ఈ వారం స్పెషల్

సైకిల్‌@200 సామాన్యుని సవారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత సంపన్నుడైనా, కడు బీదవాడైనా తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో సైకిల్ తొక్కాల్సిందే. ఒకప్పుడు అవసరం కోసం, మరొక్కప్పుడు సరదా కోసం, ఇప్పుడు ఆరోగ్యం కోసం సైకిల్ అవసరమవుతోంది. ప్రజలకు అందుబాటులోకి వచ్చిన రెండు శతాబ్దాలైనా ఇప్పటికీ సైకిల్‌కు ఆదరణ తగ్గలేదు.
సైన్యం నుంచి సామాజిక సేవల వరకు, ఆటలు, పోటీలు, రక్షణ దళాలు.. ఒకటేమిటి ఏ రంగంలోనైనా, ఎప్పుడో ఒకప్పుడు సైకిల్ సేవలందించిందంటే నమ్మాల్సిందే. కొత్తవనె్నలు, చినె్నలతో అభివృద్ధి పథంలో సైకిల్ పరుగులు తీస్తూనే ఉంది. ఎంత హార్స్ పవర్ ఉన్నా ఇతర వాహనాలేవీ దాని పరుగును ఆపలేకపోతున్నాయి. దాని అభివృద్ధిని అందుకోలేకపోతున్నాయి. తక్కువ ధరకు, ప్రమాదాలు లేని, పర్యావరణ హిత ప్రయాణ సాధనం సైకిల్ మాత్రమే. దీనికి మరోటి పోటీ లేదు మరి.
***
ట్రిన్..ట్రిన్..అంటూ బెల్లుకొట్టి రయ్ రయ్ మంటూ తొక్కే సైకిల్‌వాలా మొహంలో ఆనందం వర్ణించడం అంత ఈజీ కాదు. ఈ సామాన్యుడి ప్రయాణ సాధనం అందుబాటులోకి వచ్చి అప్పుడే రెండువందల ఏళ్లు పూర్తయింది. అయినా అదంటే మోజుతగ్గలేదు. మనిషి నడిస్తే ఎంత శక్తి ఖర్చవుతుందో, అదే శక్తితో వేగంగా గమ్యానికి చేరుకునేందుకు ఉపయోగపడే ప్రయాణ సాధనం సైకిల్. ప్రస్తుతం కార్లకన్నా మూడురెట్లు ఎక్కువగా, అంటే ఈ భూగోళంపై దాదాపు వంద కోట్ల సైకిళ్లు సేవలందిస్తున్నాయి. ప్రపంచం ఇప్పుడు ఆకాశంవైపే చూస్తోంది.
ఆశలు, ఆకాంక్షలు అన్నీ హద్దుల్లేని ప్రాంతంవైపే సాగిపోవాలని తహతహలాడుతోంది. రాకెట్లు, విమానాలు, కార్లు, అధునాతన ప్రయాణ సాధనాలు సౌకర్యాన్నిస్తూనే ఉన్నాయి. అయినా.. ఎంత పెద్దవారైనా ఓ సైకిల్ కనిపిస్తే చిన్నపిల్లల్లా మారిపోతారు. ఎందుకంటారు? అదే సైకిల్‌లోని మహత్తు.
ఈ మధ్య మన ప్రధాని నరేంద్రమోదీ నెదర్లాండ్ వెళ్లారు. ఆ దేశ ప్రధాని ఓ అద్భుతమైన సైకిల్‌ను మోదీకి బహుమతిగా ఇచ్చారు. సైకిల్ తొక్కుతున్న భంగిమలో మన ప్రధాని పోజిచ్చారు. సైకిల్ తొక్కుతూ ఆనందంగా నవ్వుతూ కనిపించారు మోదీ. సరే, ఆ దేశ ప్రధాని, మన మోదీకి సైకిలే ఎందుకు బహుమతిగా ఇచ్చారు. ఎందుకంటే, నెదర్లాండ్‌కు, సైకిల్‌కు అంతటి అనుబంధం ఉంది మరి. ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సైకిళ్ల వాడకాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ, అనుసరిస్తున్న దేశాల్లో నెదర్లాండ్‌ది మొదటి స్థానం. సాక్షాత్తు అక్కడి ప్రధాని సహా పెద్దలు చాలామంది తమతమ పనులను సైకిళ్లపై వెళ్లే చక్కబెట్టుకుంటారు. సరే, భారత్‌లో సైకిల్ ప్రస్థానం, దాని అవసరం తెలుసుకోవలసిన సందర్భం ఇది.
తొలిసారిగా..
దాదాపు 300 వందళ ఏళ్ల క్రితం నుంచే రోడ్డుపై నడిచే తేలికపాటి వాహనం కోసం ప్రయత్నాలు మొదలైనా 1817నాటికి ఓ ప్రయత్నం సాకారమైంది. ముఖ్యంగా రెండు చక్రాల సైకిల్ మోడల్ ఆవిష్కృతమైంది. కొయ్యతో చేసిన ఈ వాహనాన్ని కాళ్లతో తోసుకుంటూ నడపాల్సి వచ్చింది. పెడల్స్, రెండు చక్రాలను అనుసంధానం చేసే వ్యవస్థ, బెల్లు, బ్రేకులు లేవు. జర్మనీకి చెందిన బరన్ కార్ల్ డ్రెయిస్ దీనిని రూపొందించారు. ఒక అంచనా ప్రకారం 1817 జూన్ 12న దీనిని జర్మనీలోని మాన్‌హీన్ ప్రాంతంలోని గ్రాండ్ డచీ ఆఫ్ బాడెన్‌లో నడిపారు. ఆ తరువాత పారిస్‌లో దీనినే నడిపారు.
అప్పట్లో అది ఒక సంచలనమైంది. ఆ తరువాత పరిశోధనలు ముమ్మరమై ఒక్కో సౌకర్యం ఏర్పాటు చేశారు. యుద్ధాల్లోను, అగ్నిమాపక దళాల్లోను, రేసుల్లోను, సాధారణ వినియోగానికి, ఇలా అవసరాన్నిబట్టి వివిధ మోడళ్ల సైకిళ్లు అందుబాటులోకి వచ్చాయి. మగవారికి, మహిళలకు వేరువేరుగా, పిల్లలకు బ్యాలెన్సింగ్ సౌకర్యం ఉన్నవి ఇలా ఆధునిక పోకడలకు తగ్గ విధంగా సైకిళ్లు తయారయ్యాయి. ఎన్నిమార్పులు వచ్చినా రెండుచక్రాలు, బెల్లు, బ్రేకుల్లో పెద్దమార్పులు లేవు. టూరిస్ట్ సైకిళ్లకు భలే గిరాకీ ఏర్పడింది. మొత్తంమీద జనం అవసరాలకు తగ్గట్టు తయారైన సైకిల్ సామాన్యుడికి అందుబాటులో ఉండే సౌకర్యవంతమైన ప్రయాణ సాధనంగా ఇప్పటికీ చెలామణీలో ఉంది.
ఆరోగ్యరహస్యం
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం సైకిళ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నది నిరూపితమైన నిజం. అందుకే ప్రస్తుతం చాలా దేశాలు సైకిళ్ల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సైక్లింగ్‌కు అనుకూలంగా ఎన్నో స్వచ్చంద సంస్థలు ఉద్యమాలు కూడా నిర్వహిస్తున్నాయి. ఫ్రాన్స్ కేంద్రంగా ఏటా నిర్వహించే సైకిల్ రేసింగ్ 1903 నుంచి నిరాటకంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో అత్యుత్తమ, ప్రతిష్టాత్మక సైకిల్‌రేసింగ్ ఇది. 104వ సైకిల్ రేసింగ్ ఇటీవలే పారిస్‌లో నిర్వహించారు. మనిషి మామూలుగా నడిస్తే ఎంత శక్తి ఖర్చవుతుందో సైకిల్ తొక్కినా అంతే అవుతుంది. పైగా సమయం ఆదా అవుతుంది. శరీరానికి వ్యాయామం చేసిన ఫలితం దొరుకుతుంది. పర్యావరణానికి ఎటువంటి హానీ చేయని ఈ సైకిల్‌ను విస్తృతంగా వాడుకునేందుకు నెదర్లాండ్, డెన్మార్క్ వంటి దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. నెదర్లాండ్‌లో దాదాపు ప్రతి రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌లో సైకిల్‌స్టాండ్లు ఉన్నాయి. కొన్ని వందల సైకిళ్లు అక్కడ అందుబాటులో ఉంటాయి. దగ్గరి దూరాలకు సైకిల్‌ను అద్దెకు తీసుకుని వెళ్లేందుకు అలా అందుబాటులో ఉంచారన్నమాట. ఓ ప్రత్యేక కార్డు తీసుకుని స్వైప్ చేసి కావలసిన సైకిల్‌ను వాడుకోవచ్చన్నమాట. పరిమితంగా అద్దె వసూలు చేస్తారంతే. నెదర్లాండ్‌లో దాదాపు 40 శాతం మంది సైకిల్‌నే వాడతారు. అక్కడ కార్ల సంఖ్యకంటే సైకిళ్లు మూడురెట్లు ఎక్కువ. ముఖ్యంగా అమస్టర్‌డామ్, కోపెన్‌హగన్ వంటి నగరాల్లో సైకిల్ వినియోగం అసాధారణంగా ఉంటుంది. ఎటుచూసినా సైకిల్‌పై వెళ్లేవారే కనిపిస్తారు. వారికోసం ప్రత్యేకంగా సైకిల్‌ట్రాక్‌లు ఏర్పాటు చేసారు. పార్కింగ్, ప్రత్యేక సైక్లింగ్ నిబంధనలు అమలు చేస్తారు. హెల్మెట్ వాడకం తప్పనిసరిగా చేశారు. న్యూయార్క్ నగరంలో సైక్లింగ్‌ను ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. దాదాపు 14శాతం మంది సైకిళ్లను వినియోగిస్తారంటే నమ్మాలి.
భారత్‌లో..
సైకిల్ హవా అంతా మొదట్లో యూరోప్‌లోనే కనిపించింది. రానురాను భారత్‌కూ అది పాకింది. పేదల అవసరాలు తీర్చిన సైకిల్ పేదలకు ఒక వరం. కేవలం ప్రయాణానికే కాకుండా సరుకుల తరలింపునకు ఇది పెద్ద సాధనమైపోయింది. సరుకులు, పంటలు, భారీ వస్తువులను మోసి తీసుకువెళ్లకుండా తరలించుకుపోయేందుకు ఇవి అక్కరకొచ్చాయి. ఆధునిక భారతంలో మోపెడ్‌లు, మోటార్‌సైకిళ్లు అందుబాటులోకి వచ్చినా మొదట సైకిల్ నేర్చుకున్నాకే వాటిజోలికి వెళ్లేవారు. సైకిల్ బ్యాలెన్స్ చేస్తూ నడపగలిగితే మోటార్‌బైక్‌ను సులువుగా నడపవచ్చన్నది అప్పటివారి భావన. డైనమోలైట్లున్న సైకిళ్లు, బ్యాటరీతో మోగే హారన్స్ ఉన్న సైకిళ్లను అప్పట్లో గొప్పగా చూసేవారు. అలాంటి సైకిళ్లను నడిపేవారి హావభావాలు ఇప్పుడు గుర్తుచేసుకుంటే నవ్వాపుకోవడం కష్టమే. మనదేశంలో రోడ్లు సైక్లింగ్‌కు అనువుగా ఉండవన్నది ఓ అభిప్రాయం. ఇందులో నిజం లేకపోలేదు. విదేశాలతో పోలిస్తే సైకిళ్ల వాడకంపై ఓ విధానం అంటూ మనకు లేదు. సైకిల్‌ను ఓ ప్రయాణ సాధనంగా భావించడం లేదు. భోపాల్, విజయవాడ, కోల్‌కతా, చెన్నై ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే సైకిళ్లవాడకం పెరుగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, విజయవాడ వంటి నగరాల్లో సైకిళ్ల హడావిడి ఎక్కువే. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో సైకిళ్లు కనిపిస్తున్నా మిగతా నగరాలతో పోలిస్తే తక్కువే.
జనాదరణ చూసి..
సైకిల్ పేదవాడి సవారీ. మారుమూల పల్లెల్లోనైనా సరే ఏ కుటుంబానికైనా ఓ సైకిల్ ఉండటం మామూలే. స్కూలుకు వెళ్లేవారికి సైకిల్ ఉంటే పెద్దలకు ఊరట. రవాణా ఖర్చులు తగ్గడమే అందుకు కారణం. అందుకే వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లును ఇస్తామంటాయి. ఒడిశా, బిహార్, ఏపి, తెలంగాణ, తమిళనాడు, యుపి వంటి రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలయ్యాయికూడా.
*
అతడి ఇల్లే మ్యూజియం
సైకిళ్లపై అధ్యయనం చేయడం, సైక్లింగ్‌ను ప్రోత్సహించడం, ప్రచారం చేయడం అతడికి ఇష్టం. అతడి పేరు రేనాడ్. గత యాభై ఏళ్లుగా అతడు సైకిళ్లపై అధ్యయనం చేస్తున్నాడు. తన ఇంటినే ఓ మ్యూజియంగా మార్చేశాడు. ఏటా కనీసం 6000 మంది పర్యాటకులు అతడి ఇంటిని సందర్శిస్తూంటారు.ప్రపంచంలో నాలుగు సైకిల్ మ్యూజియంలున్నాయని అతడు చెబుతూంటాడు. తన ఇంటిని కూడా వాటిలో ఒకటిగా మార్చాలన్నది అతడి ఆలోచన.
*మనదేశంలో భోపాల్, విజయవాడ సైకిళ్ల వాడకంలో మొదటి స్థానాల్లో ఉన్నాయి. రాజమండ్రి, విజయనగరంలో సైకిళ్ల వాడకం ఎక్కువే.
*సైకిళ్లను విస్తృతంగా వాడే దేశం నెదర్లాండ్. అక్కడ ప్రభుత్వాధినేతలు కూడా సైకిల్‌పై విధులకు హాజరవుతారు.
*టాండెన్ అనే సైకిల్ ప్రపంచంలో అతి పొడవైన బైసైకిల్. 67 అడుగుల పొడవైన ఈ సైకిల్‌పై 35మంది కూర్చునేందుకు సీట్లున్నాయి.
*
*సైకిళ్ల ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలోను, భారత్ రెండో స్థానంలోనూ ఉన్నాయి.

*ప్రపంచంలో ఏటా 10.3 కోట్ల సైకిళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో 66 శాతం చైనాయే ఉత్పత్తి చేస్తోంది.
*
బెంగళూరులో ట్రిన్..ట్రిన్
పరిశుభ్రమైన నగరంగా దేశంలో మొదటి స్థానంలో నిలిచిన కర్నాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం తొలిసారిగా ఓ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి ‘ట్రిన్..ట్రిన్-పెడల్ విత్ ప్రైడ్’ అని పేరుపెట్టింది. విదేశాల్లో మాదిరిగా సైకిల్ షేరింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. సైకిళ్లను ఓ చోట అందుబాటులో ఉంచుతారన్నమాట. ముఖ్యంగా రద్దీ కూడళ్ల దగ్గర ఇవి ఉంటాయి. రైల్వే, బస్‌స్టేషన్లవంటి ప్రాంతాల్లోనన్నమాట. పబ్లిక్ బైక్ షేరింగ్ సిస్టమ్‌గా దీనికి పేరుపెట్టారు. ఈమధ్యే దీనిని ప్రారంభించారు కూడా. వరల్డ్‌బ్యాంక్, గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ గ్రాంటుతో దీనిని నిర్వహిస్తున్నారు. డాకింగ్ స్టేషన్లలో ఉన్న సైకిళ్లను కావలసిన వారు ఓ కార్డుతో స్వైప్ చేసి అద్దెకు తీసుకోవచ్చన్నమాట. వాటి నిర్వహణ, మరమ్మతులకు ఓ కేంద్రం ఉంటుంది. మైసూరులో దీనిని మొదట ప్రారంభించారు. 450 సైకిళ్లను ప్రాథమిక దశలో అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం అందించే ఈ సైకిళ్లకు జిపిఎస్ ట్యాగ్ అమర్చి ఉంటుంది. సైకిల్ వాడకానికి మొదటి రెండు గంటలకు 5 నుంచి పది రూపాయల వరకు వసూలు చేస్తారు. స్మార్ట్‌కార్డు ద్వారా వీటిని వసూలు చేస్తారన్నమాట. అద్దెకు తీసుకున్న కేంద్రంలోనే తిరిగి సైకిల్‌ను ఇవ్వాలన్న నిబంధన ఏమీ లేదు. నగరంలో ఉన్న ఏ కేంద్రంలోనైనా దానిని అప్పగించవచ్చు. మొత్తం 52 సైకిల్ డాకింగ్ స్టేషన్లను అక్కడ ఏర్పాటు చేశారు. వీటిలో 49 ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచంలో ఇప్పటివరకు ఇలాంటి పబ్లిక్ షేరింగ్ సిస్టమ్ ఉన్న కేంద్రాలు 600 ఉన్నాయి.