ఈ వారం స్పెషల్

చైతన్య దీప్తి దీపావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబింపజేసేవి పండుగలు. ధర్మ, అర్థ, కామ, మోక్షములనే నాలుగు పురుషార్థములలో, అర్థ కామములను ధర్మబద్ధముగా అనుభవించాలని, అదే మోక్షాన్ని ప్రసాదిస్తుందన్నదే పండుగలలోని పరమార్థం. నియమబద్ధమైన జీవితం సుఖశాంతులను ప్రసాదిస్తుందని చెప్పేవి మన పండుగలు. భారతీయ సంస్కృతిలోని సామరస్యాన్ని, సమైక్యతను తెలిపేవి పండుగలు. మానవులను సంస్కరించి, దైవప్రీతి, పాపభీతి, సంఘ నీతిని అలవరచి ఆచరణలో ప్రకటింపజేసేవి - పండుగలు.
నైతిక, ధార్మిక, సామాజిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక విలువలను అలవరచడానికి, పోషించడానికి అవకాశం కలిగించేవి, భారతీయ పండుగలు పర్వదినములు. ఎనె్నన్నో పండుగలను వేడుకగా జరుపుకుంటారు భారతీయులు. అందులో, కుల మత వర్ణ వర్గ భేదములు లేకుండా, భారతీయులందరూ ఒకే కుటుంబ పరివారమనే విధంగా, ఆనందమయంగా జరుపుకునే పండుగ - దీపావళి.
మనిషిలోని ఈర్ష్య అసూయ ద్వేషం స్వార్థం అధర్మం అవినీతి అనేవి చీకటికి సంకేతం. ప్రేమ, మంచితనం, సత్ప్రవర్తన, ధర్మం అనేవి వెలుగుకు సంకేతం. చీకటిని పారద్రోలి జ్ఞానవెలుగును అనుగ్రహించి, జీవితానికి చైతన్యదీప్తి నిచ్చే పండుగ - దీపావళి.
ప్రబోధమనే ప్రమిదలో వైరాగ్యమనే తైలాన్ని పోసి, అందులో భక్తి అనే వత్తిని వెలిగించి జ్వలింపజేస్తే, అది విశ్వప్రేమను, ప్రేరేపించి విశ్వకల్యాణానికి దోహదం చేస్తుంది. ఇదే దీపాల పండుగ దీపావళికి స్ఫూర్తి.
అపరిమితమైన కాలంలో, పరిమితమైన జీవిత కాలంలో మనిషి మనిషిగా పుట్టటం ఒక వరం, పూర్వజన్మ ప్యుం. విచిత్రమైన అనుభవాలతో నిండి, అవధుల్లేని ఆలోచనలతో నిండిన మనిషి జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అగాధాలు మలుపులు చోటు చేసుకుంటాయి. సృష్టిలోని ఇన్ని ప్రాణుల్లోను, ప్రకృతి నుంచి అనుభవాన్ని పొంది తన మార్గాన్ని మార్చుకోగలిగినవాడు, మార్చుకోవలసిన వాడు - మనిషి. మార్పు రాకపోతే చదివినవి చూస్తున్నవి వింటున్నవి అనుభవిస్తున్నవి ఏవీ ఉపకరించవు. జీవితంలో మహోన్నత స్థానానికి ఎదగవలసిన మనిషి, దిగజారిపోతాడు. చైతన్య రహితుడై స్థాణువులా అయిపోతాడు. బాల్యంలోను, వయస్సులోను, వయస్సు మీరినా ఎంత వయస్సు వచ్చినా, చేసిన తప్పులే మళ్లీమళ్లీ చేసుకుంటూ పోతున్నాడు.
యాంత్రిక యుగంలో ఉన్న అటువంటి మానవుడు, జీవితంలో ఎదురయ్యే సమస్యలతో నిరాశా నిస్పృహ చెందక ఓర్పుతో మొక్కవోని ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ‘శక్తి’ని కూడగట్టుకొని, తనలో ఉండే కామక్రోధాదులనే ఆరు విధములైన అజ్ఞాన తిమిర శత్రువులను సాత్విక సామరస్యమనే విజ్ఞాన జ్ఞానజ్యోతిచే పారద్రోలి, జీవితాన్ని సుఖమయం సుసంపన్నం చేసికోవాలనే ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించి, ఆనందమయ జీవన సరళికి మార్గాన్ని దర్శింపచేసే వెలుగుల పండుగ- దీపావళి.
అగ్ని ఆరాధనకు ప్రతీక- దీపారాధన
‘్భ’ అంటే వెలుగు, కాంతి, దీప్తి, అగ్ని అనే అర్థాలున్నాయి. అగ్నిని అనగా దీపమును ఆరాధించేవారు భారతీయులు. జ్ఞాన వెలుగును అనగా సత్యానే్వషణతో జీవితాన్ని చరితార్థత నొందించుకునేవారు భారతీయులు. కనుకనే మన దేశంలో ప్రతి ఇంట్లో దీపారాధన చేస్తాము. ఏ కార్యక్రమాన్నైనా దీపారాధన చేయకుండా ప్రారంభించము. దీపారాధన ఒక యజ్ఞం - జీవిత యజ్ఞం. యజ్ఞానికి సూక్ష్మరూపం - దీపారాధన. ‘ఉద్దీప్యస్య జాతవేదో పఘ్నన్ - నిర్‌ఋతిం మమ’ ఓ అగ్నిదేవా - నా పాపములను పోగొట్టి నాకు వెలుగు, వివేకమును ప్రసాదించమని, అగ్నిని భారతీయులు ప్రార్థిస్తారు.
‘దీప’ పదానికి వ్యుత్పత్తి, విస్తృతార్థములు
దీపావళి అంటే దీపపంక్తి. దీపముల వరుస అని అర్థం. దీపావళి ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు వస్తుంది. దీనినే దీపోత్సవమనే పేరుతో పండుగగా ఆనందోత్సాహాలతో చేసుకుంటారు. ఇప్పుడు ‘దీప’ పదానికి అర్థం తెలుసుకుందాం. ‘దీప్యతే అనేన’ అని వ్యుత్పత్తి. అంటే ఏమిటి? దేనిచేత సమస్తము ప్రకాశింప చేయబడునో, దానికి దీపమని పేరు. అగ్ని, జ్యోతిస్సు, ప్రకాశము, కాంతి, జ్ఞానము, వివేకము - ఇవన్నీ దీప పదమునకు అర్థము.
పరమాత్మ లేకపోతే, జగత్తు లేదు. కనుక పరమాత్మ, ప్రప్రథమ దీపము. ‘నతత్ర సూర్యోభాతి న చంద్ర తారకమ్ యస్య భాసా సర్వమిదం విభాతి’ ఆ పరమేశ్వర రూప దీపముతోనే ప్రపంచము, సూర్య చంద్ర నక్షత్రాదులు గూడా ప్రకాశిస్తాయి. కనుక, సూర్యుడు చంద్రుడు, నక్షత్రములు కూడా దీపములే.
‘తామగ్ని వర్ణాం తపసాజ్వలం తీం, వైరోచనీమ్ కర్మఫలేషు జుష్టామ్’ అని ‘లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్’ అన్నది శ్రీసూక్తమ్. ‘జయజయ వైష్ణవి దుర్గే, పార్వతి లోకైక దీపే’ అన్నాడు శివనారాయణ తీర్థులు, శ్రీకృష్ణ లీలాతరంగిణిలో. కనుక పరాదేవియైన జగజ్జనని కూడా దీపమే.
‘శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం, సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం’ రఘుకులమునకే దీపముగా కొనియాడబడేవాడు శ్రీరామచంద్రుడు.
భగవద్గీత ఏం చెప్పింది?
అగ్ని - అగ్ని, వాయువు, సూర్యుడు అని మూడు విధములైనది (అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ) వేదములు - ఋక్, యజుస్, సామ - మూడు విధములు. అగ్ని నుండి ఋగ్వేదం, వాయువు నుండి యజుర్వేదం, సూర్యుని నుండి సామవేదము ఆవిర్భవించినాయి. మూడు వేదములు అగ్ని నుండి పుట్టి లోకమున చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దివ్య దీపములు. దీపము, చీకటిని పోగొట్టి వస్తువును దర్శింపజేస్తుంది. అజ్ఞాన చీకటిని పారద్రోలే దీపము - జ్ఞాన దీపము, అని భగవద్గీత తెలుపుతోంది. ‘జ్ఞానదీపేన భాస్వతా’. అలాగే జ్ఞానాన్ని అగ్ని అని భగవద్గీత తెలిపింది. జ్ఞానముచే అజ్ఞానము నశించి ఎవరి అజ్ఞానము ఆ సూర్యుని వంటి జ్ఞానాగ్నిచే దగ్ధమగునో, ఆతనిని పండితుడంటారన్నది, భగవద్గీత. ఇవన్నీ దీపానికి విశేషార్థాలు.
వేద శబ్దావళి - దీపావళి
అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయః, మృత్యోర్మా అమృతంగమయ. అసత్యం నుండి సత్యం, చీకటి నుండి సత్యం, చీకటి నుండి వెలుగును, అజ్ఞానము నుండి జ్ఞానమును, మృత్యువు నుండి అమృతమును నాకు గల్గించమని ప్రార్థన. ఆ జ్ఞాన దీపమునే, ఈ విశ్వానికి మొదట ఇచ్చింది - వేద శబ్దములు. ఆ వైదిక అనగా వేద శబ్దావళియే - దీపావళి.
లలితా సహస్ర నామాలలో-
‘నిజభర్తృ ముఖాంభోజ చింతనాయై నమో నమః’ అన్నది లలితా సహస్ర నామములు. సదా భర్త ముఖారవింద ధ్యానముచే, తన పాతివ్రత్యముచే భర్తను స్వాధీనము గావించుకొని, ‘శివా స్వాధీన వల్లభా’ అని కీర్తింపబడుతోంది, జగన్మాత. భారతీయ సంస్కృతీ సంప్రదాయంలో, స్ర్తికి ప్రముఖ స్థానం యివ్వబడింది. అందుకే ‘ఇంటికి దీపం ఇల్లాలే’ అనే ఆర్యోక్తి వచ్చింది. అగ్ని వంటిది స్ర్తి పాతివ్రత్యం. అది దివ్యదీపము వంటిది. కనుక భారతీయ స్ర్తిలే నిజమైన దీపాలు. ఆ దీపాలే ఈ విశ్వానికి దీపావళి.
దీపావళి పండుగను అయిదు రోజులుగా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుండి కార్తిక శుద్ధ విదియ వరకు సమగ్రమైన దీపావళి పండుగగా జరుపుకుంటారు. ఐదు రోజుల పండుగ వివరాలలోకి వెళదాం.
ధన త్రయోదశి
దీనినే ‘్ధన్ తేరస్’ అని కూడా పిలుస్తారు. గృహాలను శుభ్రం చేసి, రంగురంగుల ముగ్గులు పెట్టి, వీధిలో వారి గుమ్మాలకి ఎదురుగా కూడా శుభ్రం చేసి రంగవల్లులు దిద్దుతారు. ఈనాటి నుండి దీపాలు పెట్టటం మొదలుపెడతారు. శుచి, శుభ్రత, భక్తిశ్రద్ధలు ఉన్న గృహంలోకి, దీపమున్న ఇంట్లోకి మహాలక్ష్మీదేవి వస్తుందని విశ్వాసం. అపమృత్యు భయం నివారణార్థం నువ్వులనూనెతో దీపాన్ని వెలిగించి, పూజించి ఇంటి ముందు పెడతారు. దీనినే యమదీపమంటారు. ‘్ధన్ తేరస్’ అని, త్రయోదశి నాడు కొంతైనా బంగారాన్ని కొని దీపావళి పండుగనాడు పూజలో పెడతారు. దీనికి సంబంధించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. బంగారం కొనలేక పోయినా, భక్తిశ్రద్ధలతో, సంపూర్ణ శరణాగతితో జగన్మాతను ఆరాధిస్తే, తల్లి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది.
నరక చతుర్దశి
ప్రతి పండుగ నేపథ్యంలోనూ ఒక అంతరార్థం వుంటుంది. నరక చతుర్దశి, తరువాత రోజు దీపావళి అమావాస్య. మొదటి రోజు నరకాసురుణ్ణి వధించటం, రెండవ రోజున వరుసగా దీపాలు వెలిగించటం. ఎవరికీ నరకాసురుడు? ఎందుకు వధింపబడ్డాడు. ఎవరో కాదీ నరకాసురుడు. శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తినప్పుడు, ఆయనకూ భూదేవికీ సాంగత్యమేర్పడింది. దానికి ఫలమే ఈ నరకాసురుడు - భూదేవి కుమారుడు. వాడికా విషయం తెలియదు. బ్రహ్మను గూర్చి కఠోర తపస్సు చేశాడు, దారుణమైన వరాలు అడిగి, పొందాడు. వరగర్వంతో స్వర్గం మీద దండెత్తాడు. దేవతలను హింసించి స్వర్గ్ధాపతి అయ్యాడు. యజ్ఞ యాగాది ఫలములన్నీ వాడికే చెందాలని మహర్షులను నిర్బంధించాడు, వారంగీకరించకపోతే చిత్రహింసలు పెట్టాడు. వాళ్లంతా శ్రీకృష్ణుని ప్రార్థించారు. వాణ్ణి వధించి ధర్మాన్ని నిలబెడతానన్నాడు - శ్రీకృష్ణ పరమాత్మ. సత్యభామతో సహా బయలుదేరాడు యుద్ధానికి.
నరకుని సహచరులైన మురాదులను మట్టుబెట్టాడు. అజ్ఞానమనే అంధకారానికి సంకేతమే నరకుడు. ‘నరీయతే ఇతి నరః’. ముక్తి లభించే వరకు వదలని తత్త్వం - జీవభావం. జీవుడు నరుడైతే, జీవుడికి ఉన్న అజ్ఞానం - నరకుడు. ఇదే అసుర. స్వరూపంతో రాజిల్లేది సుర, అంటే జ్ఞానం. అది లేకపోతే అసుర. అజ్ఞానంతో ఉన్న నరుడు అసురుడు. అతని నివాస స్థానం - ప్రాగ్జోతిషపురం. ప్రాక్కంటే ఏమిటి? ప్రాచీనం, ఏమిటి దాని అర్థం? పురాతనం నుంచీ మనలో ఆత్మ చైతన్య జ్యోతి ఉంది. ఎప్పుడూ ఉంటుంది. దాన్ని గుర్తిస్తే మనలో అసుర భావనలు నశిస్తాయి, మానవతా విలువలు తెలుస్తాయి, దైవ తత్త్వం అంకురిస్తుంది. ఆ వెలుగు ద్యోతకమవుతుంది. ఆ వెలుగు లేకపోతే, అసుర తత్వంతో నరకాసురులంగానే మిగిలిపోతాం.
పరమాత్మ అసుర భావాన్ని శిక్షింపదలచాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ద్వారకలో. ద్వారక అంటే ఈ శరీరమే. నవద్వారమైన పురమిది. ఇందులో ఉన్న అంతరాత్మా - శ్రీకృష్ణుడు. ‘కర్షతీతి కృష్ణః’ అసుర సంపదను తరిమేస్తాడు. దేనితో? సత్యభామ సహాయంతో. సత్యభామ అంటే? సత్యమైన ‘్భ’ -సత్యభామ. ‘్భ’ అంటే వెలుగు, దీప్తి, చైతన్యం. అనశ్వరమైన చైతన్య దీప్తి. ఆ యోగమాయా ప్రభావంతో దండెత్తి వచ్చాడు - నరకుడి మీదికి. వాడిలో పాతుకుపోయిన అసుర గుణాలను మట్టుబెట్టాడు.
ప్రాగ్‌ః జ్యోతిః షః పూర్వపు జ్యోతిని మరచినవారి పురము ప్రాగ్జోతిష పురము. ప్రకృతి వాంఛలకు ప్రభావితులై అధర్మవర్తనులై దుష్కృత్యములు చేసే వారందరూ నరకులే, అని అందరిలో ఉన్నది ఒకే చైతన్యం అన్న తత్త్వాన్ని తెలిసికొన్నవాడు నరుడని చెప్తుంది, నరక చతుర్దశి. ప్రాగ్జ్యోతిషపురం అనేది నరకుని రాజధాని. అంటే జ్యోతిర్మయమునకు ముందున్న అంధకార స్థితి. కనుక నరకుడంటే అజ్ఞానాంధకారంలో ఉండి అధోగతి పాలైన నరుడు.
వశిష్ఠ మహర్షి శాపం
నరకుడు కామ రూప దేశాన్ని చాలా కాలం పరిపాలించాడు. ద్వాపర యుగంలో నరకుడికి మరో రాక్షసునితో సఖ్యత ఏర్పడింది. ఆ ప్రభావంతో నరకుడు ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ట మహర్షి ప్రాగ్జోతిష పురంలోని కామాక్యా దేవిని పూజించటానికి వెడుతుంటే, ఆలయం తలుపులు మూయించాడు. ‘వినాశకాలే విపరీత బుద్ధిః’ దానికి కోపించి వశిష్ఠుడు ‘నీ జన్మదాత చేతిలోనే మరణిస్తావు’ అని శపించాడు, నరకాసురుణ్ణి.
సత్యాకృష్ణులు
మాయను జయించి, మనస్సును స్వాధీనం చేసుకొన్న యోగీశ్వరేశ్వరుడు, పూర్ణ పుణ్యావతారుడు - శ్రీకృష్ణుడు. అందుకే ‘కృష్ణం వందే జగద్గురుం’ అన్నారు. దీనే్న అన్నమయ్య అద్భుతంగా చెప్పాడు. ‘ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు’ అన్న కురంజి రాగ ఆదితాళ కీర్తనలో.
వ్యక్తిలో స్వార్థం విజృంభిస్తే, అధర్మం ప్రబలుతుంది. సమాజంలో సమన్వయ దృష్టి, సమరస భావం మృగ్యమవుతాయి. అవి లోపిస్తే సంఘర్షణ మొదలవుతుంది. సంఘర్షణలో వ్యక్తులు అదుపు తప్పి ఎవరికి తోచినట్లు వాళ్లు, ఎవరికి బలం ఉన్నంతవరకు వాళ్లు సమాజాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారు. దుర్మార్గులది, బలవంతులది పైచెయ్యి అవుతుంది. బలహీనులు సాధుజనులు బాధలకు గురి అవుతారు. సమాజం అల్లకల్లోల మవుతుంది. అల్లకల్లోలాన్ని అణచి, వ్యక్తి స్వార్థాన్ని అదుపులో పెట్టటానికి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు, ధర్మ పునరుత్థానానికి అవతరించిన పరబ్రహ్మమే - శ్రీకృష్ణ పరమాత్మ.
అర్జునుని నిమిత్తంగా చేసి, గీతాసారాన్ని బోధించి జీవనగతిని నిర్దేశించి, హంసల ఆధ్యాత్మిక చిరు శబ్దాలు అందెల రవళులు కాగా, కనుల కొలనులలో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసంగా, విశ్వమోహన మురళీ గానంతో జీవన గీతాన్ని సుమనోహరంగా గానం చేయించి, జీవిత పరమార్థాన్ని బోధించిన కరుణామయుడు, ఆచార్యాగ్ని హోత్రుడు - శ్రీకృష్ణుడు. గరుత్మంత వాహనంపై సత్యభామా సమేతుడై వచ్చి, నరకాసురునితో యుద్ధం చేశాడు.
భూదేవి అంశ సత్యభామ- వీర శృంగారమూర్తియైనది. ఆమె ముఖం హరికి చంద్రబింబం, అరికి (నరకాసురునికి) ప్రచండ సూర్యబింబంగా గోచరించింది. ఆమె చేలాంచలం, హరికి మన్మథ కేతువు, నరకుడికి ధూమకేతువు. ఆమె రూపం హరికి అమృత ప్రవాహం, అరికి అనల సందోహం. ఆమె బాణవృష్టి హరికి హర్షదాయి, నరకునికి మహారోషదాయి. ఆ మహాసంగ్రామంలో, సత్య కరాళ కాళికా కృతి దాల్చింది. ఆమె బాణాగ్నికి నరకుని సైన్యం మలమల మాడిపోసాగింది. రోషాయుత నేత్రములతో భీకరాకారుడై నరకుడు, తనలోనున్న కామక్రోధాది ఆరు స్థితులకు ప్రతీకగా ఆరు బాణాలను, సత్య పాలిండ్లపై ప్రయోగించాడు. శ్రీకృష్ణుని వైపు మేలు చూపులతోనూ, అసురపతి నరకుని వైపు వాడి తూపులతోనూ, సత్యభామ విజృంభించింది. రణభూమిలో ఒకవైపు భర్తకు సంతోషాన్ని, మరొకవైపు నరకునికి సంతాపాన్ని కల్గించింది సత్యభామ అని, నాచనసోముడు సందర్భోచితంగా మత్త్భే వృత్తంలో వర్ణించాడు.
బంగారు ఉయ్యాల ఎక్కటానికి భయపడే బాల, ఖగపతిని అనగా అతి వేగంగా వెళ్లే గరుత్మంతుని అధిరోహించిందని, నెమళ్లకు నృత్యం నేర్పితేనే అలసిపోయే అతివ, ప్రత్యాలీఢ పాదంతో పగతురను చీల్చి చెండాడింది. ఆనాడు వీరమే, ఆడుతనంపు రూపును ధరించిందని ‘వీర శృంగార భయరసద్ర విస్మయములు కలిసి భామిని యయ్యెనో యనగ’ సత్యభామ రూపమున్నదని, ఏనాటికీ మరిచిపోలేని సత్యరూపాన్ని చిత్రించాడు, సహజకవి, పరమ భాగవతోత్తముడు - పోతన.
వశిష్ఠుని శాపం నిజమైంది. భూపుత్రుడైన నరకాసురుడు, భూదేవి అంశయైన సత్యభామ చేతితో హతమయ్యాడు. సత్యమైన చైతన్య దీప్తి - సత్యభామ. అదే శ్రీకృష్ణుని నిత్య సిద్ధమైన సంపద. దానితో నరకునిలోని అసురత్వం నశించింది. నరకుని కుమారుడైన సహదేవుని ప్రాగ్జ్యోతిష పురానికి రాజుని చేసి, ధర్మ సంస్థాపన చేశాడు. దేవతల తల్లి అదితి, అంటే పూర్ణమైన ఆకాశ తత్త్వం. ఆమె ధరించిన కుండలాలను అపహరించి తెచ్చుకున్నాడు, నరకాసురుడు. ఆ కుండలాలేమిటి? అవి ఏవో కావు - సూర్యచంద్రులే. అంటే మనః ప్రాణాలు, జ్ఞాన క్రియా శక్తులు. వాటిని రాక్షస బలంతో కాజేసినా, అవి వాడికి ఉపయోగపడవు. ఆత్మ చైతన్యంతో అవి దగ్గరవుతాయి, ఉపయోగపడతాయి. ఇది నరకాసురునిలోని ఆంతర్యం.
నరక చతుర్దశికి జ్యోతిష శాస్త్ర అన్వయం
చిత్తా నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశించిన తరువాత నరక చతుర్దశి వస్తుంది. కనుక ఆ రోజు సూర్యోదయం తులారాశిలో జరుగుతుంది. తులారాశికి అధిపతి శుక్రుడు - స్ర్తి గ్రహం. ఆ రోజు సూర్యాస్తమానం మేష రాశిలో జరుగుతుంది. అంటే మేషరాశి సూర్యాస్తమయ సమయంలో ఉదయిస్తుంది. మేషరాశికి అధిపతి- కుజుడు. కుజుడు భూపుత్రుడు. నరకుడూ భూపుత్రుడే. ఉదయం సూర్యోదయం అయ్యేంతవరకు చీకటే. జ్యోతిష శాస్త్ర ప్రకారం, పితృకారకుడు - రవి, మాతృకారకుడు - చంద్రుడు, మేష రాశిపై సూర్యుడు అనగా తండ్రి - శ్రీకృష్ణుడు చంద్రునితో - తల్లితో - సత్యభామతో సహా యుద్ధానికి బయలుదేరి, అజ్ఞానాంధకారాన్ని నశింపచేశాడన్నది, నరక చతుర్దశి, దీపావళి పురాణ గాథకు జ్యోతిష శాస్త్ర అన్వయం. నరక చతుర్దశి నాడు సూర్యోదయాత్పూర్వమే అభ్యంగన స్నానం చేసి, పరమాత్మ వెలుగును దీపారాధనలో దర్శిస్తారు. మరునాడు దీపావళి - ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ.
భగవాన్ రమణమహర్షి
మానవ శరీరం - నరకం వంటి ఇల్లు. భ్రమతో శరీరమే తాననుకునేవాడు - నరకుడు. నరకుని జ్ఞాన జ్యోతితో అణచినవాడు - నారాయణుడు, అనగా మనలోని చైతన్యం. చైతన్యానికి బాహ్య చిహ్నం దీపారాధన, దీపముల పంక్తి. ఇదే నరక చతుర్దశి, దీపావళి అని అన్నారు - భగవాన్ రమణమహర్షి.
పితృదేవతలకు తర్పణాలు
చంద్ర మండలం ఉపరితలం మీద నివసించే పితృదేవతలకు, అమావాస్య తిథి - మిట్టమధ్యాహ్నం అవుతుంది. సూర్యుడు తులారాశిలో ఉండగా వచ్చే దీపావళి అమావాస్య నాడు పితృ తర్పణాలు ఇస్తే వారికి ఉత్తమ లోకప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు పేర్కొన్నాయి. నరకంలో ఉన్న పితరులు ఈ రోజులలో బయటకు వస్తారని, వారికి కొరువులు అనగా దివ్వెలు దారి చూపిస్తాయని, నరక నివారణార్థం బాణాసంచా కాలుస్తారు. అమావాస్యనాడు పితృదేవతలకు తర్పణాలు యివ్వడం విధాయకం. ఇది తల్లిదండ్రులు లేని వారికి మాత్రమే. తల్లిదండ్రులు జీవించి ఉండగా చేయకూడదు.
తైలే లక్ష్మీ ర్జలే గంగా దీపావళి తిథౌ వసతే.. దీపావళి నాడు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, జలములలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి ఉంటారు. ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు అభ్యంగన స్నానం చేయడం వలన దారిద్య్రం తొలగడమే కాక గంగానదీ స్నాన ఫలం లభించి, నరక భయం ఉండదని పురాణాలు చెప్తున్నాయి.
వర్ధమాన మహావీరుడు: దీపావళి
జైన మత స్థాపకుడు వర్థమాన మహావీరుడు. దీపావళి అమావాస్య నాడు సిద్ధి పొందాడు. ఆ మహనీయుని దివ్య ఆత్మకు శ్రద్ధాంజలి చిహ్నంగా మహావీరుని జ్యోతి స్వరూపంలో ఆరాధించటానికి దీపావళిని జ్యోతిర్మయ పండుగగా జరుపుకుంటారు జైనులు.
బలిపాడ్యమి
దీపావళి మరునాడు బలి పాడ్యమి. బలిదాన గుణానికి సంతోషించి, వామనుడు అతనికి జ్ఞానజ్యోతిని ప్రసాదించాడు. అజ్ఞాన చీకటిని పారద్రోలి జ్ఞాన దీపాల్ని వెలిగించటానికి సంవత్సరానికి ఒకసారి బలి చక్రవర్తి పాతాళం నుంచి భూమి మీదకు వచ్చే వరాన్ని పొందాడు. ఆ కారణంగా ఈ పండుగ చేసికొంటారు.
యమ విదియ - భగినీ హస్త భోజనం
కార్తిక శుద్ధ విదియని, యమ విదియ - ‘్భగినీ హస్త భోజనం’ అని పిలుస్తారు. యమ ధర్మరాజు చెల్లెలైన యమున ఇంటికి ఈ రోజున భోజనానికి వస్తాడు. చెల్లెల్ని ఏదైనా కోరుకోమంటాడు. ఈ రోజున సోదరి చేతి వంట తినే సోదరుడికి నరకలోక ప్రాప్తి, అపమృత్యు దోషం లేకుండా వరం ప్రసాదించవలసిందిగా కోరింది. ‘తథాస్తు’ అన్నాడు యముడు. అందుకే ఈ రోజు సోదరులు, సోదరీమణుల ఇంట్లో భోజనం చేస్తారు.
‘ఏహి అన్నపూర్ణే సన్నిదేహి సదాపూర్ణే సువర్ణే మాంపాహి..’ అని ముచ్చటగా కీర్తించాడు, ముత్తుస్వామి దీక్షితులు. ‘కాశీ’ అంటే వెలుగు. వెలుగుల పండుగైన దీపావళి నాడు సువర్ణ అన్నపూర్ణా దేవి కాంతులీనుతూ దివ్య తేజస్సుతో భువనావళికి చైతన్య దీప్తి నిస్తుంది.
సర్వ మానవ సౌభ్రాత్రతతో విశ్వమానవ కల్యాణాన్ని కాంక్షించే ‘వెలుగు’ను పొందాలని మానవాళికి దివ్య సందేశాన్నిస్తోంది దివ్య దీపావళి.

పసుమర్తి కామేశ్వరశర్మ 94407 37464