ఈ వారం స్పెషల్

ఆకలిరాజ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్టోబర్ 16 వరల్డ్ ఫుడ్ డే
*
మనది వసుధైకకుటుంబం.. అది ఒకప్పటిమాట.
ఔను.. ప్రస్తుత ప్రపంచం ఒక ఆకలి రాజ్యం...
ఇదేదో మాటవరసకో.. నవ్వులాటకో అన్నమాటకాదు.. పచ్చినిజం.

ప్రపంచ జనాభాలో నాలుగోవంతుమందికి కడుపునిండడం లేదు. కనీసం ఒకపూట తిండి కూడా కష్టమే. ఇది నమ్మాల్సిన నిజం. మిగతావారికి కడుపునిండుతోంది. కానీ పుష్ఠి లేదు. వారిలో కొందరికి బొజ్జనిండుతోంది. ఆ ఆహారంలో బలం లేదు. తిన్నది అరగక కొందరికి, ఎక్కువ తినడం వల్ల మరికొందరికి ఊబకాయం వచ్చిపడుతోంది. మొత్తంమీద ఈ భూమి మీద ఆకలిబాధలు లేకుండా, తిండి దొరకదన్న భయం లేకుండా బతుకుతున్న జనం చాలా తక్కువ. ఆధునిక కాలంలో ఎందుకింత కష్టం వచ్చింది. బతకడానికి తిండి కావాలి. ఆ తిండికోసం తిప్పలు తప్పవు. పుట్టిన చోట పనిలేక, తిండిలేక పస్తులతో బతకలేక పొట్టచేత పట్టుకుని వలసవెళ్లిపోతున్న జనాభా కోట్లలోనే ఉంది. ఊళ్లు దాటినవాళ్లు, దేశాలు దాటినవారు, ఖండాలు దాటినవారు వీరిలో ఉన్నారు. అందుకే ఆకలిలేని రాజ్యంగా ఈ భూగోళాన్ని మార్చాలని, కేవలం ఆహారం కోసం ఏ ఒక్కరూ వలసదారి పట్టకూడదని, ఆహారభద్రత లక్ష్యం కావాలని, అందుకోసం వ్యవసాయ, ఆహార రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తోంది. ఈ భూమీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఆహారం కొరత లేకుండా, అందుబాటులో ఉండేలా చూడాలన్నది లక్ష్యం. ఆ లక్ష్యసాధనకోసమే ఏటా అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లుగా మనదేశం కూడా ‘ఆహారభద్రత’కోసం పరితపిస్తోంది. ఒక్కోఅడుగూ వేస్తోంది. 2030 నాటికి ప్రపంచం ఏ మూల కూడా ఆకలికేకలు వినిపించకూడదని, ఆకలి అన్నది ఉండకూడదన్న (జీరో హంగర్) లక్ష్యంతో అందరూ అడుగువేస్తున్నారు.
ఆహార దినోత్సవం ఎందుకు?
ప్రతి మనిషికి ఆహారం అవసరం. అది ప్రాథమిక హక్కుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అయితే పుస్తకాల్లో అది రాస్తే ఆహారం వచ్చి పడదుకదా. ప్రజల ఆహార అవసరాలకు తగ్గట్లు ఉత్పత్తులు పెరగాలి. జనాభా పెరిగిపోవడం, ఆర్థిక వ్యత్యాసాలు, వాతావరణ మార్పులు ఆహార కొరతకు కారణమయ్యాయి. దీంతో ఆకలిదప్పులతో కొన్నివర్గాలు పేదరికంలో మగ్గిపోవడం మొదలైంది. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి ఐక్యరాజ్య సమితి అనుబంధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎఒ) ఆవిర్భవించింది. 1945 అక్టోబర్ 16న అది ఏర్పడినందుకు గుర్తుగా ఏటా అదేరోజున ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా మారింది. 1981 నుండి ఈ రోజును పాటిస్తున్నారు. ఏటా ఒక లక్ష్యాన్ని నినాదంగా చేసుకుని ప్రజాచైతన్యం కోసం పాటుపడుతున్నారు. ఈ ఏడాది వలసల నివారణ, ఆహార, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా నినాదాన్ని ఎంపిక చేశారు. సభ్య దేశాలన్నీ ఇందుకు తగ్గట్లుగా కార్యక్రమాలను రూపొందించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ కూడా చిత్తశుద్ధితో ప్రత్యేక ఆహార సదస్సును నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆయా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రధాని నరేంద్రమోదీ కసరస్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆకలికేకలు వినిపిస్తున్న దేశాల్లో మనదేశం కూడా ఉంది. జనాభాపరంగా, ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్న చిన్నచిన్న దేశాలు ఆకలిని తరిమేస్తూ ప్రజలకు జవసత్వాలు కల్పిస్తూంటే మన చిన్నారులు ఎక్కడా లేనివిధంగా నీరసిస్తూ ప్రాణాలు వదిలేస్తున్నారు. కలవరపరిచే వాస్తవాలు తరువాత తెలుసుకుందా. ప్రస్తుతం ఎఫ్.ఎ.ఒ. పరిధిలో 150కుపైగా దేశాలు సభ్యత్వం తీసుకున్నాయి. ఆహారభద్రత అంటే ప్రజలందరికీ ఆహారం అందుబాటులో ఉండటం అని స్థూలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నాలుగు అంశాలతో ఆయా దేశాల్లో ఆహార భద్రత ప్రమాణాలను లెక్కగట్టవచ్చు. ప్రజలకు అందుబాటులో ఆహార పదార్థాలు ఉండటం, వాటిని కొనుగోలు చేసుకోవడానికి అనుసంధాన ఏర్పాట్లు ఉండటం, వాటిని వినియోగించుకునే సౌకర్యాలు ఉండటం, ఇవన్నీ ఎప్పుడూ స్థిరంగా ఉండటాన్నిబట్టి ఆ ప్రాంతంలో ఆహారభద్రత ఉన్నట్లు లెక్క. ఈ పరిస్థితులను ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో కల్పించి ఆకలి అన్నది, పేదరికం అన్నది లేకుండా చూడటమే ప్రస్తుత లక్ష్యం. 2030నాటికి ఆకలి లేని సుభిక్షమైన రాజ్యంగా భూగోళం అవతరించాలన్నది ఆకాంక్ష. కానీ ప్రస్తుత పరిస్థితులను ఓసారి తెలుసుకుంటే లక్ష్యసాధన కోసం ఎంత కష్టపడాలో తెలుస్తుంది.
ఇదీ నిజం!
ప్రపంచ జనాభాలో 830 మిలియన్లమంది ఆకలితో అలమటిస్తున్నారు. ఆహారం దొరకక, కొనలేక వారు నకనకలాడుతున్నారు. తీవ్రమైన ఆకలి (క్రానిక్ హంగర్)తో వారంతా జీవచ్చవాల్లా మారిపోయారు. ముఖ్యంగా ఐదేళ్ల లోపు చిన్నారులు అసలు ఆహారం లేక, మరికొందరు బలవర్ధక ఆహారం దొరకక ప్రాణాలు విడుస్తున్నారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ప్రపంచం అంతటా మలేరియా, క్షయ, ఎయిడ్స్ వ్యాధులన్నింటివల్ల ఏటా మరణిస్తున్నవారి సంఖ్య కంటే ఆకలితో మరణిస్తున్నవారి సంఖ్య ఎక్కువ. నమ్ముతారా? ఈ వాస్తవాలతో కదిలిపోయిన హంగేరీ వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ పాల్ రొమెని ఆహార భద్రత, ఆకలిని తరిమివేసేందుకు కంకణం కట్టుకోవాలని సభ్యదేశాలకు పిలుపునివ్వడం, అద్భుతమైన ప్రతిపాదనలతో ముందుకురావడంతో ప్రపంచం కదిలింది. ఆయన సూచనల తరువాత జనాభా పెరుగుదల, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలని, పంటల సాగును మెరుగుపరచాలని, రైతులకు మద్దతు ధరలు కల్పించాలని, ఆహార నిల్వలను పెంచుకోవాలన్న ధ్యాస మొదలైంది. నిజానికి 1950-51లో ఆహారధాన్యాల ఉత్పత్తి 50 మిలియన్ టన్నులు (ఇండియా) ఉంటే 2014-15 నాటికి 250 మిలియన్ టన్నులకు పెరిగింది. 2022నాటికి రైతులకు ఇప్పుడు వస్తున్న ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో భారత్ అడుగులు వేస్తోంది. 1974లో వరల్డ్ ఫుడ్ కాన్ఫరెన్స్, 1996లో వరల్డ్ ఫుడ్ సమ్మిట్‌లలో ‘ఆహార భద్రత’ అన్న అంశం చర్చకు వచ్చింది. భారత్‌లో 2013 నుంచి ఆహార భద్రత దిశగా తొలి అడుగుపడింది. నిజానికి పదివేల ఏళ్లక్రితమే మనిషి భవిష్యత్ అవసరాలకోసం ఆహారధాన్యాలను నిల్వచేసుకోవడం తెలుసు. అయితే ఆధునిక కాలంలో జనాభా విస్ఫోటనంతో నిల్వల మాట దేవుడెరుగు. ఎప్పటికప్పుడు అవసరాలకు తగ్గట్లు ఉత్పత్తి చేసుకోవడమే గగనం అయిపోయింది. మనిషి సేద్యయోగ్య భూమిని తగ్గిస్తూ అభివృద్ధిపేరిట నిర్మాణాలను చేపట్టడం, భూతాపం పెరగడం, దానివల్ల వ్యవసాయం దెబ్బతినడం ఈ పరిస్థితికి కారణం. అంటే మనకు ఆహారం దొరకకపోవడానికి మనమే కారణమన్నమాట.
మనదేశంలో...
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనదేశం ఒకటి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మనదీ ఒకటి. ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రబలశక్తిగా ఎదుగుతోంది. ఈ అంశాల్లో కొంత నిజం ఉన్నా... ఆ ఖ్యాతికి మచ్చతెచ్చే, బాధపెట్టే నిజాలు చాలానే ఉన్నాయి. ఆకలితో అలమటిస్తున్న ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఉంది. మనకన్నా చిన్నచిన్న దేశాలు పేదరికాన్ని, ఆకలిని తరిమేస్తుంటే మనం ఇంకా వెనుకబడే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో సరైన ఆహారం లేక, పౌష్టికత లోపించి ప్రాణాలు విడుస్తున్నవారి సంఖ్య ఏటా 3.1 మిలియన్లమంది. మనదేశంలో చిన్నపిల్లల మరణాల సంఖ్య దేశీయంగా 48శాతం. అంటే పిల్లల్లో సగంమంది పౌష్టికాహారం లేక మరణిస్తున్నారన్నమాట. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించాలంటే ఆకలిని తరిమేయాలి. ఆ దిశగా 120 దేశాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే 72 దేశాలు గణనీయమైన ప్రగతి సాధించాయి. మనం మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాం. హంగర్ ఇండెక్స్ జాబితాలో మనం అట్టడుగు గ్రూప్‌లో ఉన్నామని ఎందరికి తెలుసు. ఘనా, గొబన్, పరాగ్వే వంటి దేశాలు కేవలం 5 రేట్‌తో అగ్రస్థానంలో (ఆకలిని తరిమేసిన దేశాలు) ఉంటే మనం చివరి నుంచి 20వ స్థానంలో ఉన్నాం. ప్రపంచంలో ప్రతి తొమ్మిది మంది చిన్నారుల్లో నలుగురు పౌష్ఠికాహార లోపంతో బాధపడుతుంటే మనదగ్గర వారి సంఖ్య ఇంకాస్త ఎక్కువ. నిరక్షరాస్యత, పేదరికం, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగకపోవడం, అడవుల నరికివేత, ప్రభుత్వ నిరాసక్తత దీనికి కారణం. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహాలు మొదలయ్యాయి. ఇది ఆశాజనక పరిణామం. రైతులకు మద్దతు ధరలు, సబ్సిడీలు, రాయితీలు ఇవ్వడం, వారి ఆదాయాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆహార భద్రత చట్టాన్ని అమలు చేస్తూ, 2022 నాటికి రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వం ఏం చేసినా ప్రజలలో మార్పు రావాలి. చాలామందికి పూట గడవడమే కష్టంగా ఉంటే చాలామంది ఉన్నవారు ఆహారాన్ని వృధా చేస్తున్నారు. కావలసినది కాకుండా ఆర్భాటం కోసం ఆహారాన్ని వండి పడేస్తున్నారు. నిజానికి మనలో ప్రతి పదిమందిలో ముగ్గురు ఆకలితో అలమటిస్తున్నారని చాలామందికి తెలియదు. తెలిసినా స్పందించడం అరుదే. ఆ వైఖరిలో మార్పు వస్తేనే మనది ఆకలిరాజ్యం కాదు. రామరాజ్యం అవుతుంది.
ఆకలిని తరిమేసిన దేశాలు

గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం గొబన్ అనే చిన్నదేశం ఆకలికేకలు వినిపించని ప్రాంతంగా ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచింది. ఆ దేశం ఇండెక్స్ సంఖ్య 5.2. మారిషస్, చైనా, పరాగ్వే, ఎల్‌సాల్వడార్, కిర్గిజ్ రిపబ్లిక్, ట్రినిడాడ్ అండ్ టుబాగో, కొలంబియా, మొరాకో, పెరు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అంటే అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలకన్నా మెరుగైన స్థితిలో ఇవి ఉన్నాయి. ఇవన్నీ 6 అంకెలలోపు ఇండెక్స్ నెంబర్‌ను సాధించాయి. ముఖ్యంగా రైతులకు అనుకూలమైన విధానాలను, వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధానాలను అనుసరించడంతో ఆయా దేశాలు గణనీయంగా ఆహారధాన్యాలను ఉత్పత్తి చేసి ఆకలిని తరిమేశాయి.
ఆకలిచావులు ఇక్కడ ఎక్కువ
పేదరికం తాండవిస్తున్న దేశాల జాబితాలో మొదటి పది స్థానాల్లో చాలా ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. అయితే కొన్ని ఆఫ్రికా దేశాలు గడచిన దశాబ్దంలో చేపట్టిన చర్యలు మెరుగైన ఫలితాలను ఇచ్చాయి. కానీ ఈ జాబితాలో ఉన్న దేశాలు ఇప్పటికీ ఇతరుల సహాయంపైనే జీవితాలను దినదినగండం నూరేళ్ల ఆయుష్షుగా గడుపుతున్నాయి. చిన్నపిల్లల మరణాలు, తల్లుల మరణాలు, పౌష్టికాహార లభ్యత, ఆహార భద్రత, తలసరి ఆదాయం వంటి గణాంకాల ఆధారంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నిర్ణయిస్తారు. ఆ లెక్కల హైతీ అతి దారుణమైన స్థితిలో ఉంది. ఈ దేశం ఇండెక్స్ సంఖ్య 23. ఇక్కడ 55 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువ ఉన్నారు. వీరిలో మూడొంతుల మంది రోజుకు ఒక అమెరికన్ డాలర్ ఆదాయాన్ని గడించడం కూడా గగనమే. ఆ దేశంలోని చిన్నారుల్లో 22.9 శాతం మంది పౌష్టికాహారం పొందలేకపోతున్నారు. ఇక్కడ ఆకలిచావులు చాలా ఎక్కువ. జాంబియా, ఎమన్, ఇథియోపియా, ఛాద్, సూడాన్, కొమెరస్, తిమోర్-లెస్టె, ఎరిత్రియా, బురిండి ఆ తరువాతి స్థానాల్లో ఉన్యా.
నిప్పులాంటి నిజాలు
* ప్రపంచంలో 800 మిలియన్లకు పైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. 150 దేశాల్లో ఈ పరిస్థితి ఉంది. ప్రతి తొమ్మిది మందిలో ముగ్గురు కడుపునిండా తిండి దొరకక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఆకలితో అలమటిస్తున్న జనాభాలో 60 శాతం మంది మహిళలు.
* ప్రపంచంలోని పేదల్లో 80 శాతం మంది గ్రామీణ ప్రాంతాలవారే. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడ్డవారే.
* ప్రాణాంతక మలేరియా, ఎయిడ్స్, క్షయ వ్యాధులు మూకుమ్మడిగా సోకి మరణిస్తున్నవారి సంఖ్యకన్నా ఆకలితో మరణిస్తున్నవారి సంఖ్య ఎక్కువ.
* ప్రపంచంలో 45 శాతం మంది చిన్నారులు పౌష్ఠికాహార లోపంతో మరణిస్తున్నారు. భారత్‌లో ఇది 48 శాతం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వీరిమరణాల ప్రభావం ఏటా 3.5 ట్రిలియన్ డాలర్లు

*ఒక చిన్నారి కోసం ఒక డాలర్ మొత్తాన్ని రోజుకు వినియోగించగలిగితే అతడి వల్ల దాదాపు 136 డాలర్ల మొత్తం తిరిగి ఇచ్చే శక్తి అతడికి పెద్దయ్యాక వస్తుంది.
*దాదాపు 109 కోట్లమంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ప్రపంచంలో మనం వృధా చేస్తున్న ఆహారం మనం ఉత్పత్తి చేస్తున్నదాంట్లో మూడోవంతుకు సరిసమానం. ఇది వృధా అయినా కావొచ్చు.. నష్టపోవడమైనా కావొచ్చు.
*ప్రస్తుత అవసరాల ప్రకారం లెక్కగడితే 2050 నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇప్పటికి రెట్టింపు చేయాల్సి ఉంటుంది.
*వాతావరణ మార్పుల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్న రంగం వ్యవసాయం మాత్రమే. ఇది అన్ని జీవజాతుల మనుగడకు సవాలు చేస్తోంది.
*గడిచిన కొన్ని సంవత్సరాలలో ఆహారభద్రత కోసం కృషి చేస్తు అద్భుత ఫలితాలు సాధించి ఆకలికేకలు లేకుండా గణనీయ ఫలితాలు సాధించిన దేశాల్లో ఆర్మేనియా, కువైట్, బ్రెజిల్, క్యూబా, ఘనా ఉన్నాయి.
*మన దాయాది దేశం పాకిస్తాన్ మనకన్నా మెరుగైన స్థితిలో ఉండటం విశేషం.

-కృష్ణతేజ