ఈ వారం స్పెషల్

చక్కర్లు కొడుతూ.. చక్కబెట్టే పనులెన్నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

========================
సైన్యం కోసం తయారైన పరికరం..
వ్యవసాయానికీ సాయం చేస్తోంది..
శత్రు స్థావరాలపై నిఘా పెడుతోంది..
పెళ్లిళ్లలో ఫొటోలు, వీడియోలు తీస్తుంది..
సరకు రవాణా కూడా చేస్తుంది..
అదే డ్రోన్..
========================

వైమానిక వాహన బోర్డులో పైలెట్ నడపేది కాకుండా, రిమోట్ వ్యవస్థ ద్వారా నడిచే వైమానిక వాహనమే డ్రోన్. ‘డ్రోన్’ అనే పదానికి మంద్రంగా ఝంకారం చేసే మగ తేనెటీగ అని అర్థం. ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా అలా చిన్నగా శబ్దం చేస్తూ ఎగురుతాయి కాబట్టి వీటిని సాధారణ భాషలో డ్రోన్ అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే పైలెట్ లేని బుల్లి విమానాలు ఇవి. పిల్లలు కారు బొమ్మలను రిమోట్‌తో నడిపి ఆడుకుంటుంటారు కదా.. అచ్చం అలాంటిదే డ్రోన్ కూడా.. వీటిని కూడా రిమోట్ సహాయంతో గాల్లో ఎగిరేయవచ్చు. ఎగరడానికి వీలుగా హెలికాప్టర్‌కు ఉన్నట్లు వీటికి రోటర్లు ఉంటాయి. సరకులైనా, పొలంలో పురుగు మందులు చల్లాలన్నా, వధూవరులపై పూలవర్షం కురిపించాలన్నా, పేలతాయన్న భయం లేకుండా మందుపాతరలనూ, బాంబులను తొలగించాలన్నా, ఎవరైనా తప్పిపోయినప్పుడు వెతకాలన్నా, గస్తీ కాయాలన్నా.. ఇలాంటి పనులన్నింటినీ డ్రోన్లు చిటికెలో చేసేస్తాయి. అదీ మనం ఏ మాత్రం కష్టపడకుండా..
డ్రోన్లను మొదట సైన్యం కోసం తయారుచేశారు. గాల్లో ఎగురుతున్న వాహనాన్ని గురిచూసి నేలకూల్చడం ఎలాగో నేర్చుకోవడానికి బ్రిటీష్ నౌకాదళ సిబ్బంది వీటిని ఉపయోగించేది. వందేళ్ల క్రితమే ఇవి వాడుకలోకి వచ్చాయి. తర్వాత వీటికే కెమెరాలను బిగించి వియత్నాం యుద్ధంలో శత్రువుల కదలికలను కనిపెట్టడానికి వాడారు. ఇప్పుడైతే మిలటరీ డ్రోన్లు ఏకంగా క్షిపణులనే మోసుకెళ్తున్నాయి. నేటి సాంకేతిక యుగంలో వాయుసేన బడ్జెట్లో డ్రోన్లదే హవా.. శత్రుస్థావరాలపై నిరంతరం నిఘా పెట్టడానికీ, సరిహద్దుల వద్ద సమాచారాన్ని చిత్రీకరించి ఇంటెలిజన్స్ విభాగానికి అందించడానికి వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఈ పనులు చేయడానికి మనిషి నడిపే విమానాన్ని వాడితే అది శత్రుదేశానికి పట్టుబడే ప్రమాదం ఉంది. అప్పుడు దౌత్యపరంగా చాలా ఇబ్బంది. అదే డ్రోన్లు పట్టుబడినా.. దానిలో దేశం తాలూకు సమాచారం ఏమీ ఉండదు కాబట్టి ఏమీ నష్టం లేదు. పైగా ఎలాంటి ప్రాణనష్టమూ ఉండదు. మన దేశంలోనూ డీఆర్‌డీవో రక్షణశాఖకు అవసరమయ్యే డ్రోన్లను తయారుచేస్తోంది. ఇప్పటికే ఇజ్రాయల్ నుంచి దిగుమతి చేసుకున్న వందలాది డ్రోన్లను మన సైన్యం ఉపయోగిస్తోంది. డ్రోన్లను ఉపయోగించడానికి ప్రత్యేక నైపుణ్యాలేమీ అవసరం లేదు. కొద్దిపాటి శిక్షణతో డ్రోన్లను అవలీలగా నడపచ్చు. పైగా ఇవి చాలా చౌక. దీనిలో అత్యంత ఆధునిక సాంకేతికత ఉంటుంది.
డ్రోన్ల పనితీరును ‘అన్ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్’ అంటారు. అంటే మనిషి లేకుండా గాలిలో ఎగిరే వ్యవస్థ అని అర్థం. వీటిల్లో అనేక రకాలు ఉన్నాయి. పౌరసమాజం ఉపయోగాలకు వాడే వాటిని యూఏవీలనీ అంటే అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అనీ, మిలిటరీ ప్రయోజనాలకు వాడేవాటిని యూఏసీవీలనీ అంటే అన్‌మ్యాన్డ్ ఏరియల్ కాంబాట్ వెహికల్ అనీ అంటారు. ఈ డ్రోన్లు జీపీ ఎస్ కంట్రోల్‌తో మనం ఎంచుకున్న పరిధిలో తిరిగేట్లు చేయవచ్చు. అంతేకాదు.. డ్రోన్లు కూడా పక్షుల్లాగే ఏదైనా అడ్డం వస్తే ఆగి పక్కకు తప్పుకుని వెళ్తాయి కాబట్టి, ఎదురుగా ఉన్నదాన్ని ఢీకొంటాయన్న భయం లేదు. డ్రోన్ చేసే పనిపై దాని ఖరీదు ఆధారపడి ఉంటుంది. వేలతో మొదలుపెట్టి లక్షల వరకూ ఖరీదు చేసే రకరకాల డ్రోన్లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉన్నాయి. ఆడుకోవడానికి, హాబీగా కొనుక్కోవడానికి వాడే డ్రోనులు వెయ్యి రూపాయలకే లభిస్తాయి. ఫొటోగ్రఫీకి వాడే డ్రోన్ల ఖరీదు ఐదు వేల నుంచి లక్షల్లో ఉంటుంది. వీటిల్లోనూ వ్యక్తిగత వినియోగానికీ, వ్యాపార అవసరాలకీ వేర్వేరు డ్రోన్లు లభిస్తున్నాయి. సైన్యం కోసం వాడే డ్రోన్ల ఖరీదు చాలా ఎక్కువ.
సరకు రవాణా
డ్రోన్‌ను సరకు రవాణాకు చక్కగా ఉపయోగించుకోవచ్చు. మనదేశంలో కూడా డ్రోన్ల ద్వారా సరకు రవాణా చేయడానికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అమేజాన్ దీనిపై చాలాకాలంగా పరిశోధన చేస్తోంది. గత ఏడాది డిసెంబరులో ఇంగ్లాండ్‌లో, ఈ ఏడాది మార్చిలో అమెరికాలో విజయవంతంగా ప్రదర్శించింది కూడా. ఇంగ్లండ్‌లోని గ్రామీణ ప్రాంతాలకు సరకుల్ని డ్రోన్ డెలివరీ చేస్తోంది. అయితే రద్దీగా ఉన్న నగరాల్లో డ్రోన్ల రాకపోకలను నియంత్రించే విషయంలో అమెరికా ప్రభుత్వం స్పష్టమైన మార్గద ర్శకాలను రూపొందించలేదు. దాంతో అమెరికన్ డ్రోన్ కంపెనీలు ఇతర దేశాల్లో వాణిజ్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలో రోడ్డు మార్గం ద్వారా చేరుకోవడానికి కష్టమైన మారుమూల గ్రామాలకు మందులు, నిత్యావసరాల పంపిణీకి డ్రోన్లను వాడుతున్నారు. న్యూజిలాండ్‌లో డ్రోన్ల ద్వారా పిజ్జాలను డోర్ డెలివరీ చేస్తున్నారు.
వ్యవసాయానికి..
చైనా, జపాన్ రైతులు వ్యవసాయ రంగంలో డ్రోన్లను ఎక్కువగా వాడుతున్నారు. క్రిమిసంహారక మందుల్నీ, రసాయన ఎరువుల్నీ డ్రోన్ల ద్వారా చల్లవచ్చు. రైతులే వాటిని చల్లాలంటే రసాయనాల ప్రభావం శరీరం మీద పడకుండా చాలా జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. పైగా ఎక్కువ సమయం పడుతుంది. డ్రోన్లతో ఆ సమస్య ఉండదు. కాసేపట్లోనే పొలమంతా మందును చల్లేస్తుంది. రైతు దూరంగా కూర్చుని రిమోట్ ద్వారా డ్రోన్‌ను నడిపించవచ్చు. పెద్ద పెద్ద తోటలు ఉన్నట్లయితే స్వయంగా తోటంతా తిరగడానికి సమయం పడుతుంది. డ్రోన్ ద్వారా అయితే కాసేపట్లోనే తోటను అన్ని కోణాల్లోనూ వీడియో తీసుకొస్తుంది. కంప్యూటర్లో ఆ వీడియోను చూస్తూ రైతులు పంటల పరిస్థితిని అంచనా వేస్తూ.. తదుపరి పనుల ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. అంతేకాదండోయ్.. డ్రోన్లు పొలంలోని మట్టి నాణ్యతను విశే్లషిస్తాయి. వాతావరణం పంటలకు అనుకూలంగా ఉన్నదీ, లేనిదీ కూడా చెప్తాయి. అలాగే చుట్టుపక్కల పొంచి ఉన్న చీడపీడల సమాచారాన్ని అందిస్తాయి. పంట దిగుబడిని అంచనా వేస్తాయి. ఇలా వ్యవసాయంలో డ్రోన్లు అడుగడుగునా ఉపయోగపడతాయి. డెయిరీ ఫారాల్లో పర్యవేక్షణకు కూడా డ్రోన్లనే ఉపయోగిస్తున్నారు. మెరిల్ లించ్ అంచనా ప్రకారం భవిష్యత్తులో ఎనభై శాతం డ్రోన్ల అమ్మకాలు వ్యవసాయ రంగానికి సంబంధించే ఉంటాయట..
ఫొటోలు, వీడియోలు..
ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగాల్లో ఇప్పుడు డ్రోన్లదే కీలకపాత్ర. పెళ్లిలో పైనుంచి వింతైన ఫొటోలను తీయడానికి, వధూవరులపై పూలజల్లు కురిపించడానికి మునుపు హెలికాప్టర్లను వాడేవారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదే డ్రోన్‌తో నాణ్యమైన ఫొటోలు, హెచ్.డి. క్వాలిటీ వీడియోలు.. 360 డిగ్రీలతో.. ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. పెళ్లి వేడుకలో వధూవరుల ‘క్లోజప్’ దృశ్యాలను డ్రోన్లు ఎలా తీయగలుగుతాయి? అని చాలామందికి సందేహం. డ్రోన్‌కు అమర్చే కెమెరా ద్వారా ఫొటోలను తీయడం సాధ్యమవుతుంది. కెమెరాను అనుసరించి ఫొటోల నాణ్యత ఉంటుంది. డ్రోన్ తిరుగుతూ రకరకాల కోణాల్లో ఫొటోలు తీస్తుంది. డ్రోన్‌కి అనుసంధానం చేసిన కంప్యూటర్ ద్వారానో, స్మార్ట్ఫోన్ ద్వారానో ఫొటోగ్రాఫర్ తనకు అవసరమైనట్లుగా డ్రోన్‌నీ, కెమెరా లెన్స్‌నీ తిప్పుతూ.. అన్ని కోణాల్లో మంచి ఫొటోలు వచ్చేలా చూడగలడు. డ్రోన్‌కు అమర్చిన కెమెరా ద్వారా వీడియో రికార్డు చేయడమే కాదు, డ్రోన్‌ను శాటిలైట్‌కు అనుసంధానం చేసి లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయవచ్చు. అంటే ఒకచోట జరిగే వేడుకను అదే సమయంలో మరోచోట ఉన్నవారు ప్రత్యక్ష ప్రసారంలా చూడవచ్చు. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలకు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో డ్రోన్లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చాలావరకు వెడ్డింగ్ ప్లానర్లూ, వీడియోగ్రాఫర్లూ డ్రోన్లను అద్దెకిచ్చే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తదననుగుణంగా పెళ్లి ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు.
ఇతర పనులకు..
డ్రోన్లను ఇంకా చాలా చాలా పనులకు ఉపయోగిస్తున్నారు. ఇటీవల యూపీలో స్థానిక ఎన్నికల పర్యవేక్షణకు డ్రోన్లను ఉపయోగించారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లకు డ్రోన్లను బాగా ఉపయోగిస్తున్నారు. రైల్వేలైన్, ఎయిర్‌పోర్ట్‌లో రన్ వే నిఘాకు డ్రోన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మాన్యువల్‌గా అయితే ఇందుకు చాలామంది సిబ్బంది అవసరముంటుంది. పురావస్తు, గనుల్లో ప్రతిచోటా డ్రోన్ల అవసరం ఉంటుంది. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్కువ సమయంలో పరిస్థితులను అంచనా వేయడానికి, సహాయ చర్యలను చేపట్టడానికి డ్రోన్‌ను మించిన సాధనం మరొకటి లేదు. ఉప్పునీటిలో తడిసినా పాడవకుండా పనిచేసే స్ల్పాష్ డ్రోన్-3 వంటి ‘చేపలు పట్టే డ్రోన్లు’ కూడా ఉన్నాయి. అత్యంత నాణ్యమైన కెమెరాలు బిగించిన డ్రోన్లతో త్రీడీ మ్యాపింగ్ కూడా చేపడుతున్నారు. భవిష్యత్తులో డ్రోన్లు ఇంకా చాలా పనులు చేయనున్నాయి. గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక ప్రకారం 2020కల్లా డ్రోన్ల మార్కెట్ పదివేల కోట్ల రూపాయలకు చేరుతుందనీ, కార్పొరేట్ రంగానికి నిత్యజీవితంలో ఇది తప్పనిసరి అంశమవుతుందనీ విశే్లషకుల అంచనా. డ్రోన్ల హార్డ్‌వేర్ ఇప్పుడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. బ్యాటరీ సామర్థ్యమూ, బరువు మోసే శక్తీ మరిన్ని రెట్లు పెరుగుతాయి. డ్రోన్ల వాడకం పెరగడం గమనించిన పశ్చిమ బంగ ప్రభుత్వం తమ రాష్ట్రాన్ని డ్రోన్ తయారీ హబ్‌గా మార్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. వ్యక్తిగత కంప్యూటర్లలా భవిష్యత్తులో ప్రతి ఇంటికీ ఒక డ్రోన్ ఉండే అవకాశం ఉందని టెక్నాలజీ ప్రియులు జోస్యం చెబుతున్నారు. ఏ ఫైలో, లంచ్ బాక్సో ఇంట్లో మర్చిపోయి ఆఫీసుకు వెళ్లిపోయినా ఫర్వాలేదు.. ఫోనులో ఒక్కమాట చెబితే చాలు.. డ్రోన్ తెచ్చిపెడుతుందిక..!
మార్గదర్శకాలు
దేశంలో డ్రోన్ల వినియోగంపై ఇంతవరకు ఉన్న అస్పష్టతకు కేంద్రం తెరదించింది. వీటి వినియోగానికి సబంధించి పౌర విమానయాన శాఖ పరిధిలోని ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబర్ ఒకటి నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. తాజా మార్గదర్శకాల్లో..
* ఫొటోగ్రఫీ, వ్యవసాయ కార్యకలాపాల పర్యవేక్షణ, ప్రకటనల చిత్రీకరణ, విపత్తు సహాయ పనుల్లో వీటిని ఉపయోగించవచ్చు. కానీ ఆహార పదార్థాల చేరవేత, ఈ కామర్స్ సైట్లు వస్తువుల చేరవేతకు ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
* మనదేశంలో ఐదురకాల డ్రోన్లు ఉన్నాయి. నానో, మైక్రో, మినీ, స్మాల్, లార్జ్. అన్నిటికన్నా పెద్ద డ్రోన్ల బరువు గరిష్ఠంగా 150 కిలోల వరకూ ఉండవచ్చు.
* నానోడ్రోన్ల (250 గ్రాముల కంటే తక్కువ)ను ఉపయోగించడానికి భద్రతాపరమైన అనుమతులేవీ అక్కర్లేదు. నానో డ్రోన్లకి తప్ప మిగిలిన డ్రోన్లన్నింటికీ వివిధ విభాగాల నుంచి అనుమతి తప్పనిసరి. డ్రోన్ తిరిగే మార్గం వాయుసేన అధికారులకు తెలిసి ఉండడం అవసరం కాబట్టి వారి అనుమతి పొందకుండా డ్రోన్లను వాడకూడదు.
* రెండు కిలోల కన్నా తక్కువ బరువుండి 200 మీటర్ల పరిధిలోనే తిరిగే డ్రోన్లు అయితే ఎలాంటి అనుమతులూ అక్కర్లేదు. అయితే పౌర విమానయాన శాఖ వద్ద నమోదు చేయించాలి.
* కొన్ని ప్రత్యేక ప్రాంతాలను ‘నో డ్రోన్ జోన్లు’గా గుర్తించారు. అంతర్జాతీయ సరిహద్దులు, విమానాశ్రయాలు, చట్టసభలు, న్యాయస్థానాలు, రాష్టప్రతి భవన్, రాజకీయ, రక్షణ వ్యవహారాలకు చెందిన ముఖ్య కార్యాలయాలు, ముఖ్యమంత్రుల నివాసాలు.. వంటి కీలక ప్రాంతాల్లో ప్రైవేటు డ్రోన్లు తిరగడానికి అనుమతి లేదు.
* డ్రోన్ల వినియోగంలో కచ్చితమైన ప్రైవసీ ప్రొటెక్షన్ చట్టాలను తేనుంది ప్రభుత్వం. వీటిని ఆపరేట్ చేసేవాళ్లు అనుమతి లేకుండా ఇతరులకు సంబంధించిన కార్యక్రమాల ఆడియో, వీడియో రికార్డు చేయకూడదు. ఒకసారి అనుమతి పొందాక డ్రోన్ ప్రయాణించే మార్గాన్ని మార్చకూడదు. ప్రస్తుతానికి డ్రోన్ల వినియోగానికి అవరోధాలు లేకుండా ఈ నియమాలను రూపొందించారు. కొన్నాళ్లు ఈ డ్రోన్లు తిరిగే విధానం పరిశీలించాక ప్రభుత్వం వీటికి తుదిరూపం ఇస్తుంది.
నిబంధనలు
డ్రోన్ల వాడకానికి కూడా ప్రభుత్వం కొన్ని నిబంధనలను ప్రకటించింది.
* ఇండోర్‌లో 50 అడుగుల ఎత్తు కంటే తక్కువ ఎత్తులో వాటిని ఎగరనిచ్చేందుకు అనుమతులు అవసరం లేదు.
* ఏ అవసరం కోసం డ్రోన్లను వినియోగిస్తున్నామో చెబుతూ స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది. 18 ఏళ్ల లోపువారు వీటిని ఆపరేట్ చేయరాదు.
* సూర్యాస్తమయం తర్వాత డ్రోన్లను ఆపరేట్ చేయకూడదు.
* ముంబయి, దిల్లీ, చెన్నై, కోల్‌కత, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులకు ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను వినియోగించకూడదు.
* ఇతర విమానాశ్రయాలు.. అంటే పౌర, రక్షణ, ప్రైవేట్ విమాశ్రయాల ప్రాంతంలో మూడు కిలోమీటర్ల వరకు ‘నో ఫ్లై జోన్’గా పరిగణిస్తారు.
* అంతర్జాతీయ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వద్ద డ్రోన్ల వాడకం పూర్తిగా నిషేధం.
* యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ పరిధిలో 25 కిలోమీటర్ల వరకు ‘నో ఫ్లై జోన్’
* సముద్ర తీరం, సైనిక స్థావరాల సమీపంలో, జాతీయపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను ‘నో డ్రోన్ జోన్లు’గా ప్రకటించారు.
డీజీసీఏ ప్రకటించిన నిబంధనలను ఉల్లంఘిస్తే ఐపీసీ (్భరత శిక్షాస్మృతి)తో పాటు ‘వైమానిక చట్టం-1934’ ప్రకారం శిక్షార్హులవుతారు.
భవిష్యత్తులో..
భవిష్యత్తులో డ్రోన్లు ముఖ్యంగా ఐదు రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయంటున్నారు నిపుణులు
* క్లౌడ్ సీడింగ్ చేయడానికి అమెరికాలో డ్రోన్లను విజయవంతంగా వినియోగించారు. భవిష్యత్తులో కరవు ప్రాంతాల్లో వీటిని వాడి వర్షాలు కురిపించవచ్చు.
* అభయారణ్యాల్లో వేటగాళ్ల బారి నుంచి జంతువుల సంరక్షణకు డ్రోన్లు బాగా ఉపయోగపడుతున్నాయి. ఆఫ్రికాలో పలుచోట్ల ఇప్పటికే వీటిని వాడుతున్నారు.
* అంబులెన్సులుగా డ్రోన్ల వాడకం గురించి ప్రయోగాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే ప్రమాదాల్లో ప్రాణనష్టం భారీగా తగ్గుతుంది.
* ఇంటర్నెట్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో డ్రోనే్ల తాత్కాలిక, పోర్టబుల్ సర్వర్లుగా పనిచేస్తాయి.
*ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, నదులు, కొండలూ దాటి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాల్సి వచ్చినప్పుడూ డ్రోనే్ల కీలకం కానున్నాయి.
ఇలా ఇప్పుడు అంతా డ్రోన్ మయమే.. అమ్మ చేతి ఆవకాయ తినాలన్నా పుట్టింటికి వెళ్లి తెచ్చుకోవాల్సిన పనిలేదు అత్తారింట్లో ఉన్న అమ్మాయికి. అమ్మ ఆవకాయ పెడుతూనే కొత్త ఆవకాయని డ్రోన్ ద్వారా తెప్పించుకోవచ్చు. అర్జెంటుగా విమానాశ్రయానికి వెళ్లాలంటే ఓ డ్రోన్ టాక్సీని బుక్ చేసుకుంటే ట్రాఫిక్ జామ్‌ల భయమే ఉండదు. మరి డ్రోన్‌లు కూడా పెరిగిపోతే- ‘ఆకాశమార్గంలోనూ ట్రాఫిక్ జామ్ మొదలవుతుందేమో..!’ అన్నది కొంతమంది భయం. మరికొందరు ఔత్సాహిక ఆర్కిటెక్టులు భవిష్యత్తును ఆలోచించి డ్రౌన్‌పోర్టుల నమూనాలను రూపొందించేశారు. డ్రోన్ల సంఖ్య పెరిగితే వాటిని నిలిపేందుకు ఓ చోటు కావాలి కదా.. మరి! అందుకే నేటిమాట ‘డోర్ డెలివరీ’ కాస్తా.. రేపటి రోజున ‘డ్రోన్ డెలివరీ’గా మారనుంది.
*

-- ఎస్.ఎన్.ఉమామహేశ్వరి