ఈ వారం స్పెషల్

నవచేతనా వసంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలచక్ర పరిభ్రమణంలో విళంబి తప్పుకుని, కొత్త సంవత్సరాది ‘వికారి’ని ప్రవేశింపచేస్తోంది. తిథి, వార, నక్షత్రాల ఊసే లేక, ఇంగ్లీష్ తేదీ, వారంతోనే కాలం గడిపేసుకునే - అలవాటయి పోయాక, ఉగాది కొత్త సంవత్సరం అంటేనే - ‘జనవరి ఒకటి కదా న్యూఇయర్! మళ్లీ ఇదేమిటి?’ అని నివ్వెరపోయే తరం స్థిరమైపోతోంది. ఇది మన తెలుగుతనం, తెలుగు వత్సరాదియే ఉగాది పండుగ. అభ్యంగన స్నానాలు, కొత్త బట్టలు, పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు, ఉదయానే్న ఉగాది పచ్చడి సేవనం ఇవన్నీ మన తెలుగు అస్తిత్వాలు. వాటిని క్రమేపీ మటుమాయం చేసుకుంటూ పరారుూకరణం చెందడం విషాదమే మరి!
అయితే నేటికీ మన పల్లెసీమల్లో మామిడి తోరణాలతో ఇంటి ద్వారాలను అలంకరించుకుని, వాకిళ్లలో ముగ్గులు పెట్టుకుని కోయిల కుహూ రావాలతో, వేపపూలతో, మామిళ్ల గుబురులతో, పూల సౌరభాలతో, పిండి వంటలతో, బంధు సమాగమంతో, ఆలయాల్లో పూజాదికాలతో వేద పండితుల ఆశీర్వాదాలతో పండుగను నిండుగా నిలుపుకుంటున్న ఛాయలు పూర్తిగా మటుమాయం కాలేదు. మన తెలుగు సంస్కృతీ సంప్రదాయాల పట్ల గౌరవాదరాలు, మానవీయ విలువల పట్ల సమాదరణలు కలవారున్నారు.
వసంతకాలే సంప్రాప్తే
కాకం కాకః పికం పికః
అన్నట్లు కోయిలలేవో, కాకులు ఏవో ఆమని ఏమని వివరించాలా అని సందిగ్ధపడదు. చైత్రమాస సంరంభమే కొత్త ప్రకృతికి ఆవిష్కరణమై కాలం విలువను, ఉగాది ఉనికిని ఉల్లాసభరితం చేస్తుంది. సూర్యమండల మధ్యమున శ్రీమన్నారాయణుడే హిరణ్మయ స్వరూపంలో కాలచక్రాన్ని నడుపుతున్నాడని మనవారి విశ్వాసం.
మహత్తర తపశ్శక్తి సంపన్నులైన మన ఋషులు నవగ్రహాలను, వాని భ్రమణాలనూ గుర్తించి, అనంతమైన కాలస్వరూపాన్ని నిరూపిస్తూ - కాలం కాలమానానికై ఘడియలు, విఘడియలు, దివారాత్రాలు, రోజులు, నెలలు, సంవత్సరాలు అంటూ మాసాలను ఏర్పరచారనీ, ముఖ్యంగా చాంద్రమానాన్ని తెలుగు వారు పాటించడం జరుగుతోందనీ అనూచానంగా మనం చెప్పుకుంటున్న విషయం. చంద్రుడు ఒకసారి భూమిని చుట్టి రావడానికి 29 రోజుల 12 గంటల 44 నిమిషాల 3 సెకన్లు పడుతుందట. అమావాస్య వెళ్లిన పాడ్యమి నుండి మరల అమావాస్య వరకూ చంద్రుడు ఒక భూప్రదక్షణం చేస్తూ ఒక రాశి నుండి మరో రాశికి భూమితోపాటు చేరుతూంటాడనీ, భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 54 నిమిషాల కాలం పడుతుందనీ, భూమి సూర్యుని చుట్టి వచ్చిన కాలానికే సౌరమాన సంవత్సరమని పేరు పెట్టారనీ మన జ్యోతిషవేత్తలు చెప్పే మాట.
చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలం నెల, అలాంటి పనె్నండు నెలలు ఒక సంవత్సరం అదే చాంద్రమాన సంవత్సరం. సౌరమానానికీ, చాంద్రమానానికీ రెండింటికీ కొద్ది రోజులు తేడా వస్తుంది. మన జ్యోతిష్కులు ఋతువులతో స్పష్టంగా కాన వస్తున్న సౌరమాన సంవత్సరాన్నీ, శుక్ల, కృష్ణ పక్షాలతో కానవస్తున్న చాంద్రమాన సంవత్సరాన్ని దేనినీ వదులుకోలేక ఆ తేడా వచ్చే రోజులను సరిపెట్టేందుకే ‘అధిక మాసం’ సృష్టించారు. ఈ ఆచారం ఋగ్వేద కాలం నుండీ వుందని పురాణాల వల్ల తెలుస్తోంది. సంవత్సరాది పండుగ జరుపుకునే ఆచారం వేదకాలం నుంచీ ఉందట!
రాత్రింబగళ్ల కాలం సమానమయ్యే వసంతకాలమే వేదయుగంలో కూడా ఉగాదిగా పరిగణింపబడింది. యజ్ఞయాగాదులు ఆ దినానే్న ప్రారంభించి సంవత్సరం పొడుగునా చేసేవారట! అనాది నుంచి ఈ సంవత్సరాది భిన్న ప్రాంతాల వారికి, భిన్న భాషల వారికీ భిన్నంగానే ఉంటోంది. కర్ణాటక, మహారాష్ట్రులు ఈ ఉగాది వేడుకల విషయంలో మనకు దగ్గర. తమిళులు, బెంగాలీల సంవత్సరాది వేరు.
జీవితం షడ్రుచుల సమ్మేళనం అన్నదానికి ప్రతీకగానూ అన్నింటినీ స్థిరచిత్తంతో స్వీకరించాలనీ, స్థితప్రజ్ఞత అవసరమనీ ఉగాది పండుగ ఉదయానే్న వగరు, పులుపులతో కూడిన మామిడి పిందెలతోను, పులుపు, తీపులతో మిళితమైన కొత్త చింతపండుతోనూ చేదయిన వేపపువ్వుతోనూ, కొత్త బెల్లంతోనూ తయారయిన పచ్చడిని సేవించడం, కొన్ని పల్లెల్లోనయితే గ్రామ పురోహితుడే ఇంటింటికీ వచ్చి ఆ పచ్చడిని తెచ్చి ప్రతివారికి ఇవ్వడం జరిగేది. ఇప్పటికీ కొన్ని పల్లెల్లో పల్లె ప్రజలు ముఖ్యంగా రైతులు ఉదయం నుండీ కొత్త గోగునారతో పగ్గాలను తయారుచేసుకుని, సాయంత్రం తమ నాగలికి పూజలు చేసి సకుటుంబంగా తమ పొలంలో ఏరువాక ప్రారంభించి పాలేళ్లకు, జీతగాళ్లకు కానుకలివ్వడం, ఒక సమష్టి జీవన సంవిధానాన్నీ, పరస్పర ప్రేమాదరాలనూ ప్రతిఫలింప చేయడమూ ఉంది. అలాగే పంచాంగ శ్రవణం ద్వారా రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలుసుకుని తదనుగుణంగా తమ జీవన విధానాలనూ, కార్యక్రమాలను ప్రణాళికాబద్ధం చేసుకోవడం సంప్రదాయం పట్ల విశ్వాసానికి నిదర్శనం. పంచాంగ శ్రవణం యజ్ఞ ఫలంతో సమానమనే భావన వుంది.
క్రితం మాటు వికారి నామ సంవత్సరం 1959లో వచ్చినప్పటికి అంతకు ఎనిమిది తొమ్మిది వందల సంవత్సరాలుగా ఛిన్నాభిన్నమైన తెలుగు జాతి ఏకజాతిగా సుసంఘటితం కాగా, ఈ వికారి 2019కి మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడివడి అసలు దేశం మొత్తం ఎన్నికల సంరంభంతో రాజకీయ నానా వికారాలతో సాక్షాత్కరిస్తూండడం విధి వైచిత్రియే మరి!
ఏ పేరు పూని వచ్చిన
నీపై మా కోర్కులెల్ల నెలకొనునయ్యా
ప్రాపై ఏటికి యేడున్
చూపుము నీ మంచితనపు సౌరది నుగాది!
అని బొడ్డు బాపిరాజు గారన్నట్లు, పేరేదైనా తీరేదన్నదే మనకు ముఖ్యం. ఆ సౌరు బాగుండాలనే ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటాం. అసలు ఉగాది అంటేనే వసంతం, కోకిలలు, పూలకారు ప్రకృతి అందాలు.
ఆకులందున అణగిమణగీ
కవిత కోకిల పలుకవలెనోయ్
పలుకులను విని దేశమందభిమానములు
మొలకెత్తవలెనోయ్!
అని గురజాడ వారన్నారు అంటే - కవి కోకిలలకు బాధ్యత వుందనీ, వారి కూతలు దేశానికి ప్రగతి చేతలు కావాలనీ, అలాంటి నేతలును ఎన్నుకునే చైతన్య స్ఫూర్తి నివ్వాలనీ సత్సంకల్పం. కానీ కవిత్వమూ రాజకీయమై పోయి సమష్టి చేతన కులాలుగా, ప్రాంతాలుగా శకలాలు శకలాలుగా ఛిద్రమై పోతుంటే ఆర్తియే కలుగుతోంది.
మావి గుమ్మ కొమ్మ మాటున
పల్లవము మెక్కి కోయిల పాడుటేల
పరుల తనియించుటకో - తన బాగు కొరకో
గానమొనరింపక బ్రతుకు గడువబోకొ?
అని కృష్ణశాస్ర్తీ గారన్నట్లు కవిత్వం మానవీయ విలువల శిఖరాయమానం కవి తన గురించి తాను రాసుకున్నట్లు కనబడినా అందులో పరహితార్థ చింతన వుంటుంది. ఉండాలి. కవిత్వమే జీవితం అన్నంత స్వచ్ఛత ఉండాలి. ఉగాదిని లక్ష్మిగా, సౌందర్య దేవతగా సంభావించడమూ వుంది.
ఉగాది లక్ష్మిని చూదాము
వసంతలక్ష్మిని కొలుతాము
రారండి! రారండి!

రంగురంగులా పూలివిగో
కమ్మని పూలా తావిదుగో
పూలను చేరే రేడిడుగో
ఝుమ్మను తుమ్మెద రవమిదిగో
గున్నమామిడి కొమ్మదిగో
కొమ్మ చివరా చివురిదిగో
చివురుల మేసే పికమిదిగో
రాగము కూర్చే స్వరమిదిగో
రారండి! రారండి!!
అని పిల్లలమర్రి హనుమంతరావు గారు పిల్లలకు కూడా సుబోధకంగా ఉగాది లక్ష్మిని ఆహ్వానించారు. మామిడులు, కోకిలలు, పూలు, తుమ్మెదలు లేని ఉగాది కవిత అందునా సంప్రదాయ కవుల పద్యాలే లేవు.
1959 నాటి సుప్రసిద్ధ స్ర్తిల మాసపత్రికగా పేరొందిన కేసరి కుటీరం వారి ‘గృహలక్ష్మి’ ఉగాది సంచికలో వికారి నామ సంవత్సర ‘ఉగాది కానుక’ అంటూ కవిభూషణ బిరుదాంకితులైన కల్లూరు అహోబలరావుగారు రాసిన పద్యాలివి కొన్ని-
పండుగ నేడుగాది, పరిపాటిగ భామినులెల్ల, నిండు పూ
దండలు గ్రొత్త పుట్టములు దాల్చి, సుభూషణముల్ ధరింత్రు; నీ
వండజయాన! శ్రీకరము - హాస మనోహర వేషభూషలన్
నిండుగ దాల్చి రమ్ము; తరుణీ! వరదమ్మ - వికార వేషముల్

హృదయానందకరీ! సౌ
ఖ్యదరీ! నారీ! ఒయారి! కడు శృంగారీ!
ముదమొసగెడు, సంసారీ!
ఇదె మా స్వాగతము! స్వీకరింపు, వికారీ!
కలరుతములు బలికెను, కో
యిలగమి, మలయా నిలంబు లింపుగ వీచెన్
లలిసుమములు వర్షించెను
కోలు వింపారంగ జేసికొమ్ము, వికారీ!
... ...
జిలిబిలి పల్కులన్ తెలుగు జినె్నలువనె్నలు జిందులాడ, కో
కిలకలనాదముల్ వెలయఁ గినె్నరసానులు, నట్టువాడగా
గలకలఁదెల్లు కబ్బములు, కమ్మగవ్రాయ గవీంద్రకోటి, మే
ల్కొలుపుము శ్రీ వికారి! కయికొమ్ము! జోహారులుగాది కానుకల్.
1959లో రాజుగా గురువు, సేనాధిపతి చంద్రుడు, మంత్రిగా కుజుడు వున్న వికారి వస్తే ఇప్పుడు రాజు, సేనాధిపతి, అర్ఘ్ధాపతి కూడా శనియేననీ, మంత్రి రవి అనీ, సస్యాధిపతి, నీరసాధిపతి కుజుడు అనీ ధాన్యాధిపతి, మేఘాధిపతి చంద్రుడు అనీ, రసాధిపతి శుక్రుడు అనీ జ్యోతిష పండితులు అంటున్నారు. మరి ఈ ‘వికారి’ ప్రారంభమే ఎన్నికల వేళ అనేక రకాల రాజకీయ వికారాలతో అడుగు పెడుతూంటే ఏ విధమైన ఫలితాలు లభిస్తాయన్నది సందేహాస్పదమే అయినా ఆశాజీవులం కనుక మంచినే అభిలషిస్తాం. అభిలషిద్దాం.
ఉగాది సంప్రదాయవాదులకే అనుకోవడం నేడు పొడచూపుతున్న ఓ విడ్డూర వైఖరి. ఉగాదిని జరుపుకోవడం కూడా వర్ణగత ఆధిపత్య భావజాలం అనే వ్యాఖ్యలు నేడు కొన్ని వినబడుతూండడం కూడా ‘ఎక్కడికి పోతున్నాం మనం? అగాధ పాతాళ కుహరాలలోకా? ఉత్తుంగ హిమవన్నగ శృంగాల వైపునకా?’ అని సి.నా.రె. ప్రశ్నను వేసుకోవాల్సి వస్తోంది.
గత వికారికి విశాలాంధ్ర దినపత్రికలో ‘ఉదయభాను’ అనే నాటి, కవి ‘సమీక్ష’ అని ఉగాదినిలా సంభావించాడు.
ప్రేయసి ఉత్తరంలా వచ్చింది ఉగాది
పేకాటలో జోకరులా వచ్చింది
విచ్చిన ఉషస్సులా విచ్చేసింది ఉగాది
ఇరాక్‌లో ఖాసింలా వచ్చింది
ఎడద ఎడదను కొత్త కోర్కెలే పండీ
గుండె గుండెకు క్రొత్త నెత్తురులు నిండీ
వింతగా ఉంటుంది ఉగాది వేడుక
ఇది కాలం పుట్టిన రోజు పండుగ
తెలుగు సాహితీ లోకంలో శ్రీశ్రీలా
అక్షరాలా అతని మహాప్రస్థానంలా
సామ్యవాద జగతీ సంస్థాపనా
లక్ష్యసంఘటిత ప్రజాపోరాటంలా
ఈ ఉగాదిలో నిండుదనం నిండి వుంది
ఏదో నిత్యనూతనత్వం నిబిడి వుంది
ఆమని చిగురించి నేడు మామిళ్లు కాసి
వేపలు పుష్పించి నేడు వేకువలు వెలిగి
ఎదురేగి ఎదమ్రోగి హారతిచ్చాయి
సిగ్గుపడుతూ చైత్ర మనునయించింది.
మనిషి మనిషికి మధ్య దూరాలు త్రెంచి
మనసు మనసుకు మధ్య వైరాలు త్రుంచి
సముజ్జ్వల భావికై బాట వేసేను
ఈ రోజు
మరో మంచి లోకానికి నాంది చేసేను
ఇది ప్రస్థాన యాత్రలో ఒక మైలురాయి
అంచేత నేడు గతాగతాల సమీక్ష వ్రాయి.
అంటాడు ఆ కవి.
ఆ స్వతంత్ర స్వర్గమునకు మేలుకో భారతీయుడా
ఈ వికారి వత్సరమున ఇంపుసొంపు గులుకుచుండ
దైన్య జడత లేని మనోధైర్య స్థైర్య సహితమైన
నిశ్చలత్వమంది నీవు నిక్కినడచు ఠీవి గల్గి
అంటూ డి.రాజన్న అనే కవి గృహలక్ష్మిలోనే వికారి గేయము రాస్తూ నాటి దేశభక్తి జనితమైన భావనలను జమలికగా ఇలా అంటుకట్టాడు.
సత్యధర్మ మహింసా శాంతి దాంతులొల్కునట్టి
నిత్యవౌ ప్రభుత్వరీతి నెగడుగా వికారిలోన
దేశపిత మహాత్మాగాంధి తెలిపినట్టి విశ్వప్రేమ
దేశదేశములను నెగడి తేజరిల్లు వికారిలోన
భారత త్రిమూర్తులరయ గాంధి, టాగూరు, అరవిందులూ
వారి వేద సత్యఘోష నీ ‘వికారి’లో వెలయగా
ఆటంబాంబు లలజడిని ఆత్మబల్మి నణగద్రొక్కి
పంచశీల జండా నూత్న వత్సరమున వెలయుగా
ఈ వికారి వత్సరమున నే వికారములు లేక
పాడిపంటలెల్ల భోగభాగ్యములు జేకూరుగా!
అని అభిలషించి ఆశావహ సందేశగీతి పలికాడు. ప్రస్తుతం మహాత్మాగాంధీ 150వ జయంతి సమాపన వేడుకలు సాగుతున్నాయి. ‘గాంధీ అనేది ఒక పేరు కాదు ఈ కాలానికి అవసరమైన ఒక జీవన విధానం’ అని ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రి పెరల్‌బక్ అన్నట్లు నేటి తరానికి గాంధీ మార్గం గురించిన పునర్ముల్యాంకనం అవసరం. పంచశీల సూత్రాలు అప్పట్లో ప్రాచుర్యంలో వున్నాయి. నిజానికి ‘దేవుడే సత్యం’ అని మొదట్లో అన్న గాంధీ ఆ తరువాతి కాలంలో ‘సత్యమే దేవుడు’ అని విశ్వసించి నడిచి నడిపించాడు.
తుపాకీల హతం చేసి
కృపాకీల వెలిగించుడు
అని కవి దాశరథి అన్నట్లు అణుబాంబులు కాక అహింస యొక్క ఆవశ్యకతే ఈ తరానికీ అవసరం. భోగభాగ్యాలతో, పాడిపంటలతో దేశం విలసిల్లాలంటే అన్నదాత రైతు ముందు క్షేమంగా ఉండాలి. ప్రస్తుత వ్యవస్థ పట్ల ‘రోసి’ నిజామాబాద్‌లో రైతులు తామే అధిక సంఖ్యలో పార్లమెంట్ నామినేషన్ పత్రాలు వేసి ఓ హెచ్చరికను చూపారన్నప్పుడు నిజంగా భూమిని నమ్ముకున్న రైతు నేలను అమ్ముకుని పోకుండా జీవించగలిగే సుఖమయ తరుణమే అభిలషణీయంగా కదా మరి!
విశిష్టమైన కాలపురిక్క అనే భావనకు ఈ ‘వికారి’ ఓ సంకేత పదం అన్నాడో కవి. నిజంగా నక్షత్ర కాంతితో కాలం వెలుగొందాలని ఈ వికారిలోని అర్థాన్ని పరిణామయుక్తం చేసుకోవడం దోషమేమీ కాదు కదా!
దేశరాజు భారతీదేవి అరవై ఏండ్ల క్రితం తన కవితలో సంభావించినట్లుగా అందుకోదగిన అశంసల భావశబలత ఇది.
సగుణబ్రహ్మము నీ మహామహిముచే సంజాతమై యందు నీ
జగతీ చక్రము గల్గె నీ వలననే, సర్వంబు నీ కార్యమే
యగు గాదే; నిను దప్పుకోగలుగు బ్రహ్మంబొండు మాత్రంబె, ని
త్యగుడౌనేమో, వికార శూన్యతను బెంపారన్ ‘వికారీ’ నమః
శుభం భూయాత్!!

-సుధామ 98492 97958