ఈ వారం స్పెషల్

పాఠమే ప్రాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*పి.ఎస్.ఆర్.

పోలీస్ శాఖలో 34 ఏళ్ల సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానం.. అత్యున్నతమైన డీజీపీ హోదాలో పదవీ విరమణ చేశాక ‘విశ్రాంత జీవితాని’కి బదులు ఆయన అడుగులు బడి వైపు దారితీశాయి.. పిల్లలకు పాఠాలు చెప్పాలన్న తృష్ణ ఆ రిటైర్డ్ పోలీస్ బాస్‌ను ‘గురువు’గా మార్చేసింది.. కళాశాల రోజుల్లో ‘ప్యాకెట్ మనీ’ కోసం ట్యూషన్లు చెప్పిన ఆయన ఇప్పుడు పూర్తిస్థాయిలో బోధనకు అంకితం కావాలని తరగతి గదిలోకి ప్రవేశించారు.. అస్సాంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదవీ విరమణ చేసిన ముఖేష్ సహాయ్ ఓ ప్రభుత్వ హైస్కూల్‌లో గణితం బోధిస్తూ పిల్లలతో మమేకమవుతూ- బోధనకు విశ్రాంతి లేదని నిరూపిస్తున్నారు..
***
పాతికేళ్ల బాబర్ అలీకి ‘టీచర్ ట్రైనింగ్’లో ఎలాంటి డిగ్రీలు లేకున్నా- ప్రపంచంలోనే అత్యంత ‘పిన్న వయస్కుడైన హెడ్మాస్టర్’గా రికార్డు సృష్టించాడు.. తొమ్మిదేళ్ల వయసులోనే టీచర్‌గా అవతారమెత్తిన అలీ పశ్చిమ బెంగాల్‌లోని భాబ్టా గ్రామంలో ఓ పాఠశాలను ఏర్పాటు చేసి బడుగువర్గాల పిల్లలకు విద్యాగంధాన్ని పంచుతున్నాడు.. ఈ కుర్రాడు నిర్వహిస్తున్న ‘ఆనంద శిక్షా నికేతన్’ గురించి ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ ‘బీబీసీ’ ఓ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది.. అలీ ప్రారంభించిన పాఠశాలలో ఇపుడు 300 మంది విద్యార్థులకు పదిమంది టీచర్లు పాఠాలు చెబుతున్నారు..
***
ఆయన- ఓ ‘నడిచే పాఠశాల’.. సైకిల్‌పై ప్రతిరోజూ సుమారు అరవై కిలోమీటర్ల మేరకు ప్రయాణిస్తూ మురికివాడల్లో, రోడ్ల వెంబడి, పొలం గట్లపై పిల్లలు ఎక్కడ కనిపిస్తే అక్కడ పాఠాలు చెబుతుంటాడు.. ‘సైకిల్ గురూజీ’గా అందరూ పిలిచే ఆదిత్య కుమార్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో పరిసర ప్రాంతంలో రెండు దశాబ్దాలకు పైగా విద్యా బోధన కొనసాగిస్తున్నాడు..
***
ఆమెను చూస్తే ‘ఎనభై ఏళ్ల యువతి’గా మనం అభివర్ణించాల్సిందే.. ఉపాధ్యాయురాలిగా పాతికేళ్ల క్రితమే పదవీ విరమణ చేసినప్పటికీ- ఆమె బడికి మాత్రం దూరం కాలేదు.. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని మదన్‌పూర్ ఖదర్‌లో పేద పిల్లలకు ముదిమి వయసులోనూ ఆమె పాఠాలు చెబుతోంది.. ప్రభుత్వ స్కూల్‌లో తగినంత మంది టీచర్లు లేనందున ఉచితంగా సేవలందిస్తోంది.. తరగతి గదులు శిథిలం కావడంతో కొన్నాళ్లపాటు పార్కులో పిల్లలను కూర్చోపెట్టి పాఠాలు చెప్పింది.. తన శక్తినంతా ధారపోసి చివరికి బడి కోసం ఓ చిన్న భవనాన్ని సమకూర్చుకుని- ‘గురువు’కు అలసట లేదని చాటిచెబుతోంది..
***
... అన్ని రకాల ‘బోధనార్హతలు’ ఉన్నవారే కాదు, పాఠాలు చెప్పాలన్న ఆసక్తి, అనురక్తి ఉన్నవారు సైతం గురువులుగా సేవలందిస్తూ ఇతరులకు స్ఫూర్తిదాతలుగా నిలుస్తున్నారు. వృత్తి ఏదైనా, ఉద్యోగం ఏదైనా పాఠాలు చెప్పాలని, విద్యాదానం చేయాలని సంకల్పించడం ఉత్తమోత్తమం. ఉపాధ్యాయుడిగా సేవలందించడంలో ఉన్న తృప్తి అక్షరాలకు అందనిది.. సమాజంలో గురువుకు ఉన్న స్థానం ఎంతో ఉతృష్టమైనది.. ఏ రంగంలో ఎంతటి నిష్ణాతులైనా వారు- గురువు వద్ద పాఠాలు నేర్చుకుని విజయ శిఖరాలను అధిరోహించినవారే. గురువు వెలిగించే జ్ఞానదీపాలే ఎవరికైనా జీవనపథంలో గమ్యానికి దారి చూపుతాయి. జీవితానికి దిశానిర్దేశం చేసేది గురువులే.. ఆ ‘గురు’తర బాధ్యతను నిండుమనసుతో నిర్వర్తించినపుడే వ్యక్తి వికాసం, సమాజ వికాసం సాధ్యం. హృదయాన్ని స్పృశించి, స్ఫూర్తిని రగిలించినవారే నిజమైన విద్యాదాతలు. ఉపాధ్యాయుల ప్రభావం లేని సమాజాన్ని ఊహించలేం. బోధన అంటే పాఠ్యాంశాల్ని ఏకరువు పెట్టడం కాదు, పిల్లలకు చదువుపై ఆసక్తిని కలిగించడం, వారి ఆలోచనలకు ఆలంబనగా నిలవడం, వారి సృజనను వెలికితీయడం.. ప్రపంచంలో మరే వృత్తికీ లేని గౌరవం, ఉన్నత స్థానం ఉన్నందునే- ఇతర ఉద్యోగాల్లో ఉన్నవారిలో సైతం- ‘తమకు తెలిసిన జ్ఞానాన్ని పదిమందికీ పంచాలన్న’ తపన పెరుగుతోంది.
పాఠాలు చెప్పడమనేది కొందరికి ఉద్యోగం అయితే- మరికొందరికి అదొక ‘హాబీ’. నిజానికి ఆకట్టుకొనేలా పాఠాలు చెప్పడం- ఓ వరం, వదులుకోలేని ఓ అలవాటు, అనిర్వచనీయ ఆనందం, నిరంతర తపన, ఓ జీవన విధానం.. నిత్య నూతనత్వమే గురువుకు అసలైన అర్హత.. ప్రపంచాన్ని తెలుసుకుని, ప్రపంచాన్ని చూపేవాడే నిజమైన ఉపాధ్యాయుడు.. కాలమాన పరిస్థితులను, తరాల అంతరాలను గమనిస్తూ చదువుపై జిజ్ఞాసను పెంపొందించేవాడే అసలైన అధ్యాపకుడు.. పాఠ్య పుస్తకాల్లోని అంశాలు సంబంధిత సబ్జెక్టులపై మనకు అవగాహన పెంచేవే. కానీ ఆప్యాయతతో గురువు చెప్పే మాటలు మన జీవితాలకు దిశానిర్దేశం చేస్తాయి. బోధనలో వినూత్న పద్ధతులు ఆచరించేవారు గొప్ప టీచర్లుగా గుర్తుండిపోతారు. వృత్తిపరంగా గురువులు కానివారు సైతం విద్యారంగంలో విశేష సేవలందిస్తూ తమ గొప్ప మనసు చాటుకుంటున్నారు..
అ‘గణిత’ సేవలు..
‘నా దృష్టిలో విద్యార్థులే హీరోలు.. వారిని మెరికల్లా తీర్చిదిద్దడమే నా లక్ష్యం’ అంటూ గణితం బోధించేందుకు ‘గురువు అవతారం’ ఎత్తారు అస్సాం మాజీ డీజీపీ ముఖేష్ సహాయ్. 1984 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన 34 సంవత్సరాల పాటు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఫిజిక్స్, గణితం, స్టాటిస్టిక్స్‌లో పీజీ, న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసిన ఆయనకు పాఠాలు చెప్పడమంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి. ఇటీవలే ఉద్యోగ విరమణ చేశాక విద్యార్థులకు గణితం బోధించాలన్న తలంపు రావడంతో గౌహతి నగరంలో 124 ఏళ్ల చరిత్ర కలిగిన ‘సోనారం హయ్యర్ సెకండరీ స్కూల్’ ప్రిన్సిపాల్‌ను కలిసి సహాయ్ తన మనోగతాన్ని వివరించారు. 1894లో ఏర్పాటైన ఈ పాఠశాల అస్సాంలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రభుత్వ అజమాయిషీలో నడుస్తున్న ఈ పురాతన బడిలో గత రెండేళ్లుగా గణితం టీచర్ పోస్టు ఖాళీగా ఉందని తెలియడంతో 11, 12వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు సహాయ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. డీజీపీ హోదాలో మొక్కలు నాటేందుకు 2016లో ఆ పాఠశాలకు వెళ్లిన ఆయనకు హెడ్మాస్టర్‌తో సాన్నిహిత్యం ఉంది. కెమిస్ట్రీ బోధించే తనకు గణితం, స్టాటిస్టిక్స్ చెప్పడం ఇబ్బందికరంగా ఉన్నా రెండేళ్లు ఎలాగో నెట్టుకువచ్చానని, ఇపుడు గణితం బోధించేందుకు సహాయ్ రావడంతో ఎంతో ఉపశమనం కలిగిందని పాఠశాల హెడ్మాస్టర్ ద్విజేంద్రనాథ్ బర్తాకుర్ అంటున్నారు. తమ విద్యార్థుల్లో 80 శాతం మంది బడుగువర్గాల వారేనని, ట్యూషన్లకు వెళ్లే ఆర్థిక స్థోమత వారికి లేనందున సహాయ్ రాక తమకు వరంలా మారిందన్నారు. ఉన్నత హోదాలో పనిచేసిన వ్యక్తి పాఠాలు చెబుతున్నందున విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుందన్నారు. గణితం పాఠ్య పుస్తకాలు పంపాలంటూ డీజీపీ హోదాలో పనిచేసిన సహాయ్ అడగడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. పాఠాలు బోధించేందుకు శ్రీకారం చుట్టిన సందర్భంగా సోనారం స్కూల్‌లో ఇటీవల సహాయ్ మొక్కలు నాటారు. గతంలో తాను టీచర్‌గా పనిచేయకపోయినా, పోలీస్ శాఖలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించిన అనుభవం ఉందని ఆయన గుర్తు చేస్తున్నారు. ఉద్యోగ జీవితంలో ఒత్తిడి, పనిభారం వల్ల తాను పాఠాలు చెప్పలేకపోయానని, ఇప్పుడు బోధనే తన సర్వస్వం అంటున్నారు. కాలేజీ రోజుల్లో ఖర్చులకు అవసరమయ్యే డబ్బు సంపాదించేందుకు ట్యూషన్లు చెప్పానని గత స్మృతులను వివరిస్తున్నారు. పాఠశాల పనిదినాల్లో ప్రతిరోజూ గంటసేపు ‘కాలిక్యులస్’ చెబుతున్న ఆయన కొత్త విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు ముగిశాక రోజూ రెండు తరగతులకు పాఠాలు చెబుతానని అంటున్నారు. గణితం బోధించేందుకు మరో ఉపాధ్యాయుడిని నియమించినా, ‘కాలిక్కులస్’ చెప్పేందుకు తాను ప్రతిరోజూ స్కూల్‌కు వస్తానని, ఇందుకోసం ఇంటివద్ద కొంత హోం వర్క్ చేస్తానని సహాయ్ తెలిపారు. సమాజంలో భాగస్వామిగా ఉంటూ, శారీరకం, మానసిక ఉత్సాహాలను కలిగి ఉన్నపుడు నేర్చుకోవడానికి, నేర్పడానికి ఎలాంటి ఆటంకం ఉండదని ఆయన చెబుతుంటారు. పూర్తిస్థాయి టీచర్‌లా సహాయ్ పాఠాలు చెబుతుండడంతో విద్యార్థులు సైతం గణితంపై ఆసక్తి పెంచుకుంటున్నారని హెడ్మాస్టర్ ద్విజేంద్రనాథ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 30న పదవీ విరమణ చేసిన సహాయ్ నుంచి మే 1న తనకు కబురు అందిందని, ఏడవ తేదీన టీచర్‌గా ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారని హెడ్మాస్టర్ తెలిపారు. ఎంతో ఓపిగ్గా, ప్రేమతో పాఠాలు చెప్పే ‘సహాయ్ సార్’ క్లాసులో ఉన్నపుడు విద్యార్థులెవరూ గైర్జాజర్ కావడం లేదు.
పేదపిల్లలకు విద్యాగంధం..
పశ్చిమ బెంగాల్‌లోని భాబ్టా గ్రామానికి చెందిన బాబర్ అలీ పేదవర్గాల పిల్లలకు చదువు చెప్పేందుకు ప్రారంభించిన ‘ఆనంద శిక్షా నికేతన్’ పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా వార్తల్లోకెక్కింది. చదువుకునేందుకు నిరుపేద పిల్లలు పడుతున్న అవస్థలను చూసి, తొమ్మిదేళ్ల ప్రాయంలోనే తన ఇంటి ఆవరణలో అలీ ఓ పాఠశాలను ప్రారంభించాడు. తానే టీచర్ అవతారం ఎత్తి పాఠాలు చెబుతుంటాడు. టీనేజీ వయసులో కళాశాలకు వెళ్లడానికి బదులు- ఇతను పాఠశాలను నడుపుతూ అడ్డంకులన్నింటినీ అధిగమించాడు. పిల్లల కోసం స్కూలు నడుపుతూనే ఇంగ్లీష్ లిటరేచర్‌లో పీజీ చేశాడు. అలీ నడుపుతున్న బడిలో అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా పాఠాలు చెబుతుంటారు. జనాదరణ పెరగడంతో ‘ఆనంద శిక్షా నికేతన్’కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గుర్తింపును ఇచ్చింది. ఇప్పుడు ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 300కు చేరుకోగా పది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
పిల్లలు కనిపిస్తే చాలు..
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలోని మురికివాడల ప్రజలందరికీ ‘సైకిల్ గురూజీ’ అంటే ఎనలేని ప్రేమ. ఎటువంటి ఉన్నత చదువులు లేకున్నా ఇతను నిత్యం సైకిల్‌పై తిరుగుతూ పిల్లలకు పాఠాలు చెబుతుంటాడు. పాఠశాలలు లేని మారుమూల గ్రామాలకు వెళుతూ రోడ్డుపక్కన పిల్లలను కూర్చోపెట్టి చదువు చెప్పే ఆదిత్య కుమార్ 1995 నుంచి సైకిల్‌పైనే తిరుగుతూ విద్యాగంధం పంచుతున్నాడు. పార్కులు, మురికివాడలు, రహదారుల పక్కన పిల్లలకు పాఠాలు చెప్పే ఈ ‘సైకిల్ గురూజీ’ ఎవరి నుంచీ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించడు. తన వల్ల కొంతమంది పిల్లలకైనా అక్షరజ్ఞానం వస్తే చాలునని సంతృప్తి చెందుతుంటాడు. ప్రతిరోజూ 60-65 కిలోమీటర్లు సైకిల్ తొక్కినా పిల్లలకు పాఠాలు చెప్పడంతో తనకు ఎలాంటి విసుగు ఉండదంటున్నాడు.
బొమ్మలతో చదువు..
చదువుపై పిల్లల్లో ఆసక్తి కలిగించాలంటే వినూత్న పద్ధతులు అవసరమని మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాకు చెందిన అరవింద్ గుప్తా చెబుతుంటారు. అగ్గిపుల్లలు, రబ్బరు గొట్టాలు, చెక్కముక్కలతో పలురకాల ఆకృతులను సృష్టిస్తూ పిల్లలకు సైన్స్ పాఠాలు బోధించడంలో ఆయనది అందెవేసిన చేయి. కాన్పూర్ ఐఐటిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో శిక్షణ పొందిన ఆయన సరదా మాటలతో, చిన్న చిన్న వస్తువులతో చిన్నారులకు పాఠాలు చెబుతుంటారు. విద్యారంగానికి చేస్తున్న సేవలను గుర్తించి అరవింద్ గుప్తాను కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. వివిధ భాషలకు చెందిన 35 పుస్తకాలను అనువదించి పిల్లల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఇంతవరకూ సుమారు 700 పిల్లల పుస్తకాలను హిందీలో ప్రచురించడమే కాదు, వాటిని ఆన్‌లైన్‌లో ఉంచారు. ఎలాంటి సౌకర్యాలు లేని బడుగువర్గాల పిల్లలకు సులభమైన పద్ధతుల్లో బోధించినపుడు వారు మంచి ఫలితాలు సాధిస్తారని ఆయన చెబుతుంటారు. బోధన కోసం తాను రూపొందించిన వస్తువులతో సుమారు వెయ్యి వీడియోలను ఆయన చిత్రీకరించారు. సుమారు మూడు వేల పాఠశాలలకు వెళ్లి బొమ్మలతో విద్యాబోధన చేశారు. ఆవిష్కరణలు అనంతంగా కొనసాగుతుంటాయని, కొద్దిపాటి సాంకేతికను వినియోగించి బోధనలో అద్భుతాలను సాధించవచ్చని ఆయన నమ్ముతుంటారు.
వంతెన కింద బడి..
పాఠాలు చెప్పేందుకు విశాలమైన భవనాలు, విస్తృతమైన సౌకర్యాలు అవసరం లేదని ఢిల్లీకి చెందిన రాజేశ్‌కుమార్ శర్మ నిరూపిస్తున్నారు. మురికివాడల్లోని పిల్లల కోసం ఇతను ఢిల్లీ మెట్రోరైల్ వంతెన కింద ఓ పాఠశాలను ప్రారంభించాడు. తరగతి గదులు, బల్లలు, కుర్చీలు వంటివి ఈ ‘వంతెన కింది బడి’లో కనిపించవు. ఎలాంటి వసతులు లేకున్నా ఈయన నడిపే స్కూల్‌కు రోజూ కనీసం 200 మంది పిల్లలు సమీపంలోని మురికివాడల నుంచి వస్తుంటారు. విజ్ఞానాన్ని పంచేందుకు భారీ సౌకర్యాలు అవసరం లేదని భావించే రాజేశ్‌కుమార్ శర్మకు మరికొంతమంది యువకులు అండగా నిలిచారు. ఉన్నత చదువులు పూర్తిచేసిన కొందరు యువకులు ఈ బడిలో స్వచ్ఛందంగా సేవలందిస్తుంటారు.
ఆన్‌లైన్ పాఠాలు..
పాఠాలు చెప్పాలంటే టీచర్‌గా పనిచేయడం, బడికి వెళ్లడం వంటివి అక్కర్లేదని రోషినీ ముఖర్జీ నిరూపిస్తున్నారు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఆమె పాఠాలను ‘యూ ట్యూబ్’లో అందుబాటులో ఉంచుతున్నారు. విద్యార్థుల నుంచి వచ్చే సందేహాలకు కూడా ఆమె ఆన్‌లైన్‌లోనే సమాధానాలు చెబుతుంటారు. ఫిజిక్స్, మేథ్స్, బయోలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఆమె రూపొందించిన వీడియో పాఠాలను ఎవరైనా ఆన్‌లైన్‌లో ఉచితంగా పొందవచ్చు. ఢిల్లీకి చెందిన రోషినీ ముఖర్జీ ఎమ్మెస్సీ (్ఫజిక్స్) చేశాక విద్యార్థుల కోసం ‘ఆన్‌లైన్ వేదిక’ను ప్రారంభించాలని నిర్ణయించి, ఖర్చుకు వెనుకాడక తమ లక్ష్యాన్ని సాధించారు. చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పాలన్న తపన ఉన్న ఆమె వివిధ సబ్జెక్టుల్లో 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం సుమారు 3,800 వీడియో పాఠాలను రూపొందించారు. భర్త, కుటుంబ సభ్యులు అండగా నిలవడంతో ఆమె తన ఆన్‌లైన్‌లో బోధనా కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. పరీక్షల పట్ల పిల్లల్లో భయం పోవాలని, నిర్దిష్ట ప్రణాళికతో పాఠ్యాంశాలను అందిస్తే వారు మంచి ఫలితాలను సాధించగలరని రోషినీ చెబుతుంటారు. పిల్లల కోసం రోజంతా పనిచేసినా తనకు ఎలాంటి విసుగు అనిపించదంటారు. పాఠ్యాంశాలు అర్థం కాక చిన్నతనంలో తాను పలు సమస్యలను ఎదుర్కొన్నానని, ఇలాంటి అవస్థలు విద్యార్థులకు ఉండరాదన్నదే తన తపన అని ఆమె చెబుతున్నారు. ప్రాంతీయ భాషల్లోనూ వీడియో పాఠాలను రూపొందించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. తాను రూపొందించిన వీడియో పాఠాల ద్వారా ఎంతోమంది విద్యార్థులు చదువులో ఉన్నత ప్రమాణాలు సాధించడం ఎంతో సంతోషం కలిగిస్తోందని ఆమె అంటున్నారు.
పోలీస్ టీచర్..
ఉద్యోగరీత్యా ఆయన అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్.. విధులు ముగిశాక టీచర్ అవతారం.. ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భమ్ జిల్లా గుడాబండ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న ప్రమోద్ పశ్వాన్ తీరిక వేళలో హతియాపడాలోని పాఠశాలలో గణితం బోధిస్తుంటారు. మావోయిస్టుల కార్యకలాపాలకు నిలయమైన హతియాపడా ప్రాంతంలో పాఠశాలలు తరచూ మూతపడుతుంటాయి. మావోయిస్టుల విధ్వంసక చర్యలతో విద్యార్థులకు, విద్యావ్యవస్థకు ఎంతో నష్టం జరుగుతోంది. ఇక్కడి పిల్లలు చదువుకు దూరం అవుతూ మావోయిస్టుల ప్రభావానికి లోనవుతున్నారు. దీంతో చదువుపై విద్యార్థులు దృష్టి సారించేలా ప్రమోద్ పశ్వాన్ కృషి చేస్తున్నారు. పాఠశాలలో గణితం బోధిస్తూ చదువుపై పిల్లల్లో ఆసక్తిని కలిగిస్తున్నారు. పిల్లలంతా చదువుకుంటే ఈ ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమం పూర్తిగా సమసిపోతుందని ప్రమోద్ అంటున్నారు. గణితంలో ఎదురయ్యే సమస్యలను విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునేందుకు వీడియో పాఠాలను కూడా ఆయన రూపొందించారు.
బడులను బాగుచేద్దాం..
మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు ఓ ఉన్నత విద్యావంతుడు విరాళాలు సేకరిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ముంబయి మహానగరంలో ప్రొఫెసర్ సందీప్ దేశాయ్ ప్రభుత్వ బడులను పరిరక్షించుకుందామంటూ వీధుల్లో తిరుగుతూ విరాళాలను సేకరిస్తున్నారు. ఈ విరాళాలను మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని పాఠశాలల కోసం ఆయన ఖర్చు చేస్తున్నారు. ముంబయి లోకల్ రైళ్లలో విరాళాలు సేకరించే ఈ ప్రొఫెసర్ చాలామందికి సుపరిచితులు. ఉదార భావంతో విరాళాలిచ్చే దాతల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో కొంతవరకైనా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని దేశాయ్ అంటున్నారు.
*

*పి.ఎస్.ఆర్.