ఈ వారం స్పెషల్

‘ఫిట్ ఇండియా’ పిలుస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాడు దేశ స్వాతంత్య్రం కోసం
తెల్లదొరలను తరిమికొట్టేందుకు
‘జాతిపిత’ గాంధీజీ ఇచ్చిన పిలుపు-‘క్విట్ ఇండియా’!

నేడు జాతిజనుల జీవనశైలిలో మార్పు కోసం,
‘శ్రేష్ఠ్ భారత్’ నిర్మాణం కోసం ప్రధాని మోదీ
ఇచ్చిన నినాదం-‘్ఫట్ ఇండియా’!

‘క్విట్ ఇండియా’ అప్పటి అవసరం..
మనలోని అలసత్వాన్ని తొలగించేందుకు
‘ఫిట్ ఇండియా’ ఇప్పుడు అత్యంత ఆవశ్యకం..

‘టెక్నాలజీ’ చేరువైనకొద్దీ
మనం శారీరక శ్రమకు దూరమవుతున్నాం..
విజ్ఞానాన్ని ఒడిసి పట్టుకున్నామని మురిసిపోతున్నాం..
‘సాంకేతిక మంత్రం’ జపిస్తూ
సహజ ప్రక్రియకు దూరమైపోతూ
యంత్రాల్లా మారుతున్నాం.. బద్ధకంతో
బతికేస్తున్నాం..
ప్రతి ఒక్కరూ విజేత కావాలంటే-
‘ఫిట్ ఇండియా’లో భాగస్వాములం కావాల్సిందే..
‘రోజూ ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి.. లేకుంటే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.. మీరెలా ఆలోచిస్తే అలా తయారవుతారు.. బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు.. శక్తిని నమ్మితే శక్తిమంతులే అవుతారు..’- అని దశాబ్దాల క్రితం స్వామి వివేకానంద చెప్పిన హితవచనాలు ఎప్పటికీ అక్షర సత్యాలు. ‘ఫలితంపై ఎంతగా ఆసక్తి చూపిస్తారో.. దాన్ని పొందే పద్ధతుల్లోనూ అంతే ఆసక్తి, శ్రద్ధ చూపాలి..’ అని ఆయన చెప్పిన మాటలను శిరసావహించి నేడు జాతిజనులంతా ‘ఫిట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొనాలి.
పుట్టినరోజు సందర్భంగానో, నూతన సంవత్సరం శుభవేళనో- అలసత్వాన్ని వీడాలని, ‘ఫిట్‌నెస్’తో ఉండాలని ఘనంగా ప్రతిజ్ఞలు చేసుకొంటాం. కానీ- ఆ ముచ్చట మహా అయితే నాలుగైదు రోజులే! ఆ తర్వాత మన జీవనశైలి షరామామూలే! ఇలా ‘నిర్ణయాల’కు నీళ్లొదిలే వారిలో యువతదే అగ్రస్థానం!
పొట్ట కరిగించి ‘సిక్స్ ప్యాక్’ సాధించాలని కొందరు.. తిండి మానేసైనా సన్నబడిపోయి నాజూకైన దుస్తులు వేసుకోవాలని ఆరాటపడేవారు ఇంకొందరు.. జిమ్‌కు, యోగ క్లాసులకు హాజరై కండలు పెంచాలని.. శరీరాన్ని, మనసును అదుపాజ్ఞల్లో ఉంచాలని మరి కొందరు ఉబలాటపడు తుంటారు. అయితే, ఆచరణలో అనుకున్నది సాధించేది అతి కొద్దిమందే.. అన్నది కాదనలేని కఠోర వాస్తవం. సంకల్పాన్ని ఆచరణలో రుజువు చేసుకోవాలన్నా, అలసత్వం ఊబి నుంచి బయటపడాలన్నా-‘ఫిట్‌నెస్’ను ఓ ఉద్యమంలా, ఊపిరిలా భావించాల్సిందే. అందుకు మానసికంగా మనం సన్నద్ధం కావాలి. జాతి దృఢంగా ఉన్నపుడే దేశం కూడా బలంగా ఉంటుంది. అందుకే- ‘ఉక్కు కండరాలు, ఇనుప తీగల్లాంటి నరాలు కలిగిన యువత ఈ దేశానికి ఎంతో అవసరం’ అని అలనాడు స్వామి వివేకానంద జాతికి పిలుపునిచ్చారు. అందుకు మనం ఏం చేయాలి..?
స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లను ఉదయం వేళ కాసేపైనా దూరంగా పెట్టి- ‘ఫిట్‌నెస్’ సూత్రాలను విధిగా పాటించాలి. ఈ సమయంలోనే ఎవరికి వారు ‘చార్జ్’ కావాలి. పనికిమాలిన వ్యాపకాలను కాసింత వదిలేసుకొని పంచేంద్రియాలకు ‘పదును’ పెట్టాలి. ‘సాఫ్ట్‌వేర్‌తో సర్వం సాధ్యం’ అని సంబరపడకుండా మెదడులోని సహజ సిద్ధమైన ‘చిప్’లకు కాస్త విశ్రాంతి ఇవ్వాలి. మానసిక ప్రశాంతతతో మెదడులోని జ్ఞానాన్నంతా సమృద్ధిగా వాడుకోవాలి. మెదడుకు ప్రశాంతత లభించాలంటే- నడక, యోగ, ధ్యానం, చిన్నపాటి వ్యాయామాలను పాటించడం తప్పనిసరి అని గుర్తించాలి. ‘సాఫ్ట్‌వేర్’లో ‘ప్రమాదకర వైరస్’లు చొరబడకుండా ఎలా జాగ్రత్త పడతామో- మెదడులోకి చెడు ఆలోచనలు ప్రవేశించకుండా యోగ, ధ్యానం అనే ‘యాంటీ వైరస్’ ప్రోగ్రామ్‌లను వాడాల్సిందే. ఖరీదైన ‘ఐఫోన్’లకే కాదు, సృష్టిలో అత్యద్భుతమైన మానవ మెదడుకు కూడా తగినంత ‘చార్జింగ్’ ఉండాలి. ఇందుకు ఏకాగ్రత, ప్రశాంతతలే సాధనాలు. అలాగే, ఎంతసేపూ ‘స్మార్ట్ఫోన్’లో ‘అంగుళాల తెర’లకు అతుక్కుపోకుండా- ప్రపంచమనే ‘్భరీ తెర’పై వాస్తవ దృశ్యాలను పరిశీలించాలి. జీవనశైలిలో మార్పు కోసం, సరికొత్త తేజస్సు కోసం- ‘ఫిట్‌నెస్’ యవనికపై మనం ఉత్సాహంగా కదులుతుండాలి.

‘ఆరోగ్యకరమైన’ భవిత వైపు..
జాతిజనులకు ఆరోగ్యమే కీలకం, దేహ దారుఢ్యం ఉన్న వారితోనే దేశం ‘ఆరోగ్యకరమైన’ భవిత వైపు పయనిస్తుందని ప్రధాని మోదీ కొద్దిరోజుల క్రితం ‘జాతీయ క్రీడా దినోత్సవం’ నేపథ్యంగా జరిగిన సమ్మేళనంలో అన్నారు. పలు యుద్ధక్రీడలు, సాహస కృత్యాలు, కళలు, నృత్యరీతుల సమాహారంగా సాగిన జాతీయ క్రీడా దినోత్సవం వేదికపై ఆయన ‘ఫిట్‌నెస్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఏ కార్యక్రమానికైనా ఎంతోకొంత పెట్టుబడి అవసరమని, అయితే- మానసిక, శారీరక దృఢత్వానికి సంబంధించిన ‘ఫిట్‌నెస్’ ఉద్యమానికి సంకల్ప బలం తప్ప రూపాయి కూడా పెట్టుబడి అవసరం లేదని, ఫలితాలు మాత్రం వంద శాతానికి మించి ఉంటాయని మోదీ వివరించారు. విజయానికి, ఫిట్‌నెస్‌కు విడదీయరాని సంబంధం ఉందని ఆయన చెబుతూ, విజేతలంటే ఫిట్‌నెస్ ఉన్నవారని అభివర్ణించారు. సాంకేతికత ఎంతగానో చేరువైందని మురిసిపోకుండా జీవనశైలిలో మార్పు కోసం అందరూ ఫిట్‌నెస్ సూత్రాలను పాటించాలన్నారు. ‘ఫిట్‌నెస్’తో ఉంటేనే బుద్ధి వికసిస్తుందని అన్నారు. శారీరక, మానసిక దారుఢ్యం అనేది మన సంస్కృతిలో అనాదిగా ఉన్న అద్భుత మంత్రమని, అయితే ఇటీవలి కాలంలో మన సంస్కృతిని మనమే విస్మరిస్తూ విపరిణామాలను ఎదుర్కొంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఫిట్‌నెస్’పై అలసత్వం కారణంగా అనేకానేక సమస్యలను, శారీరక-మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నామన్నారు.
ఫర్లాంగు దూరమైనా భారమే..
కొన్ని దశాబ్దాల క్రితం ఒక వ్యక్తి సగటున 8 నుంచి 10 కిలోమీటర్లు అనాయాసంగా నడిచేవాడని మోదీ గుర్తుచేశారు. ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా నడక లేదా సైకిల్‌పై వెళ్లడం వల్ల శారీరక శ్రమ ఎంతో ఉండేదన్నారు. కాలగతిలో సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సౌకర్యాలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో శారీరక శ్రమకు మనం దూరమవుతున్నామని, ఇపుడు పట్టుమని ఫర్లాంగు దూరం నడవలేని పరిస్థితిలో ఎంతోమంది ఉన్నారని ప్రధాని సోదాహరణంగా వివరించారు. టెక్నాలజీ మన కాళ్లకు సంకెళ్లు వేసే దుస్థితి రాకూడదని, నడకను మరచిపోవడం ఆరోగ్యానికి నష్టదాయకమన్నారు. ‘మనం ఇపుడు నడకను బాగా తగ్గించాం, అయితే- మనం తగినంతగా నడవలేక పోతున్నామని ఇదే ‘టెక్నాలజీ’ మనలను హెచ్చరించే రోజులు కూడా వస్తాయి..’ అని ఆయన వ్యాఖ్యానించారు. గమ్యాన్ని చేరుకోవడం అనేది ‘నడక’లోనే తెలుస్తుందని, తొలుత అడుగులుగా సాగే ‘నడక’ కాస్త వేగం పుంజుకొంటే అది ‘పరుగు’ అవుతుందన్నారు. నడక, యోగ, వ్యాయామం వల్ల మన భౌతిక శక్తి మానసిక శక్తిని ఎంతగానో ఇనుమడింపజేస్తుందన్నారు. శారీరక వ్యాయామం క్రమశిక్షణను నేర్పుతుందని, ఇదే సమగ్రమైన జీవన వలయమన్నారు. ఆటల్లో నిష్ణాతులైన పలువురు క్రీడా ప్రముఖుల విజయాలను స్ఫూర్తిగా తీసుకునేందుకు ‘ఫిట్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. ఇంటింటా ప్రతి వ్యక్తి భాగస్వామ్యంతో సాగే ఈ ఉద్యమం దేశంలో సరికొత్త విప్లవాన్ని తేవాలన్నారు.‘ఫిట్‌నెస్’ అనేది కేవలం ఒక పదం కాదు, అంతకుమించి ఆరోగ్యకరమైన, పరిపూర్ణమైన జీవనానికి అది ప్రాతిపదిక అని, ఆరోగ్య భాగ్యం కోసం ఫిట్‌నెస్ సూత్రాలను కచ్చితంగా పాటించాల్సిందేనని, ఇందుకు మరో ప్రత్యామ్నాయం ఏదీ లేదన్నారు.
ధ్యాన్‌చంద్ స్ఫూర్తిగా..
హాకీ స్టిక్‌తో ప్రపంచాన్ని అబ్బుర పరచి, భారత్‌కు అరుదైన విజయాలను సాధించిపెట్టిన మేటి క్రీడాకారుడు, ‘పద్మభూషణ్’ అవార్డు గ్రహీత మేజర్ ధ్యాన్‌చంద్ జన్మించిన ఆగస్టు 29వ తేదీన ‘జాతీయ క్రీడా దినోత్సవం’ పాటిస్తున్నామని, ఆయన కీర్తి నేటి తరానికి నిరంతర స్ఫూర్తి అని మోదీ నివాళులర్పించారు. ఒలింపిక్స్‌లో వరుసగా మూడు సార్లు స్వర్ణ పతకాలు సాధించి, హాకీ క్రీడలో భారత్‌కు ఎదురులేదని ధ్యాన్‌చంద్ నిరూపించారని ఆయన గుర్తుచేశారు. మంచి ఫిట్‌నెస్‌తో ఎంతోమంది క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు పతకాలు సాధించి పెట్టారని, ఈ విజయ పరంపరతో మన దేశం ప్రతిష్ట మరింతగా పెరుగుతుందన్నారు. ‘ఫిట్‌నెస్’ గురించి గొప్పగా మాట్లాడితే ప్రయోజనం శూన్యమని, అందరూ కలసికట్టుగా దీన్ని ఒక ఉద్యమంలా విజయవంతం చేయాలని మోదీ పిలుపునిచ్చారు.
జీవనశైలి.. పెనుశాపం!
ఆధునిక జీవనశైలి ముఖ్యంగా యువతకు పెనుశాపంగా దాపురించిందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. శారీరక శ్రమ లేనందున నేడు అన్ని వయసుల వారిలోనూ మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి ‘జీవనశైలి వ్యాధులు’ విజృంభిస్తున్నాయన్నారు. దేశానికి ఉపయోగపడాల్సిన యువతకు ఈ రుగ్మతల వల్ల ఎంతగానో నష్టం జరుగుతోందన్నారు. ఇరవై ఏళ్లు నిండని వారిలో మధుమేహం, ముప్పయి ఏళ్లురాని వారిలో గుండెపోటు వంటివి చూస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ఇంతటి వైపరీత్యాలకు ‘ఫిట్‌నెస్’ లేకపోవడమే కారణమన్నారు. జీవన శైలిలో వైపరీత్యాల వల్లనే అనుకోని రీతిలో వ్యాధులు వస్తుంటాయని, మనం మంచి అలవాట్లకు దగ్గరైతే ఈ రుగ్మతలు దూరం అవుతాయన్నారు. ‘ఫిట్‌నెస్’ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ఉద్ధృతంగా చేపట్టేందుకు కేంద్ర క్రీడల మంత్రి కిరెన్ రిజిజు నేతృత్వంలో 28 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. ఉన్నతాధికారులు, భారత ఒలింపిక్ సంఘం సభ్యులు, భారత క్రీడా ప్రాధికార సంస్థ, జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు, ఫిట్‌నెస్ ప్రమోటర్లు, ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులకు ఇందులో భాగస్వామ్యం ఉంటుందన్నారు. క్రీడలు, మాధ్యమిక విద్య, ఆయుష్, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఈ కమిటీలో సేవలందిస్తారని వివరించారు. ఫిట్‌నెస్ ఉద్యమం పట్ల జనబాహుళ్యంలో చైతన్యం కలిగించి, వారిని భాగస్వాములుగా చేసేందుకు జాతీయ స్థాయి కమిటీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ‘ఆరోగ్యకరమైన వ్యక్తి, ఆరోగ్యకరమైన సమాజంతోనే ‘శ్రేష్ఠ్ భారత్’ అవతరిస్తుందన్నారు. జీవనశైలిలో మార్పు కోసం ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.
‘ఫిట్‌నెస్’ ప్రతిజ్ఞ..
ఫిట్‌నెస్ ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ‘ఫిట్‌నెస్ లోగో’ను ఆవిష్కరించి, సమావేశానికి హాజరైన వారిచేత ‘ఫిట్‌నెస్ ప్రతిజ్ఞ’ చేయించారు. ‘శారీరక శ్రమకు, క్రీడలకు ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయిస్తా.. కుటుంబ సభ్యులను, ఇరుగు పొరుగువారిని సైతం ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఆరోగ్య భారత్ నిర్మాణానికి చిత్తశుద్ధితో నా వంతు కృషి చేస్తా..’ అని ఆయన అందరిచేత ప్రమాణం చేయించారు. బాలీవుడ్ నటి శిల్పాశెట్టితో పాటు పలువురు సెలబ్రిటీలు మోదీ సమక్షంలో ‘ఫిట్‌నెస్’ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
‘యోగ దినోత్సవం’తో నాంది..
ప్రపంచంలో భారతీయులకు మాత్రమే అనాది సంప్రదాయంగా సంక్రమించిన ‘యోగ విద్య’ను నేడు ఎనె్నన్నో దేశాలకు పరిచయం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది. ‘గమ్యాన్ని చేరేందుకు ఎలివేటర్లు వంటివి ఉండవు.. కష్టపడి మెట్లన్నీ ఎక్కితేనే విజేతగా నిలుస్తారు..’ అని జీవన వాస్తవాలను తెలిపే మోదీ ‘యోగ దినోత్సవాన్ని’ విశ్వవ్యాప్తంగా పాటించేలా కృషి చేశారు. ‘యోగ’ ప్రాముఖ్యతను వివరించి, ఏటా జూన్ 21న ‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’ పాటించాలని ఐక్యరాజ్య సమితిలో ఆయన తీర్మానం చేయించారు. అరవై తొమ్మిదేళ్ల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా కనిపించే ఆయన ఇపుడు ‘ఫిట్‌నెస్’ పట్ల భారత జాతి దృష్టి సారించాలని పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. ‘ఫిట్‌నెస్’కు వయసుతో సంబంధం లేదని చెప్పే మోదీ జీవితం నేటి యువతకు మార్గదర్శకం. చిన్నతనం నుంచి ఎక్సర్‌సైజ్‌లు, ఈత వంటివి నేర్చుకోవడంతో తాను శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నానని ఆయన చెబుతుంటారు. ఈత నేర్చుకోవడం వల్ల తాను చిన్నతనంలో ఓ మొసలి పిల్లను పట్టుకుని ధైర్యంగా దాన్ని ఇంటికి తెచ్చానని ఆయన గుర్తు చేస్తుంటారు. ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ (ఆరెస్సెస్) శాఖలకు హాజరై యుద్ధవిద్యలు, ఎక్సర్‌సైజ్‌లు వంటివి నేర్చుకున్నానని చెబుతుంటారు. నిత్యం సూర్య నమస్కారాలు చేస్తుండడం వల్ల శరీరం తేజోవంతం
అవుతుందంటారు. ఫిట్‌నెస్ వల్ల శారీరక దృఢత్వమే కాదు, మంచి క్రమశిక్షణ అలవడుతుందని ఆయన చెబుతుంటారు. దేశ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించే ఆయన ఇటీవల సార్వత్రిక ఎన్నికల అనంతరం హిమాలయాల్లోని ఓ గుహలో కొన్ని గంటల సేపు తపస్సు చేసి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసిన సంగతి తెలిసిందే. ఎందరో ఆధ్యాత్నిక గురువులను కలుసుకుని ప్రాణాయామ వంటి విద్యలను మోదీ అభ్యసించారు. శారీరక శ్రమతో, క్రమశిక్షణతో మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకొన్న ఆయన భారతీయ జనతాపార్టీలో అజేయుడిగా నిలిచి అఖండ విజయాలను సొంతం చేసుకున్నారు.
యోగతో ఆరోగ్యం...
ఒకప్పుడు ఆరెస్సెస్‌లో, ఇపుడు భాజపాలో కీలకపాత్ర వహిస్తూ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న మోదీ 1992-93లో ‘స్పాండిలైటిస్’ వ్యాధికి లోనయ్యారు. ‘పని రాక్షసుడి’గా పేరొందిన ఆయన ఆ వ్యాధి నుంచి బయటపడేందుకు బెంగళూరులోని వివేకానంద యోగ పరిశోధన కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య సూత్రాలను పాటించారు. యోగ వంటి సంప్రదాయ పద్ధతుల వల్ల ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయన తన సన్నిహితులకు సూచిస్తుంటారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రభుత్వ అధికారులు ‘యోగ’ను అభ్యసించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు విధి నిర్వహణలో మంచి ఫలితాలను సాధించేందుకు యోగ శిబిరాలను ఆయన ఏర్పాటు చేయించారు. గుజరాత్‌లో లాకులిష్ యోగ విశ్వవిద్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఊపిరి సలపని కార్యక్రమాలున్నా ఆయన ‘యోగ’ అభ్యసిస్తుంటారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వివిధ యోగసనాలు ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు.
‘గ్రీన్ టీ’ చాలు...
యోగ, ప్రాణాయామతో పాటు మంచి ఆహారపు అలవాట్లు తన ఆరోగ్యానికి కారణాలని మోదీ చెబుతుంటారు. పసితనంలో పేదరికం కారణంగా ఖరీదైన ఆహార పదార్థాలకు ఆయన నోచుకోలేదు. రాజకీయంగా ఎన్నో పదవుల్లో రాణించినా ఆయన విలాసవంతమైన జీవనానికి అలవాటు పడలేదు. పరిమితమైన శాకాహారాన్ని ఆయన ఎక్కువగా ఇష్టపడతారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ‘టీ’ తాగడాన్ని బాగా తగ్గించారు. ఎక్కడైనా ఆతిథ్యం స్వీకరించాల్సి వస్తే తనకు ‘గ్రీన్ టీ’ మాత్రం చాలని ఆయన అడుగుతారు. ఎన్నికల సమయంలో బిజీగా ఉన్నపుడు రాత్రి వేళ భోజనానికి స్వస్తి చెబుతుంటారు. తాను యువకుడిగా ఉన్నపుడు ఎక్కువగా సైకిల్‌పైనే ప్రయాణించడం వల్ల శారీరక దృఢత్వం సాధ్యమైందంటారు. పరిశుభ్రత, వ్యాయామం, పోషకాహారం, తగిన విశ్రాంతి ఉన్నపుడే ‘ఫిట్‌నెస్’ సాధ్యమవుతుందని ఆయన వివరిస్తుంటారు. చిన్నతనం నుంచి పరిశుభ్రత అంటే మక్కువ చూపే ఆయన తన దుస్తులను తానే ఉతుక్కొనేవారు. ఎవరు ఏ హోదాలో ఉన్నా, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అందరికీ చెబుతుంటారు. పార్టీ కార్యక్రమాల్లో తీరక లేకుండా అర్ధరాత్రి వరకూ మెలకువగా ఉన్నా, పుస్తక పఠనం వల్ల అంతగా నిద్ర లేకున్నా- ఉదయం అయిదు గంటలకే నిద్ర లేవడం మోదీకి అలవాటు. చన్నీటితో స్నానం చేసే అలవాటుతో పాటు ఉదయానే్న వ్యాయామం, యోగ పాటించడం వల్ల ‘ఫిట్‌నెస్’ సాధ్యమవుతుందని మోదీ అంటారు. తన జీవితంలో ఎనె్నన్నో అనుభవాలు నేర్పిన పాఠాలతో ఆయన ఇపుడు జాతిజనులకు ‘ఫిట్‌నెస్ మంత్రం’ ఉపదేశించారు.
అందరి బాధ్యత..
ఆహారం, ఆరోగ్యం, ఫిట్‌నెస్ వంటి అంశాలపైనా సామాజిక వ్యవస్థలో సమష్టి బాధ్యత తప్పనిసరిగా ఉండాలి. పెళ్లిళ్లు, పిల్లల పెంపకం, చదువుసంధ్యలు వంటి అనేకానేక కుటుంబ బాధ్యతలను నెరవేర్చినట్టే ఆరోగ్యం కోసం అందరూ బాధ్యత వహించాల్సిన సమయమిది. చదువుల మాదిరి పిల్లలకు వారికిష్టమైన ఆటపాటల్లో అవకాశం కల్పించాలి. చిన్నప్పటి నుంచే శారీరక శ్రమపై వారికి అవగాహన కలిగించాలి. క్రీడలు, వ్యాయామం, యోగ, ధ్యానం వంటివి అన్ని వయసుల వారికీ దినచర్యలో భాగం కావాలి. ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్యవంతమైన జీవనం సాగించేలా నిర్దిష్ట పద్ధతులను ప్రతి ఒక్కరూ ఆచరించాలి. కుటుంబ వ్యవస్థ ఇందుకు బాధ్యత వహించాలి. పోషకాహారం, పరిశుభ్రమైన తాగునీరు, స్వచ్ఛమైన గాలి అందేలా చూడాలి. పర్యావరణం, పచ్చదనంపై అందరిలోనూ ఆసక్తి పెరగాలి. నిపుణుల సలహాల మేరకు వ్యాయామం చేస్తుండాలి. ఆశించిన ఫలితాలు రాలేదని నిరాశ చెందకుండా మంచి ఆహారపు అలవాట్లు, మేలైన ఆరోగ్య పద్ధతులు పాటిస్తే ‘ఫిట్ ఇండియా’ సాకారమ్యే అవకాశాలు ఉన్నాయి. *
కూరగాయల కోసం కొండలపైకి..
ఆయన ఓ ఐఏఎస్ అధికారి.. అయినా ఎలాంటి భేషజాలు లేకుండా భుజాన వెదురుబుట్ట వేసుకొని తాజా కూరగాయల కోసం మైళ్లకొద్దీ నడుస్తుంటారు.. కొండలపైకి చేరుకొని ఆ ఉన్నతాధికారి తాజా కూరలను సాధారణ వ్యక్తిలా కొనడం అందరికీ విస్మయం కలిగిస్తుంది.. ‘ఫిట్నెస్ మంత్రం’ పాటిస్తున్న ఆయన అందరికీ స్ఫూర్తిగా నిలిచారని ‘నెటిజన్లు’ తెగ ప్రశంసిస్తున్నారు. పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవనశైలికి ఆయన ప్రత్యక్ష ఉదాహరణ. మేఘాలయ రాష్ట్రంలోని వెస్ట్ గరో హిల్స్ ప్రాంతంలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న రామ్‌సింగ్ తాను ఓ ఐఏఎస్ అధికారినని భావించకుండా వారానికోసారి కనీసం పది మైళ్లు నడుస్తుంటారు. కొండలు, గుట్టలు ఎక్కి గిరిజనుల వద్ద తాజా కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన కూరగాయలను మాత్రమే ఆయన కొంటారు.
ప్లాస్టిక్ కవర్లు, కాలుష్యం వెదజల్లే మోటారు వాహనాలను వాడేందుకు ఆయన ఇష్టపడరు. అధికారులు లేనిపోని దర్పం వెలగబెట్టే ఈ రోజుల్లో ఓ ఐఏఎస్ అధికారి ఇంత సాదాసీదాగా నడచి వెళ్తుండడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అధికారుల వల్ల ప్రధాని మోదీ ఆశించిన ‘ఫిట్ ఇండియా’ కల సాకారం అవుతుందని ‘నెటిజన్లు’ ఎంతో ఉత్సాహంగా అంతర్జాలంలో ‘పోస్ట్‌లు’ పెడుతున్నారు.
సెలబ్రిటీల మద్దతు...
ప్రధాని మోదీ ఇచ్చిన ‘ఫిట్ ఇండియా’ పిలుపునకు దేశవ్యాప్తంగా భారీ స్పందన రావడం ఖాయమని సినీ, క్రీడారంగ ప్రముఖులు అంటున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మోదీ ప్రసంగించిన సమావేశంలో సినీ నటి, యోగ శిక్షకురాలు శిల్పాశెట్టి తదితరులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శారీరక, మానసిక దృఢత్వం సాధ్యమైనపుడు భారత జాతి అన్ని రంగాల్లోనూ అద్భుత విజయాలు సాధిస్తుందని సినీ రంగ ప్రముఖులు అన్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌తో పాటు మరికొందరు నటీనటులు ‘ఫిట్ ఇండియా’ సంకల్పం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రపంచ బ్యాండ్మింటన్ చాంపియన్ పీవీ సింధు, ఒలింపిక్ విజేతలు మేరీకోమ్, సుశీల్ కుమార్ తదితర క్రీడా ప్రముఖులు కూడా‘ఫిట్ నెస్’ అనేది మన జీవన విధానంలో భాగం కావాలన్నారు.
వ్యాధులపై సమరం..
‘ఫిట్నెస్’ లోపించడం వల్లనే నేడు మన దేశంలో వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది వ్యాధుల బారిన పడుతున్నారు. ఇటీవల జాతీయ క్రీడా దినోత్సవం నాడు ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ఈ విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జీవనశైలి కారణంగా యువకుల్లోనూ మధుమేహం, గుండెపోటు వంటి రుగ్మతలు వస్తున్నాయన్నారు. అన్ని వయసుల వారూ క్రీడలు, ఎక్సర్‌సైజులు, యోగ, ధ్యానం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటే ‘ఫిట్నెస్’ సాధ్యమవుతుందన్నారు. 134 కోట్ల మంది భారతీయుల్లో యువత సంఖ్య ఎక్కువగా ఉందని, యువజనులు ‘జీవనశైలి వ్యాధుల’కు దూరమైనపుడే దేశం ఆరోగ్యవంతంగా ఉంటుందని మోదీ అన్నారు. అంటువ్యాధులు, విషజ్వరాల బారినపడి ఏటా ఎంతోమంది మరణిస్తుండగా, జీవనశైలి కారణంగా ఇంకెంతోమంది పలు రకాల శారీరక, మానసిక రుగ్మతలకు బలైపోతున్నారని ఆయన వివరించారు. నాలుగవ జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం అంటువ్యాధులు కాని రోగాలతో దేశంలో 60 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ఊబకాయం, రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులకు జీవనశైలిలో అలవాట్లు కారణమవుతున్నాయని పలు అధ్యయనాల్లో తేటతెల్లమైంది. శారీరక శ్రమ లేనందున రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని ఎంతోమంది అధిక బరువు, గుండె సంబంధిత రోగాలకు లోనవుతున్నారు..
ఊబకాయం..
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత వైద్య మండలి, బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ అధ్యయనాల మేరకు 2016 నాటికి భారత్‌లో 20.4 శాతం మంది ఊబకాయంతో అవస్థలు పడుతున్నారు.
హృద్రోగ సమస్యలు..
మన దేశంలో 2016 నాటి మరణాలను విశే్లషిస్తే 28 శాతం మంది హృద్రోగాలతో మృత్యువాత పడ్డారు. ఈ గణాంకాలను లానె్సట్ గ్లోబల్ హెల్త్ వంటి ప్రఖ్యాత సంస్థలు ధ్రువీకరించాయి.
రక్తపోటు..
ప్రతి నలుగురు భారతీయుల్లో కనీసం ఒకరు రక్తపోటు సమస్యతో సతమతమవుతున్నారని భారత వైద్య పరిశోధనా మండలి సర్వేలో తేలింది, అధిక రక్తపోటు వల్ల గుండె, కిడ్నీలు, నేత్రాలు, ఇతర అవయవాలకు నష్టం జరుగుతోంది. దేశంలో వంద జిల్లాల్లో రక్తపోటు రోగులను గుర్తించి ప్రత్యేక వైద్య సహాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది.
మధుమేహం..
దేశవ్యాప్తంగా సుమారు 72 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రపంచంలోనే ‘మధుమేహ రాజధాని’గా భారత్ అవతరించిందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
సరైన ఆహారపు అలవాట్లు, తగిన ఆరోగ్య పద్ధతులు, శారీరక శ్రమ లేని కారణంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఫిట్ ఇండియా’ సాధ్యం కావాలంటే ఆహారం, ఆరోగ్యం, శారీరక శ్రమ పట్ల అందరిలోనూ తగిన అవగాహన కలిగించాలి. ఇందుకు ‘ఫిట్ ఇండియా’ ఉద్యమమే శరణ్యం. పిల్లలకు చిన్నప్పటి నుంచే యోగ, సూర్య నమస్కారాలు, ఎక్సర్‌సైజ్‌ల పట్ల అవగాహన కల్పించాలి. అన్ని స్థాయిల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఇందుకు నడుం బిగించాలి. క్రీడలకు, ఫిట్‌నెస్ కార్యక్రమాలకు అధిక మొత్తంలో నిధులను కేటాయించాలి.

- పి.ఎస్.ఆర్.