ఈ వారం స్పెషల్

ప్రజాస్వామ్య కుంభమేళా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశం యావత్తూ వేసవి భగభగలను మించిన రాజకీయ వేడి రాజుకొంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా వాసికెక్కిన భారతావనిలో ‘సార్వత్రిక ఎన్నికల’ పేరిట వోట్ల జాతర మొదలైంది. ఆసేతు హిమాచలం పది లక్షల పోలింగ్ కేంద్రాలు, సుమారు 90 కోట్ల మంది వోటర్లతో ‘ప్రజాస్వామ్య కుంభమేళా’ను ఏడు దశల్లో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. దేశ విధానకర్తలను ఎన్నుకొని, రాబోయే ఐదేళ్ల కాలానికి- జాతి భవితకు వోటర్లు దిశానిర్దేశం చేసేందుకు సమయం ఆసన్నమైంది. పోలింగ్ నాడు మాత్రమే నేతలకు గుర్తుకొచ్చే సామాన్యుడు.. తన పాశుపతాస్త్రాన్ని బయటకు తీసే ఘడియలు వచ్చేశాయి. సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో అన్ని రాజకీయ పక్షాలూ.. పదునైన వ్యూహాలతో వోటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకొనేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నాయి. భారతావని ‘్భవిష్యత్ ప్రస్థానగతికి’ సరైన బాటలు వేయాల్సిన ఎన్నికలివి...
17వ లోక్‌సభ ఎన్నికలకు సమరోత్సాహం నెలకొనడంతో ఎన్నికల తీరు, రాబోయే ఫలితాలపై దేశదేశాల్లో ఆసక్తి నెలకొంది. భారత దేశ చరిత్రలో ప్రస్తుత ఎన్నికలు అత్యంత కీలకమైనవి. మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం భారీ కసరత్తు చేస్తోంది. ఈసారి ఎన్నికల్లో భాజపా ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమి, ఎస్పీ-బీఎస్పీ కూటమి తలపడుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, ఒడిశాలో బిజూ జనతాదళ్, కేరళలో వామపక్షాలు, ఆంధ్రాలో తెదేపా, వైకాపా, తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీలు ఎలాంటి పొత్తులు లేకుండా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతో తలపడుతున్నాయి. ఎన్డీఏ రథసారథి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎన్నికల్లో మట్టికరిపించాలని పరితపిస్తున్న విపక్షాలు మాత్రం ఏకతాటిపైకి రావడంలో విఫలమయ్యాయి. పొత్తుల సంగతి ఎలా ఉన్నా ఈ ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తున్నాయి.
గతంలో ఎన్నికలు సంక్షేమ పథకాలకు, ఆకర్షణీయమైన హామీలకు పరిమితమయ్యాయి. కానీ, ప్రస్తుత ఎన్నికలు దేశ భద్రత, వౌలిక సదుపాయాలు, అభివృద్ధితో ముడివడి ఉన్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక భద్రతాపరంగా కాంగ్రెస్ పాలకుల వైఫల్యాలపై ఇపుడు బహిరంగ చర్చ జరుగుతోంది. మరోవైపు వారసత్వ రాజకీయాలను ప్రజలు పట్టించుకోవడం లేదు. రాహుల్ గాంధీ ద్వారా వోటర్లను ఆకర్షించలేమన్న నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన చివరి అస్త్రంగా ప్రియాంకను రంగంలోకి దించిది. భవిష్యత్తులో ప్రియాంకను ప్రజలు ఆదరిస్తారో లేదో అంచనా వేయలేం, కానీ ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం సొంత రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లోనే ఆమెకు ఆదరణ అంతంత మాత్రంగా కనిపిస్తోంది. భాజపాను మతతత్వ పార్టీగా ముద్రవేసి ఓడించేందుకు ఒక కూటమిగా అవతరించాలన్న కాంగ్రెస్ కలలు భగ్నమయ్యాయి.
పెద్ద రాష్ట్రంలో చిన్నదైన కాంగ్రెస్..
దేశం మొత్తం మీద అత్యధిక సంఖ్యలో- 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ నేడు ఒంటరిదైంది. ఇక్కడ మాయావతి ఆధ్వర్యంలోని బీఎస్పీ, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తుకు ఈ కూటమి వ్యతిరేకించింది. బీజేపీని నిలువరించేందుకు బీఎస్పీ-ఎస్పీ కూటమి,కాంగ్రెస్ మోహరించడంతో ముక్కోణపు పోటీ జరగనుంది. బిహార్‌లో బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. ఇక్కడ ఆర్జేడీ,కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. రెండు కూటముల మధ్య బిహార్‌లో 40 లోక్‌సభ సీట్ల కోసం భీకర పోరు జరుగనుంది.
మహారాష్టల్రో 48 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఇక్కడ శివసేనతో బీజేపీ పొత్తు ఖరారైంది. కాంగ్రెస్, శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. హిందీ బెల్ట్‌లోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, లోక్‌సభ ఎన్నికల వేళ పరిస్థితులు మారే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. ఎస్పీ, బీఎస్పీలు కూడా తమ అభ్యర్థులను రంగంలోకి దింపి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఢీ కొనేందుకు శిరోమణి ఆకాలీదళ్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇక్కడ ఆమ్‌ఆద్మీ పార్టీ, బీఎస్పీలు సొంతంగా ఎన్నికల బరిలోకి దిగాయి. హర్యానాలో బీజేపీని ఓడించేందుకు దివంగత మాజీ ఉపప్రధాని దేవీలాల్ తనయుడు చౌతాలా పార్టీతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో అధికారంలో ఉన్న బీజేపీ ఆధిక్యానికి గండి కొట్టాలని కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఇక్కడ ముఖాముఖి పోటీలు అనివార్యం. ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 42 లోక్‌సభ సీట్లకు తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. బెంగాల్‌లో కాంగ్రెస్,వామపక్ష పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఒడిశా, తెలంగాణ, ఆంధ్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు ఒంటరిగా పోటీచేస్తున్నాయి. ఆంధ్రాలో తెదేపా, వైకాపాలు ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతుండగా, జనసేన పార్టీ వామపక్షాలు, బిఎస్పీతో పొత్తు కుదుర్చుకుని బరిలోకి దిగుతోంది. తెలంగాణలో టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌తో పోటీపడుతోంది. తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ, డీఎండీకే, పీఎంకే ఇంకా చిన్నాచితకా పార్టీలతో కూటమి ఏర్పడగా, డీఎంకే, కాంగ్రెస్‌లతో మరో కూటమి సత్తా చాటేందుకు యత్నిస్తోంది. కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్, భాజపా నేతలు ఎవరికివారు రంగంలోకి దిగారు. కర్నాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమిని ఎదుర్కొనేందుకు బీజేపీ సర్వశక్తులు మోహరించి పోరాడుతోంది. గుజరాత్‌లో భాజపా, కాంగ్రెస్‌ల మధ్య ‘నువ్వా.. నేనా..’ అన్న రీతిలో పోటీ జరగనుంది. ఇక, ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాంలో బీజేపీ, ఏజీపీ కూటమి కాంగ్రెస్‌తో పోటీపడుతోంది. త్రిపురలో అధికారంలో ఉన్న బీజేపీ విపక్షంగా ఉన్న లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్‌ను ఎదుర్కొంటోంది. చిన్న రాష్ట్రాలైనప్పటికీ ఈశాన్య ప్రాంతంలోనూ వివిధ పక్షాల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుంది.
జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో జత కట్టేందుకు మిగతా విపక్షాలు సుముఖత చూపకపోవడం ప్రస్తుత ఎన్నికల్లో కీలక పరిణామం. పెద్ద రాష్టమ్రైన యూపీలోనే బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ను కలుపుకోకుండా బీఎస్పీ, ఎస్పీలు పొత్తు పెట్టుకున్నాయి. యూపీలో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోతే ప్రత్యేకించి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో చెప్పడం కష్టం. 80 లోక్‌సభ సీట్లున్న యూపీలోనే బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఒక వేదికపైకి రాకపోవడంతో- మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి మార్గం సుగమమైందని రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తున్నారు.
ప్రధాన అంశాలు...
ఎన్నికలంటే ఎంతసేపూ సంక్షేమ పథకాలు, వోటర్లకు తాయిలాలు గుర్తుకొస్తాయి. ఈసారి ఎన్నికలు భావోద్వేగాలు, ఆవేశపూరితమైన వాతావరణం నేపథ్యంలో జరగనున్నాయి. సంక్షేమ పథకాలతో పాటు దేశ భద్రతను సైతం వోటర్లు గుర్తుచేసుకుంటున్నారు. గత నెలలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా వద్ద ఆత్మాహుతి దాడి చేసి 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకోవడంతో దేశభక్తి, అంతర్గత భద్రతపై జనం దృష్టి సారించారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా మోదీ ప్రభుత్వం ‘సర్జికల్ స్ట్రయిక్’ పేరుతో దీటైన జవాబు ఇచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్ కేంద్రంగా జైషే మహ్మద్ ముష్కర సంస్థకు చెందిన శిబిరంపై భారత్ వైమానిక దాడులు నిర్వహించింది. 2016లో సెప్టెంబర్ 29న కూడా ఈ తరహా దాడులనే భారత్ నిర్వహించింది. ఆత్మరక్షణ కోసం తెగించి దాడులు చేయగలనని, చేతులు ముడుచుకుని కూర్చునే ప్రసక్తిలేదని భారత్ ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా పాక్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ఇజ్రాయల్ తరహాలో దాడికి ప్రతిదాడి అనే రీతిలో భారత్ చూపిన దూకుడు ధోరణి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది.
ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ బిల్లు ఎన్డీఏ కూటమికి ఓట్లు రాల్చే అంశంగా మారింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ తదితర దేశాల నుంచి వలస వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, పార్శీ మతాలకు చెందిన శరణార్థులకు శాశ్వత పౌరసత్వం కల్పించే బిల్లు మోదీ సర్కార్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని చెప్పవచ్చు. ఈ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. మరోవైపు రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి కిసాన్ స్కీం’కు విశేష ఆదరణ లభిస్తోంది. ఇలాంటి పథకాన్ని ‘రైతుబంధు’ పేరిట తొలుత తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం వల్ల సాలీనా రైతుల ఖాతాల్లోకి మూడు విడతలుగా మొత్తం రూ.6వేలు జమచేస్తారు.
గత లోక్‌సభలో బలాబలాలు..
16వ లోక్‌సభలో 36 రాజకీయ పార్టీలు కొలువు తీరాయి. ఎన్డీఏ కూటమికి 336 సీట్లు వచ్చాయి. ఇందులో కేవలం బీజేపీకి 282 సీట్లు దక్కాయి. కాంగ్రెస్‌కు 44, ఎఐఎడిఎంకేకు 37 , తృణమూల్ కాంగ్రెస్‌కు 34, బిజూ జనతాదళ్‌కు 18, శివసేనకు 18, టీడీపీకి 16, టీఆర్‌ఎస్‌కు 10, సీపీఎంకు 9, ఎస్పీకి 7, లోక్ జనశక్తికి 6, ఎన్సీపీకి 6, ఆమ్ ఆద్మీ పార్టీకి 4, రాష్ట్రీయ జనతాదళ్‌కు 4, శిరోమణి అకాలీదళ్‌కు 4, వైకాపాకు 9, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్‌కు మూడు, స్వతంత్రులు 3, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీకి మూడు, అప్నాదళ్‌కు రెండు, ఐఎన్‌ఎల్‌డీకి 2, ఐయూఎంఎల్‌కు 2, జేడీఎస్‌కు 2, జేడీయూకు 2, జేఎంఎంకు 2, ఎఐఎంఐఎంకు 1, ఎఐఎన్‌ఆర్‌సీకి 1, సీపీఐకి 1, జేకేఎన్‌సీకి 1, జేకేపీడీపీకి 1, ఎన్‌డీపీసీకి 1, పీఎంకేకి 1, ఆర్‌ఎల్‌డీకి 1, ఆర్‌ఎస్‌పీకి 1, ఎస్‌డీఎఫ్‌కి 1, ఎస్‌డబ్ల్యుపీకి ఒక సీటు దక్కాయి. లోక్‌సభలో ఆంగ్లో ఇండియన్లు ఇద్దరు ఎంపీలుగా ఉన్నారు.
ఎన్నికల నియమావళి..
ఎన్నికలంటే అందరికీ ‘కోడ్’ గుర్తుకొస్తుంది. 30 ఏళ్లక్రిందట ఎన్నికల కోడ్‌ను ఎవరూ పట్టించుకునేవారు కాదు. అప్పట్లో ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా టీఎన్ శేషన్ పనిచేసినప్పడు ఎన్నికల సంఘం అంటే ఏమిటో ప్రజలకు, ప్రజాప్రతినిధులకు తెలిసింది. ఎన్నికల ప్రక్రియను ప్రకటించాక ప్రభుత్వం కొత్త స్కీంలు ప్రకటించరాదు. ప్రజలకు ఆటంకం కలిగించేలా రోడ్ షోలను నిర్వహించరాదు. అన్నింటికీ ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలి. రాత్రి వేళ నిర్ణీత
సమయానికి ప్రచారం ముగించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరు కారాదు. ప్రభుత్వ బంగ్లాలను అన్ని పార్టీలకూ సమానంగా కేటాయించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ విశ్రాంతి భవనాలను తమ ఆధీనంలో పెట్టుకునే రోజులకు కాలం చెల్లింది. ప్రభుత్వ వాహనాలను వాడుకోరాదు. వోటర్లను ప్రభావితం చేసేలా అభ్యర్థులు ప్రవర్తించరాదు. ఎన్నికల సంఘం నిర్దేశించిన లక్ష్మణరేఖను దాటి ఎడాపెడా ఖర్చుపెట్టరాదు. ప్రభుత్వ కార్పొరేషన్లకు చైర్మన్లను, సభ్యులను నియమించరాదు.
ఓటర్ల సంఖ్య..
దేశంలో దాదాపు 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 18-19 సంవత్సరాల వయస్సు ఉన్న 1.5 కోట్ల మంది యువ ఓటర్లు ఉన్నారు. భారీ సంఖ్యలో ఉన్న వోటర్లు సజావుగా పోలింగ్‌లో పాల్గొనేందుకు తగిన ఏర్పాట్లు చేయడం ఆషామాషీ కాదు. 11 మిలియన్ల మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. 120 రైళ్లు, మూడు వేల కోచ్‌లు, రెండు లక్షల బస్సులు, కార్లు, బోట్లు, కొన్ని చోట్ల ఏనుగులు, ఒంటెలు, మరి కొన్ని చోట్ల హెలికాప్టర్లను ఎన్నికల నిర్వహణకు ఉపయోగించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 3,69,33,091 మంది , అరుణాచల్ ప్రదేశ్‌లో 7,94,303 మంది, అస్సాంలో 2,17,60,614 మంది , బిహార్‌లో 7.6 కోట్ల మంది, ఛత్తీస్‌గఢ్‌లో 1.89 కోట్లు, గోవాలో 11.26 లక్షలు, గుజరాత్‌లో4.47 కోట్లు, హర్యానాలో 1.73 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌లో 50.9 లక్షలు, జమ్మూ కశ్మీర్‌లో 77 లక్షలు, ఝార్ఖండ్‌లో 2.19కోట్లు, కర్నాటకలో 5.3 కోట్లు, కేరళలో 2.54 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 5.14 కోట్లు, మహారాష్టల్రో 8.73 కోట్లు, మణిపూర్‌లో 19 లక్షలు, మేఘాలయలో 18.9 లక్షలు, మిజోరంలో 7.84లక్షలు, నాగాలాండ్‌లో 12లక్షలు, ఒడిశాలో 3.18కోట్లు, పంజాబ్‌లో 2కోట్లు, రాజస్థాన్‌లో 4.84 కోట్లు, సిక్కింలో 4.23 లక్షలు, తమిళనాడులో 5.91 కోట్లు, త్రిపురలో 76లక్షలు, ఉత్తరాఖండ్‌లో 76.28లక్షలు, ఉత్తరప్రదేశ్‌లో 14.40 కోట్లు, పశ్చిమబెంగాల్‌లో 6.97 కోట్లు, అండమాన్- నికోబార్ దీవుల్లో 2.94 లక్షలు, చండీగఢ్‌లో 6.19లక్షలు, దాద్రా నగర్ హవేలీలో 2.4 లక్షలు, దామన్ డయ్యూలో 1.19 లక్షలు, లక్షదీవుల్లో 54వేలు, ఢిల్లీలో 1.36కోట్లు, పుదుచ్చేరిలో 9.5 లక్షలు, తెలంగాణలో 2,95,18,964 మంది ఓటర్లు ఉన్నారు. దేశంలోని 89,87,68,978 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 46,70,4861 మంది, మహిళలు 43, 17,32,825 మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్లు 38,325 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా 10,35,919 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం 99.36 శాతం మంది ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులను పంపిణీ చేసింది. వోటర్ వెరిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రాం (వీవీఐపీ)ను కొత్తగా ప్రవేశ పెట్టారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు ఫోన్ చేసి గానీ, ఎస్‌ఎంఎస్‌లను పంపడం ద్వారా గానీ చేసేందుకు అవకాశం కల్పించారు. ఈసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లతోపాటు వోటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)లను కూడా ఉపయోగిస్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లలోనూ వీటిని అమర్చనున్నారు. దీనివల్ల ఈవీఎంల పట్ల విశ్వసనీయత పెరుగుతుంది. వీవీ ప్యాట్ ద్వారా ఓటరు తన ఓటును అక్కడికక్కడ తనిఖీ చేసుకోవచ్చును. దేశంలో 10.35 లక్షల పోలింగ్ స్టేషన్లలో 23.3 లక్షల బీయూలు, 16.35 లక్షల సీయూ యూనిట్లను, 17.4 లక్షల వీవీప్యాట్‌లను అమర్చుతారు. పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లను అమర్చే ముందు వాటి పనితీరును మూడుసార్లు మదింపు వేస్తారు. మొదటి స్థాయి చెకింగ్‌లో ప్రతి వీవీప్యాట్‌పై మాక్ పోల్ నిర్వహిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ స్టేషన్‌లోని, పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వీవీప్యాట్ స్లిప్ కౌంట్ పద్ధతిని తప్పనిసరి చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను పోలింగ్ స్టేషన్లకు తరలించడం, ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటిని సురక్షితంగా తరలించేందుకు జీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. వీటిని తీసుకెళ్లే వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం అధికారులు గమనిస్తుంటారు. ఈసారి ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులతోపాటు అభ్యర్థుల ఫొటోలు కూడా ఉంటాయి.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపైన ఉన్న క్రిమినల్ కేసుల గురించి ఎన్నికల ప్రచారం ముగిసేలోగా మూడు సార్లు టీవీల్లో ప్రసారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. పత్రికల్లో ఆ సమాచారాన్ని ప్రకటనల ద్వారా ఇవ్వాలి. రాజకీయ పార్టీలు కూడా తాము టిక్కెట్లు ఇచ్చే అభ్యర్థులకు నేరచరిత్ర ఉంటే ఆ వివరాలను వెబ్‌సైట్లలో ఉంచాలి. టీవీలు, పత్రికల ద్వారా ప్రసారం, ప్రచురణ చేయాలి. రాత్రి పది గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రచారంలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించరాదు. నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, గుర్తుల కేటకాయింపు, ఈవీఎంల తనిఖీ వంటి అన్ని పనులనూ వీడియోలుగా చిత్రీకరిస్తారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర పారా మిలటరీ బలగాలను నియమిస్తారు. వీరు స్థానిక పోలీసులు, నిఘా విభాగం, ఎన్నికల అధికారుల సూచన మేరకు భద్రతను కాపాడేలా విధులను నిర్వహిస్తారు. శాంతి భద్రతలకు విఘాతం లేకుండా పారా మిలటరీ బలగాలు, రాష్ట్ర పోలీసు బలగాలు సమస్యాత్మాకప్రాంతాల్లో కవాతును నిర్వహిస్తాయి. ప్రజలు ప్రశాంతంగా, ప్రలోభాలకు,్భయాలకు లోనుకాకుండా పోలింగ్ స్టేషన్‌కు వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నాయి.
ఎన్నికల పరిశీలకులు
ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు భారీ సంఖ్యలో పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది. ఎన్నికల ఖర్చుపై నిబంధనలకు తిలోదకాలిచ్చే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పరిశీలకులను నియమించారు. ఈ పరిశీలకుల పర్యటనలకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియచేసేందుకు విస్తృత ప్రచారం చేస్తారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఒక అభ్యర్థి రూ.70 లక్షలకు మించి ఖర్చుపెట్టరాదు. అరుణాచల్ ప్రదేశ్, గోవా,సిక్కిం రాష్ట్రాల్లో ఈ ఖర్చు రూ.54 లక్షలు మించకుండా ఆంక్షలు విధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి గరిష్ట వ్యయ పరిమితి రూ.24 లక్షలు మించరాదు. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు రోజూవారీ ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరచాలి. లోక్‌సభ ఎన్నికలు ముగిశాక 90 రోజుల్లోగా, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన 75 రోజుల్లోగా ఎన్నికల ఖర్చు వివరాలను రాజకీయ పార్టీలు సమర్పించాలి.
2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికల పరిశీలకులు, దర్యాప్తు ఏజన్సీలు అక్రమంగా తరలిస్తున్న రూ.304 కోట్ల నగదు, రూ.92 కోట్ల మద్యం, 804 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రూ.147 కోట్ల నగదు, రూ.92.5 కోట్ల మద్యం, డ్రగ్స్ తదితరమైనవి రూ.56.5 కోట్లు కలిపి మొత్తం రూ.296 కోట్లను ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. ఈసారి ఎన్నికల యంత్రాంగం సామర్థ్యాన్ని పెంపొందించేందుకు, ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు స్మార్ట్ టెక్నాలజీని కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగిస్తోంది. సీ విజిల్, వోటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్, పీడబ్ల్యుడీ యాప్, సువిధి క్యాండిడేట్ యాప్, సమాధాన్, వోటర్ హెల్ప్‌లైన్ కాంటాక్ట్ సెంటర్, ఎన్నికల అధికారుల కోసం అబ్జర్వర్ యాప్, సువిధ యాప్‌లను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది.
పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం...

2016 నవంబర్ 8న మోదీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయడం పట్ల ప్రజలు భిన్నరీతుల్లో స్పందించారు. వస్తు సేవాపన్ను (జీఎస్టీ) ను 2017 జూలై 1 నుంచి కేంద్రం ప్రవేశపెట్టింది. ప్రజలు అసంతృప్తి చెందడంతో ఆ తర్వాత పలు విడతల్లో అనేక వస్తువులపై జీఎస్టీని తగ్గించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పన్నుల రంగంలో సంస్కరణలకు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘ఒకే దేశం- ఒకే పన్ను’ నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానంపై విపక్షాలు పెదవి విరిచాయి. సుస్థిర పాలన, దేశ భద్రత, అన్ని వర్గాలకూ సంక్షేమం, ఆరోగ్య బీమా, రైతులకు ఆర్థిక సహాయం, గిట్టుబాటు ధరలు లాంటి పథకాల వల్ల ప్రజల్లో మోదీ ప్రభుత్వం పట్ల పెద్దగా వ్యతిరేకత లేదని చెప్పవచ్చు. కాగా, ఇదే సమయంలో విపక్షాలు మోదీ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యాయి. విపక్షాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించడంతో- ఎన్నికల ప్రచారంలో మోదీ పై చేయి సాధించేందుకు బలం చేకూరినట్లయింది. అయోధ్య రామజన్మభూమి వివాదాన్ని సుప్రీం కోర్టు మధ్యవర్తిత్వం, సంప్రదింపుల కమిటీకి అప్పగించింది. కోర్టు తీర్పుకు లోబడి మాత్రమే ప్రభుత్వం ముందడుగు వేసే అవకాశం కనపడుతోంది. ఇక, ముస్లిం మహిళల వివాహ బంధం పటిష్టతకు ప్రవేశపెట్టిన త్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది. మోదీ పాలనపై గతంలో ఉన్నత సానుకూల ధోరణి ప్రజల్లో లేకపోయినా, ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో విపక్ష పార్టీలు సత్తా చాటుకోలేక పోయాయి. ఇదే మోదీకి బలంగా మారింది.

సుదీర్ఘ క్రతువు..
కేంద్ర ఎన్నికల సంఘం ఏడు విడతలుగా లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనుంది. అన్ని విడతల పోలింగ్ ముగిశాక ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్‌లో 20 రాష్ట్రాల్లోని 91 సీట్లకు, ఏప్రిల్ 18న 13 రాష్ట్రాల్లో 97 సీట్లకు, ఏప్రిల్ 23న 14 రాష్ట్రాల్లో 115 సీట్లకు, ఏప్రిల్ 29న 9 రాష్ట్రాల్లో 71 సీట్లకు, మే 6న ఏడు రాష్ట్రాల్లో 51 సీట్లకు, మే 12న ఏడు రాష్ట్రాల్లో 59 సీట్లకు, తుది విడతగా మే 19న 8 రాష్ట్రాల్లో 59 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌సభకు, అసెంబ్లీకి, తెలంగాణలో లోక్‌సభకు ఏకకాలంలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి.
*

-కె.విజయ శైలేంద్ర 98499 98097