ఈ వారం స్పెషల్

ఆరోగ్య సిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆహారం మితంగా తీసుకుంటే ఔషధం..
అమితంగా తీసుకుంటే విషం’ అన్నాడో సినీ రచయిత. ఇది అక్షరాలా నిజం. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యం. జీవన విధానం, ఆహారం సరిగ్గా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. అందుకనే మన పూర్వీకులు మనకి ఎంతో అద్భుతమైన ఆహార విధానాలు, అలవాట్లు అందించారు. కాలక్రమేణా అవన్నీ మరుగున పడిపోయాయి. అందుకే ఆరోగ్యం కూడా రోజురోజుకీ క్షీణిస్తోంది. పూర్వీకులైన అమ్మమ్మలు, తాతయ్యలు ఇప్పటికీ ఇంట్లో ఉత్సాహంగా, ఆనందంగా తిరుగుతున్నారు. ఈ తరానికి చెందిన వారిలా వారు డీలా పడరు. ఒకప్పుడు అరవై సంవత్సరాలు దాటిన తరువాత వచ్చే జబ్బులు.. ఇప్పుడు చిన్నవయసు పిల్లలకూ వస్తున్నాయి. వైద్యరంగం రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్నా మనుషుల జీవితకాలం తగ్గుతోంది. వైద్యుని దగ్గరకి వెళ్ళకుండా జీవనం సాగించడం అసాధ్యమే! ఈ పరిస్థితికి కారణం ఎవరు? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు మనకి గుర్తొచ్చేవి సమాజం, వైద్యులు, రాజకీయ నాయకులు, కంపెనీలు, మీడియా మొదలైనవి.. ఇవన్నీ ఒక కారణమైతే అసలైన కారణం మాత్రం మనమే.. అవును ముమ్మాటికీ మనమే!
ఒకప్పుడు ఆవు లేదా గేదె పాలు తాగేవారు.. ఇప్పుడు పాల పాకెట్లు, పాల పౌడర్లు వాడుతున్నారు. అప్పుడు పాలు ఒక్కరోజు మాత్రమే నిలవ ఉండేవి. కానీ ఇప్పుడు నెలలు, నెలలు నిలువ ఉంటున్నాయి. మునుపు చెట్ల నుండి కోసిన రెండు రోజుల్లోనే కూరగాయలు వాడిపోయేవి. కానీ నేటికాలంలో కూరగాయలు ఎన్నో రోజులు తాజాగా ఉంటున్నాయి. ఇంట్లో ఏవైనా పండ్ల రసాలు తయారుచేస్తే నిలువ ఉండవు. కానీ ఇప్పుడు పండ్ల రసాలు నెలలు, నెలలు నిలువ ఉంటున్నాయి. ఇవన్నీ ఎలా సాధ్యం? అనే కదా ఆలోచిస్తున్నారు. వీటన్నింటికీ కారణం రసాయనాలు. రసాయనాలు కలిపితేనే ఇవన్నీ సాధ్యం. మరి ఆ రసాయనాలు మనుషులకి హానిచెయ్యవా? అని ఆలోచిస్తే.. మనమే ఈ ప్రస్తుత పరిస్థితులకి కారణం.
భారతీయులు.. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతం వారు తీసుకునే ఆహారం వరి. ఉత్తరాది వారు గోధుమలను ఎక్కువగా తీసుకుంటారు. అందరూ తినేది ఆ బియ్యమే కదా.. మరెందుకు సమస్య అనుకుంటాం. కానీ ఈ పాలిష్ చేసిన బియ్యం మూడు పూటలా తీసుకోవడం వల్ల రక్తంలోకి గ్లూకోస్ ఎక్కువగా వెళుతుంది. రక్తంలో గ్లూకోస్ పాళ్లు ఎక్కువయ్యి మధుమేహ వ్యాధికి దారితీస్తుంది. మధుమేహ వ్యాధి వచ్చాక పండ్లు మానేస్తారు. అన్నం లేదా చపాతీలు ఎక్కువగా తింటారు. ఫలితంగా క్లోమ గ్రంథి దెబ్బతింటుంది. ఈ గ్లూకోస్ వల్ల థైరాయిడ్, ఊబకాయం మొదలైనవి కూడా వస్తాయి. చపాతీలు కూడా బియ్యం వంటివే.. ఈ రెండు కాకుండా ఇటీవల చిరుధాన్యాల గురించిన చర్చ ఎక్కువైంది. మన పూర్వీకులు సిరిధాన్యాలనే ఎక్కువగా తినేవారు. అందుకే వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. దాదాపు 130 సంవత్సరాల నుంచే మనకు బియ్యం తినే అలవాటు ఎక్కువైంది. గోధుమ పంట కూడా చాలా అరుదైన పంటగా చలామణిలో ఉండేది. ఎప్పుడైతే వరి, గోధుమల పట్ల మోజు ఏర్పడిందో అప్పటి నుంచీ సిరిధాన్యాలు చిన్నచూపుకు గురయ్యాయి. ఇవి పేదల ఆహారం అని, డబ్బున్న వాళ్లందరూ బియ్యం, గోధుమలు తింటారనే భ్రమ పెరిగింది. ఎప్పుడైతే సిరిధాన్యాలను పక్కకు పెట్టారో.. అప్పటినుంచే అనారోగ్యాలు మొదలయ్యాయన్న విషయాన్ని ఎవ్వరూ గమనించలేదు. ఇప్పటివాళ్లలా వారికి రోగాలు, నొప్పులు ఉండేవి కాదు. వాళ్లు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండేవారు. ఎప్పుడో ఒకసారి జ్వరం.. తప్ప వారికి అంత పెద్ద పెద్ద రోగాలు వచ్చిన దాఖలాలు కూడా తక్కువే.. కారణం వారు సంపూర్ణంగా సిరిధాన్యాలను భుజించేవారు. మనం మాత్రం కల్చర్ నెపంతో బియ్యం, గోధుమపిండి వెంట పరుగులు తీస్తున్నాం. ఫలితంగా

రెట్టింపు వేగంతో ఆసుపత్రుల చుట్టూ కూడా తిరుగుతున్నాం.
సిరిధాన్యాలు అంటే అవేవో వింత పదార్థాలు కావు. మన పూర్వీకులు మనకు అందించిన అద్భుత ఆహార ధాన్యాలు. బియ్యాన్ని ఎలా అయితే వండుకుంటామో.. వీటిని కూడా అలాగే వండుకోవాలి. వీటిని తిన్నాక.. జీర్ణం అవడానికి కనీసం ఆరు గంటల సమయం పడుతుంది. కాబట్టి మధ్యమధ్యలో చిరుతిళ్ళు, కాఫీ, టీ వంటివి తీసుకోవడానికి కుదరదు. ఫలితంగా చెడు కొవ్వు తగ్గుతుంది. అరికెలు, సామలు, ఓధలు, సజ్జలు, రాగులు, వరిగెలు, జొన్నలను సిరిధాన్యాలుగా పిలుస్తారు. అయితే ముఖ్యంగా అరికెలు, సామలు, వరిగెలు, కొర్రలు, రాగులను కలిపి ఐదు రకాలను సిరిధాన్యాలు అంటారు. ఇవి వేరే దేశంలో ఎక్కడా కనిపించవు. ఒక్క భారతదేశంలోనే కనిపిస్తాయి. అయితే ఇవి వందల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి వచ్చాయని అంటుంటారు. ఇప్పుడిప్పుడే జనాల్లో వస్తున్న అవగాహన వల్ల సిరిధాన్యాలకు ఆదరణ లభిస్తోంది. వీటిలో పీచుపదార్థం చాలా అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం. వీటివల్ల గ్లూకోస్ చాలా తక్కువ మోతాదులో రక్తంలోకి నెమ్మదిగా చేరుతుంది. పీచు పదార్థం ఎక్కువ కాబట్టి ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఈ ధాన్యాల్లో ఇనుము, కాల్షియం, మాంసకృత్తులు, కావాల్సిన కొలెస్ట్రాల్, విటమిన్ బి, పొటాషియం, జింక్, మెగ్నీషియం.. మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. అందుకే సిరిధాన్యాలను అద్భుత ధాన్యాలు, అమృతతుల్యాలు అంటారు.
సేద్యం
ఇప్పుడిప్పుడే జనాల్లో వస్తున్న అవగాహన వల్ల సిరి ధాన్యాలకు ఆదరణ లభిస్తోంది. కానీ లభ్యత చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రజలకు కావాల్సిన మోతాదులో ధాన్యాలు అందడం లేదు. ఈ సిరి ధాన్యాల సాగు కూడా చాలా సులభంగా ఉంటుంది. ఉదాహరణకు కిలో వరి పండించడానికి ఎనిమిది వేల లీటర్ల నీరు అవసరమైతే కిలో కొర్రలు పండించడానికి 200 లీటర్ల నీరు సరిపోతుంది. ఈ పంట కూడా చాలా త్వరగా అంటే 75 రోజుల్లో చేతికొచ్చేస్తుంది. కాలక్రమంలో నీటి డ్యాముల నిర్మాణం, నీటి లభ్యత, వ్యవసాయ విప్లవం, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆధిపత్య ప్రభావంతో మన ప్రాచీన, సంప్రదాయ పంటలయిన కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, అండుకొర్రల స్థానంలో నీటి ఆధారిత పంటలైన వరి, గోధుమల పంటలు వచ్చి చేరాయి. ఫలితంగా మన శరీరాల్లోకి దీర్ఘకాలిక రోగాలు, కీళ్ళనొప్పులు, మోకాళ్ళ అరుగుదలలు చేరిపోయాయి. సిరిధాన్యాలు పండించడానికి నీరు తక్కువ అని తెలుసుకున్నాం కదా.. అలాగే ఎకరానికి నాలుగు కిలోల విత్తనాలు సరిపోతాయి. అదే నారు పోసి నాటే విధానంలో అయితే ఎకరానికి కిలో లోపు విత్తనాలు సరిపోతాయి. కలుపుతీయాల్సిన అవసరం లేదు. పురుగు మందులు, రసాయనాలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ప్రకృతిని, భూమిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ భూగర్భ జలాలను కాపాడుతూ సిరిధాన్యాల పంట సాగు ద్వారా రైతులు అధిక లాభాలను పొందవచ్చు. తద్వారా స్థానికంగా అందుబాటులో ఉండి వినియోగదారులకు సరైన ధరలో సిరిధాన్యాలు లభిస్తాయి.
ప్రయోజనాలు
* సిరిధాన్యాలను ఆహారంగా తీసుకుంటే రక్తంలోని గ్లూకోస్ శాతం తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది.
* వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఫలితంగా దంతాలు, ఎముకలు గట్టిపడుతాయి.
* ఇవి అధిక పీచుని కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంగా తీసుకున్నప్పుడు కిడ్నీలో, పిత్తాశయంలో రాళ్లు రావడం వంటి సమస్యలు తగ్గుతాయి.
* సిరిధాన్యాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కొవ్వు తగ్గుతుంది.
* అసిడిటీ ఉన్నవారికి ఇవి చాలా మేలు చేస్తాయి. గ్యాస్ సమస్య తగ్గుముఖం పడుతుంది.
* ఊబకాయం, కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులు తప్పనిసరిగా సిరిధాన్యాలను తీసుకోవాలి.
* ధాన్యాలు ఏవైనా వీటిని తీసుకునేటప్పుడు బాగా నమిలి తినాలి. ఫలితంగా రెండు గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినాలి అనిపించదు. కడుపు నిండినట్లుగా ఉంటుంది. త్వరగా ఆకలి వేయదు. అతిగా తినే దురలవాటు తగ్గుతుంది. ఆహారం బాగా నమిలి తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
* సిరిధాన్యాలను తరచూ తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తప్రసరణ కూడా సజావుగా జరుగుతుంది. దీనివల్ల హార్మోనుల అసమతుల్యత తగ్గి రుతు సమస్య, సంతాన సమస్య వంటి చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.
* శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. శరీరంలోని చెడు కొవ్వు కూడా బాగా తగ్గుతుంది.
* అతి భయంకరమైన వ్యాధిగా చెప్పే కేన్సర్ వ్యాధి నుండి కూడా కాపాడుతాయి ఈ ధాన్యాలు.
* రక్తపోటు ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల అదుపులోకి వస్తుంది.
* శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
* కాలేయం, పిత్తాశయం పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.

కొర్రలు
కొర్రలు తీపి, వగరు రుచులను కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకిది మంచి ఆహారం. శరీరంలోని కొలెస్టరాల్ పరిమాణాన్ని తగ్గిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రల్లో పీచుపదార్థం, మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరంతో విటమిన్లు అధిక పాళ్ళలో ఉంటాయి. కనుక చిన్న పిల్లలకు, గర్భిణీలకు మంచి ఆహారం. ఉదర సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపునొప్పి, మూత్ర సంబంధ వ్యాధులు, ఆకలిమాంద్యం, అతిసారం మొదలగు వ్యాధులకు ఔషధాహారం. మాంసకృత్తులు, ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తహీనత నివారణకు చక్కటి ఔషధం. పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని అరికడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినప్పుడు కొర్ర గంజి తాగితే జ్వరం తగ్గిపోతుందని పెద్దల అనుభవం.
అరికెలు
అరికెలు తీపి, వగరు, చేదు రుచిని కలిగి ఉంటాయి. వీటిలో అధిక పోషక విలువలు అంటే విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి పిల్లలకు మంచి ఆహారం. ఇవి జీర్ణశక్తిహిత ఆహారం. వీటిలో అధిక యాంటీ ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉంటాయి. అందుకే వీటిని పరుగు పందాలలో పాల్గొనేవారికి ఇస్తారు. వీటిని ఇతర పప్పు దినుసులతో అంటే బొబ్బర్లు, శనగలతో కలిపి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే బాధల ఉపశమనానికి, వాపులు తగ్గడానికి అరికెలు మంచి ఆహారం. వాత రోగాలకు, ముఖ్యంగా కీళ్ళ వాతానికి, రుతుస్రావ సమస్యలున్న స్ర్తిలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, కంటి నరాల బలానికి అరికెలు మంచి ఆహారం. అరికె పిండిని వాపులకు పై పూతగా కూడా వాడతారు.

అండుకొర్రలు
సంప్రదాయ పంటల్లో అండుకొర్రలు ఒకటి. ఒక్క అండుకొర్రలను కనీసం నాలుగు గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి. జీర్ణాశయం, ఆర్థరైటిస్, రక్తపోటు, థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణకు ఉపయోగపడతాయి. అలాగే మొలలు, మూలశంక, ఫిషరీస్, అల్సర్‌లు, మెదడు, రక్తం, స్తనాలు, ఎముకలు, ఉదర, చర్మ సంబంధ కేన్సర్‌ల చికిత్సకు బాగా ఉపయోగపడతాయి.

ఊదలు
ఊదలు రుచికి తియ్యగా ఉంటాయి. ఊదలు చాలా బలవర్ధకమైన ఆహారం. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. ఉత్తర భారతదేశంలోని ఉపవాస దీక్షలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉత్తరాఖండ్, నేపాల్‌లలో ఊదల ఆహారాన్ని గర్భిణిలకు, బాలింతలకు ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే ఊదలలో ఇనుము శాతం ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గి బాలింతలకు పాలు బాగా పడతాయని నమ్మకం. శరీర ఉష్ణోగ్రతలను కూడా సమస్థితిలో ఉంచుతాయి ఇవి. వ్యాధినిరోధక శక్తిని పెంచడంలోను ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి. శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారికి ఊదలు చాలా మంచి ఆహారం. ఊదల్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకానికి, మధుమేహగ్రస్తులకు మంచి ఆహారం. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగుల్లో ఏర్పడే పుండ్లు, పెద్ద ప్రేగుల్లో కేన్సర్ రాకుండా ఊదల ఆహారం కాపాడుతుంది.
సామలు
సామలు కూడా తియ్యగా ఉంటాయి. వీటిని ఆహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. పైత్యం ఎక్కువవడం వల్ల భోజనం తర్వాత గుండెల్లో మంటగా ఉండటం, పుల్ల త్రేన్పులు రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఇవి ఔషధంగా ఉపయోగపడతాయి. సుఖవ్యాధులు, అతిసారం, అజీర్ణం, పురుషుల శుక్రకణాల వృద్ధికి, ఆడవారి రుతుసమస్యలకు ఇవి చాలా మంచివి. గుండె సమస్యలకు, ఊబకాయం, కీళ్ళనొప్పులకు ఇది బలవర్ధకమైన ఆహారం.

కొర్ర మామిడి అన్నం
కావలసిన పదార్థాలు
కొర్రలు: ఒక గ్లాసు
మామిడి తురుము: అరకప్పు
అల్లం తురుము: ఒక చెంచా
ఉప్పు: తగినంత
నెయ్యి: రెండు చెంచాలు
పచ్చి శనగపప్పు: రెండు చెంచాలు
మినపప్పు: రెండు చెంచాలు
ఎండుమిర్చి: నాలుగు
తరిగిన పచ్చిమిర్చి: ఐదు
ఆవాలు: చిన్న చెంచా
మెంతులు: పావు చెంచా
పసుపు: పావు చెంచా
ఇంగువ: పావు చెంచా
కరివేపాకు: మూడు రెబ్బలు
తయారుచేసే విధానం
కొర్ర బియ్యాన్ని నాలుగు గంటలపాటు నానబెట్టాలి. తరువాత నీళ్లను ఒంపేసి తగినన్ని మంచినీళ్లు వేసి అన్నం ఉడికించాలి. ఉడికిన కొర్ర అన్నాన్ని ప్లేటులో ఆరబెట్టుకోవాలి. స్టవ్‌పై బాణలిని ఉంచి నెయ్యి వేయాలి. వేడయ్యాక ఆవాలు, మెంతులు, పచ్చి శనగపప్పు, మినపప్పు, అల్లం తురుము, పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేయించాలి. తరువాత దీనికి మామిడి తురుమును కూడా జతచేసి ఐదు నిముషాల పాటు వేయించాలి. తరువాత స్టవ్‌పై నుంచి దించి చల్లార్చాలి. చల్లారిన తరువా దీనిలో కొర్ర అన్నం వేసి బాగా కలపాలి. దీనిలో ఉప్పును జతచేసి మరోమారు కలిపి రెండు గంటల తర్వాత వడ్డించాలి. ఇలా చేయడం వల్ల మామిడికాయలోని పులుపుదనం కొర్ర అన్నానికి పడుతుంది.

కొర్ర దోసె

కావలసిన పదార్థాలు
కొర్రలు: మూడు కప్పులు
మినపప్పు: కప్పు
మెంతులు: పావు చెంచా
ఉప్పు: తగినంత
నూనె: తగినంత
తయారుచేసే విధానం
కొర్రలు, మెంతులు, మినపప్పులను విడివిడిగా తగినన్ని నీళ్లు జతచేసి ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం నీళ్లను ఒంపేయాలి. గ్రైండర్‌లో మినపప్పు, కొర్రలు, మెంతులు వేసి కొద్దికొద్దిగా నీళ్లు జతచేస్తూ దోసెలపిండిలా మెత్తగా రుబ్బుకోవాలి. సుమారు ఆరేడు గంటలు అలాగే ఉంచాలి. పిండి పొంగిన తరువాత దీనిలో ఉప్పు జతచేయాలి. అలవాటు ఉన్నవాళ్లు సోడా ఉప్పును కూడా జతచేసుకోవచ్చు. స్టవ్‌పై దోసెల పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి రాసుకుని, రుబ్బి ఉంచుకున్న పిండిని దోసెల్లా వేసుకోవాలి. రెండు వైపులా దోరగా కాల్చుకున్న తరువాత ప్లేటులోకి తీసుకుని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే భలే ఉంటాయి. అరికెల పులావు
కావలసిన పదార్థాలు
అరికెలు: కప్పు
ఉల్లి తరుగు: కప్పు
పచ్చిమిర్చి: నాలుగు
అల్లం-వెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు
కూరగాయల ముక్కలు: కప్పు
షాజీర: అర చెంచా
ధనియాల పొడి: ఒక చెంచా
నిమ్మరసం: ఒక చెంచా
నెయ్యి: రెండు చెంచాలు
పుదీనా: పావు కప్పు
ఉప్పు: తగినంత
బిర్యానీ మసాలా దినుసులు
దాల్చిన చెక్క: చిన్న ముక్క
లవంగాలు: నాలుగు యాలకులు: నాలుగు మిరియాలు: అర చెంచా
సోంపు: అర చెంచా జాపత్రి: కొద్దిగా
తయారుచేసే విధానం
అరికెలను రెండు, మూడు సార్లు కడిగి తగినన్ని నీళ్లు జతచేసి రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. బిర్యానీ మసాలా దినుసులన్నీ రెండున్నర కప్పుల నీళ్లలో మరిగించి, వడకట్టి పక్కన ఉంచాలి. స్టౌపై మందపాటి గినె్నలో నెయ్యి వేసుకుని వేడి అయిన తరువాత షాజీర, పచ్చిమిర్చి తరుగు, ఉల్లితరుగు, కూరగాయల ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ దోరగా వేయించుకోవాలి. తరువాత పుదీనా, అల్లం-వెల్లుల్లి ముద్ద చేర్చుకుని పచ్చివాసన పోయేవరకు కలియబెట్టాలి. వడకట్టుకున్న నీళ్లు, ఉప్పు, జత చేసి మరగనివ్వాలి. నానబెట్టుకున్న అరికెల బియ్యంలో నీళ్లు ఒంపేసి మరుగుతున్న మసాలా నీటిలో అరికెలను వేయాలి. దీనిపై మూతపెట్టి సన్నటి మంటపై పులావులా వండుకోవాలి. మధ్యలో ఒకటి రెండుసార్లు గరిటెతో తిప్పుతూ మూత ఉంచి ఉడికించాలి. దించేముందు ధనియాలపొడి, నిమ్మరసం, నెయ్యి వేసి పూర్తిగా కలియబెట్టి దింపేయాలి. దీనిపై పుదీనా తరుగు వేసి వేడివేడిగా వడ్డించాలి.

అరికెల పాయసం
కావలసిన పదార్థాలు
అరికెలు: కప్పు
బెల్లం పొడి: ఒకటిన్నర కప్పు
కొబ్బరి పాలు: రెండు కప్పులు
కుంకుమపువ్వు: కొద్దిగా
నెయ్యి: పెద్ద చెంచా
జీడిపప్పులు: పది
బాదంపప్పులు: పది
పిస్తాపప్పులు: పది
తయారుచేసే విధానం.. అరికెలను శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టాలి. మందపాటి గినె్నను తీసుకుని దానిలో తగిననన్ని నీళ్లు పోసి స్టవ్‌పై ఉంచి మరిగించాలి. దీనిలో కొబ్బరిపాలు, నానబెట్టుకున్న అరికెలను వేసి ఉడికించాలి. మెత్తగా ఉడికిన తరువాత బెల్లం పొడిని జతచేసి బాగా కలియబెట్టాలి. మరోవైపు బాణలిని ఉంచి నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పులను దోరగా వేయించి ఉడుకుతున్న పాయసంలో వేసి కలపాలి. ఈ పాయసం వేడిగా తిన్నా, చల్లగా తిన్నా చాలా బాగుంటుంది.

అండుకొర్రల పొంగలి

కావలసిన పదార్థాలు
అండుకొర్రలు: అరకప్పు
పెసరపప్పు: అరకప్పు
కొబ్బరిపాలు: రెండు కప్పులు
మిరియాల పొడి: పావుచెంచా
అల్లం: చిన్న ముక్క
జీలకర్ర: చెంచా
నెయ్యి: నాలుగు చెంచాలు
జీడిపప్పులు: పది
కరివేపాకు: రెండు రెబ్బలు
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
పెసరపప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జతచేసి స్టవ్‌పై ఉంచి మెత్తగా ఉడికించాలి. ఒక పాత్రలో అండుకొర్రలు, కొబ్బరిపాలు వేసి బాగా కలిపి స్టవ్‌పై ఉంచి ఉడికించాలి. దీనిలో తగినంత ఉప్పు, మిరియాల పొడి జతచేసి కలియబెట్టాలి. దీనికి ఉడికించిన పెసరపప్పును జతచేసి మరోమారు కలియబెట్టాలి. స్టవ్‌పై బాణలి ఉంచి నెయ్యిని వేయాలి. వేడయ్యాక జీడిపప్పు, కరివేపాకు, అల్లం ముక్కలను వేసి దోరగా వేయించి ఉడుకుతున్న పొంగలిలో వేసి కలియబెట్టి దింపేయాలి. దీన్ని కొబ్బరి చట్నీతో కానీ, సాంబారుతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది.

అండుకొర్రల ఊతప్పం

కావలసిన పదార్థాలు
అండుకొర్రలు: పావుకప్పు
మినపప్పు: చెంచా
అల్లం-పచ్చిమిర్చి ముద్ద: చెంచా
ఉప్పు: తగినంత
నూనె: తగినంత
టమోట తరుగు: రెండు చెంచాలు
కొత్తిమీర తరుగు:
రెండు చెంచాలు
తయారుచేసే విధానం
అండుకొర్రలు, మినపప్పులను విడివిడిగా శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి విడివిడిగానే ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం నీళ్లు ఒంపేసి గ్రైండర్‌లో వేసి తగినన్ని నీళ్లు జతచేస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో అల్లం పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. తరువాత స్టవ్‌పై పెనం ఉంచి వేడయ్యాక ఊతప్పంలా వేసుకుని పైన టమోట తరుగు, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు వేసి మూత ఉంచాలి. బాగా కాలిన తరువాత రెండో వైపునకు తిప్పకుండా మరికాస్త నూనె వేసి తీసేయాలి. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుది.
100 గ్రాముల కొర్రల్లో..

సియాసిన్ బి3 0.7 మి.గ్రా.
రిబోఫ్లావిన్ బి2 0.11 మి.గ్రా.
థయామిన్ బి1 0.59 మి.గ్రా.
కెరోటిన్ 32 యు.జి.
ఐరన్ 6.3 మి.గ్రా.
కాల్షియం 0.03 గ్రా.
ఫాస్పరస్ 00.29 గ్రా.
ప్రొటీన్ 12.3 గ్రా.
ఖనిజాలు 3.3 గ్రా.
పిండిపదార్థం 60.6 గ్రా.
పీచుపదార్థం 8.0 గ్రా.100 గ్రాముల అరికెల్లో..

నియాసిన్ బి3 2.0 మి.గ్రా.
రిబోఫ్లావిన్ బి2 0.09 మి.గ్రా.
థయామిన్ బి1 0.33 మి.గ్రా.
కెరోటిన్ 0 యు.జి.
ఐరన్ 2.9 మి.గ్రా.
కాల్షియం 0.04 గ్రా.
ఫాస్పరస్ 0.24 గ్రా.
ప్రొటీన్ 6.2 గ్రా.
ఖనిజాలు 2.6 గ్రా.
పిండి పదార్థం 65.6 గ్రా.
పీచు పదార్థం 9.6 గ్రా.

100 గ్రాముల అండుకొర్రల్లో..

నియాసిన్ బి3 18.5 మి.గ్రా.
రిబోఫ్లావిన్ బి2 0.027 మి.గ్రా.
థయామిన్ బి1 3.2 మి.గ్రా.
కెరోటిన్ 0 యు.జి.
ఐరన్ 0.65 మి.గ్రా.
కాల్షియం 0.01 గ్రా.
ఫాస్పరస్ 0.47 గ్రా.
ప్రొటీన్ 11.5 గ్రా.
ఖనిజాలు 4.21 గ్రా.
పిండి పదార్థాలు 69.37 గ్రా.
పీచు పదార్థం 12.5 గ్రా.
సామల టమోటా పులావ్
కావలసిన పదార్థాలు
సామలు: కప్పు
ఉల్లి తరుగు:
పావు కప్పు
పచ్చిమిర్చి: రెండు
క్యారట్ తురుము:
పావు కప్పు
ఉడికించిన బఠాణి: కప్పు
కరివేపాకు: రెండు రెబ్బలు
అల్లం తురుము: చెంచా
ఆవాలు: చిన్న చెంచా
పచ్చి శనగపప్పు: చిన్న చెంచా
మినపప్పు: చిన్న చెంచా
టమోటా తరుగు: పావు కప్పు
పసుపు: చిటికెడు కారం: పావు చెంచా
కొత్తిమీర: ఒక చెంచా నీళ్లు: తగినన్ని
ఉప్పు: తగినంత నెయ్యి: రెండు చెంచాలు
తయారుచేసే విధానం
సామలకు తగినన్ని నీళ్లు జతచేసి శుభ్రంగా కడిగి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి. తరువాత స్టవ్‌పై కుక్కర్ ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి కాగాక ఆవాలు, పచ్చిమిర్చి, సెనగపప్పు, మినపప్పు, ఉల్లితరుగు, అల్లం తరుము, ఉడికించిన బఠాణీలు, క్యారట్ తరుగు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. తరువాత టమోట తరుగు, పసుపు, మిరపకారం వేసి మరోమారు కలపాలి. దీనికి తగినన్ని నీళ్లను జతచేసి ఉప్పు వేసి మరిగించాలి. తరువాత సామలను వడకట్టి మరుగుతున్న మసాలా నీళ్లలో సామలను వేసి కలియబెట్టి మూత పెట్టేయాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి. చివరిగా కొత్తిమీర చల్లి కొబ్బరి చట్నీతో కానీ, కొత్తిమీర చట్నీతో కానీ తింటే భలే రుచిగా ఉంటుంది.
సామల ఖీర్
కావలసిన పదార్థాలు
సామలు: కప్పు
నెయ్యి: ఒక చెంచా
జీడిపప్పు: పది
కిస్‌మిస్: ఒక పెద్ద చెంచా బాదంపప్పు: పది
పిస్తా: పది బెల్లం పొడి: కప్పు
కొబ్బరిపాలు: కప్పు యాలకులపొడి: చిన్న చెంచా
తయారుచేసే విధానం
ముందుగా సామలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లను జతచేసి సుమారు రెండు గంటల పాటు నానబెట్టాలి. స్టవ్‌పై బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేయాలి. ఇది కరిగాక జీడిపప్పు పలుకులు, బాదం పప్పు, పిస్తా, కిస్‌మిస్ వేసి వేయించి పక్కన ఉంచాలి. సామలలోని నీళ్లు ఒంపేసి తగినన్ని మంచినీళ్లు జత చేసి, స్టవ్‌పై ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. తరువాత కొబ్బరిపాలు జతచేయాలి. దీనిలో బెల్లం పొడి వేసి బాగా కలియబెట్టి కొద్దిసేపు ఉడికించాలి. దీనిలో యాలకులపొడి, వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్‌ను వేసి కలిపి దింపేయాలి. ఈ ఖీర్ వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
ఊదల కట్‌లెట్
కావలసిన పదార్థాలు
ఊదల పిండి: కప్పు
కంద ముక్కలు: పావు కప్పు
బఠాణీ: పావు కప్పు
జీలకర్ర పొడి: చెంచా ధనియాల పొడి: చెంచా
వాము: చిన్న చెంచా మిరియాల పొడి: అర చెంచా
కారం: అర చెంచా
కొత్తిమీర తరుగు: రెండు చెంచాలు
అల్లం-వెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు
జీడిపప్పులు: పది నెయ్యి: అరకప్పు
నువ్వుల పొడి: రెండు చెంచాలు
నిమ్మరసం: చెంచా ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
కంద ముక్కలు, బఠాణీలను విడివిడిగా ఉడికించి చేత్తో మెత్తగా చిదిమి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్‌పై బాణలిలో ఒక స్పూన్ నెయ్యివేసి కాగిన తరువాత ఊదల పిండి వేసి దోరగా వేయించి చల్లారనివ్వాలి. తరువాత ఈ పిండిని వెడల్పాటి గినె్నలో వేసి మెత్తగా మెదిపిన కంద, బఠాణీ ముద్దలను వేసి చపాతీపిండిలా కలుపుకోవాలి. దీనిలోనే అల్లం-వెల్లుల్లి ముద్ద, కారం, మిరియాలపొడి, ధనియాలపొడి, జీలకర్రపొడి, వాము, కొత్తిమీర తరుగు, ఉప్పు, నిమ్మరసం ఇలా అన్నింటినీ వేసి కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని కట్‌లెట్‌లా ఒత్తుకుని నువ్వుల పొడిలో ముంచి పక్కన ఉంచాలి. పెనం వేడయ్యాక నెయ్యివేసి కాగాక కట్‌లెట్‌లను పెనంపై వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి. రుచికరమైన ఊదల కట్‌లెట్ రెడీ.

ఊదల పిజ్జా
కావలసిన పదార్థాలు
ఊదలు: అరకప్పు
గోధుమపిండి: అరకప్పు
బేకింగ్ పౌడర్: అర చెంచా
ఉప్పు: తగినంత
నెయ్యి: రెండు చెంచాలు
ఉల్లితరుగు: అరకప్పు
క్యాప్సికమ్ తరుగు: అరకప్పు
టమోట తరుగు: అరకప్పు
మష్రూమ్ తరుగు: అరకప్పు
స్వీట్‌కార్న్: చెంచా టమోట సాస్: పావు కప్పు
మొజెల్లా చీజ్: తగినంత తయారుచేసే విధానం
ఊదలను తగినన్ని నీళ్లను జతచేసి రెండు గంటలపాటు నానబెట్టాలి. నీళ్లను ఒంపేసి ఊదలను గ్రైండర్‌లో వేసి మెత్తటి పిండిలా రుబ్బాలి. దీనికి గోధుమపిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్‌లను జతచేసి బాగా కలిపి సుమారు ఆరు గంటలపాటు పులియబెట్టాలి. స్టవ్‌పై పాన్‌ను ఉంచి వేడిచేయాలి. దీనిపై నెయ్యివేసి కాగిన తరువాత పులియబెట్టిన పిండిని గరిటతో తీసుకుని పెనంపై వేసి కాల్చుకోవాలి. దీంతో పిజ్జా బేస్ సిద్ధమైనట్లే. తరువాత 180 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర అవెన్‌ను ఐదు నిముషాల పాటు వేడిచేయాలి. బేకింగ్ ట్రేలో పిజ్జా బేస్‌ను ఉంచాలి. దీనిపై టమోట సాస్, మొజెల్లా చీజ్, టమోట తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు, మష్రూమ్ తరుగు, స్వీట్‌కార్న్ గింజలు వేయాలి. దీన్ని పదినిముషాల పాటు ఒవెన్‌లో బేక్ చేసి బయటకు తీయాలి. తరువాత వేడివేడిగా అందించాలి. పిల్లలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు.

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి