్తోంది. సెర్బియాలో మైనస్ డిగ్రీల చలిలో గజగజ వణికిపోతున్న శరణార్థ కుటుంబాలకు ఐరాస నేతృత్వంలోని సహాయ బృందాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు దుప్పట్లు, హీటర్లు వంటి ఇతర పరికరాలు పంపిణీ చేశాయి. మరికొంతమందిని ప్రభుత్వ వసతిగృహాలకు తరలించాయి. ఈ చర్యలు కొంతమేరకే ఫలితాన్నిచ్చినా స్థానిక ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే తప్ప దట్టమైన మంచుదుప్పటి కప్పుకున్న శరణార్థుల బతుకులు సాధారణ స్థితికి వచ్చే అవకాశం కనిపించడం లేదు. శరణార్థులను నిర్లక్ష్యం చేయడం మానుకోవాలని, ఆయా ప్రభుత్వాల చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని హైకమిషన్ తీవ్రంగా స్పందించడం యూరోపియన్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఆయా ప్రభుత్వాల తీరు మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది. చాలా శిబిరాల్లో వైద్య సేవలు నామమాత్రంగా ఉన్నాయి. ప్రసూతి సమయంలో వైద్యుల సంరక్షణ లేకపోవడంతో నవజాత శిశువులు పురిట్లోనే ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మరికొన్నిచోట్ల అంటురోగాలు ప్రబలి అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉపాధి, పోషకాహారం, వౌలిక వసతులు వంటివి అందక చాలా శరణార్థ శిబిరాలు దుర్భర పరిస్థితులను తలపిస్తున్నాయి. చాలా శిబిరాల్లో విద్య, వైద్యం, ఉపాధి కల్పన వంటి చర్యలకు ఆయా ప్రభుత్వాలు తొలి దశలో చర్యలు తీసుకున్నాయి. అలాంటి శిబిరాలన్నీ ఇప్పుడు శరణార్థులకు స్థిర నివాసాలుగా మారిపోయాయి. అయితే వలస వస్తున్న శరణార్థుల సంఖ్య పెరిగిపోతుండటంతో సౌకర్యాల కల్పన అరకొరగా మారింది. ఐరాస బృందాలు, స్వచ్ఛంద సంస్థలు తీసుకుంటున్న చర్యలకు తోడు ఆయా ప్రభుత్వాలు కూడా ముందుకువస్తే శరణార్థుల జీవితాలు గాడిన పడినట్టే. మరోపక్క ప్రపంచంలోనే అతి పెద్ద శరణార్థ శిబిరమైన దాదాబ్‌ను 2017 జూన్ నాటికి మూసివేస్తామని కెన్యా ప్రకటించింది. తరచూ మూసివేత ప్రకటనలు చేస్తున్న కెన్యా ఈసారి మళ్లీ గడువు పొడిగించింది. నిధులు
రాబట్టుకునేందుకే కెన్యా ఇలాంటి ప్రకటనలు చేస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దాదాబ్ కాంప్లెక్స్‌లో సోమాలియా శరణార్థులు జీవనం సాగిస్తున్నారు. సోమాలియాకు కేవలం 90 కి.మీ దూరంలో ఉన్న ఈ శిబిరానికి కాలినడకనే శరణార్థులు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. దాదాబ్ కాంప్లెక్స్ ఉగ్రవాదులకు ఆశ్రయ కేంద్రంగా మారిందనే సాకుతో కెన్యా మూసివేత ప్రకటనలు చేస్తోంది. శిబిరాల్లో తలదాచుకుంటున్న శరణార్థులను బెదిరించడం, హింసించడం, నిత్యావసరాల సరఫరాలో కోత విధించడం వంటి చర్యలతో తమంత తాముగా శిబిరాలను విడిచిపెట్టే పరిస్థితులు కల్పిస్తోంది.
జలగండంగా మారిన మధ్యధరా సముద్రం
స్వేచ్ఛాయుత జీవనం కోసం పొట్ట చేతపట్టుకుని కట్టుబట్టలతో, పిల్లాజెల్లాతో ఉరుకులు పరుగులు పెడుతున్న కుటుంబాలకు మధ్యధరా సముద్రం జలగండంగా మారింది. నాటుపడవలు, రబ్బరు బోట్లమీద వీరు సాగిస్తున్న ప్రయాణం ప్రాణాల్నే హరిస్తోంది. అక్రమ రవాణా సాగిస్తున్న దళారులు శరణార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. లెక్కకుమించిన వారిని పడవల్లో ఎక్కించి చేతులు దులుపుకోవడంతో ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. భవిష్యత్తు మీద ఆశతో స్వేచ్ఛగా బతుకుదామనుకున్న వారి బతుకులు జలసమాధి అయిపోతున్నాయి. మరోపక్క వీలైనంత త్వరగా సురక్షిత ప్రదేశానికి చేరుకోవాలన్న శరణార్థుల తొందర కూడా ఈ ప్రమాదాలకు కారణభూతమవుతోంది. శరణార్థుల పాలిట 2016 చేదుజ్ఞాపకాలనే మిగిల్చింది. మధ్యధరా సముద్రంలో జరిగిన పడవ ప్రమాదాల్లో ఐదువేలమంది శరణార్థులు జలసమాధి కావడం ఆయా దేశాల్లో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2015లో మధ్యధరా సముద్రాన్ని దాటుతూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,771 కాగా, 2016లో ఆ సంఖ్య ఐదువేలకు చేరడం శరణార్థుల సమస్య తీవ్రతకు నిదర్శనం.
కొత్త ఏడాది ఆరంభంలోనే...
కొత్త ఏడాది తొలి రెండు వారాల్లోనే మధ్యధరా సముద్ర జలాల్లో 11మంది మరణించారు. జనవరి 15న సుమారు వందమంది ప్రయాణిస్తున్న మరో పడవ మునిగిపోవడంతో నలుగురు మాత్రమే బతికి బట్టకట్టారు. ఎనిమిది మృతదేహాలు లభ్యం కాగా, మిగిలిన వారి ఆచూకీ లభ్యం కాలేదు. లిబియా-ఇటలీ మధ్య లిబియా తీరానికి 30 కి.మీ దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరంతా ఏ దేశస్థులో తెలియరాలేదు. జనవరిలో తొలి పక్షం రోజుల్లోనే సముద్ర మార్గం ద్వారా యూరప్‌కు వెయ్యిమంది తరలివచ్చారని హైకమిషన్ అంచనా వేసిందంటే శరణార్థుల సంఖ్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే - పదిహేడేళ్లలోపు యువతీ యువకులు ఒంటరిగానే తరలిరావడం. సముద్ర మార్గం ద్వారా గత ఏడాది 25,800మంది ఒంటరిగానే ఇటలీలోకి ప్రవేశించినట్లు యునిసెఫ్ ప్రకటించడాన్ని బట్టి చూస్తే శరణార్థుల్లో మరో కోణం వెలుగుచూసింది. కుటుంబాలకు కుటుంబాలు తరలివస్తున్న నేపథ్యంలో ఒంటరిగా వచ్చే బాలబాలికల సంఖ్య కూడా తక్కువేమీ కాదని తేటతెల్లమైంది.
ఆ ఎనిమిది దేశాలు...
అనిశ్చితి, అంతర్యుద్ధం, నిరంతర దాడులతో భయానక వాతావరణం కలిగిన ఎనిమిది దేశాలనుంచే ప్రజలు ఆశ్రయం కోసం సరిహద్దులు దాటేస్తున్నారు. ఆయా దేశాల్లో నెలకొన్న అశాంతి తగ్గుముఖం పట్టే సూచనలు లేకపోవడంతో ప్రజలు వలసబాటను ఎంచుకుంటున్నారు. పాలస్తీనా, సిరియా, అఫ్గానిస్తాన్, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశాలనుంచి భారీ సంఖ్యలో వలసబాట పడుతున్నారు. పాలస్తీనా నుంచి 52 లక్షలమంది, సిరియానుంచి 49లక్షలమంది, అఫ్గానిస్తాన్ నుంచి 27 లక్షలమంది, సోమాలియా నుంచి 11లక్షల 20వేలమంది, దక్షిణ సూడాన్ నుంచి 7,78,700మంది, సూడాన్ నుంచి 6,28,800మంది, డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో నుంచి 5,41,500మంది, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ నుంచి 4,71,100మంది ఆశ్రయం కోసం ఇతర దేశాలకు తరలినట్లు ఐరాస శరణార్థి వ్యవహారాల హైకమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఆశ్రయమిస్తున్న దేశాల్లో టర్కీదే అగ్రస్థానం
శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల్లో టర్కీ అగ్రస్థానంలో నిలిచింది. 2015 చివరి నాటికి రెండున్నర కోట్లమంది శరణార్థులు ఆశ్రయం పొందుతుండగా ఈ సంఖ్య 2016లో మరింతగా పెరిగింది. టర్కీ మొత్తం జనాభా ఏడున్నర కోట్లు కాగా, అదనంగా రెండున్నర కోట్ల శరణార్థులకు ఆశ్రయమివ్వడం గమనార్హం. పాకిస్తాన్‌లో పదహారు లక్షలమంది, లెబనాన్‌లో 11లక్షలమంది, ఇరాన్‌లో 9లక్షల 80వేలమంది, ఇథియోపియాలో ఏడులక్షల 36వేలమంది, జోర్డాన్‌లో ఆరులక్షల 64వేలమంది, కెన్యాలో ఐదులక్షల 53వేలమంది, ఉగాండాలో నాలుగులక్షల 77వేలమంది, కాంగోలో మూడులక్షల 83వేలమంది, ఛాద్‌లో మూడు లక్షల 69వేలమంది శరణార్థులకు ఆశ్రయమిచ్చాయి.
బాధ్యత మరిచిన సంపన్న దేశాలు
వలస వచ్చే వారికి రక్షణ కల్పించాలన్నది ప్రపంచ నియమం. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలది. అయితే శరణార్థుల సమస్య తమది కాదన్నట్లుగా చాలా సంపన్న దేశాలు వ్యవహరిస్తున్నాయి. వరదలా వస్తున్న శరణార్థులను అడ్డుకుంటూ రహదారులను మూసివేసి వారిని పేద దేశాలవైపు వ్యూహాత్మకంగా దారి మళ్లిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలవైపు వీరిని పంపించివేస్తున్నారు. దీంతో మొత్తం శరణార్థుల సంఖ్యలో 86 శాతం ఈ దేశాల్లోనే ఆశ్రయం పొందుతున్నారంటే సంపన్న దేశాలు ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతుంది. ప్రస్తుతం తీవ్రంగా పరిణమించిన శరణార్థుల సమస్యను పరిష్కరించేందుకు సంపన్న దేశాలన్నీ కలిసికట్టుగా ముందుకు కదలాల్సిన అవసరముందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ సూచించడం ఈ సందర్భంగా గమనార్హం.
శరణార్థులు సురక్షితంగా తరలివచ్చేందుకు మార్గం సుగమం చేయాలి. సరిహద్దులను తెరిచివుంచాలి. దీంతో ప్రమాదకరంగా పరిణమించిన సముద్ర మార్గంపై ప్రయాణాలు తగ్గుముఖం పడతాయి. సరిహద్దుల వద్దగానీ, మధ్యధరా సముద్ర ప్రయాణంలోగానీ శరణార్థులు ప్రాణాలు కోల్పోకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా సరిహద్దుల్లోకి అనుమతించాలి. ఫెన్సింగ్‌లతో సరిహద్దులు మూసివేయడం వల్లే గత్యంతరం లేక ప్రమాదకర మార్గాల్లో ప్రయాణాలకు ఒడిగట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. మానవ రవాణాకు ఉసిగొల్పుతున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. బలవంతంగా వసూళ్లకు పాల్పడటం, చెల్లించని వారిని సముద్రంలోకి తోసివేయడం వంటి కిరాతక చర్యలకు మానవ రవాణా దళారులు పాల్పడటంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రయాణంలో ఆహారం, నీరు అందక మరణించేవారి సంఖ్య కూడా అధికమే. ఆర్థిక, సామాజిక కారణాలు చూపి శరణార్థులను తిరస్కరించకుండా అన్ని దేశాలు మానవీయతను ప్రదర్శించాలి. లేకపోతే హింసాత్మక ఘటనలు పెచ్చుమీరే ప్రమాదముంది.
రెండో ప్రపంచ యుద్ధానంతరం 1951లో జరిగిన సదస్సులో శరణార్థులకు రక్షణ కల్పిస్తామని ఐక్యరాజ్యసమితి సాక్షిగా చాలా దేశాలు వాగ్దానం చేశాయి. ఆ వాగ్దానం ఇప్పుడు సంపన్న దేశాలకు గుర్తుకురాకపోవచ్చు. పతాకస్థాయికి చేరిన శరణార్థుల సమస్య ఎప్పటికైనా తీవ్ర రూపం దాల్చే ప్రమాదం మాత్రం పొంచివున్నట్లే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న ఈ ప్రమాద ఘంటికలను ప్రపంచ నాయకులు ఆలకించిన పక్షంలో సమీప భవిష్యత్తులో భారీ మానవ సంక్షోభానికి దారితీయకుండా అడ్డుకోగలిగినవారవుతారు.

- ఎస్. మోహన్‌రావు