ఈ వారం స్పెషల్

బ్రహ్మాండోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల బ్రహ్మోత్సవాలు.. మానవాళికి మహోత్సవాలు.. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం కన్యామాసంలో వీటిని నిర్వహించడం ఆనవాయితి. అధికమాసం వచ్చినప్పుడు మాత్రం ఒకే ఏడాదిలో రెండుసార్లు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవ సంప్రదాయాలు, విశేషాలు, వాహన సేవల వెనుక పరమార్థాన్ని తెలుసుకుందాం..
వేదములే శిలలైన కొండపై శ్రీ వేంకటనాథునికి ఎన్నో ఉత్సవాలు రంగరంగ వైభవంగా, నిత్యకళ్యాణం పచ్చతోరణంగా జరుగుతూ ఉంటాయి. కలియుగ వైకుంఠంలో భక్తజన హృదయ కుసుమాలతో స్వామి అహర్నిశలూ పూజలందుకుంటూనే ఉంటాడు. ఏటా ఆశ్వయుజంలో తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ దినోత్సవాలు శ్రీవారి అవతార నక్షత్రమైన శ్రవణా నక్షత్రంతో ముగుస్తాయి. ఇదొక మహాపర్వం. మిరుమిట్లు గొలిపే దీప తోరణాలతో, అఖండ జ్యోతులతో, ధగద్ధగాయమానంగా ప్రకాశించే నవరత్నహార సంచయంతో, వేదఘోషలతో, పాటలతో, గోవిందనామాలతో సప్తగిరులు శోభిల్లుతాయి. స్వామి బ్రహ్మోత్సవ వేళ వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తకోటిని తరింపచేస్తాడు. దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు స్వామిని తనివితీరా దర్శించుకుని, కోరికలను నివేదించుకోవడానికి తిరుమలకు తరలి వస్తారు.
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి ఏటా 450కి పైగా ఉత్సవాలను నిర్వహిస్తారు. వైఖానస ఆగమవిధిగా నిర్వహించే అన్ని ఉత్సవాలలోనూ అత్యంత విశిష్టమైనవి, శోభాయమానమైనవి తొమ్మిది రోజులపాటు నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు.
పేరెలా వచ్చిందంటే..
శ్రీనివాస పరబ్రహ్మ కోరిక మేరకు బ్రహ్మోత్సవాలు శ్రీకారం చుట్టుకున్నాయి. సాక్షాత్తు స్వామివారు చతుర్ముఖ బ్రహ్మను పిలిచి ‘‘ఉత్సవం కురు మే పుణ్యం బ్రహ్మాన్! లోక పితామహా!’’ అని అడిగి చేయించుకున్నాడు. నాటి నుంచి బ్రహ్మోత్సవాలు నేటికీ సాంప్రదాయంగా కొనసాగుతున్నాయి. ‘బృహి-వృద్ధౌ’ అనే ప్రయోగాన్ని అనుసరించి తొమ్మిది రోజులపాటు నిర్విరామంగా స్వామి ప్రతి ఉదయం, సాయంత్రం వాహనసేవలు అందుకుంటాడు. సూర్యుడు కన్యారాశిలో సంచరించేటప్పుడు చిట్టా నక్షత్రం నాడు ధ్వజారోహణం, ఉత్తరా నక్షత్రం నాడు రథోత్సవం, శ్రవణానక్షత్రం నాడు తీర్థవారి చక్రస్నానంతో బ్రహ్మదేవుడు వీటిని ప్రారంభించాడు. కనుక ఇవి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మ పర్యవేక్షణకు సంకేతంగా నేటికీ బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మకు శూన్యరథం సిద్ధం చేస్తారు. ఉత్సవ వాహన సేవల్లో బ్రహ్మ రథం ముందుగా వెళుతూ ఉంటుంది.
చారిత్రాత్మకంగా..
పల్లవ రాణి పెరిందేవి క్రీ.శ. 614లో మనవాళ పెరుమాళ్ళు అనే వెండి (్భగ) శ్రీనివాసుని విగ్రహాన్ని తిరుమల ఆనందనిలయానికి సమర్పించింది. క్రీ.శ. 1429 ఆశ్వయుజ మాసంలో వీరప్రతాప దేవరాయులు, క్రీ.శ. 1446లో మాసి తిరునాళ్ళు పేరుతో హరిహర రాయలు బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. క్రీ.శ. 1530లో అచ్యుతరాయలు నిర్వహించిన ఉత్సవం అచ్యుతరాయ బ్రహ్మోత్సవంగా చరిత్ర ప్రసిద్ధికెక్కింది. క్రీ.శ. 1583 నాటికే బ్రహ్మోత్సవాలు ఇంచుమించుగా నెలకోసారి జరిగేవి. రాజులు, రాజ్యాలు అంతరించినా బ్రహ్మోత్సవ సాంప్రదాయం మాత్రం చిరుస్థాయిగా నిలిచిపోయింది.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
బ్రహ్మోత్సవాలకు ముందురోజు తిరుమల ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. ఇలా ఉగాది, ఆణివారి ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కూడా చేస్తారు. పరిమళ ద్రవ్యాలతో శ్రీవారి ఆనంద నిలయాన్ని శుద్ధిచేసి, అలంకరించే ఈ ప్రక్రియను కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంగా వ్యవహరిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమలలో విరాజిల్లుతున్న బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు ఈనెల 30న ధ్వజారోహనంతో ప్రారంభమై తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించి అక్టోబరు 8న ధ్వజాఅవరోహణంతో ముగించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. తొలి రోజు రాత్రి పెద్ద శేష వాహనంపై స్వామివారు చతుర్వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. కాగా ఈ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను 30వ తేదీ సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సమర్పించనున్నారు. ఇక 4వ తారీఖున స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమైన గరుడ వాహన సేవ జరుగుతుంది. ఈ సందర్భంగా సుమారు 3 నుంచి 4 లక్షల వరకు భక్తులు ఉత్సవాల్లో పాల్గొంటారని టీటీడీ అధికారులు అంచనాకు వచ్చి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
నిత్య కల్యాణం, పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరి ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం ఒక స్వర్గ్ధామమే. వేంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడ్ని పిలిచి జగత్‌కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఆ ప్రకారం శ్రవణానక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిదిరోజులు పాటు బ్రహ్మ స్వయంగా పర్యవేక్షిస్తూ బ్రహ్మోత్సవాలు నిర్వహించారని పురాణాలు తెలియజేస్తున్నాయి. చరిత్రలో ఎందరో రాజులు తమ విజయపరంపరకు చిహ్నంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఏడాదిలో నెలకు ఒకటి చొప్పున 12బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు ఆధారాలు ఉన్నాయి. స్వామి ఊరేగే వాహన సేవల సంఖ్యను బట్టి రోజుల సంఖ్య మారుతూ వచ్చింది. రాజులు, రాజ్యాలు కాలగర్భంలో కలసి పోయినా, శ్రీవారి మాత్రం బ్రహ్మోత్సవాలు నేటికీ నిర్విఘ్నంగా సాగుతున్న విషయం విదితమే.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం యేడాదికోసారి 9రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తోంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవ వైభవాన్ని తిలకించి తరించడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారి ఆలయంలో కొలువుదీరి ఉన్న మూలవిరాట్‌ను దర్శించడం కన్నా విశేష అలంకరణలతో దేదీప్యమానంగా వాహనాలపై ఊరేగే ఉత్సవమూర్తులను చూడటానికి భక్తులు ఎంతో ఆసక్తిగా వస్తారు.
ఉత్సవాల ప్రారంభంలో భక్తుల రద్దీ ఒక మోస్తారుగా ఉన్నా రెండురోజుల్లోనే ప్రతిరోజూ 70 నుంచి 1.50 లక్షల వరకు భక్తులు ఉత్సవాలను తిలకించడానికి తరలివస్తారు. ముఖ్యంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడవాహన సేవను తిలకించడానికి 3 నుంచి 4 లక్షల మంది భక్తులు తరలివస్తారు. ఇందుకు సంబంధించి టీటీడీ యాజమాన్యం పగడ్బంధీగా ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి 3 నెలల ముందునుంచే టీటీడీ అధికారులు దృష్టిసారించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి ఎ.వి. ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాధ్ జెట్టి, అదనపుసీవీఎస్‌వో శివకుమార్ రెడ్డిలతో పాటు చీఫ్ ఇంజనీర్ రామచంద్రారెడ్డి తిరుమలలో భక్తులకోసం చేయాల్సిన ఏర్పాట్లపై నిరంతరంగా సమీక్షలు చేస్తున్నారు. ఇక ఈ వార్షిక బ్రహ్మోత్సవాలంటే భక్తులకు ఒక పండుగ...అందుకే ఈ ఉత్సవాల కోసం భక్తజనం కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం ఆసన్నమైంది.
వైకానస ఆగమోక్తంగా నిర్వహించనున్న ఈ నవాహ్మిక బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం నాడు ఈనెల 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవానికి నాందిగా 29వ తేదీన అంకురార్పణ జరుగుతుంది. ఈ అంకురార్పణ జరిగేరోజున స్వామివారి సేనాధిపతి అయిన విష్వక్సేనుల వారు ఊరేగింపు, పుట్టమన్ను సేకరణ, యాగశాలల్లో పూజలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 30 సాయంత్రం బ్రహ్మోత్సవాలకు ప్రారంభోత్సవానికి సంకేతంగా ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహిస్తారు. స్వామివారికి అత్యంత పీతిపాత్రమైన గరుడ చిత్రాన్ని ఒక పసుపు వస్త్రంపై ఆవిష్కరింపచేసి చతుర్వీదులలో ఊరేగిస్తారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం పైకి ఈ గరుడచిత్రాన్ని ఎగురవేస్తారు. అదేరోజు రాత్రి 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పెద్దశేష వాహనం నిర్వహిస్తారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామివారు భక్తులకు అభయప్రదానం చేస్తారు. రెండోరోజు నుంచి ప్రతిరోజూ ఉదయం, రాత్రి రెండుపూటలా స్వామివారు వివిధ రకాల వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. కొన్ని వాహనాల్లో శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామిగా అధిరోహిస్తే కొన్ని వాహనాల్లో మలయప్పస్వామి మాత్రమే భిన్న రూపాలలో విశేషాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 2వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సింహవాహనంపైన, రాత్రి 8 నుంచి 11 గంటల వరకు ముత్యపుపందిరివాహనంపైన, 4వ తేదీ ఉదయం మోహినీ అవతారంలోనూ, రాత్రి 7 నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు గరుడవాహనంపైన విహరిస్తారు. 5వ తేదీ ఉదయం హనుమంత వాహనంపైన, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు స్వర్ణరథంపైన, రాత్రి గజవాహనంపైన స్వామివారు చతుర్వీధులలో విహరిస్తారు. 6వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 7వ తేదీ ఉదయం 7 గంటలకు రథోత్సవం, అటు తరువాత రాత్రి స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతారు. 8వ తేదీ ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగుస్తాయి.
ఈ ఉత్సవాలను చూసి తరించాలే తప్ప విని తరించలేమన్నది అక్షరసత్యం. స్వామివారి బ్రహ్మోత్సవాల వైభవాలను తిరుమలలోజరిగే సాంస్కృతిక కార్యక్రమాలను టీటీడీ ఎస్వీ భక్తిచానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. టీటీడీ ఫౌర సంబంధాల శాఖ అధికారి డాక్టర్ రవి, ఏపీ ఆర్ ఓ నీలిమ ఈ ఉత్సవాల వైభవాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. టీటీడీ ఛాయాచిత్ర గ్రాహకులు (ఫొటోగ్రాఫర్) శేఖర్ స్వామివారి ఉత్సవ వైభవాలను తమ కెమరాల్లో బంధించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా ఉత్సవాల్లో వచ్చే భక్తులకు సేవలందించడానికి టీటీడీ ఉద్యోగులతో పాటు టీటీడీ ఫౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవారి సేవకులు ఇప్పటికే తమ హాజరును సేవాసదన్ కార్యాలయంలో నిర్దారించుకున్నారు.
అంకురార్పణ
శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. ఉత్సవాలు ప్రారంభానికి ముందు రోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న వసంతమండపానికి విశ్వక్సేనుల వారు పరివార దేవతలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారం నందు లలాట బహు స్థన ప్రదేశాల నుండి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయంలోనికి చేరుకుంటారు. దీనే్న మ్రిత్సంగ్రహణం అంటారు.
యాగశాలలో ఈ మట్టిని నింపి 9పాలికలు(కుండలు) శాలి,వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియాంగు తదితర నవధాన్యాలను పోసి ఆ మట్టిలో మొలకెత్తించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి మొత్తం చంద్రుడు అధిపతి. శుక్లపక్ష చంద్రుడిలా పాలికల్లో నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్థారు. నీరుపోసి అవి మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. అంకురార్పణను ఆరోహణం చేసే కార్యక్రమం కాబట్టి దీన్ని అంకురార్పణ అంటారు.
ధ్వజారోహణం
నభూతో నభవిష్యతి అనేలా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామి వాహనం గరుడుడు కాబట్టి కొత్తవస్త్రం మీద గరుడుడి బొమ్మను చిత్రీకరిస్తారు. దీనే్న గరుడధ్వజపటం అంటారు. దీన్ని ధ్వజస్తంభానికి కట్టేందుకు నూలుతో తయారు చేసిన కొడితాడును సిద్దం చేశారు. ఉత్సవమూర్తులు అయిన భోగశ్రీనివాసుడు శ్రీదేవి, భూదేవి సమక్షంలో గోదూళి లగ్నమైన మీనలగ్నంలో కొడితాడును కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్థంభం మీద ఎగురే గరుడపటమే సకల దేవతల, అష్టదిక్పాలకుల, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు ఆహ్వానం పత్రం. ఈ ఆహ్వానంతో ముక్కోటి దేవతలు బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిదిరోజులు కొండమీదే ఉండి తిలకించి ఆనందిస్తారని పురణాలు చెబుతున్నాయి.
పెద్దశేషవాహనం
ధ్వజారోహణమైన తొలి రోజు రాత్రి స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై ఆలయ నాలుగుమాడవీధుల్లో ఊరేగుతారు. స్వామివారు కొలువు తీరింది శేషాద్రిపైన. ధరించేది శేషవస్త్రం. స్వామి పాన్పు శేషుడు. అందుకే ఉత్సవాల్లో శేషుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలిరోజు ఆ వాహనం మీద ఊరేగుతారు.
చిన్నశేషవాహనం
రెండవ రోజు ఉదయం స్వామి తన దేవేరిలతో కలసి ఐదు శిరస్సుల గల చిన్నశేషవాహనంపై అధిరోహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. పెద్ద శేషవాహనం ఆదిశేషుడుగాను, చిన్నశేషవాహనం వాసుకీగాను భావిస్తారు.
హంస వాహనం
రెండవ రోజు రాత్రి స్వామివారు శారదామాత రూపంలో హంసవాహనంపై విశేషాలంకార భూషితుడై అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు. పాలు, నీళ్లు వేరుచేసినట్లు గుణ, గణాలను విచక్షణా జ్ఞానానికి సంకేతంగా ఈ వాహనాన్ని స్వామివారు ఆధిరోహిస్తారు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమహంస అయిన శ్రీనివాసుడు ఊరేగడం నయనాందనకరం. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్దమైన మనోమందిరమని కూడా అర్థం ఉంది. పరమాత్మ వేదోపదేశాన్ని హంస రూపంలోనే చేసినందు వలన తుచ్ఛమైన కోర్కెల అంధకారం వీడి శాశ్వతమైన పరహ్మ్ర చెంతకు చేరే ముక్తి మార్గం వైపు నడవాలని ఈ వాహనం ద్వారా బక్తులకు చాటుతున్నారని ఐతిహ్యం.
సింహవాహనం
మూడవరోజ ఉదయం సింహవాహనమెక్కి వేంకటనాథుడు దర్శనమిస్తాడు. జంతువులకు రాజైన సింహ సైతం తానేనని, మనుషులు తమలోని జంతు ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామి చాటుతారు.
ముత్యపుపందిరి వాహనం
మూడవరోజు రాత్రి స్వామికి జరిగే సుకుమారసేవగా ముత్యపుపందిరి వాహనాన్ని చెప్పవచ్చు. ముక్తి సాదనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని ఈ వాహనం ద్వారా స్వామి చాటి చెబుతారు.
కల్పవృక్ష వాహనం
కల్పవృక్షం కోరినవారికి మాత్రమే వరాలిస్తుంది. తన భక్తులకు అడగకుండానే వరాలిచ్చే దేవదేవుడు వేంకటాద్రివాసుడు. కల్పవృక్షం.. అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలదు. కానీ స్వామి శాశ్వత కైవల్యం ప్రసాదించే కల్పతరువు నాలుగోరో ఉదయం ఈ వాహనంపై వెంకన్న సర్వాలంకార భూషితుడై ఊరేగుతారు.
సర్వభూపాల వాహనం
లోకంలో భూపాలుంలందరికీ భూపాలుడు తానేని లోకానికి చాటుతూ స్వామి నాల్గవ రోజు రాత్రి ఈ వాహనంపై కొలువుదీరుతారు. ఈ వాహనసేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతఫలాన్ని ఇస్తుంది.
మోహినీ అవతారం
అత్యంత ప్రధానమైన ఐదవ రోజు ఉదయం మెహినీ అవతారంలో స్వామి సాక్షాత్కరిస్తారు. అన్ని వాహనసేవలూ వాహనమండపం నుండి ప్రారంభమైతే. మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలో నుండే పల్లకీపై ప్రారంభమవుతుంది. పరమశివుడిని సైతం సమ్మోహనపరిచి, క్షీరసాగర మథనం నుండి వెలవడిన అమృతాన్ని దేవతలకు మాత్రమే దక్కేలా చేసిన అవతారమిది. మంచి పనులు చేయడం ద్వారా అనుగ్రహం ఎలా పొందవచ్చో లోకానికి చాటడానికే శ్రీవారి జగన్మోహిని రూపంలో తిరువీధుల్లో విహరిస్తారు.
గరుడవాహనం
ఐదవ రోజు రాత్రి తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద ఊరేగుతారు. స్వామి మూలమూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, వేంకటేశ్వర సహస్రనామ మాల ధరించి మలయప్పస్వామి భక్తులను అనుగ్రహిస్తారు. వేంకటేశ్వరుడిని అనేక విధాల కొనియాడిన గోదాదేవి శ్రీవిల్లి పుత్తూరు నుండి పంపే తులసీమాల, నూతన చత్రాలను గరుడవాహనంలో అలంకరిస్తారు. గరుడుడితో స్వామికి గల అనుబంధాన్ని కూడా ఈ సేవ చాటి చెబుతుంది.
హనుమంత వాహనం
ఆరవ రోజు జరిగే సేవ ఇది. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన హనుమంతుడ్ని వాహనంగా తీసుకుని స్వామి తిరువీదుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతుని భక్తి తత్పరతను చాటి చెబుతూ, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్ని తానేనని ఈ వాహణం ద్వారా స్వామి తెలియజేస్తారు.

గజవాహనం
గజేంద్రమోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే శరణు కోరే వారిని కాపాడతానని చాటిచెప్పడానికి స్వామి ఆరవ రోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతారు. గజ వాహనారూడుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.
సూర్యప్రభ వాహనం
ఏడవ రోజు ఉదయం సప్తాశ్వాలపై భానుడు రథసారధిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనంపై ఊరేగుతారు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడికి తానే ప్రతిరూపమని చాటిచెబుతారు.
చంద్రప్రభ వాహనం
ఏడవరోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పూమాలలు ధరించి స్వామి చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని ఈ వాహనాల ద్వారా తెలియజేస్తారు.
రథోత్సవం
గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కటి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదవరోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామి రథోత్సవంలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉండదని విశ్వాసం.
అశ్వవాహనం
ఎనిమిదవ రోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామి ఊరేగుతారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్టశిక్షణ, శిక్షణ రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీన్ని ఉద్దేశ్యం.
చక్రస్నానం
ఎనిమిది రోజుల పాటు వాహనసేవల్లో అలసిపోయిన స్వామి సేదతీరడం కోసం తొమ్మిదవ రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆనలయ ఆవరణంలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేకసేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రతాళ్వార్‌ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగస్తాయి. చక్రతాళ్వార్ స్నానమాచరించే సమయంలో కోనేరులో స్వానం చేస్తే సర్వపాపాలు నశించి, కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం.
ధ్వజావరోహణం
చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్థంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిదిరోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు. *
వేడుకలు ఇలా..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే ప్రతి పూజ, ప్రతి సేవ ఎంతో విశేషమైనవి. వైఖానస ఆగమోక్తంగా జరిగే బ్రహ్మోత్సవాలు ‘ధ్వజారోహణం’తో ప్రారంభమై ‘చక్రస్నానం’తో పరిసమాప్తమవుతాయి. ఈనెల 30న (సోమవారం) జరిగే ‘ధ్వజారోహణా’నికి ముందురోజున బ్రహ్మోత్సవాలకు 29న (ఆదివారం) ‘అంకురార్పణ’ను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అంకురార్పణం సందర్భంగా సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకూ మాడ వీధుల్లో శ్రీసేనాధిపతివారిని ఊరేగిస్తారు.
ధ్వజారోహణం
సెప్టెంబర్ 30న (సోమవారం) ఉదయం 5-23 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ మీనలగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ధ్వజారోహణం నాడు తెల్లవారు జామున 3 నుంచి 3-30 గంటల వరకూ సుప్రభాత సేవ, 3-30 నుంచి రాత్రి 12-30 గంటల వరకూ సర్వదర్శనం, అర్ధరాత్రి ఒంటిగంటకు ఏకాంత సేవ ఉంటాయి. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ మాడ వీధుల్లో ‘పెద్దశేష వాహనం’ ఊరేగింపు జరుగుతుంది.
హంస వాహనం
బ్రహోత్సవాల్లో రెండవ రోజున (అక్టోబర్ 1) మంగళవారం తెల్లవారు జామున 3 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకూ సుప్రభాతం, సర్వదర్శనం, ఊంజల సేవ, ఏకాంత సేవ ఉంటాయి. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ ‘హంస వాహనం’పై శ్రీవారి ఊరేగింపు
సింహవాహనం
మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా బుధవారం (అక్టోబర్ 2) తెల్లవారు జామున 3 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకూ సుప్రభాతం, సర్వదర్శనం, స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, ఏకాంత సేవ ఉంటాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ ‘సింహవాహనం’, రాత్రి 8 నుంచి 10 గంటల వరకూ ‘ముత్యాలపందిరి వాహనం’పై ఊరేగింపులు నిర్వహిస్తారు.
కల్పవృక్ష వాహనం
నాల్గవ రోజు ఉత్సవాల్లో భాగంగా (అక్టోబర్ 3) గురువారం ఉదయం 3 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకూ సుప్రభాతం, సర్వదర్శనం, పూలంగి సర్వదర్శనం, ఊంజల సేవ, ఏకాంత సేవ ఉంటాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ ‘కల్పవృక్ష వాహనం’, రాత్రి 8 నుంచి 10 గంటల వరకూ ‘సర్వభూపాల వాహనం’పై ఊరేగింపు జరుగుతుంది.
గరుడ వాహన సేవ
అయిదో రోజు ఉత్సవాల సందర్భంగా శుక్రవారం (అక్టోబర్ 4) తెల్లవారు జామున 3 గంటల నుంచి అర్ధరాత్రి 1-30 గంటల వరకూ సుప్రభాతం, అభిషేకం, సర్వదర్శనం, ఏకాంత సేవ ఉంటాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ మోహినీ అవతారం, రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ గరుడ వాహన సేవ ఉంటాయి.
గజవాహనం
ఆరవ రోజు ఉత్సవాల్లో భాగంగా శనివారం (అక్టోబర్ 5) తెల్లవారు జామున 3 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకూ సుప్రభాతం, సర్వదర్శనం, ఏకాంత సేవ ఉంటాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ సర్ణరథం, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ గజవాహనంపై శ్రీవారి ఊరేగింపు.
సూర్య, చంద్రప్రభల వాహనాలు
ఏడవ రోజు ఉత్సవాల్లో ఆదివారం (అక్టోబర్ 6) తెల్లవారు జామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ సుప్రభాతం, సర్వదర్శనం, ఊంజల సేవ, ఏకాంత సేవ జరుగుతాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ సూర్యప్రభ, రాత్రి 8 నుంచి 10 గంటల వరకూ చంద్రప్రభ వాహనాలపై స్వామివారి ఊరేగింపు.
రథోత్సవం
ఎనిమిదో రోజు ఉత్సవాల సందర్భంగా సోమవారం (అక్టోబర్ 7) తెల్లవారు జామున 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ సుప్రభాతం, సర్వదర్శనం, ఊంజల సేవ, ఏకాంత సేవ ఉంటాయి. ఉదయం ఏడు గంటలకు రథోత్సవం, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ అశ్వవాహనంపై ఊరేగింపు.
చక్రస్నానం
బ్రహోత్సవాల్లో చివరి రోజున మంగళవారం (అక్టోబర్ 8) తెల్లవారు జామున 1 గంట నుంచి 1-30 గంటల వరకూ ఏకాంత సేవ, 3 గంటల నుంచి రాత్రి 8-30 గంటల వరకూ సర్వదర్శనం ఉంటాయి. తెల్లవారు జామున 3 గంటల నుంచి ఆరు గంటల వరకూ పల్లకి ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం జరుగుతాయి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ శ్రీవరాహ స్వామి ఆలయం వద్ద స్నపన తిరురమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు.
అన్నమయ్య కీర్తన

బ్రహ్మోత్సవం.. ప్రతి సంవత్సరం ఆ కొండలరాయునికి జరిగే విశేష ఉత్సవం. ఈ బ్రహ్మోత్సవాలు కోయల్ ఆళ్వార్ తిరుమంజనంతో మొదలు అయ్యే చక్రస్నానంతో పూర్తి అవుతాయి. అంకురార్పణ, ధ్వజారోహణం, వాహన సేవలు, ధ్వజావహారోహణం వంటి క్రతువులు దీనిలో భాగం. బ్రహ్మ ముందుండి జరిపించే ఆ బ్రహ్మాండనాయకుని ఉత్సవాలు మీద అన్నమాచార్యులు రాసిన అద్భుత సంకీర్తన, దాని అంతరార్థం..
పల్లవి:
తిరువీధుల మెరసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారముల తోడను॥
తిరుమలాధీశుని ఆలయం చుట్టూ వున్నా వీధులను మాడవీధులు అంటారు. అవి అతి పవిత్రమయినవి. అటువంటి మాడవీధులలో ఆ శ్రీనివాసుడు తేజస్సుతో ఎంతో గొప్పవైనా సింగారాలతో తిరుగుచున్నాడు అని అన్నమయ్య కీర్తించాడు.
చరణం:
తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు
సిరుల రెండవనాడు శేషుని మీద
మురిపేన మూడవనాడు ముత్యాల పందిరిక్రింద
పొరి నాలుగవనాడు పువ్వు గోవిలలోను॥
తొలిరోజు ధ్వజారోహణం జరిగే ముందు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి మాడవీధుల్లో ఊరేగి సకల దేవతలను ఆహ్వానిస్తాడు. తొలిరోజు రాత్రి ఇరువురు దేవేరులతో శ్రీవారు ఏడు పడగల పెద్ద శేష వాహనంపై ఊరేగుతారు. మనలో ఇమిడి ఉన్న కుండలినీ శక్తిని మేల్కొల్పమని భోదించడమే ఈ వాహనసేవ విశిష్టత. ఎండావానల నుంచి తనని ఎల్లవేళలా కాపాడే ఆ ఆదిశేషుని మీద ప్రీతితో రెండవనాడు శ్రీవారు ఒక్కరే ఉదయం ఐదు పడగల చిన్న శేష వాహనం మీద ఊరేగుతారు. చదువుల తల్లి అయిన సరస్వతి స్వరూపంతో శ్రీనివాసుడు హంసవాహనంపై ఆ రోజు రాత్రి అనుగ్రహిస్తాడు. హంస పాల నుంచి నీళ్లను ఎలా వేరు చేస్తుందో అదేవిధంగా మనం మంచి చెడు విచక్షణ తెలుసుకోవాలి అని చెప్పడమే ఈ సేవ ఉద్దేశం. మూడవనాడు ఉదయం స్వామి యోగశాస్త్రంలో సహనశక్తికి, గమనశక్తికి ప్రతీకగా తెలిపే సింహవాహనంపై దర్శనం ఇస్తారు. నవరత్నాలలో ముత్యం ఆరోగ్యప్రదాతలయిన చంద్రునికి ప్రతీక. అటువంటి ముత్యాలపందిరిలో శ్రీదేవి, భూదేవి సమేతుడయ్యి గోవింధులు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. నాలుగోరోజు ఉదయం భార్యలతో సహా మలయప్పస్వామి కోరిన వరాలు ఇచ్చే కల్పవృక్షవాహనంపై ఊరేగుతూ భక్తుల మనస్సంకల్పాలను తీరుస్తాడు ఆ బ్రహ్మాండనాయకుడు. ఆయన నాలుగోరోజు రాత్రి ఊరేగే ఆ బంగారు పల్లకినే సర్వభూపాలవాహనం అంటారు.
చరణం-2: గ్రక్కున నైదవనాడు గరుడుమీద
యెక్కెను నారవనాడు యేనుగుమీద
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను
యిక్కున దేరును గుర్రమెనిమిదవనాడు॥
అయిదవనాడు ఉదయం స్ర్తి రూపధారుడు అయ్యి మోహిని అవతారంలో బంగారు పల్లకిలో అందాలు ఒలకబోస్తూ దర్శనమిస్తాడు. బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యం గొప్పది అని చాటిచెప్తారు. గరుడసేవ అత్యంత ప్రసిద్ధమయినది. పక్షిరాజం, విష్ణువాహనమయిన గరుత్మంతునిపై మూలవిరాట్ ధరించే మకరకంఠి, లక్ష్మీహారం, విష్ణు సహస్రనామాలు వంటి ఆభరణాలతో మలయప్పస్వామి దర్శనం ఇస్తాడు. ఆరవనాడు ఉదయం శ్రీవారొక్కరే శ్రీరామ అవతారంలో తన ప్రియ భక్తుడు అయిన హనుమంతుని భుజాలతపై ఊరేగుతాడు. త్రేతాయుగంలో సేవ చేసిన తన భక్తుడిని ఇప్పటికి కూడా తాను మర్చిపోలేదని చెప్పడమే దీని అర్థం.
అదేరోజు సాయంసంధ్య సమయంలో వసంతోత్సవం అనంతరం బంగారురథంపై దేవేరులతో స్వామివారు అనుగ్రహిస్తారు. ఎంత పెద్ద సమస్యని అయినా తాను పరిష్కరిస్తా అని సూచించేలా ఆ గజేంద్రునిపై వెనె్నలలో శ్రీవేంకటేశ్వరుడు విహరిస్తాడు. ఏడవనాడు ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. సూర్యచంద్రుడు రెండూ తానే అని చెప్పడం దీని వెనుక దాగిన రహస్యం. ఎనిమిదవరోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతుడు అయిన స్వామి రథోత్సవంలో కనువిందు చేస్తాడు. మనస్సు అనే రథానికి సరైన కళ్లెం వేస్తే జీవితం సమస్యలు లేకుండా ముందుకు సాగుతుంది అని చెప్పడమే ఈ సేవ పరమార్థం. కలియుగాంతంలో కల్కావతారంతో దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తాను అని చెబుతూ శ్రీవారు అశ్వవాహనాన్ని అధిరోహిస్తారు.
చరణం-3:
కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట
యెనసి శ్రీవేంకటేశు డింతి యలమేల్మంగతో
వనితల నడుమను వాహనాల మీదను॥
చివరిరోజు అయిన తొమ్మిదవనాడు శ్రీవారు పల్లకి సేవ, తిరుచ్చి ఉత్సవంలో పాల్గొంటారు. ఇన్ని సేవలు చేయించుకుని అలసిపోయిన ఆ దేవదేవుడు పుష్కరిణి ఒడ్డున గల వరాహస్వామి సన్నిధిలో అభిషేక సేవలో సేదతీరుతాడు. తన ప్రతిరూపం అయిన చక్రతాళ్వారుకి ఆ పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఈ ఉత్సవాలు పూర్తి అవుతాయి. ఆ రోజు రాత్రి ధ్వజారోహణం చేసి దేవతలకు వీడ్కోలు పలుకుతారు. పూర్వకాలంలో శ్రీవారి కల్యాణం బ్రహ్మోత్సవాల భాగంగా పదవరోజు జరిగేది. ఈ విధంగా అలమేలుమంగా సమేతుడయిన శ్రీవేంకటేశ్వరుడు భక్తుల నీరాజనాల మధ్య వాహనాలపై విహరిస్తూ మనల్ని కటాక్షిస్తాడు.

కె.ఆర్.ఎన్. రాజేంద్ర