ఈ వారం స్పెషల్

బుల్లెట్ రైలులో దూసుకుపోదాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచం మారిపోతోంది.
అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది..
ప్రపంచంతోపాటు మనమూ రయ్‌మంటూ దూసుకువెళ్లాల్సిన రోజులివి.
ఆవిరి యంత్రాలతో పనులు చేసుకునే దశ నుండి చిన్న బటన్ నొక్కితే విమానాలు ఎగిరే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం ముందుకు వెళుతోంది. రానున్న రోజుల్లో బయటకు వ్యక్తం చేయకుండానే మనిషి ఆలోచనలకు అనుగుణంగా రిమోట్ లేకుండా పనిచేసే యంత్రాలు రాబోతున్నాయి. మనిషి స్థానంలో రొబోలు ఇప్పటికే ప్రవేశిస్తున్నాయి. మనిషి కంటే నిజాయితీగా, ఎక్కువ సమయం ఎలాంటి అలసట లేకుండా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చెప్పింది చెప్పినట్టు ఎన్ని రోజులైనా ఆపకుండా పనిచేస్తున్నాయి ఈ రోబొట్లు. వాటంతట అవి ఆలోచించే మానసిక విచలనాలను కూడా శాస్తవ్రేత్తలు రోబోలకు అందించగలుతున్నారు. శారీరక, మానసిక సామర్ధ్యాలున్న రోబోలు మన ముందుకు వస్తే మనిషి రోబోలను అదుపు చేసే మావటివాడిగా మారిపోయే రోజు కూడా దగ్గరలోనే ఉంది. అవసరాలకు అనుగుణంగా పరిసరాలను మార్చుకుంటున్న మనిషి, యంత్రాల్లోనూ, ఇతర సౌకర్యాలను తేలికగా సమకూర్చుకుంటున్నాడు. దైనందిన కార్యక్రమాల్లో మనిషి ప్రధాన అవసరాల్లో రవాణా కూడా అతిముఖ్యమైనదిగా మారిపోయింది. ఆహారం, తాగునీరు, గాలి, బట్ట, నివాసం అనేవి ఒకపుడు ప్రధాన అంశంగా ఉన్నా, నేడు రవాణా ప్రాధాన్య అంశంగా మారిపోయింది. ద్విచక్రవాహనాలు, కార్లు, బస్సులు, రైళ్ళు, విమానాలు , రానున్న రోజుల్లో ద్రోన్‌లు కూడా, ఇంకా కొంచెం కాలం తర్వాత ఉపగ్రహాలను మనిషి తన రవాణాకు వినియోగించనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల్లో అత్యంత సురక్షితమైనది, సుఖవంతమైనదీ రైల్వేలే. దూరప్రయాణాలకు, విశ్రాంతి తీసుకునేందుకు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు, భద్రత పరంగానూ, సురక్షితంగా గమ్యానికి చేరడంలోనూ రైల్వేలదే అగ్రస్థానం. మనదేశంలో ఒకపుడు గంటకు 10 కిలోమీటర్లు ప్రయాణించే రైళ్లు నేడు గంటకు 180 నుండి 200 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తున్నాయి. మున్ముందు ఈ వేగం ఏ శిఖరాలకు చేరుతుందో ఊహించలేం. ఈ వేగాన్ని మరింత పెంచే పనిలో రైల్వే యంత్రాంగం పడింది. హై స్పీడ్ రైళ్లు, ట్యూబ్ రైళ్లు, రోప్ రైళ్లు, అందుబాటులోకి వస్తున్నాయి. అంటే అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే హైదరాబాద్ నుండి నాగ్‌పూర్‌కు రెండు మూడు గంటల్లో ప్రయాణించగలగడం, ఢిల్లీకి కనీసం 12 గంటల్లో చేరుకోవడం , ఇటు హైదరాబాద్ నుండి విజయవాడకు రెండు గంటలు, విశాఖపట్టణానికి ఐదు గంటలు, హౌరాకు 12 గంటల్లో చేరుకునేలా గంటకు 350 కిలోమీటర్లు నుండి 420 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించే ఈ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి.
విలాశవంతమైన ప్రాచీనమైన సుంపన్నమైన చరిత్ర భారతీయ రైల్వేలకు ఉంది. ప్రత్యేకమైన టూర్లలోనే కాదు, సాధారణ రైలులో కూర్చున్నా భారతదేశ ఇతిహాస సౌందర్యాన్ని వీక్షించేందుకు అవకాశం ఇస్తుంది.
సాధారణ రైళ్లతో పాటు రైల్వే శాఖ స్టీమ్ ఇంజన్‌తో నడిపే ప్యాలస్ ఆన్ వీల్స్, సైన్స్ ఎక్స్‌ప్రెస్, హెల్త్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. పూర్వం మహరాజులు, వైస్రాయిలు ఉపయోగించిన రైలు పెట్టెలనే విలాసవంతంగా పునరుద్ధరించడం ద్వారా వారివారి రాచరిక వారసత్వపు వాతావరణాన్ని తిరిగి సంతరించుకునేలా ఈ రైళ్లు చేశాయి. ముత్యాల్లా తెల్లగా ఉండి, వాటి బాహ్యరూపం గోడలపైనా బర్మా టేక్‌తో చేయబడిన పలకలు, క్రిస్టల్‌తో చేసిన షాండ్లియర్లు అద్భుతమైన ముదురు రంగు వస్త్రాల వైభవం ఉట్టిపడేలా చేస్తాయి. నిద్రించడానికి మహత్తరమైన గదులు, భోజన శాల, తీరిక సమయాల్లో కూర్చోవడానికి వసారా, గ్రంథాలయం, రుచికరమైన అంతర్జాతీయ స్థాయి వంటకాలు, యూనిఫారంలో ఉండే సేవకులు, ఇవన్నీ ప్రయాణీకులకు గట్టి నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్గిస్తాయి.
వాస్తవానికి భారతీయ రైల్వేలకు ధీటైన మరో రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే లేదు. మనకంటే ఎక్కువ నెట్‌వర్కు , మనకంటే ఎక్కువ మందిని రవాణా చేసే అవకాశం అటు చైనాలోనూ, రష్యాలోనూ ఉన్నా, సౌకర్యంలోనూ, సదుపాయంలోనూ, విశాలమైన కోచ్‌ల విషయంలోనూ భారతదేశ రైల్వే వ్యవస్థదే అగ్రపీఠం. ఎందుకంటే 1862లోనే రెండంతస్థుల రైలు మనదేశంలో నడిచింది.
తొలి బుల్లెట్‌రైల్ ప్రాజెక్టు
భవిష్యత్‌లో దేశంలో ఎన్నో నగరాల మధ్య బుల్లెట్ రైళ్లు నడుస్తాయని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ముంబై- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులకు ప్రధాని నరేంద్రమోదీతో పాటు జపాన్ ప్రధాని షింజో అబేలు శంకుస్థాపన చేశారు. ఈప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రస్తుత అంచనాల ప్రకారం 98 వేల కోట్లు. అయితే రానున్న రోజుల్లో ఈ వ్యయం లక్షన్నర కోట్లకు పెరుగుతుందని అంచనా. ముంబై నుండి అహ్మదాబాద్ వరకూ ఉన్న 508 కిలోమీటర్ల దూరం వరకూ గంటకు 300 నుండి 350 కిలోమీటర్లు వేగంతో నడిచే బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తాయి. పనులు వచ్చే ఏడాది ప్రారంభం
అవుతాయి. 2023 నాటికి బుల్లెట్ రైళ్లు తమ సేవలు అందిస్తాయి. వాస్తవానికి జపాన్‌లో బుల్లెట్ రైళ్లు 1964 నుండి సేవలు అందిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం జపాన్ 90వేల కోట్ల మేర రుణాన్ని భారత్‌కు అందిస్తుంది. ఇందుకు భారత్ నూటికి 10 పైసల వడ్డీ చెల్లిస్తుంది. ప్రస్తుతం ఏడు గంటలు పడుతున్న ఈ ప్రయాణం బుల్లెట్ రైళ్ల రాకతో రెండు గంటల్లో చేరుకునే వీలు కలుగుతుంది. ఇదే తరహా రైలు మార్గాలు హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్- విశాఖపట్టణంలతో పాటు ఢిల్లీ-ఆగ్రా- పాట్నా, చెన్నై - బెంగళూరు- తిరువనంతపురం లైన్లలోనూ నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇలాంటి రైళ్ల రాకతో భారతదేశంలో గత వంద సంవత్సరాల్లో జరగని అభివృద్ధి జరగనుంది. ఈ భారీ ప్రాజెక్టుతో వేగవంతమైన రవాణా వ్యవస్థను నెలకోల్పడంతో పాటు ఉద్యోగ కల్పనకు ఆస్కారం లభిస్తుంది. కాలుష్యరహితం అయిన ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు జీవితాల్లో కీలకంగా మరబోతోంది. ఇప్పటికే చైనా గోల్డెన్ ఫోనిక్స్, డాల్ఫిన్ బ్లూ పేరుతో అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైళ్లను నడుపుతోంది. ఇవి గంటకు 420 కిలోమీటర్లు వేగంతో వెళ్తాయి. రెండు రైళ్లు పట్టాలపై చెరోవైపు ప్రయాణించినపుడు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చైనా చర్యలు తీసుకుంది. అంటే ఇలాంటి రైలు ద్వారా హైదరాబాద్ నుండి విజయవాడకు గంటన్నరలోనూ, విజయవాడ నుండి వైజాక్‌కు గంటన్నరలోనూ ప్రయాణించవచ్చు. హౌరాకు ఆరు గంటల్లో చేరుకునే వీలుంది.
చరిత్ర మార్చే బుల్లెట్ రైళ్లు
అహ్మదాబాద్ - ముంబై మధ్య ప్రతిపాదిత బుల్లెట్ రైలు మూడు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. మహారాష్టల్రో 156 కిలోమీటర్లు, గుజరాత్‌లో 351 కిలోమీటర్లు, దాదర్ నాగర్ హవేలీలో రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. నిర్మాణపనుల వల్ల 20వేల మందికి, రైళ్లనిర్వహణ వల్ల 4వేల మందికి, పరోక్షంగా మరో 20వేల మందికి ఉపాధి కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అహ్మదాబాద్ - ముంబైల మధ్య 12 స్టేషన్లు ఉంటాయి. అన్నింటిలో ఆగితే బుల్లెట్ రైలు రెండు గంటల 58 నిమిషాల్లో చేరుకుంటుంది. ఒక వేల కేవలం 4 స్టేషన్లలో మాత్రమే ఆగితే రెండు గంటల ఏడు నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రెండు స్టేషన్లలో తొలి దశలో 35 బుల్లెట్ రైళ్లు నడుపుతారు. అంటే దాదాపు 70 ట్రిప్పులు ఈ రైళ్లు నడుస్తాయి. రానున్న రోజుల్లో రైళ్ల సంఖ్యను 105కు పెంచుతారు. ఇందుకోసం 825 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. 21 కిలోమీటర్ల పొడవైన సొరంగాన్ని బోల్సర్-బంద్ర కుర్ల కాంప్లెక్స్ వరకూ నిర్మించాల్సి ఉంటుంది. ప్రతి రైలులో 10 బోగీలుంటాయి. అందులో 750 మంది కూర్చేనే సౌకర్యం ఉంటుంది. ఈ బోగీల సంఖ్యను డిమాండ్‌కు అనుగుణంగా రానున్న రోజుల్లో పెంచుతారు.
భారత్‌లో సాధ్యమా?
తరచూ ప్రమాదాలను చవిచూసే భారతీయ రైల్వేలకు బుల్లెట్ రైళ్లు భారమా అనే వారు లేకపోలేదు. అందుకు తగ్గట్టు ట్రాక్‌లను పటిష్టంచేసుకుంటే ఏదైనా సాధ్యమేనని భారతీయులే అనేక అంశాల్లో రుజువు చేసుకున్నారు. ప్రపంచానే్న శాశించే స్థాయికి అంతరిక్షరంగం ఎదిగినట్టు రైల్వే యంత్రాంగం సైతం ఎదుగుతుందనే విశ్వాసం అందరిలో ఉంది.
ఘనమైన చరిత్ర
సామాన్యులకు ఉన్న అసమాన్య రవాణా సౌకర్యం భారతీయ రైల్వేలు. ప్రపంచంలో ఎంతో విశాలంగా కనిపించే కోచ్‌లు ఉన్న ఏకైక రైల్వే వ్యవస్థ మనదే. లక్ష 20వేల కిలోమీటర్లు మేర ట్రాక్ నెట్‌వర్కుతో రోజుకు రెండు కోట్ల మంది ప్రయాణీకులను చేరవేస్తున్న వ్యవస్థ భారతీయ రైల్వే. ప్రపంచంలో పొడవైన రైల్వే ట్రాక్ నెట్‌వర్కు ఉన్న దేశాల్లో తృతీయస్థానంలో ఉంది. దాదాపు ఏటా రైల్వేలకు 1.75 లక్షల కోట్ల ఆదాయం లభిస్తోంది. ఇప్పటికే రైల్వేల్లో 14 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొంకణ్‌తో కలిపి 17 రైల్వే విభాగాలున్నాయి. సగటున రోజుకు రెండు కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది. భారతదేశంలో రైల్వేల కోసం ఒక ప్రణాళికను 1832లో తీసుకువచ్చారు. అయితే ఆ ప్రణాళికలో 10ఏళ్ల పాటు ఎలాంటి కదలిక రాలేదు. 1844లో అప్పటి గవర్నర్ జనరల్ వినె్సంట్ హర్డింగ్ రైల్వేలలో ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులను అనుమతించారు. ఇదే గాక రెండు రైల్వే సంస్థలు బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ, ఈస్టు ఇండియాకంపెనీలను స్థాపించి కొత్త పెట్టుబడిదారులు ముందుకు రావాలని కోరాడు. భారతదేశంలో మాత్రం మొదటి రైలును 1851 డిసెంబర్ 22న నడిపారు. ఇది రూర్కీలో నిర్మాణ సామగ్రిని తరలించడానికి ఉపయోగించారు. 1853 ఏప్రిల్ 16న మొదటి ప్రయాణీకుల రైలు బోరిబందర్, ముంబై, థానేల మధ్య నడిపారు. దీని దూరం 34 కిలోమీటర్లు. సాహిబ్, సుల్తాన్, సింధ్ పేరిట ఉన్న ఇంజన్లు ఇందుకు వినియోగించారు. తర్వాత క్రమేపీ రైల్వే లైన్లు పెరుగుతూ పాతికేళ్లలో 14,500 కిలోమీటర్ల ట్రాక్ పెరిగింది. 1895లో భారతదేశంలోనే ఇంజన్ల తయారీ మొదలైంది. వెనువెంటనే ఉగండా నుండి కాంట్రాక్టు రావడంతో భారతీయ ఇంజనీర్లు ఉగండా రైల్వే నిర్మాణంలో సహకరించారు.
ఆ రైళ్లు ప్రత్యేకం
వేడి నుండి తప్పించుకోవడానికి బ్రిటిష్ కాలనీ వారు కొండ ప్రాంతాలకు వెళ్లడానికి ఎక్కువ ఇష్టపడేవారు. అక్కడకు త్వరగా చేరుకోవాలంటే బుల్లి రైళ్లు ఉండాలని భావించి అందుకు రైలు మార్గాలను నిర్మించే ప్రయత్నం చేశారు. నీలగిరి కొండలకు బుల్లి రైలు మార్గం ఉంది. అలాగే అరకు, గతంలో నౌపాడ నుండి పర్లాకిమిడి వరకూ ఈ రైలు మార్గాలు బ్రిటిష్ వారు నిర్మించినవే. భారతదేశంలో అతి మెల్లగా నడిచే రైలు నీలగిరి రైలు. ఇది గంటకు 10 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. కూనూరు వరకూ కొండల్లో టీ, కాఫీ తోటల మధ్య 1712 మీటర్లు ఎత్తులో ప్రయాణిస్తుంది. ప్రతి 12 మీటర్ల దూరానికి ఒక మీటరు ఎత్తుకు వెళ్తూ 208 మలుపులు, 13 సొరంగాల గుండా ప్రయాణిస్తుంది. అలాగే డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే 22.5 మీటర్లకు ఒక మీటరు చొప్పున క్రమంగా అధిరోహిస్తూ కేవలం రెండు అడుగులు దూరంగా ఉన్న పట్టాలపై 2258 మీటర్ల ఎత్తులో ఉన్న ఘుమ్ స్టేషన్‌కు చేరుకుంటుంది. అలాగే బ్రిటిష్ పరిపాలనలో భారతదేశానికి వేసవికాలపు రాజధానిగా 2200 మీటర్లు ఎత్తులో ఉన్న సిమ్లాను చేరుకోవడానికి రైలు 102 సొరంగాలు ప్రయాణించి, 869 వంతెనలు దాటి, కేవలం 95 కిలోమీటర్లులో 919 వంపులు తిరిగి వెళ్తుంది. పెద్ద కిటికీల నుండి ఫైబర్ గ్లాస్‌తో చేసిన పైకప్పు నుండి అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు. ఆ తరహా రైలును ఇటీవలె వైజాగ్ నుండి అరకు వరకూ ప్రారంభించారు.
ఇదే సందర్భంగా మరో రైలు గురించి కూడా ప్రస్తావించుకోవల్సిందే. ఫెయిర్ క్వీన్. ప్రపంచంలోకెల్లా ఇప్పటికీ పనిచేస్తున్న అత్యంత పురాతనమైన స్టీమ్ ఇంజన్ ఫెయిర్ క్వీన్. కిట్సస్, థామ్సన్, హెవిట్‌సన్‌ల ఇంజనీరింగ్ ఫర్మ్ ద్వారా ఇంగ్లండ్‌లోని లీడ్‌స్‌లో 1855వ సంవత్సరంలో ఈ ఇంజన్‌ను నిర్మించారు. దీనిని కొల్‌కటా సమీపంలోని హౌరా స్టేషన్ నుండి రాణిగంజ్ వరకూ టపాతెచ్చే రైళ్లను తీసుకువెళ్లేది. 1909 తర్వాత దానిని ఆపివేసి న్యూఢిల్లీలోని నేషనల్ రైల్వే మ్యూజియంలో ఉంచారు.
జీవన రేఖ
బ్రిటిష్ వారు రైల్వే లైన్లు పెంచిన కొద్దీ భారత రాజసంస్థానాలు కూడా సొంత రైల్వే మార్గాలు ప్రారంభించాయి. 1901లో రైల్వే బోర్డును స్థాపించినా, విధాన నిర్ణయాధికారాలు మాత్రం బ్రిటిష్ వైస్రాయి జనరల్ లార్డ్ కర్జన్ వద్దనే ఉండేవి. అప్పట్లో రైల్వే బోర్డు ఆర్ధిక - పరిశ్రమల శాఖ ఆధీనంలో పనిచేసేది. 1908లో మొదటిసారిగా విద్యుత్ ఇంజన్ల వాడకం మొదలైంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు దేశం వెలుపలి అవసరాలకూ రైల్వేలను ఉపయోగించారు. యుద్ధం కారణంగా రైల్వే వ్యవస్థ దెబ్బతిని మూలకు చేరడంతో 1920లో దానికోసం ప్రత్యేక నిధులను కేటాయించి పునరుద్ధరణకు పూనుకున్నారు. ఆ విధంగా ప్రత్యేక బడ్జెట్ ప్రతిపాదన మొదలైంది. 1947లో స్వాతంత్య్రం సిద్ధించిన నాటికి అత్యధిక రైల్వేలు పాకిస్థాన్ సరిహద్దులోనే ఉండిపోయాయి. ఆ తర్వాత రైల్వే శాఖ అనేక పరిణామాలు చెందింది. 1947లో స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో 47 రైల్వే సంస్థలు పనిచేస్తున్నాయి. 1951లో ఈ సంస్థలన్నీ కలిపి భారతీయ రైల్వే పేరిట ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే సంస్థల్లో ఒకటిగా ఆవిర్భవించింది. 1985 నాటికి అంత వరకూ ఉన్న ఆవిరి యంత్రాలకు బదులుగా డీజిల్, విద్యుత్ యంత్రాలు ప్రారంభం అయ్యాయి. 1995 నాటికి రైల్వే వ్యవస్థ మొత్తం కంప్యూటరీకరించబడింది. దేశంలో కశ్మీర్ నుండి కన్యకుమారి వరకూ , అస్సాం నుండి రామేశ్వరం వరకూ ఇలా దేశంలోని అన్ని ప్రాంతాలనూ కలుపుతూ రైల్వే వ్యవస్థ పనిచేస్తోంది. భారతదేశంలో రైళ్ల రాక ఒక శకపు అంతాన్ని, మరో శకపు ఆరంభాన్ని సూచిస్తుందని అంతా అంటుంటారు. వాస్తవానికి ఏ ఐక్యతా ప్రణాళికా ఇంత వరకూ సాధించలేనంతగా భారతీయ రైల్వేలు సాధించి దేశాన్ని ఐక్యపరిచిందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే జమ్మూలో హిమాలయాల అంచున రైలు ఎక్కి దేశంలో దక్షిణ ప్రాంతంలో చిట్టచివర ఉన్న కన్యాకుమారి దగ్గర దిగిపోవచ్చు. అదే అరేబియా మహా సముద్రం, హిందూ మహా సముద్రం కలిసే ప్రాంతం అంటే దాదాపు 13 రాష్ట్రాల గుండా 3751కిలోమీటర్లు దూరం ప్రయాణించి రైలులో 66 గంటలు గడిపేయవచ్చు. స్లీపర్ బెర్త్‌తో కలిపి మహా అయితే ఇందుకు అయ్యే వ్యయం 600 రూపాయిలు. అనేక సంస్కృతుల నుండి వచ్చే స్నేహపూర్వకమైన మాటకారులైన ప్రజలను కలుసుకునే బృహత్తర అవకాశం దక్కుతుంది. ఇంత కంటే చౌకగా ఇలాంటి అవకాశం ప్రపంచంలో ఎక్కడా లభించనే లభించదు.
టెక్నాలజీలో అగ్రపీఠం
లక్ష కిలోమీటర్లు పైగానే ట్రాక్ నెట్ వర్కు ఉన్న భారతీయ రైల్వేలకు 7500 రైల్వే స్టేషన్లున్నాయి. 3 లక్షల వేగన్లు, 75వేల కోచ్‌లు, 10వేల ఇంజన్లు రైల్వే శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగులున్న సంస్థల్లో భారతీయ రైల్వేలది రెండోస్థానం. ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులు పనిచేస్తున్న వ్యవస్థ చైనా మిలటరీదే. అలాగే సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలోనూ రైల్వేలది అగ్రస్థానమే. ముందస్తు ప్రయాణానికి ఆన్‌లైన్ బుకింగ్, ఆన్‌లైన్ రిజర్వేషన్‌లు, ఆన్‌లైన్ ఆహార బుకింగ్, రైల్వే స్టేటస్ ఆన్‌లైన్‌లో తెలుసుకునేందుకు కూడా ఐటి సేవలను అందిస్తోంది. దాంతో పాటు రైళ్ల రాకపోకలు, రైళ్లలో ఉన్న ఖాళీల బెర్త్‌ల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో అందిస్తోంది. రైల్వేల నిర్వహణకు సంబంధించి అన్ని స్థాయిల్లోనూ ఆ శాఖ సంపూర్ణంగా టెక్నాలజీని వినియోగిస్తోంది. చివరికి ఆటోమెటిక్ క్రాసింగ్, ఆటోమెటిక్ సిగ్నల్ వ్యవస్థ, యాక్సిడెంట్ కంట్రోల్ సిస్టం, ఆటోమెటిక్ ట్రాక్ లైన్ క్లియరెన్స్ సిస్టం వంటి వాటితో పాటు ఇంజన్లు సైతం అత్యాధునికతను సంతరించుకున్నాయి. బుల్లెట్ రైళ్ల రాకతో మరో ఐదేళ్లలో భారతీయ రైల్వేల విశ్వరూపాన్ని కళ్లారా చూడబోతున్నాం. దేశ ఆర్ధిక గతిని మార్చే ఈ బుల్లెట్ రైళ్లు మనుషులనే కాదు, సరకులను కూడా సకాలంలో రవాణా చేసి మరింత మేలు చేసే రోజు ఎంతో దూరంలో లేదు కదా.... *

భారతీయ రైల్వేల విశిష్టత ఇంతా అంతా కాదు. అలా చెప్పుకుంటూ పోతే కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు చెందిన రైల్వే స్టేషన్లు వరుసగా చూస్తే భవానీ మాండి. ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దుల్లో ఉంటుంది. నవాపూర్ ఇది మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఉంది. జరాయ్‌కెలా ఇది ఒరిస్సా, జార్ఘండ్ సరిహద్దుల్లో ఉంది. ఒడిసా, జార్ఘండ్ సరిహద్దుల్లో ఉన్న మరో రైల్వే స్టేషన్ బార్బిల్ . దేశంలో అతి చిన్న పేరున్న రైల్వే స్టేషన్‌గా ఇట్ పేరుగడించింది. ఇది ఒడిసాలోని ఝార్స్‌గూడ సమీపంలో ఉంది. అలాగే అతి పెద్ద పేరున్న రైల్వే స్టేషన్ వెంకట నరసింహరాజు వారి పేట. ఇది అరక్కోణం - రేణిగుంట స్టేషన్ల మధ్య ఉంది. భారతదేశంలో అత్యంత తక్కువ దూరం ప్రయాణించే రైలు నాగపూర్ నుండి అంజి వరకూ ఉంది. ఈ రైలు మార్గం దూరం కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే. అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు కన్యాకుమారి నుండి దిబ్రూఘడ్ టౌన్ వరకూ ఉంది. ఇది ఏకంగా 4283 కిలోమీటర్లు దూరం ఉన్న ప్రయాణం. దీనిని 80 గంటల్లో వివేక్ ఎక్స్‌ప్రెస్ చేరుకుంటుంది. అలాగే అత్యంత తక్కువ దూరం ఉన్న అర్బన్ రైల్వే స్టేషన్లు హైదరాబాద్‌లోని సఫిల్‌గూడ- దయానందసాగర్‌లు ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం కేవలం 170 మీటర్లు మాత్రమే. భారతదేశంలో ఉన్న అత్యంత పొట్టి రైలు కోసాంట్ ఉమర్‌పడ వరకూ ప్రయాణిస్తుంది , దీనికి రెండు బోగీలు మాత్రమే ఉంటాయి. భారతదేశంలో తరచూ ఆలస్యంగా వచ్చే రైలుగా గౌహతి ఎక్స్‌ప్రెస్ పేరుగడించింది. ఇది ప్రతిరోజు దాదాపు గంట నుండి 15 గంటలు ఆలస్యంగా వస్తుంది. ఈ రైలు గౌహతి నుండి తిరువనంతపురం వరకూ వెళ్తుంది. అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫారం ఉన్న స్టేషన్ ఖరగ్‌పూర్ , ఈ ప్లాట్ ఫారం పొడవు 1072.5 మీటర్లు. దేశంలో మూడు గేజ్‌ల పట్టాలున్న ఏకైక అతి పెద్ద స్టేషన్ న్యూ జల్‌పాయ్ గురి, అలాగే అత్యథిక మార్గాలను కలిపే అతి పెద్ద జంక్షన్ మథుర.*
*
ఈ రైళ్ల వేగం తెలుసా!
తొలి బుల్లెట్ రైలుకోసం తపన పడుతున్న మనం ఇప్పటికి మనదేశంలో అతివేగంగా వెళ్లే రైలు వేగాన్ని తెలుసుకోవాలి. న్యూఢిల్లీ-ఆగ్రా మధ్య నడుస్తున్న హైస్పీడ్ రైలు వేగం గంటకు 160 కిలోమీటర్లు మాత్రమే. ఇక ప్రపంచంలో అత్యధిక వేగంతో నడిచే బుల్లెట్ రైలు ఇటలీలో ఉంది. ఎజివి ఇటలో అనే ఈ రైలు గంటకు 574.8 కిలోమీటర్ల వేగంతో పరుగుపెడుతుంది. చైనాలోని హార్మనీ సిఆర్‌హెచ్ 380ఎ వేగం గంటకు 486.1 కి.మీ కాగా షాంఘై మాగ్లెవ్ రైలు వేగం గంటకు 430 కి.మి. ఇక జర్మనీలోని సీమెన్స్ వెలరో ఇ ట్రెయిన్ వేగం గంటకు 400 కి.మీ. కాగా స్పెయిన్‌లోని టాల్గో రలు వేగం గంటకు 365 కి.మీ.
*

జపాన్ ఆదర్శం
తొలి బుల్లెట్ ప్రతిపాదన తీసుకువచ్చినది, నడిపినది జపాన్. 1930లో తొలిసారిగా చేసిన ప్రతిపాదన మరో నాలుగేళ్లకు అమలు చేసింది. బుల్లెట్ రైలు అన్నది ఓ నిక్‌నేమ్ మాత్రమే. నిజానికి వీటిని హైస్పీడ్ రైళ్లుగానే సాంకేతికంగా పిలుస్తారు. ప్రపంచంలో హైస్పీడ్ రైళ్లను అత్యంత భద్రంగా నడుపుతున్న చరిత్ర జపాన్ సొంతం. కనీసం 10 వందల కోట్లమంది ఇప్పటివరకు జపాన్ బుల్లెట్ రైళ్లలో ప్రయాణించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ రైలు ప్రమాదాలవల్లకాని, బుల్లెట్ రైళ్ల సాంకేతిక లోపాల వల్ల కానీ మరణించలేదు. జపాన్‌కు చెందిన 0 సిరీస్ రైలు షిన్‌కన్‌సెన్ తొలి హైస్పీడ్ రైలు. అది గంటకు 130 మైళ్లవేగంతో నడిచింది. చక్రాలు లేకుండా పట్టాలపై అయస్కాంత శక్తితో నడిచే షాంఘై-మాగ్లెవ్ రైలు గంటకు 268 మైళ్లవేగంతో నిండా ప్రయాణికులతో నడుస్తుంది. అత్యంత వేగంగా నడిచే నాన్‌మాగ్లెవ్ రైలు ఫ్రాన్స్‌లో సేవలు అందిస్తోంది. 2007లో అది అందుబాటులోకి వచ్చింది. ఎస్‌ఎన్‌సిఎఫ్ టిజిఎఫ్ హైస్పీడ్ రైలు గంటకు 35.7 మైళ్లవేగంతో నడుస్తుంది. ఇది చక్రాలతోనే నడవడం ప్రత్యేకత. సొరంగ మార్గాలు, సముద్రగర్భంలోని టనె్నళ్ల నుంచికూడా ఇవి నడుస్తూ సేవలు అందిస్తున్నాయి. ఒక భూసొరంగంలో ప్రయాణిస్తూ బయటకు వచ్చేటప్పుడు అవి విడుదల చేసే శబ్దం సూపర్‌సోనిక్ యుద్ధ విమానం దూసుకుపోయేటప్పుడు వచ్చే శబ్దం స్థాయిలో ఉంటుంది. ఈ శబ్దం మన చెవులను దెబ్బతీయకుండా ఉండే సాంకేతిక పరిజ్ఞానాన్ని జపాన్ సముపార్జిస్తోంది. ప్రపంచంలో భద్రమైన, పటిష్టమైన, నాణ్యమైన బుల్లెట్ రైళ్ల తయారీ, వాడకంలో జపాన్‌దే అగ్రస్థానం. అయితే వేగంలోను, చౌకగాను బుల్లెట్ రైళ్లను అందించగలగడంలో చైనా ముందుంది. మనం ఇప్పుడిప్పుడే హైస్పీడ్ రైలుకోసం తపన పడుతున్నామాట. కానీ మనకు అందనంత దూరంలో ఆ రెండు దేశాలు దూసుకుపోయాయి.
*

బి వి ప్రసాద్